శ్రీ మంగళగౌరీ వ్రతము- విధి, కథ

శ్రీరస్తు

శ్రీ మహా గణాధిపతయే నమః
శ్రీగురుభ్యోనమః
శ్రీ మంగళగౌరీవ్రతము

వ్రతసామగ్రి: పసుపు , కుంకుమ, అక్షతలు , అగరువత్తులు, కర్పూరం, పువ్వులు, కొబ్బరికాయలు – 2 ,రవిక గుడ్డ, తమలపాకులు, పళ్ళు, వక్కలు, ఆవు నెయ్యి, అట్లకాడ (కాటుక కొరకు), గంధము.

మంగళగౌరీపూజను ప్రారంభించుటకు ముందు తమ యింటికి తూర్పు భాగమును గోమయముతో అలికి శుభ్రపరిచి, అందు రంగవల్లులు (మ్రుగ్గు)ను తీర్చి, అందు ఒక పీట లేదా మందిరము ఉంచవలయును. ఆ మందిరమును పచ్చని తోరణముతో కనులపండువుగా నలంకరించవలయును, పీఠము (పీట) మీద ఎనిమిది దళములుగల పద్మమును బియ్యపు పిండితో రాయవలెను. దానిపై నూతన వస్త్రమొకటి పెట్టవలెను. దానిపై శక్తికొలది బియ్యము పరచి, దానిపై రాగి పాత్ర నుంచవలయును. ఆ కలశములో బియ్యము నింపవలెను. అందు పంచ పల్లవములుంచి, దానిపై నారికేళ ఫలమును మూర్తి స్వరూపముగా అలంకరించిపెట్టి, క్రొత్త రవిక గుడ్డ దానికి చుట్టవలయును. మంటపమునకు దక్షిణభాగమున అఖండ దీపారాధన నుంచవలెను. పసుపు ముద్దతో గణపతి ప్రతిమను చేసుకొని కొస తూర్పుగానున్న తమలపాకుమీద, కలశమునకు ముందు, ఉంచాలి.

పిదప పూజను ఆరంభించవలెను.

శ్లో|| సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే|
శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే||
అని నమస్కరించి

పురాణాచమనం కృత్వా : ఈ క్రింది విధముగా పురాణాచమనము చేసి,

కేశవాయ నమః
నారాయణాయ నమః
మాధవాయ నమః

(అనుచు ముమ్మారు కుడి హస్తమున జలము గ్రహించి ఆచమించవలయును)
గోవిందాయ నమః
ఇతి హస్తం ప్రక్షాల్య (అని హస్తములను కడిగికొని)
విష్ణవే నమః
ఇతి నేత్రయోః ఉదకస్పర్శనం కృత్వా (అని రెండు కండ్లను తడిచేతితో తుడిచికొని)
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషీకేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్ధాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
జనార్ధనాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః

శ్రీ కృష్ణాయ నమః
అని నామావళి పఠించుచు విష్ణువును స్మరించునది.


మంగళోచ్చారణం
శ్రీ మన్మహాగణాధిపతయే నమః
శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః
శ్రీ వాణీహిరణ్యగర్భాభ్యాం నమః
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః
శ్రీ సీతారామాభ్యాం నమః
శ్రీ శచీ పురన్దరాభ్యాం నమః
కుల దేవతాభ్యో నమః
మాతాపితృభ్యాం నమః
పతిచరణారవిందాభ్యాం నమః
సర్వేభ్యో దేవేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ నమః
నిర్విఘ్నమస్తు, పుణ్యాహం దీర్ఘ మాయురస్తు
(అని స్మరించవలయును)

శ్లో|| సర్వేష్వారంభ కార్యేషు త్రయ స్త్రిభువనేశ్వరాః|
దేవా దిశంతు న స్సిద్ధిం బ్రహ్మేశాన జనార్దనాః||

విష్ణుర్విష్ణుర్విష్ణుః (అని విష్ణువును స్మరించి)

భూతోఛ్చాటనం:
శ్లో|| ఉత్తిష్ఠంతు భూతపిశాచాః య ఏతేభూమి భారకాః|
ఏతాషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే||

(అని ఉదకమును తనకు చుట్టును చల్లవలయును)

ప్రాణాయామము
ఎడమ ముక్కరమును మూసి, కుడిముక్కరముతో ‘యం’ అను వాయు బీజమును 4 మాఱ్లు స్మరించుచు వాయువును లోనికి పీల్చి; వాయువును కుంభించి ‘రం’ అను అగ్ని బీజమును 16 మాఱ్లు మానసికముగ పఠించి; ‘యం’ అను వాయు బీజమును 8 మాఱ్లు మానసికముగ పఠింపుచు ఎడమ ముక్కరముతో వాయువును విడువవలయును.

సంకల్పః

  1. దేశ సంకీర్తనము :- పంచాశత్కోటి యోజన విస్తీర్ణ మహీ మండలే, లక్ష యోజన విస్తీర్ణ జంబూద్వీపే, భారతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య వాయవ్య (ఆగ్నేయ, …) ప్రదేశే, కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే (గంగా కావేర్యోర్మధ్యదేశే, …), స్వగృహే (బంధుగృహే, వసతిగృహే) సమస్త దేవతా బ్రాహ్మణ చరణ సన్నిధౌ,
  2. కాల సంకీర్తనము:- శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే, శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, అష్టావింశన్మహాయుగే, కలియుగే, ప్రథమపాదే, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాన్ద్రమానేన …. సంవత్సరే, దక్షిణాయనే వర్షఋతౌ, శ్రావణమాసే, ….పక్షే, …..తిథౌ, కుజవాసరే, శుభనక్షత్రే శుభయోగే శుభకరణే,
  3. సంకల్పం:– శ్రీమతీ …. గోత్రవతీ …. నామధేయవతీ అహం మమోపాత్త దురితక్షయ ద్వారా యావజ్జీవ సౌమంగల్యసిద్ధ్యర్థం, పుత్రపౌత్రసంపత్సౌభాగ్య సిద్ధ్యర్థం మమ వివాహ ప్రథమ వర్షాది పంచవర్షపర్యంతం సంకల్పితం శ్రీ మంగళగౌరీ వ్రతం కరిష్యే||
    అద్య శ్రీమంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్తవిధినా యథాశక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే||
    (అని కుడి అనామికతో జలమును తాకి)

దీపారాధనమ్:
ఘృతాక్త వర్తిభిర్దీపం ప్రజ్వాల్య ధ్యాయేత్|
నేతిని పోసి దీపము వెలిగించి దీప స్తంభము నలంకరించి, ఈ క్రింద మంత్రముతో ధ్యానించుము. పూజించుము.
శ్లో॥దీపస్త్వం బ్రహ్మరూపోఽసి జ్యోతిషాం ప్రభురవ్యయః|
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే॥

దీప దేవతాభ్యోనమః , సకల పూజా పరిపూర్ణార్థం గంధాక్షత పుష్పాణి సమర్పయామి.

కలశ పూజా:
తదంగ కలశారాధనం కరిష్యే|| (అని సంకల్పించి క్రింది విధముగా కలశమును పూజించవలెను)
తాను ఆచమించుటకు ఉపయోగించు పాత్రలోని జలము దేవతకు ఉపయోగించరాదు. పీటమీదగాని భూమిమీదగాని జలముతో శుద్ధిచేసి అందు ఒక పత్రమునుంచి దానిపై కలశమునుంచవలెను. రాగి, స్టీలు పాత్రలు మంచివి కావు. వెండి పాత్రగాని, కంచువి, ఇత్తడివిగాని ఉపయోగించవచ్చును. పాత్రను అడుగున ఒక ఆకుగాని, పళ్లెముగాని ఆధారమునుంచి పెట్టి,

కలశమలంకృత్య, (కలశమును గంధము, కుంకుమతో అలంకరించి)
శుద్ధోదకేన కలశమాపూర్య, (శుద్ధజలముతో కలశము నింపి)
గంధపుష్పాక్షతైరభ్యర్చ్య, (కలశములో జలమును గంధము, పుష్పము, అక్షతలను ఉంచి)
(కలశముపై కుడిహస్తమునుంచి ఇట్లు పఠించవలెను)

శ్లో|| కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః|
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్స్మృతాః||
శ్లో|| కుక్షౌతు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా|
ఋగ్వేదోఽథ యజుర్వేద స్సామవేదో హ్యథర్వణః||
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః||

(కలశములో జలమును అందలి పుష్పముతో త్రిప్పుచూ క్రింది శ్లోకమును చెప్పవలెను)
శ్లో|| గంగేచ ! యమునే! కృష్ణే! గోదావరి! సరస్వతి!|
నర్మదే! సింధు కావేర్యౌ ! జలేఽస్మిన్ సన్నిధిం కురు ||

ఆయాంతు శ్రీమంగళగౌరీ పూజార్థం మమ దురితక్షయ కారకాః

కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవీమాత్మానం చ సంప్రోక్ష్య||
(కలశోదకమును, అందలి పుష్పముతో దేవీ ప్రతిమ మీదను, తన శిరస్సునను, పూజాద్రవ్యముల పైనను చల్లుకొనవలెను)

గణాధిపతి పూజా

ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే(అని అనామికతో జలమును స్పృశించవలెను)

మహాగణాధిపతిని పసుపు గణపతిలోకి ఆవహన చేసి పూజించవలెను.

శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

మహాగణాధిపతయే నమః ధ్యాయామి. ( మహా గణాధిపతిని ధ్యానించాలి)
మహాగణాధిపతయే నమః ఆవాహయామి. (అక్షతలతో)
మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి.(అక్షతలతో)
మహాగణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి. (కలశోదకముతో)
మహాగణాధిపతయే నమః పాద్యం సమర్పయామి.(కలశోదకముతో)
మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి. (కలశోదకముతో)
మహాగణాధిపతయే నమః ఔపచారికస్నానం సమర్పయామి. (కలశోదకముతో)
మహాగణాధిపతయే నమః స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. (కలశోదకముతో)
మహాగణాధిపతయే నమః వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి.
మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి.(అక్షతలతో)
మహాగణాధిపతయే నమః గంధాన్ ధారయామి. (గంధమును ధరింపజేయవలెను)
మహాగణాధిపతయే నమః గంధస్యోపరి అలంకారణార్థం అక్షతాన్ సమర్పయామి. (అక్షతలతో)

పుష్పైః పూజయామి – (పుష్పములతో పూజించవలెను)
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదన్తాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణికాయ నమః
ఓం లంబోధరాయ నమః
ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కంధపూర్వజాయ నమః

ఓం మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి.

మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి. (ధూపం చూపించవలెను)
మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. (దీపం దర్శింపజేయవలెను)
మహాగణాధిపతయే యథాశక్తి __ నివేదనం సమర్పయామి. (నైవేద్యం సమర్పించవలెను)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. (కలశోదకముతో)
మహాగణాధిపతయే తాంబూలం సమర్పయామి. (తాంబూలం – మూడు తమలపాకులు, రెండు వక్కలు, రెండు పళ్ళు పెట్టి స్వామికి సమర్పించవలెను)
మహాగణాధిపతయే నీరాజనం సమర్పయామి.
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. (కలశోదకముతో)

శ్లో|| వక్రతుండ మహాకాయ కోటిసూర్యసమప్రభ|
అవిఘ్నం కురుమేదేవ సర్వ కార్యేషు సర్వదా||

మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి. (ఒక పుష్పం తీసుకుని పైన చెప్పిన శ్లోకం చదివి ఆ పుష్పాన్ని స్వామికి సమర్పించవలెను)
మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి.
సర్వోపచారపూజాః సమర్పయామి. (అక్షతలతో)
శ్లో|| యస్యస్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు|
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం||
శ్లో|| మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప|
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే||

అనయా షోడశోపచార పూజయా భగవాన్ సర్వదేవాత్మకః శ్రీ మహాగణాధిపతిః సుప్రసన్నో వరదో భవతు| (అని అక్షతలు పువ్వులతో కూడ నీళ్ళు విడువవలసినది.)

శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి (పూజాక్షతలు శిరసున ధరించవలెను).

శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి. ( గణపతి ఉన్న తమలపాకు కొసను కొంత తూర్పుగా జరుపవలెను). శోభనార్థే పునరాగమనాయచ.

ప్రాణ ప్రతిష్ఠా:
(కుడి హస్తములో పుష్పముంచుకుని దేవతా ప్రతిమ పై నుంచి ఈ క్రింది మంత్రమును పఠించునది.)
” ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సం హం ళం క్షం, హంసః శ్రీమంగళగౌరీ దేవతా స్థిరాభవతు , సుప్రసన్నా భవతు , వరదా భవతు “|
(ఇట్లు ప్రాణప్రతిష్ఠ గావించి పుష్పము దేవతపైనే ఉంచునది)

అథ ధ్యానం
శ్లో|| కుందేందు ధవళాకారాం పూర్ణచంద్ర నిభాననమ్|
స్వర్గాపవర్గ ఫలదాం వందే మహేశ్వరీం సదా||
శ్లో|| సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికాం
సమందహసితే క్షణాం సశరచాప పాశాంకుశామ్|
అశేషజనమోహినీం అరుణమాల్య భూషాంబరాం
జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరామ్యంబికామ్||
శ్లో|| దేవీం షోడశవర్షీయాం శశ్వత్ సుస్థిర యౌవనామ్|
బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మ నిభాననామ్||
శ్లో|| శ్వేతచంపక వర్ణాభాం సునీలోత్పల లోచనామ్|
జగద్ధాత్రీంచ దాత్రీంచ సర్వేభ్యః సర్వసమ్పదామ్||
సంసార సాగరే ఘోరే జ్యోతీరూపాం సదా భజే||

అని ధ్యానించి పుష్పాంజలి సమర్పించి,

షోడశోపచార పూజా

1.ఆవాహనమ్:-
శ్లో|| ఏణాంకానల భానుమండలలసత్ శ్రీచక్రమధ్యే స్థితాం
బాలార్కద్యుతి భాసురాం కరతలైః పాశాంకుశౌ బిభ్రతీమ్|
చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభ వస్త్రాన్వితాం
తాం త్వాం చంద్రకళావతంస మకుటాం చారుస్మితాం భావయే||
శ్లో|| ఆగచ్ఛ సర్వదేవేశి సర్వకార్యార్థ సిద్ధయే|
సర్వసిద్ధిప్రదే ! దేవి ! సర్వపాప ప్రణాశిని!||

హ్రీం శ్రీమంగళగౌర్యై నమః ఆవాహనం సమర్పయామి|(ప్రతిమపై అక్షతలనుంచుము)

2.ఆసనం:-
శ్లో|| కల్లోలోల్లసిఽతామృతాబ్ధి లహరీ మధ్యే విరాజన్ మణి
ద్వీపే కల్పక వాటికా పరివృతే కాదంబవాడ్యుజ్జ్వలే|
రత్నస్తంభ సహస్రనిర్మిత సభామధ్యే విమానోత్తమే
చింతారత్న వినిర్మితం జనని ! తే సింహాసనం భావయే||
శ్లో|| స్వర్ణరత్నమయం దివ్యం హేమవర్ణం సుశోభితమ్|
ఆసనం తే ప్రదాస్యామి స్వీకురుష్వ సురేశ్వరి||

హ్రీం శ్రీమంగళగౌర్యై నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి|(అక్షతలతో)

3.పాద్యం:-
శ్లో|| గంగాది సలిలై ర్యుక్తం సుగన్ధేన సువాసితమ్|
పాద్యం గృహాణ సుశ్రోణి రుద్రపత్ని ! నమోఽస్తుతే||

హ్రీం శ్రీమంగళగౌర్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి. (కలశోదకం)

4.అర్ఘ్యమ్:-
శ్లో|| భాగీరథ్యాది సలిలం నానాతీర్థ సమన్వితమ్|
కర్పూర గంధ సంయుక్తమర్ఘ్యం తుభ్యం దదామ్యహం||

హ్రీం శ్రీమంగళగౌర్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి|(కలశోదకం)

5.ఆచమనీయం:-
శ్లో|| రత్నపాత్రేస్థితం తోయం సర్వతీర్థ సమన్వితం|
ఆచమ్యతాం మహాదేవి ! రుద్రకాంతే! నమోఽస్తుతే||

హ్రీం శ్రీమంగళగౌర్యై నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. (కలశోదకం)

6.మధుపర్కః:-
(మధుపర్కమనగా ఆవుపాలు, ఆవుపెరుగు, తేనె మిశ్రితము)
శ్లో|| స్వర్ణపాత్రే సమానీతం దధిఖండ మధు ప్లుతమ్|
మధుపర్కం గృహాణేదం మయా దత్తం సురేశ్వరి!||

హ్రీం శ్రీమంగళగౌర్యై నమః మధుపర్కం సమర్పయామి.
మధుపర్కానంతరం ఆచమనీయం సమర్పయామి. (కలశోదకంతో)

7.పంచామృత స్నానం:-
(పంచామృతములు – ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె, శర్కర మిశ్రితము ; ఇవి లేనిచో కలశ జలముతో చేయునది)
శ్లో|| క్షీరం దధ్యాజ్య మధునా శర్కరా ఫల సంయుతమ్|
స్నానం స్వీకురు దేవేశి ! సర్గ స్థిత్యంత రూపిణి ||
హ్రీం శ్రీమంగళగౌర్యై నమః పంచామృతస్నానం సమర్పయామి.

