వినాయకుడి తత్త్వం

పరమాచార్యుల అమృతవాణి : వినాయకుడి తత్త్వం

(జగద్గురుబోధల నుండి)

మన మిప్పుడు వినాయకు డంటే యేమిటో ఆతత్త్వం కొంత ఆలోచించి చూతాం. తత్త్వం ఏదయినాకానీ ఎంతైనా విచారించనీ ‘ఇది ఇంతే’ అని చెప్పలేం. ఆలోచించిన కొలదీ విషయాలు ఊరుతూనే వుంటై.

వినాయకునికి మనము టెంకాయలు కొటతాం. దీనికొక కథ ఉన్నది. విఘ్నేశ్వరుడు ఒకప్పుడు తండ్రిని పరమశివుని చూచి – ‘నీ తలకాయ నాకు బలిగా ఇయ్‌’ అని అడిగాడట. కార్యం అవిఘ్నంగా సాగిపోవడానికి ఈశ్వరుని తలతో తూగగల ఏదో గొప్ప వస్తువు నివ్వాలి. అందుచేతనే ముక్కంటి తలకు బదులుగా మూడుకన్నులు గల టెంకాయ కొట్టడం. అట్టి వస్తువొకటి సృష్టిలో ఉండడం గూడా ఒక ఆశ్చర్యం. ‘అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా‘ అని వినాయకునికి కొబ్బరికాయలు కొట్టండి అనియే ఈశ్వరుడు వీనిని సృష్టించినట్లు కనబడుతుంది.

ఈ కొట్టడంలోనూ ఒక నియమం ఉన్నది. కొబ్బరికాయజుట్టు పూర్తిగా తీసివేసి కొట్టాలి. సన్యాసులు చనిపోయినపుడు కూడా ఇదే రీతిగా కొడతారు. ఆ కొట్టేటప్పుడు మూడుముక్కలు అయేటటులు కొట్టాలి. ఈ వాడుక తమిళదేశంలోనే ఎక్కువగా ఉన్నటుల కనబడుతుంది.

చాతుర్మాస్య అనేది నాలుగుపక్షాల కాలం. అనగా సన్న్యాసు లొక ఊళ్ళో రెన్నెలలు ఉండాలని విథి. ఈ యేర్పాటు వేయి సంవత్సరాలుగా ఆచారంలో ఉన్నది. నేనొక యేడు నాగపట్టణంలో చాతుర్మాస్య చేశాను. అను దినమూ దేవాలయానికి వెళ్ళడం వాడుక. సాయం సమయంలో ఒకటే జనసందడి. ఆలయానికి వెళ్లే దారిలో చిన్నకోవెల ఒకటి ఉన్నది. అది వినాయకునిది. దాని ముందెల్లప్పుడూ పిల్లల సందడే. కొబ్బరిచిప్పలు లెక్కలేనన్ని. ఒకరిమీద ఒకరు పడి గాయపడే రీతిగా పిల్లవాండ్ర సంఖ్య కూడా లెక్కకుమిక్కుటమే. కొందురు పెద్దలు ఆ పిల్లలను కసరికొట్టి ‘తొలగిపొండి తొలగిపొండని’ గద్దించారు. వారిలో ఒక కుఱ్ఱడు ‘మమ్ములను ఏరుకోవద్దని గద్దించడానికి మీ కెవరు అధికారం ఇచ్చారు?’ అని అడిగాడు. ‘ఈ చిట్టి దైవానికి ఈ చిట్టిపిల్లలే సొంతం’ అని అపుడు నా కనిపించింది.

ఈ దైవానికి మేను లావు, ఆకారం పర్వతం లాగా ‘తొండము నేకదంతమును దోరపు బొజ్జయు‘ కాని ఇతడేమో బాలుడే. బిడ్డలకు పుష్టియే ఒక అందం. ఆహారపుష్టీ ఆకారపుష్టీ బిడ్డలకు ఆవశ్యకం. సన్న్యాసి ఒకడు ముక్కుబంటిగా తిని స్థూలకాయు డయితే అది అందమని అనిపించుకుంటుందా? వయసు ముదిరిన కొలదీ ఉపవాస ముండటం మంచి అలవాటులలోఒకటి. చిన్నబిడ్డలు ఉపవాస ముండటం కూడని పనులలో ఒకటి. బిడ్డలు బొద్దుగా ఉండవలెననియే ఈ శిశుదైవం చూపుతున్నట్లు తోస్తుంది.

ఇతని వాహనం ఎలుక. ఇత డెంత లావో అది అంత సన్నం. వాహనంవల్ల స్వామికి గౌరవం లేదు. స్వామివల్లనే వాహనానికి గౌరవం. కొలదిపాటి మేను కల ఎలుకకు గొప్పతనం కలగాలనే ఈయన దేహం పెంచుకొన్నాడేమో!

అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్‌
అనేక దంతం భక్తానా మేక దంత ముపాస్మ హే
.

అనే శ్లోకం ఒకటి చాలా కాలంనుండి ఆనువాయతీగా వస్తున్నది. అగజ ఆనన పద్మ ఆర్కమ్‌-గమించనిది కొండ. అట్టి మంచుకొండ కూతురు పార్వతి. పార్వతి ముఖపద్మానికి సూర్యునివంటివా డని అర్థం. సూర్యుని పోలిక వినాయకుని చూచినంతనే అగజానన పద్మము వికసిస్తుంది. గజాననం అహర్నిశం ఉపాస్మహే వినాయకుని రేయింబవలూ ఉపాసిస్తాను అని అర్థం.

రేయింబవళ్ళు ఉపాసన చేయడం మనదేశంలోనే సాధ్యం ప్రతివీథి కొసనూ (తమిళదేశంలో) వినాయకుని కోవెల ఉంటుంది. భక్తి లేనివారు పిడివాదం పెట్టుకొని ‘నమస్కారం చేయము’ అని తీరుమానం చేసికొన్న ఏ కొలదిమందియో తక్క మిగిలిన ప్రతివారూ ఆలయము ముందు నుండి వెళుతూ ఒక నమస్కారమయినా చేసి వెళతారు. కొందరు మొట్టికాయలు గూడా కాయించుకొని వెళతారు.

అనేకదం-తమ్‌-భక్తానామ్‌ అని విడదీయాలి. భక్తులను ఆయన అనేక విధాలుగా అనుగ్రహిస్తాడు.

ఒకొక ప్రాణికి ఒకొక విషయమునం దెక్కుడు ప్రీతి. చమరీమృగం తోకంటే పడిచస్తుంది. నెమలికి తన పించమే బంగారం. ఏనుగునకు దంతాలంటే ప్రాణం. దేహ మెట్లా ఉన్నా ఏనుగు తన దంతాలను మాత్రం తెల్లని కాంతులు కక్కుతూ వుండేటటులుగా కాపాడుకుంటుంది. కాని గజాననుడు తన అందం చందం గౌరవం గరువం వీని అన్నిటికీ మూలాధారమైన దంతాన్ని ప్రాణప్రదమైన దాన్ని చరాలున పెరికి మహాభారత రచనా సందర్భంలో కలముగా చేసికొన్నాడు. న్యాయం ధర్మం విద్య వీనికొరకు ఎంతటి త్యాగమయినా చేయవచ్చునని ఈయన ఈపనితో నిరూపించాడు. దైవానికి ఉపకరణం నిమిత్తమాత్ర మనిన్నీ విద్యావ్యాప్తికి సత్యం జ్ఞానం ధర్మం. ఇవి వ్యాపించడానికి ఉత్‌కృష్టమయిన ఎట్టి దేహావయవమునయినా త్యాగం చేయవచ్చుననిన్నీ నిరూపించడానికే ఈ మహామహుడు మహాభారతం వ్రాశాడనిన్నీ గోచరం అవుతుంది.

అవ్వైయ్యార్‌ సంగతి తమిళుల కందరికి పరిచితమే. ఆమె చెప్పిన వాక్యమొకటి యయినా తెలియని తమిళుడంటూ ఉండడు. ఆమె వ్రాసిన గ్రంథాలలో ‘వినాయక అహవల్‌’ అనే దొకటి. అది ఒక యోగశాస్త్రగ్రంథం. ‘ధ్యాన మెట్లా చేయాలి? కుండలినీ శక్తిని సహస్రారానికి తీసికొని పోవడం ఎట్లా’? అనే అని సూక్ష్మాలయిన యోగ విషయా లెన్నో ఆ గ్రంథంలో ఆమె వివరించింది. ‘అంతప్పాటి, అత్తిసూడి’ అనే ఇతర గ్రంథాలను గూడా ఆమె రచించింది.

‘అత్తిసూడి’ అంటే పరమేశ్వరుడు. అత్తిపూవును చూడాలంకారముగా తాల్చినవాడని అర్థం. ఇది చంద్రకళవలే ఉంటుంది. శివునికి ఇంకొక పువ్వులమీద కూడా ప్రీతి ఎక్కువ. అది ఆరగ్వధం. ”ఆగ్వధే రాజవృక్ష శమ్యాక చతురంగులాః” అని ఈపూవు పేరులు అమరం తెల్పింది. ఇవన్నీ రేలపూవు పేర్లు.

వినాయకుడు ప్రణవస్వరూపి. ఆ ప్రణవమును భ్రూమధ్యంలో ధ్యానించి అవ్వయ్యార్‌ అనుగ్రహించిన పుస్తకమే వినాయక అహవల్‌. అవ్వైయ్యార్‌ను గూర్చి ఒక కథ వున్నది.

