దీపావళీ నిర్ణయః

దీపావళీ నిర్ణయః

24-10-2022 సోమవారం చతుర్దశి సా 05:22

25-10-2022 మంగళవారం అమావాస్య సా 04:14

26-10-2022 బుధవారం ప్రతిపత్ ప 02:39

దీపావళీతి సంజ్ఞా స్యాద్భూతాది త్రిదినం క్రమాత్ | ద్విజాతిభ్యో భవేద్దత్తం | సర్వం తత్రాక్షయం నృప || (మహాభారతే)


ఆశ్వయుజ చతుర్దశీ, అమావాస్యా, కార్తిక శుక్ల ప్రతిపద్దినములు మూడింటికిని దీపావళి దినములని పేరు. ఈ మూడు రోజులలో చేయు దానములన్నియు అక్షయఫలప్రదములు.


కాగా, ఈ మూడింటిలో అమావాస్య (దర్శశ్రాద్ధము అగు రోజు) నాడు ఉదయం అభ్యంగ స్నానము చేసి, అపరాహ్ణములో పార్వణ శ్రాద్ధము (దర్శశ్రాద్ధము)ను | పాలు, పెరుగు, నెయ్యి మొదలగు వాటితో (ఈనాటి పగటి భోజనము నిషేధమని శాస్త్రములో విశేషముగా చెప్పబడినందున) ఆచరించి, ప్రదోష కాలములో  దీపదానం (దీపప్రజ్వలనం), ఉల్కాప్రదర్శనం, లక్ష్మీ పూజనం (సుఖరాత్రి:) ఆచరించి భుజించవలెనని శాస్త్రనిర్దేశము.


కన్యాగతే సవితరి పితరో యాని వై సుతాన్ | శూన్యా ప్రేతపురీ సర్వా  యావద్వృశ్చిక దర్శనమ్ || తతః ప్రదోషసమయే దీపాన్ దద్యాన్మనోరమాన్ | | దేవాలయే మరే వాపి ప్రాకారోద్యాన వీథిషు || గో వాజి హస్తి శాలాయా మేవం ఘస్రత్రయేఽపిచ| తులాసంస్థే సహస్రాంశౌ ప్రదోషే భూతదర్శయోః | ఉల్కాహస్తా  నరాః కుర్యుః పితృణాం మార్గదర్శనమ్ ||


పితృదేవతలు మహాలయపక్షములో పితృలోకము నుండి భూలోకమునకు  వచ్చి, ఇక్కడి వారు చేసే మహాలయ శ్రాద్ధ తర్పణాదుల వలన తృప్తి చెంది, ఆశ్వయుజ అమావాస్య నాడు మరల పితృలోకమునకు ప్రయాణమవుతారు. అందువల్ల ఈ మూడు రోజులు ప్రదోష సమయమున ఆకాసం వైపు చూపుతూ ఉండేలా మనోహరమైన దీపములను దేవాలయములలోను, మఠములలోను, ప్రాకారములపైన, వీధులలోను, గోశాలాదులలోను పెట్టుట ద్వారా పితృలోకము నకు వెళ్ళే వారికి మార్గం చూపుట అని మన సనాతన సంప్రదాయం . కాగా, మన తెలుగునాట కొన్ని ప్రాంతములలో కాగడాని వెలిగించి ఆకాసం వైపు (ఉల్కా ప్రదర్శనం) చూపుతూ అగ్నిదగ్దాశ్చ యే జీవా యేప్యదగ్గాః కులే మమ |  ఉజ్జ్వలజ్యోతాషాదగ్ధా స్తే యాన్తు పరమాం గతిమ్ || యమలోకం పరిత్యజ్య  ఆగతా యే మహాలయే | ఉజ్జ్వలజ్యోతాషా వర్మ ప్రపశ్యున్తు ప్రజను తే || అని ప్రార్థిస్తారు. ఈ కాగడా స్థానములో గోగుదుత్తలు / గోగుకఱ్ఱలు / చెఱుకు కఱ్ఱలు / ఆముదపు కఱ్ఱలు ఉపయోగించి వాటి చివరన గుడ్డవత్తులను వెలిగించి చూపుట కూడా కొన్ని ప్రాంతములలో ఆచారముగా ఉన్నది.


ఈ సంవత్సరము 25-10-2022 నాడు ఇవన్నియూ ఆచరించవలసియున్ననూ ఈనాడు గ్రస్తాస్త సూర్యగ్రహణం అయినందువల్ల అహోరాత్రం న భుంజీత గ్రస్తావేవాసగౌ తు తౌ  అన్న విశేష శాస్త్రవాక్యమును బట్టి ఈ రోజు మొత్తం ఏ రకమైన ఆహారాదులు తీసుకొనకూడదు. మరునాటి శుద్ద సూర్యబింబ దర్శనముతో కానీ పూర్తి శుద్ధి అవనందున ఈనాటి దీపావళి కృత్యములు ఏ  రోజు ఆచరించాలి? అని సందేహము. ఇట్టి స్థితిలో –

యది సూర్యస్య గ్రస్తాస్తమయః తదా శాస్త్రతో ముక్తిం విజ్ఞాయ స్నాత్వా  రాత్రావేవ శ్రాద్ధం కుర్యాత్ అన్న విశేష శాస్త్ర వాక్యమును బట్టి గ్రహణ, దర్శశ్రాద్ధములు ఆచరింప యోగ్యులు ఈనాటి (25-10-2022) భోజనానన్తరం ఉల్కా ప్రదర్శన లక్ష్మీపూజనాదులను ఆచరించనగునని ఊహించవలసి వస్తున్నది.


మిగిలిన వారికి గ్రహణాశౌచము ఉన్నందున వారు పూర్వదినము (24-10-2022) నాడు దీపావళిని ఆచరించుట యుక్తమని అనిపించుచున్నది.

శుభమ్.

(కంచికామకోటిపీఠపంచాంగము నుండి)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s