8.స్నానం:-
శ్లో|| లక్ష్మ్యే! యోగిజనస్య రక్షిత జగజ్జాలే! విశాలేక్షణే!
ప్రాలేయాంబుపటీర కుంకుమ లసత్కర్పూర మిశ్రోదకైః|
గోక్షీరైరపి నారికేళ సలిలైః శుద్ధోదకై ర్మంత్రితైః
స్నానం దేవి! ధియా మయైతదఖిలమ్ సంతుష్టయే కల్పతామ్||
శ్లో|| గంగాది సలిలైః పుణ్యైః రానీతైః స్వర్ణపాత్రకైః|
స్నానార్థం తే మయా దత్తం సర్వాభరణభూషితే||

హ్రీం శ్రీమంగళగౌర్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. (కలశోదకంతో)

9.వస్త్రం:-
శ్లో|| హ్రీంకారాంకిత మంత్ర లక్షిత తనో హేమచలా త్సంచితైః
రత్నై రుజ్జ్వల ముత్తరీయసహితం కౌసుంభ వర్ణాంశుకం|
ముక్తాసంతతి యజ్ఞసూత్ర మమలం సౌవర్ణ తంతూద్భావం
దత్తం దేవి! ధియా మయై తదఖిలమ్ సంతుష్టయే కల్పతామ్||
శ్లో|| సర్వదే! సర్వదాగౌరి! స్రగాభరణభూషితే |
పీతాంబర ద్వయ మిదం గృహాణ పరమేశ్వరి!||

హ్రీం శ్రీమంగళగౌర్యై నమః వస్త్రం కంచుకం చ సమర్పయామి. (వస్త్రం లేనిచో తదర్థం అక్షతాన్ సమర్పయామి అని చెప్పి అక్షతలను సమర్పించవలెను)

10.ఉత్తరీయం:-
శ్లో|| గ్రైవేయ హారకేయూర కటకాద్యై ర్విభూషితమ్ |
ధార్యం స్వర్ణమయం శుభ్రముత్తరీయం చ పార్వతి!||

హ్రీం శ్రీమంగళగౌర్యై నమః ఉత్తరీయం సమర్పయామి. ( ఉత్తరీయం లేనిచో తదర్థం అక్షతాన్ సమర్పయామి అని చెప్పి అక్షతలను సమర్పించవలెను)

11.గంధః:-
శ్లో||సర్వాంగే ఘనసార కుంకుమ ఘన శ్రీ గంధ పంకాంకితం
కస్తూరీ తిలకంచ ఫాలఫలకే గోరోచనా పత్రకమ్|
గండాదర్శన మండలే నయనయో ర్దివ్యాంజనం తేఽర్పితం
కంఠాబ్జే మృగనాభిపంక మమలం త్వత్ప్రీతయే కల్పతామ్||
శ్లో|| గంధం మనోహరం దివ్యం ఘనసార సమన్వితమ్|
తుభ్యం భవాని ! దాస్యామి చోత్తమం చాఽనులేపనం||

హ్రీం శ్రీమంగళగౌర్యై నమః గంధం సమర్పయామి. (గంధమును ధరింపజేయవలెను)
గంధస్యోపరి అలంకరణార్థం కుంకుమ తిలకం ధారయామి.(గంధము పైన కుంకుమ పెట్టవలెను)

12.అక్షతాః:-
శ్లో|| అక్షతాన్త్సోమ వర్ణాభాన్ హరిద్రాద్యైస్సుసంయుతాన్|
కాత్యాయని గృహాణ త్వం సర్వదేవ నమస్కృతే|
|
హ్రీం శ్రీమంగళగౌర్యై నమః అక్షతాన్ సమర్పయామి. (అక్షతలతో)

13.పుష్పాణి:-
శ్లో|| కల్హారోత్పల మల్లికా మరువకైః సౌవర్ణ పంకేరుహైః
జాజీ చంపక మాలతీ వకుళకైః మందార కుందాదిభిః|
కేతక్యా కరవీరకైః బహువిధైః క్ఌఅప్తాః స్రజో మాలికాః
సంకల్పేన సమర్పయామి వరదే! సంతుష్టయే కల్పతామ్||
శ్లో|| చంపకాశోక కల్హార కుముదోత్పల జాజిభిః|
కరవీరాదికుసుమైః పూజయామి సురేశ్వరి!||

హ్రీం శ్రీమంగళగౌర్యై నమః పుష్పాణి సమర్పయామి. (పుష్పములతో పూజించవలెను )

అథాంగపూజా
హ్రీం గిరిజాయై నమః|పాదౌ పూజయామి|
హ్రీం కాత్యాయన్యై నమః|జానునీ పూజయామి|
హ్రీం కాళ్యై నమః|ఊరూ పూజయామి|
హ్రీం మహాకాళ్యై నమః|నాభిం పూజయామి|
హ్రీం లోకమాత్రే నమః |జఠరం పూజయామి|
హ్రీం శివాయై నమః|స్తనౌ పూజయామి|
హ్రీం కమలహస్తాయై నమః|భుజౌ పూజయామి|
హ్రీం భక్తవత్సలాయై నమః|కరం పూజయామి|
హ్రీం ఇందుముఖ్యై నమః|ముఖం పూజయామి|
హ్రీం త్రినేత్రాయై నమః|నేత్రే పూజయామి|
హ్రీం గిరివర్ధన్యై నమః|నాసికాం పూజయామి|
హ్రీం శివవల్లభాయై నమః|లలాటం పూజయామి|
హ్రీం శ్రీ మంగళగౌర్యై నమః|సర్వాణ్యంగాని పూజయామి|