సుందరమూర్తీ, చేరరాజూ, వీరిరువురూ ఏనుగునూ గుఱ్ఱమునూ ఎక్కి కైలాసానికి వెడుతూ అవ్వై్‌య్యార్‌ను గూడా తొందరగా రమ్మనిన్నీ, వచ్చేయెడల తమతోపాటు తీసుకుపోతా మనిన్నీ అన్నారట. ఆమెయో వినాయకుని పూజామధ్యంలో ఉండి ”మీరు వెళ్ళండయ్యా! కైలాసం కంటే నాకు కరి వదనుడై ముఖ్యుడు, అని చెప్పిందట. అంతటితో వారు వెళ్ళిపోయారట. పూజానంతరం ”వారందరూ వెళ్ళిపోయారే నే నెలాగు వెళ్ళేదిరా భగవంతుడా” అని ఆమె అనుకొన్నదట. ఆప్రార్థన ఆలకించిన వినాయకుడు ఒక్క చిటికలో వారు కైలాసం చేరేటంతలో తన తొండంతో ఆమెను కైలాసం చేర్చేడట.

ఇంకొక విషయం. ఎంత చూచినా తనివి తీరని వస్తువులు కొన్ని ఉన్నై. చంద్రుడూ, సముద్రుడూ, ఏనుగు ఈ తరగతిలోనివి. వానిని చూచిన కొద్దీ ఆనందమే. ఈ దేవతా శిశువు కూడా అదే విధం. చూచినకొద్దీ మరింత చూడ బుద్ధి పుడుతుంది. ఇది ఒక ఆనంద తత్త్వం, ఆరని ఆశాతత్త్వం.

”కేదారం వెళ్లాను గణపయ్యనుచూచాను, అటుమీద కన్యాకుమారి వెళ్లాను. అక్కడ కూడా బొజ్జగణపయ్య ప్రత్యక్షమే” అని ఒక గణపతి భక్తుడు ఉత్సాంతో పొంగి పొరలుతూ అన్నాడు.

పశ్యేయ మేకస్య కవేః కృతిం చేత్‌ సారస్వతం కోశ మవైమి రిక్తమ్‌,

అంతః ప్రవి శ్యాయ మవేక్షితశ్చేత్‌ కోణే ప్రవిష్టా కవికోటి రేషా.

కావ్యాలు అనేకాలు. ఒక కావ్యం చదివినా అది భారతీదేవి ముక్తాభరణంవలె వుంటుంది. ఆమె బొక్కసమే డొల్ల అయిపోయిందా అని అనిపిస్తుంది. నిజంగా ఆమె బొక్కసంలోకి వెళ్ళిచూస్తే కోటికోటి కావ్యాభరణాలు వెదజల్లబడి వుంటై, వినాయకతత్త్వం కూడా ఈలాగే వుంటుంది. ఒక పంచపాత్రతో సముద్రజలం తెచ్చామని అనుకుందాం. ఏమిటిదీ అని ఎవరైనా అడిగితే సముద్రజలమని అంటాం. కాని సముద్రంలో నీళ్ళన్నీ మనం తెచ్చామా. స్వానుభవానికి గోచరించింది మాత్రం ఏ లవలేశమో చెపుతాం.

వినాయకుడు విఘ్నవినాశకుడు. అన్ని కార్యాలకూ ఆయన పూజ మొట్టమొదట జరుగుతుంది. ఆయన అనుగ్రహబలం వుంటే అంతా అనుకూలమే వినాయకుని ప్రధానంగా ఆరాధించేవారిని గాణపతులు అని అంటారు. వినాయకుని ముందు వేయి గుంజిళ్ళకు శంకుస్థాపనం చేసింది మహావిష్ణువట ఒకప్పుడు ఆయన చక్రాయుధం యీమేనల్లుడు నోట్లో వేసుకున్నాడట పిల్లల చేతులోంచి ఏ వస్తువునూ తీసుకోటం కష్టం. గణపతి మాట సరేసరి. అతని ఏలాగైనా నవ్వించి దానిని లాగుకోవాలని మహావిష్ణువు నాలుగు చేతులతోనూ తన రెండు చెవులనూ పట్టుకొని గుంజీలు తీశాడట. ఈ విచిత్రప్రవర్తనకు వినాయకుడు దొర్లి దొర్లి నవ్వాడట. ఆనవ్వుతో చక్రంకిందపడ్డది. అప్పుడు మహావిష్ణువు నిడుదనిట్టూర్పు వదలి చక్రం అందుకుని బయటడ్డాట్ట.

లోకంలో పనులు అన్నీ విఘ్నం లేకుండా జరగాలంటే వినాయకుని అనుగ్రహబలం ఉండాలి. అందులకే త్యాగయ్య ”గిరిరాజాసుతా తనయా” అని గానం చేశాడు. మనం గూడా ఆయన అనుగ్రహానికి పాత్రుల మయ్యేటట్లు నడచుకోవాలి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s