అత్ర గౌర్యష్టోత్తరశతనామాభిః పూజా కర్తవ్యా||

హ్రీం మహా గౌర్యై నమః
హ్రీం మహాదేవ్యైనమః
హ్రీం జగన్మాత్రే నమః
హ్రీం సరస్వత్యై నమః
హ్రీం చండికాయై నమః
హ్రీం లోకజనన్యై నమః
హ్రీం సర్వదేవతాదిదేవతాయై నమః
హ్రీం పార్వత్యైనమః
హ్రీం పరమాయైనమః
హ్రీం ఈశాయైనమః
హ్రీం నగేంద్రతనయాయై నమః
హ్రీం సత్యై నమః
హ్రీం బ్రహ్మచారిణ్యై నమః
హ్రీం శర్వాణ్యై నమః
హ్రీం దేవమాత్రే నమః
హ్రీం త్రిలోచన్యై నమః
హ్రీం బ్రహ్మాణ్యై నమః
హ్రీం వైష్ణవ్యై నమః
హ్రీం రౌద్ర్యై నమః
హ్రీం కాళరాత్ర్యై నమః
హ్రీం తపస్విన్యై నమః
హ్రీం శివదూత్యై నమః
హ్రీం విశాలాక్ష్యై నమః
హ్రీం చాముండాయై నమః
హ్రీం విష్ణుసోదర్యై నమః
హ్రీం చిత్కళాయై నమః
హ్రీం చిన్మయాకారాయై నమః
హ్రీం మహిషాసురమర్దిన్యై నమః
హ్రీం కాత్యాయన్యై నమః
హ్రీం కాలరూపాయై నమః
హ్రీం గిరిజాయై నమః
హ్రీం మేనకాత్మజాయై నమః
హ్రీం భవాన్యై నమః
హ్రీం మాతృకాయై నమః
హ్రీం గౌర్యై నమః
హ్రీం రమాయై నమః
హ్రీం రామాయై నమః
హ్రీం శుచిస్మితాయై నమః
హ్రీం బ్రహ్మస్వరూపిణ్యై నమః
హ్రీం రాజ్యలక్ష్మ్యై నమః
హ్రీం శివప్రియాయై నమః
హ్రీం నారాయణ్యై నమః
హ్రీం మహాశక్త్యై నమః
హ్రీం నవోఢాయై నమః
హ్రీం భాగ్యదాయిన్యై నమః
హ్రీం అన్నపూర్ణాయై నమః
హ్రీం సదానన్దాయై నమః
హ్రీం యౌవనాయై నమః
హ్రీం మోహిన్యై నమః
హ్రీం జ్ఞానశుద్ధ్యై నమః
హ్రీం జ్ఞానగమ్యాయై నమః
హ్రీం నిత్యాయై నమః
హ్రీం నిత్యస్వరూపిణ్యై నమః
హ్రీం కమలాయై నమః
హ్రీం కమలాకారాయై నమః
హ్రీం రక్తవర్ణాయై నమః
హ్రీం కళానిధయే నమః
హ్రీం మధుప్రియాయై నమః
హ్రీం కల్యాణ్యై నమః
హ్రీం కరుణాయై నమః
హ్రీం జనసంస్థితాయై నమః
హ్రీం వీరపత్న్యై నమః
హ్రీం విరూపాక్ష్యై నమః
హ్రీం విరాధితాయై నమః
హ్రీం హేమాభాయై నమః
హ్రీం సృష్టిరూపాయై నమః
హ్రీం రంజనాయై నమః
హ్రీం పరాయై నమః
హ్రీం యౌవనాకారాయై నమః
హ్రీం పరమేశప్రియాయై నమః
హ్రీం అపరాయై నమః
హ్రీం పుష్పిణ్యై నమః
హ్రీం పురుషాకారాయై నమః
హ్రీం పురుషార్థప్రదాయిన్యై నమః
హ్రీం మహారూపాయై నమః
హ్రీం మహాపాతకనాశిన్యై నమః
హ్రీం మహారౌద్ర్యై నమః
హ్రీం కామాక్ష్యై నమః
హ్రీం వామదేవ్యై నమః
హ్రీం వరదాయై నమః
హ్రీం భయనాశిన్యై నమః
హ్రీం వాగ్దేవ్యై నమః
హ్రీం వచస్యై నమః
హ్రీం వారాహ్యై నమః
హ్రీం విశ్వతోషిణ్యై నమః
హ్రీం వర్ణనీయాయై నమః
హ్రీం విశాలాక్ష్యై నమః
హ్రీం కులసంపత్ప్రదాయిన్యై నమః
హ్రీం ఆర్తదుఃఖచ్ఛేదదక్షాయై నమః
హ్రీం అంబాయై నమః
హ్రీం నిఖిలయోగిన్యై నమః
హ్రీం సదాపురస్థాయిన్యై నమః
హ్రీం తరోర్మూలతలంగతాయై నమః
హ్రీం హరవాహసమాయుక్తాయై నమః
హ్రీం మునిమోక్షపరాయణాయై నమః
హ్రీం ధరాధరభవాయై నమః
హ్రీం ముక్తాయై నమః
హ్రీం పరమంత్రాయై నమః
హ్రీం వరప్రదాయై నమః
హ్రీం కల్యాయై నమః
హ్రీం వాగ్భవ్యై నమః
హ్రీం దేవ్యై నమః
హ్రీం క్లీంకారిణ్యై నమః
హ్రీం సంవిదే నమః
హ్రీం ఈశ్వర్యై నమః
హ్రీం హ్రీంకారబీజాయై నమః
హ్రీం శాంభవ్యై నమః
హ్రీం ప్రణవాత్మికాయై నమః

హ్రీం శ్రీమంగళగౌర్యై నమః నానావిధపరిమళపత్రపుష్పాక్షతాన్ సమర్పయామి |

14.ధూపం:-
శ్లో||హంతారం మదనస్య నందయసి యై రంగై రనంగోజ్జ్వలైః
యైర్భృంగావళి నీలకుంతలభరై ర్భధ్నాసి తస్యాశయమ్|
తానీమాని తవా అంబకోమలతరా ణ్యామోద లీలాగృహా
ణ్యామోదాయ దశాంగగుగ్గులు ఘృతైర్ధూపైరహం ధూపయే||
శ్లో|| చందనాగరు కస్తూరీ గుగ్గులాద్యై స్సమన్వితమ్
|
ధూపం గృహాణ గిరిజే! కాత్యాయని! నమోఽస్తుతే||
హ్రీం శ్రీమంగళగౌర్యై నమః ధూపమాఘ్రాపయామి.(ధూపం చూపించవలెను)

15.దీపం:-
శ్లో|| లక్ష్మీ ముజ్జ్వలయామి రత్న నివహై ర్భాస్వత్తరే మందిరే
మాలారత్న విడంబితై ర్మణిమయ స్తంభేషు సంభావితైః|
చిత్రైర్హాటక పుత్రికా కరధృతై ర్గవ్యై ర్ఘృతై ర్వర్ధితై
ర్దివ్యై ర్దీపగణై ర్ధియా గిరిసుతే! త్వత్ప్రీతయే కల్పతామ్|
శ్లో|| వర్తిత్రయ సమాయుక్తం గవ్యేనాజ్యేన సమ్యుతమ్|
దీపం ప్రజ్వాలితం దేవి, గిరిజాయై నమోఽస్తుతే||

హ్రీం శ్రీమంగళగౌర్యై నమః దీపమ్ దర్శయామి.(దీపం దర్శింపజేయవలెను)
ధూపదీపానన్తరం శుద్ధాచమనీయం సమర్పయామి.(కలశోదకముతో)

16.నైవేద్యం:-

దేవతకు ఎదుట జలము చల్లి, పిండి ముగ్గు, గంధము, కుంకుమతో చతురస్ర మండలము చేయవలెను. అందు వండిన పదార్థములను ఉంచి నైవేద్యపాత్రలు గల పళ్ళెములను, నెయ్యి, పెరుగు, సెనగలు, ఫలములు మొదలగు వానిని ఉంచుము. వండిన నైవేద్య పదార్థములపై నేతితో అభిఘరించుము. ఉద్ధరిణెతో కలశపాత్రలోని జలము తీసుకొని, గౌరీ పంచాక్షరీ మంత్రముతోగాని, ఉపదేశము లేని యడల యీ క్రింది మంత్రముతోగాని జలము నభిమంత్రించి,
శ్లో|| యోదేవస్సవితాస్మాకం ధియోధర్మాదిగోచరాః|
ప్రేరయే త్తస్య యద్భర్గ స్తద్వరేణ్య ముపాస్మహే||

(పదార్థములపై ఆ జలమును చల్లి) కలశపాత్ర నుండి దేవికి ఆచమనీయము ఇచ్చి-
శ్లో|| భక్ష్యై ర్భోజ్యైశ్చ లేహ్యైశ్చ దివ్యై ర్వన్యైః ఫలైర్యుతమ్|
శర్కరాదధిక్షీరాజ్యై రన్వితం గృహ్యతాం శివే!||

హ్రీం శ్రీమంగళగౌర్యై నమః మహానైవేద్యం సమర్పయామి.
ప్రాణాయ నమః| అపానాయ నమః| వ్యానాయ నమః| ఉదానాయ నమః| సమానాయ నమః|| ఇతి నైవేద్యం సమర్ప్య –
నైవేద్యానన్తరం ఉత్తరాపోశనం సమర్పయామి|
హస్తౌప్రక్షాలయామి| పాదౌప్రక్షాలయామి|
శుద్ధాచమనీయం సమర్పయామి|

17.తాంబూలం:-
శ్లో|| పూగీఫలై స్సకర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతం|
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్||

హ్రీం శ్రీమంగళగౌర్యై నమః తాంబూలం సమర్పయామి.(తాంబూలం – మూడు తమలపాకులు, రెండు వక్కలు, రెండు పళ్ళు పెట్టి స్వామికి సమర్పించవలెను)

18.నీరాజనం:-
శ్లో|| ఇందిరాయైనమస్తుభ్యం సర్వమంగళదాయిని!|
నీరాజనం ప్రయచ్ఛామి గృహాణ హరవల్లభే!||

హ్రీం శ్రీమంగళగౌర్యై నమః నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. (కలశోదకముతో)

19.మంత్రపుష్పం:-
శ్లో|| నమస్తే గిరిజే ! దేవి! నమస్తే భక్తవత్సలే!
నమస్తే వరదే! దేవి! స్వర్గ మోక్షప్రదాయిని!||
శ్లో||వరాంకుశౌపాశమభీతి ముద్రాం
కరైర్వహంతీం కమలాసనస్థామ్|
బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం
భజేఽహమంబాం జగదీశ్వరీం తామ్||
శ్లో||సర్వమంగళమాంగళ్యే !శివే ! సర్వార్థసాధికే|

శరణ్యే! త్ర్యంబకే ! గౌరి! నారాయణి !నమోఽస్తుతే||
హ్రీం శ్రీమంగళగౌర్యై నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. (అని చేతిలోని పుష్పాక్షతలను దేవిపాదములపై నుంచి)

20.ఆత్మప్రదక్షిణ నమస్కారాః:-
శ్లో|| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ |
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే||

శ్లో|| పదేపదే యత్పరిపూజకేభ్యః సద్యోఽశ్వమేధాది ఫలం దదాతి|
సమస్త పాపక్షయ హేతుభూతాం ప్రదక్షిణం త్వా పరితః కరోమి|
|(అని ముమ్మారు ఆత్మ ప్రదక్షిణ మొనర్చి)

శ్లో|| రక్తోత్పలా రక్తదళ ప్రభాభ్యాం
ధ్వజోర్ధ్వరేఖా కులిశాంకితాభ్యామ్|
అశేషబృందారక వందితాభ్యామ్
నమో భవానీపదపంకజాభ్యామ్||

ఇతి సాష్టాంగం ప్రణమ్య||

21.ప్రార్థనా:-
శ్లో|| జయదేవి! నమస్తుభ్యం జయభక్త వరప్రదే!|
జయశంకరవామాంగి ! మంగళే ! సర్వమంగళే!||
ఇతి సంప్రార్థ్య

22.అర్ఘ్యప్రదానం:-
జలసహిత గన్ధపుష్పాక్షతాన్ అంజలౌ గృహీత్వా –
శ్లో|| శివే ! భద్రే! మహాదేవి! దురితం హర మాం భర|
భక్త్యా ముదా సదా పూజాం కరిష్యామి శివప్రియే!||

హ్రీం శ్రీమంగళగౌర్యై నమః అర్ఘ్యం సమర్పయామి.
ఇతి త్రివారం అర్ఘ్యం దద్యాత్ (అని మూడు సార్లు అర్ఘ్యప్రదానం చేసి (జలసహిత గంధపుష్పాక్షతలను పాత్రలోకి వదిలి))

హ్రీం శ్రీమంగళగౌర్యై నమః ఛత్రం సమర్పయామి|
హ్రీం శ్రీమంగళగౌర్యై నమః చామరం వీజయామి |
హ్రీం శ్రీమంగళగౌర్యై నమః నృత్యం దర్శయామి |
హ్రీం శ్రీమంగళగౌర్యై నమః గీతం శ్రావయామి|
హ్రీం శ్రీమంగళగౌర్యై నమః వాద్యం ఘోషయామి|
హ్రీం శ్రీమంగళగౌర్యై నమః ఆందోళికా మారోహయామి|
సమస్తరాజోపచారాన్ దేవోపచారాంశ్చ సమర్పయామి||

23.సమర్పణం:-
శ్లో|| మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి!|
తత్సర్వం క్షమ్యతాం దేవి! కాత్యాయని!నమోఽస్తుతే||

అనయా మయాకృతయా పూజయా శ్రీ మంగళగౌరీదేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు|| ఇతి జలం జలే విసృజేత్ | (అని జలం వదిలి )

వాయనదానం

  1. బ్రాహ్మణునకు:-
    బ్రాహ్మణం సంపూజ్య | (బ్రాహ్మణుని పూజించి)
    శ్లో|| తతో వైణవ పాత్రేషు మంగళ ద్రవ్య సంయుతం|
    సగుడం తండులోపేతం నవకంచుక సంయుతమ్||
    తాంబూలాది సమాయుక్తం చణకాది సమన్వితమ్
    సదక్షిణాకం దాస్యామి మంగళాంబా ప్రసీదతు||

    పై శ్లోకములను పఠించుచు బ్రాహ్మణునకు వాయన మీయవలెను. ఈ వాయనమందు – సెనగలు, బెల్లము, క్రొత్తరవిక, ఫలములు, పుష్పములు, దక్షిణ, బియ్యము మొదలగునవి వెదురు చేట లేదా బట్టలో నుంచి ఇచ్చునది.)
  2. సువాసినులకు:-
    శ్లో|| కాత్యాయనీ శివా గౌరీ సావిత్రీ సర్వమంగళా|
    సువాసినీభ్యో దాస్యామి వాయనాని ప్రసీదతు||
    (విప్రునకు ఇచ్చినట్లే సువాసినులకు, తన తల్లికి ఈయవలయును.)

కాటుక పట్టుట
అనంతరము పదునారు (16) వత్తులు వేసి ఆవునేయి పోసి జ్యోతి వెలిగించి, కాటుక ఏర్పడునట్లు పెట్టి, కథాశ్రవణము చేయవలను. కథాశ్రవణానంతరము, దేవీపూజ నొనర్చిన పుష్పములను ప్రసాదముగా స్వీకరించి శిరస్సున ధరించి, కాటుకను నేత్రములకు పెట్టుకొనవలయును. పిదప సువాసినులకు (16 మందికి)ను, తల్లికిని మృష్టాన్నము పెట్టి దక్షిణల నీయవలయును.

శ్రీ మంగళ గౌరీ వ్రత కథ

పాండవులలో జ్యేష్టుడగు ధర్మరాజు శ్రీ కృష్ణునివలన అనేక పుణ్యకథలను విని సంతసించినవాడై, ఇంకను ఇట్లు ప్రార్థించెను. “శ్రీకృష్ణా ! అనేక పుణ్యకథలను చెప్పియుంటివి. స్త్రీలకు దీర్ఘాయుష్మంతులు అగు ఉత్తమ పుత్రులను, సంపదను నొసగునదియు నగు వ్రతము నొకదానిని ఉపదేశింపుము “అని వేడెను. శ్రీకృష్ణభగవానుడిట్లు చెప్పదొడగెను.

ధర్మరాజా ! సర్వలోకపాలినియగు పరాశక్తి యొక్క యనుగ్రహము గలవారికి వైధవ్యము ఎన్నడును ప్రాప్తించదు. ఆమె సర్వమంగళ. ఆ పరాశక్తిని శ్రావణమాసమున మంగళవారములయందు విశేషించి పూజించవలయును. ఆమె పసుపు, కుంకుమ, పుష్పములు, సుగంధాది మంగళద్రవ్యములయందును, ఆవునేతితో వెలింగింపబడిన దీపమున జ్యోతిరూపమునను ప్రకాశించుచుండును. కావున ఆ పరాశక్తిని జ్యోతిరూపమున ధ్యానించి పూజింతురు. ఈశ్వరుడు త్రిపురాసుర సంహారసమయమున, ఆమెను పూజించి జయమొందెను. అంగారకుడు ఈ పరాశక్తిని పూజించి నక్షత్రమండలమున గ్రహరూపమున వెలుగుచున్నాడు. ఆయన మంగళవారమునకు అధిపతియై యున్నాడు. ఈ లోకమాతయొక్క మహిమాతిశయమును తెలుపు పురాతన కథ యొకటి కలదు. చెప్పెదను. సావధాన చిత్తుడవై వినుము.

పూర్వము ’కుండిన’ నగరమున ధర్మపాలుడను వైశ్యుడు ఉండెడివాడు. అతడు మహా ధనవంతుడు. బ్రాహ్మణభక్తి కలవాడు. అతడు పత్నీసమేతుడై ఎల్లప్పుడు అనేకధర్మకార్యములను ఆచరించుచుండెను. అతడు భార్య కలవాడయ్యును సంతానము లేకుండెను. ఒక భిక్షువు దేహమునిండ విభూతి నలదికొని, రుద్రాక్షమాలలు ధరించి, జటాధారియై, ఆ నగరమున ప్రతి మధ్యాహ్నము భిక్షాటనము చేయుచుండెడివాడు. అతడు ఈ వైశ్యుని భార్య యిచ్చు యన్నమును గ్రహించక మరలిపోవుచుండెడివాడు. ఆమె యీ వృత్తాంతమును నొక నాడు తన భర్తయగు ధర్మపాలునితో జెప్పెను. అంత ధర్మపాలుడు తన భార్యతో ఇట్లనెను “ఇకముందు ఆ భిక్షువు వచ్చినప్పుడు ఆయనకు సువర్ణమును గుప్తదానము చేయుము.” అంత, ఆ వైశ్యుని భార్య పెనిమిటి చెప్పినట్లు చేసెను. కాని, ఆ భిక్షువు అది చూచి, “నీవు సంతానము లేనిదానవగుదువుగాక “అని శపించెను. ఆ మాట విని ఆమె మిగుల దుఃఖించి “నా పూర్వకర్మ ఫలవశమున మీరు నన్నిట్లు శపించిరి, ఈ శాపవిమోచనమార్గమును ఉపదేశించి, నన్ను రక్షించు“డని బహుదీనురాలై వేడుకొనెను. అంత ఆ జటాధారి ఆమెతో యిట్లు అనెను “నా యాజ్ఞగా,నేను చెప్పు ఈ వాక్యములను నీ భర్తకు చెప్పుము. నేను చెప్పినట్లు చేసినచో నీకు శాపవిమోచనము కలుగగలదు. నీ భర్త నీలవస్త్రములను ధరించినవాడై, నీలా(నల్లని గుర్రము)శ్వమును ఎక్కి అరణ్యమార్గమున పోవలయును అట్లు కొంతదూరము పోగా, నానావిధ పశు పక్షి మృగాదులతో రమ్యమగు నా అరణ్యమున నొక చోట ఆ అశ్వము అలసి నేలకూలును. అచట అశ్వమును దిగి, భూమి త్రవ్వవలయును. అందు నానారత్న ఖచితమగు బంగారు దేవాలయము కనుపించును. ఆ దేవాలయములో భక్తవత్సలయగు భవాని యుండును. ఆమెను పూజించినచో, మిమ్ముల ననుగ్రహించి, రక్షించగలదు “అని యానతిచ్చెను. సంతోషప్రదములగు ఆ భిక్షు వాక్యములను వైశ్యుని భార్య విని, ఆయన పాదారవిందములకు మరలమరల మ్రొక్కెను. ఇంతలో భిక్షువు అంతర్ధానమయ్యెను.

అనంతరము ఆమె యీ వృత్తాంతమునంతయు తన భర్తకు వినిపించెను. ఆతడందులకు సంతసించి, అట్లే చేయదలచెను. నీల వస్త్రములను ధరించినవాడై నీలాశ్వమును ఎక్కి. అరణ్యమార్గమున పోవగా పోవగా, నానావిధ పశు పక్షిమృగాదులతో రమ్యమగు భయంకరమగు ఆ అరణ్యమధ్యమున, ఒక సరస్సు కనిపించెను. రక్తనీల వర్ణములుగల కలువపూలతోనూ, చక్రవాక పక్షుల ద్వంద్వములతోను, ఆ సరస్సు విరాజిల్లుచుండెను. వైశ్యుడు ఆ సరస్సు వద్ద అశ్వమును దిగి, స్నాన సంధ్యాదులు నొనర్చి, మరల అశ్వమును ఎక్కి అరణ్యమధ్యమునకు పోసాగెను. కొంతదూరము పోయిన పిమ్మట, అశ్వము అలసట చెంది, క్రిందకూలబడెను. జటాధారి ఆఙ్ఞానుసారము, వైశ్యుడు అశ్వమునుండి దిగి, అచట భూమిని త్రవ్వనారంభించెను. కొలది కాలము త్రవ్వి, అందు వసించుచున్న భవానీ దేవిని గాంచి, విస్మితుడయ్యెను. జటాధారి యొక్క ఉపదేశమును స్మరించినవాడై ధర్మపాలుడు, విధ్యుక్త విధానమున నానావిధ ఉపచారములతోను, పుష్ప ధూప దీప నైవేద్యాదులతో ఆ దేవిని పూజించెను. దేవీమంత్రమును నిష్ఠతో జపించెను. ఇట్లు సుగుణధ్యాన తత్పరుడగు ధర్మపాలుని భక్తికి మెచ్చి, భవాని ప్రసన్నురాలై అతనితో ఇట్లనెను “నీ భక్తికి మెచ్చితిని. ఈ పూజనెందుకు చేసితివి ? వరమిచ్చెదను, కోరుము, విశేష ధన సంపద నొసగుదును.” అని భవానీ దేవి పలుకగా, ధర్మపాలుడు “ఓ దేవీ ! నీ అనుగ్రహమువలన నేను విశేష ధనముకలిగియే ఉన్నాను. కాని, పుత్రసంతానము లేదు. పితృఋణమునుండి విముక్తి కలిగించు. పుత్రసంతానము అనుగ్రహించు. నేను సంతాన హీనుడనయినందున నా యింటనే భిక్షువు నేనిచ్చు అన్నమును స్వీకరింపడు. ఈ లోపమును తీర్చి నన్ను పుత్రవంతునిగా జేయు”మని వేడుకొనెను. అంత ఆ దేవి “ధర్మపాలా! నీవు కోరుకొనిన సుఖప్రదమగు సంతానము పొందు యోగ్యత నీకు లేదు. అయినను కోరుకొనుము. వైధవ్యము బొందు కన్య కావలయునా ?దీర్ఘాయుష్మంతుడు అంధుడు వ్యర్థుడగు పుత్రుడు కావలయునా ? అల్పాయుష్మంతుడు సద్గుణవంతుడునగు పుత్రుడు కావలయునా ? కోరుకొనుము ” అని ప్రశ్నించెను. “తల్లీ, అల్పాయుష్మంతుడగు సద్గుణవంతుడగు పుత్రుని యిమ్ము. దాని వలన నేను ధన్యుడనగుదును. పితరుల నుద్ధరింతును “నని ధర్మపాలుడు కోరెను. అంత నా దేవి “ఓయీ ! నా ప్రక్క నొక గణపతి కలడు. అతని నాభి (బొడ్డు ) యందడుగు పెట్టి, మీదకి ఎక్కి సమీపముననున్న మామిడిచెట్టునగల ఒక ఫలము కోసికొని పోయి, నీ భార్య కిమ్ము. పిమ్మట పుత్రుడు కలుగు”నని పలికెను.

అంత ఆ వైశ్యుడు పార్వతీదేవి చెప్పినట్లు గణపతి బొడ్డుపై అడుగు పట్టి యెక్కి, తన ఆశకొలది అనేక ఫలములను కోసెను. కాని అతని వద్ద ఒకే ఫలము మిగిలెను. ఈ విధముగా నతడు ఎన్ని మార్లు కోసినను ఒకే ఫలము దక్కెను. అంత విఘ్నేశ్వరుడు ఈతని యందాగ్రహించి “నీకు కలుగ బోవు కుమారుని పదియాఱవయేట పాము కఱుచు”నని పలికెను.

ధర్మపాలుడు తనకి దక్కిన ఒకే ఫలమును వస్త్రములో కట్టి, తన యింటికి తీసుకునిపోయి పతివ్రతయగు తనభార్యకిచ్చెను. ఆమె ఆ పండు తిని, భర్తృసంయోగమువలన గర్భిణియై, తొమ్మిది మాసములు నిండిన వెనుక, ఉత్తముడగు పుత్రుని గనెను. ఆ శిశువునకు జాతకర్మాది సంస్కారములను నిర్వర్తించి, శివుడు అని నామకరణము చేసిరి. యుక్తకాలమున అన్నప్రాశన చూడాకర్మలు జరుపబడెను. ఉపనయనము అయ్యెను. తమ కుమారుని గాంచి తల్లిదండ్రులు ఆనందసముద్రమున నోలలాడుచుండిరి. బాలునకు పదియవ సంవత్సరము రాగానే, పతివ్రతయగు వైశ్యుని భార్య భర్తను చూచి ” స్వామీ, మనపిల్లవానికి ఒక మంచి ముహూర్తమును చూచి వివాహము కూడా చేయుము ” అని పలుకగా, వాడు కాశీయాత్రకు వెళ్ళివచ్చిన పిమ్మట చేయుదమని భర్త చెప్పెను. పిమ్మట వైశ్యుని బావమఱిదియు కుమారుడును కలసి విశేష ధనముతో కాశీయాత్రకు పయనమై వెళ్లిరి. మార్గ మధ్యమున ’ప్రతిష్ఠానపుర’మున విడిసిరి. అందొక రమ్యమగు ప్రదేశమున కొందరు కన్యలు గలసి యాడుకొనుచుండుట వీరు చూచిరి. వారిలో పసిమి ఛాయగల ’సుశీల’ యను కన్య గలదు. ఆమె స్నేహితురాలు మరియొక కన్య, సుశీలతో కలహించి “ఓ విధవా” యని మాటి మాటికి సంబోధించి ఆమెను దూషించుచుండెను. “చెలియా! నిష్కారణముగా నన్నేల తిట్టెదవు ? ’మానవతి ’ యను నా తల్లి మంగళకరమగు గౌరీ దేవి వ్రతమును చేయుచున్నది. ఆ వ్రతమహిమవలన మాయింటిలోని వారుగాని, మా బంధువులు, చెలికత్తెలు, ఇష్టులుగాని జన్మాంతపర్యంతము విధవలు కాజాలరు. ఇక కన్యనైన నా సంగతి చెప్పవలెనా ? నాకే భయమును లేదు ” అని సుశీల బదులు చెప్పెను. సుశీల మంగళగౌరీ వ్రతమహిమనిట్లు చెప్పదొడగెను : “ఓ సఖీ ! ఏ గౌరీ పూజయందు ధూప-దీపముల నర్పించి పూజించెదరో, ఆ గౌరీపూజ సర్వసుఖముల నొసగును ” అని చెప్పగా చెంతనే యున్న యా శివుని మేనమామ సుశీలా వాక్యములను విని, విస్మయమంది “ఆహా! యీ సుమంగళియగు కన్య నా మేనల్లునికి భార్యయగునేని వాడు తప్పక చిరంజీవి యగును. ఈ కార్యమునెట్లయినను సాధించవలెను” అని నిశ్చయించుకొనెను.

సుశీలయు తన సఖులతో తన యింటికిబోయెను. ఆ వైశ్య యాత్రికులు సుశీలా గృహమును తెలిసికొని, ఆ గృహసమీపమున నుండు చెఱువువద్ద కల రమ్యమగు గృహమున బస చేసి నివసించుచుండిరి. సుశీలయొక్క తండ్రియగు ’హరి’ యనువాడు పార్వతీదేవి భక్తుడు. తాను చేయు ప్రతి పనియు పరమేశ్వరి ఆజ్ఞయనియే చేయుచుండువాడు. సుశీలకు వివాహవయస్సు వచ్చినందున ఆమెకు వివాహసంబంధమెచట దొరకునా యని, హరి తన భార్యయగు మానవతి తో ఆలోచన చేసెను. పిమ్మట తల్లితండ్రులిద్దరు, తమ గృహసమీపమున నివసించుచున్న బాలుడు తమ కుమార్తెకు తగిన వరుడని భావించిరి. వారు తమ ఇష్టదైవమగు గౌరీదేవి ఆలయమునకు వెళ్లి అంజలి ఘటించి వినయము కలవారై, తమకు తగిన అల్లుని గలుగజేయుమని పార్వతిని ప్రార్థించిరి. ఇట్టి సమయమున, సుశీలనెట్లైన తన మేనల్లునకు వివాహము చేయ సంకల్పముగల యతని మేనమామ ఆ యాలయము వెనుక భాగమునే దాగియుండి, “శివుడను పేరుగల ఒక యాత్రికుడు మీకిచటనే లభింపగలడు. అతడే తగిన వరుడు” అని పల్కెను. హరియు అతని భార్యయు దీనిని విని, అది పరమేశ్వరి వాక్యమేయని విశ్వసించిరి. (అచట ఇతరమానవులెవ్వరు కనపడనందున) తరువాత శివుడను పేరుగల యాత్రికునకై వారు వెదకుచుండగా వైశ్యయాత్రికులిద్దరు హరిని సమీపించిరి. హరి వారి యోగక్షేమములు విచారించెను. శివుడను యాత్రికుడు ఆ బాలుడే యని తెలుసుకొనెను. అతడే తన కుమార్తెకు తగిన వరుడని తలంచి, అంబికా వాక్యమును స్మరణకు తెచ్చుకొనెను. శివునిమేనమామ హరి ముఖవైఖరిని బట్టి అతని హృదయము గ్రహించినవాడై సుశీలను తన మేనల్లునకీదగునని తన భావము వెలిబుచ్చెను. హరి యందులకు సమ్మతించెను. వివాహ ముహూర్తమును నిశ్చయించిరి. సుశీలా శివులకు వివాహమాయెను. సుశీలకు ఆమె తల్లియగు మానవతియు, శివుని మేనమామయు శ్రీమంగళగౌరీమహాత్మ్యమును విశదముగా బోధించిరి. వారిచే శ్రీదేవీ స్మరణము జేయించిరి.

క్షార-లవణములు (ఉప్పు కారము మొదలగు తీక్ష్ణ వస్తువులు) వదలి, సాత్వికాహారమును భుజించినవారై సుశీలా శివులు బ్రహ్మచర్య వ్రతముతో దర్భలు పఱచుకొని, అందు శయనించిరి. అంత అర్థరాత్రమున సుశీలకు స్వప్నమున ’మంగళగౌరి’ తన తల్లి రూపమున కానుపించి “సుశీలా! నీ భర్త అల్పాయుష్మంతుడు, అతడి ఆయువు నేటి రాత్రితో తీరును. ఇంకొకక్షణమున నల్లత్రాచు ఒకటి వచ్చి, యాతనిని గరచును. కావును నీకు ఒక ఉపాయము చెప్పెదను లెమ్ము. ఒక కుండ తెచ్చి, అందు పాలుపోసి, దానిని సర్పము వచ్చు తావున ఉంచుము. అయ్యది (పాలుద్రాగు ఆశతో) మొదట కుండలో ప్రవేశించును. అపుడు నీవు కుండపై వస్త్రము కప్పి కుండకు గట్టిగా కట్టియుంచుము. మరునాటి ఉదయమున ఆ కుండను తల్లికి వాయినముగా ఇమ్ము. నీ భర్తకు గండము తప్పిపోవును” అని చెప్పెను.

సుశీల స్వప్నమువల్ల భయపడి మేల్కొని, తెలివి తెచ్చుకొనెను. తన ఎదుట చూచెను. ఒక కృష్ణసర్పము బుసలుకొట్టుచు ఆమె భర్తను సమీపించుచుండెను. ధైర్యము తెచ్చుకొని వేగముగా ఒక ఘటము తెచ్చి అందు పాలుపోసి, మంగళగౌరిని ధ్యానించుచు ఆ ఘటమును పామునకెదురుగా నుంచెను. అంతట పాము ఘటములో ప్రవేశించెను. వెంటనే సుశీల తన వస్త్రమును చించి, ఘటమును మూసి, గట్టిగా కట్టియుంచెను.

అంత కొంతసేపటికి శివుడు మేల్కాంచి, తన కాకలియగుచున్నందున ఏమైనా పెట్టమని సుశీల నడిగెను. ఆమెయు ప్రేమాతిశయముతో, ఒక బంగారు పళ్లెములో కొన్ని భక్ష్యములను పెట్టి భుజింపజేసెను. అంతటా భక్ష్యములను భుజించి, తన ఉంగరమును యచటనే పడవైచి, బంగారు పాత్రను ఒక చోట దాచెను. అనంతరము ఇద్దరును యథా పూర్వకముగ శయనించి, సుఖముగా నిద్రించిరి.

తెల్లవారకమునుపే శివుడు మేల్కొని, ఎవరికిని చెప్పకుండగనే, తన మేనమామతో గలసి వెడలి పోయెను. సుశీల (తన భర్త కానరానందున) లజ్జతో గూడినదై, అచట పడియున్న ఉంగరమును జాగ్రత్తగా దాచియుంచెను. తరువాత తన తల్లి వద్దకు వెళ్లెను. అంతట, ఆమె భర్తవలె శివుని వేషము ధరించి, సాక్షాత్ శివుడే వారి యింటికి వచ్చి, పెండ్లికొమరుడై నిలిచెను. ఇతడే సుశీల భర్తయని అందరు అనుకొనుచుండిరి. వారిద్దరిమధ్య భేదము ఎవరికి తోచలేదు. సుశీలయు స్నానమాచరించి, స్వప్నమున మంగళగౌరి యానతిచ్చిన విధముగ, తాను మూతకట్టియుంచిన ఘటమును తెచ్చి, తల్లికి వాయనమిచ్చెను. దానిని విప్పిచూడగా, అందొక ముత్యాల హారముండెను. తల్లి ఆ ముత్యాల హారమును సుశీల కిచ్చెను.

అనంతరము, ఆ రాత్రి సుశీలను భర్తతో శయనించమని తల్లి యాఙ్ఞాపించెను. తన పాణిగ్రహణ మొనరించి, వివాహమునాడు తనతో నిదురించిన వరుడు ఈతడు కాడని సుశీల అతనితో భోగించుటకు నిరాకరించెను. అతడు ఆరాత్రి తెల్లవారకమునుపే తనను విడిచి పోయెననియు సుశీల నుడివెను. అతడు కాశీకిపోయి ఎప్పటికైనను రాగలడనియు, అతనిని తాను గుర్తింపగలుగుదుననియు ఆమె పలికెను. సుశీల యీ మాటలు చెప్పుచుండగా, అచట కూర్చుని యున్న (మాయ) శివుడు అదృశ్యమాయెను. ఆ వృతాంతమంతయు తెలిసినవారై, సుశీల తల్లి దండ్రులు విచారగ్రస్తులై, అన్నదానవ్రతమాచరింపుమని కొమరికతో చెప్పిరి.

హరి ఆగ్రామమున అన్న సత్ర మొకటి స్థాపించెను. సుశీల తమ భర్త జారవిడిచిన ఉంగరమును ధరించినదై (భోజనమునకు వచ్చిన) బ్రాహ్మణులకు పాదములు కడుగుటయు. తల్లి మంచి గంధమును, ఉదకమును తెచ్చి ఆమెకు అందించుటయు, హరి నీరాజనము తాంబూలముల నిచ్చుటయు నిత్యము వ్రతముగా వారు చేయుచుండిరి. ఈ ప్రకారముగా వారు చేయు అన్నదానవ్రతము, భిక్షమెత్తుకొనువారికి బాటసారులకు సౌఖ్యము కలిగించుచుండెను

ఇది యిట్లుండ, శివుడును అతని మేనమామయు కాశీనగరమునకు ప్రయాణమై, కొన్ని దినములకు చేరిరి. గంగానదిలో ఆసక్తితో స్నానము చేసిరి. మార్గమధ్యమున అనేక దానధర్మములు జేసిరి, విశ్వేశ్వరాన్నపూర్ణల దర్శించి, విధ్యుక్తముగ నారాధించిరి. పిమ్మట హరిద్వార మేగిరి. అచట భాగీరథిలో గ్రుంకులిడి, అందందు గల భిక్షుకులకు పట్టువస్త్రమిలనిచ్చి, వారి వలన ’చిరంజీవి’ యని యాశీర్వచనము పొందిరి. అటునుండి తిరిగి వచ్చుచు వారిద్దరు మరల విశ్వేశ్వరుని దర్శించి, నమస్కరించి అనేక విధములగా దేవతలను స్తుతించిరి. అంతట. గృహోన్ముఖులై వచ్చుచుండగా, మార్గమధ్యమున నా రాత్రి శివుని కొక స్వప్నమాయెను. స్వప్నమందు తనకు మృత్యువు ఆసన్నమైనట్లును, ఆ సమయమున యమదూతలును, మంగళగౌరియు యుద్ధము చేసినట్లు, తుదకు మంగళగౌరి జయమొంది, యమదూతలను పారద్రోలి, తనకు ప్రాణదానము చేసినట్లును కనుపించెను. ఈ వృత్తాంతమును శివుడు తన మేనమామకు నివేదించెను. అతడు మంగళగౌరిని మరవకుమని హెచ్చరించెను.

వారు మార్గ మధ్యమున ప్రతిష్ఠానగరమును చేరిరి. తాము పూర్వము బస చేసిన తటాకమువద్ద నుండి మనోహరమగు గృహమునే మరల విడిసిరి. అచట వంట ప్రయత్నములు చేయదొడగిరి. హరి యింట నుండు దాసీలు చెరువునకు వచ్చి, సుగుణ సంపదచే ప్రకాశించు వీరిద్దరిని చూచి, ” బాటసారులారా! మీరు వంట చేసుకొని ఏల కష్టపడెదరు? మా ప్రభువు(హరి) అన్నసత్రమును పెట్టుచున్నాడు, అచట భుజింపుడు” అని చెప్పిరి. ఆ దాసీలు తమ గృహమునకు బోయి తాము కనిన వృత్తాంతము అంతయు తమ యజమానికి చెప్పిరి. వారు చెప్పిన గుర్తులు బట్టి, తమ అల్లుడే వచ్చి యుండవచ్చునని ఊహించి, హరి నూతన వస్త్రాదులను బంపి వారిని ఆహ్వానించెను. వారుభయులు అందుకు అంగీకరించి హరి యింటికి వచ్చిరి. సుశీల, అతిథులకు పాదప్రక్షాళనము చేయుచున్నట్లే, శివునికిగూడ చేయుచు ఇతడే తన వరుడని గ్రహించి, లజ్జగలది అయ్యను. తల్లికి ఈ సంగతి చెప్పెను. సుశీల తనవద్దగల ఉంగరమును చూపి ఇది తన భర్తదేనని చెప్పి, వారిని మెప్పించెను. శివుడు తాను ఇదివరకు హరి గృహమున దాచి యుంచిన బంగారుపళెమును తెచ్చి అందరి యెదుట నుంచెను. ఈ గుర్తులను బట్టి హరి సంతసించి, ఇతడే తన అల్లుడని యథార్థము తెలిసికొని, అల్లుని యథావిధిగా పూజించి, వివాహ పరిసమాప్తి (గర్భాధానము) గావించి, స్వర్ణ వస్త్రాదులు ఇచ్చి గౌరవించెను. శ్రావణమాసము రాగానే, సుశీల మంగళవారములయందు శాస్తోక్తవిధానముగ మంగళగౌరీవ్రత మాచరించెను. అనంతరము మానవతీ హరుల సెలవు గైకొని, శివుడు సుశీలను వెంట బెట్టుకొని, తన మేనమామతో కుండిన నగరమునకు బయలుదేరి వెళ్ళెను. మార్గమధ్యమున వారికి శ్రేష్ఠమైన సువర్ణ దేవాలయము అగపడెను. అచట సుశీల గౌరిని పూజించినదై, అత్తమామలను చూచు కుతూహలము గలదై యుండెను. వారందరును మరల ప్రయాణమై కుండిన నగరానికి చేరిరి. సుశీల వినయముతో అత్తమామలకు నమస్కరించెను. “ఓ సుశీలా! పద్మములవంటి నేత్రములు కలదానా! నా కుమారునికి ఆయుర్వృద్ధి యగుటకు ఏ వ్రతమాచరించితివో దానిని నాకు చెప్పు” అని ధర్మపాలుని ధర్మపత్ని కోడలిని అడిగెను. “అత్తగారూ, ఆ వ్రతమేమో నాకు తెలియదు. నా తల్లి యగు మానవతిని, తండ్రియగు హరుని, మామయగు ధర్మపాలుని, అత్తయగు మిమ్మును, మంగళకరురాలగు గౌరీదేవిని, మీకుమారుడగు నా పెనిమిటిని మాత్రమెరుగుదును.” అని సుశీల బదులు చెప్పెను. మంగళగౌరీ మహాత్మ్యము నందరు కొనియాడిరి. సుశీలా శివులు వారికి నమస్కారములొనర్చి సుఖముగానుండిరి. చిరకాలము అనేక భోగములు ననుభవించుచు, తుదకు జన్మాంతమున కైలాసమునకు జని సుఖించిరి.

కావున ధర్మరాజా! శ్రీ మంగళగౌరీవ్రతమును నూతన వివాహితలు ఆచరించినచో యావజ్జీవ సౌమంగల్యము ననుభవించి సుఖింతురు. మంగళగౌరీ ప్రసాదమువలన వైధవ్య నిరాకరణము అతి సులభము. పెనిమిటికి దీర్ఘాయుస్సును గోరు స్త్రీలు యీ ప్రకారము ఐదు సంవత్సరములు గౌరీ వ్రతమును సలుపవలయును. అయిదవయేట ఉద్యాపనము చేయవలయును. అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పెను. (భవిష్యోత్తర పురాణము).

శ్లో|| య ఇదం శ్రుణుయాన్నిత్యం శ్రావయేద్వా సమాహితః|
సర్వపాపవినిర్ముక్తో స యాతి పరమామ్గతిమ్||

మంగళగౌరీ వ్రతము సమాప్తము.

(గౌరీ పూజాదికం పుస్తకం నుండి)

Mangala Gowri Vratam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s