సంక్షేపరామాయణమ్
శ్రీగణేశాయ నమః ।
అథ సంక్షేపరామాయణమ్ ।
తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ ।
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుఙ్గవమ్ ॥ 1॥
తపఃశాలియగు వాల్మీకి తపస్సును, వేదాధ్యయమును చేయుటయందు ఆసక్తికలవాడును, వాక్కులు తెలిసినవారిలో శ్రేష్ఠుడు, మునులలో గొప్పవాడును అగు నారదుని ప్రశ్నించెను.
కో న్వస్మిన్సామ్ప్రతం లోకే గుణవాన్కశ్చ వీర్యవాన్ ।
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ॥ 2॥
ఇప్పుడు భూలోకమునందు మంచి గుణములు కలవాడును, గొప్పపరాక్రమము కలవాడును, ధర్మము తెలిసినవాడును, కృతజ్ఞుడును, సత్యమైన వాక్కులు కలవాడును, ధృఢమైన సంకల్పము కలవాడును అగు మహాపురుషుడెవ్వడున్నాడు?
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః ।
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైకప్రియదర్శనః ॥ 3॥
మంచి నడవడి కలవాడును, సర్వప్రాణులకు హితము నాచరించువాడు, విద్వాంసుడును, అసాధ్యములైన కార్యములను కూడ సాధించు సామర్థ్యము కలవాడును, చూచువారికి ఎల్లప్పుడూ ఒకే విధముగ ఆనందముకలుగు విధమున కనబడువాడును అగు మహాపురుషుడు ఎవడు?
ఆత్మవాన్కో జితక్రోధో ద్యుతిమాన్ కోఽనసూయకః ।
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ॥ 4॥
ధైర్యము కలవాడును, కోపమును జయించినవాడును, ప్రశస్తమైన కాంతి కలవాడును, అసూయ లేనివాడును ఎవడు? యుద్ధములో కోపమువచ్చిన ఎవనిని చూచి దేవతలి కూడ భయపడుదురు?
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే ।
మహర్షే త్వం సమర్థోఽసి జ్ఞాతుమేవంవిధం నరమ్ ॥ 5॥
నే నీ విషయమును విన గోరుచున్నాను. నాకు ఎక్కువ కుతూహలముగా ఉన్నది. ఓ మహర్షీ! ఇట్టి గుణములు గల మనుష్యుని గూర్చి నీకు తెలియుటకు అవకాశము ఉన్నది.
శ్రుత్వా చైతత్త్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః ।
శ్రూయతామితి చామన్త్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్ ॥ 6॥
మూడులోకముల వృత్తాంతము తెలిసిన నారదుడు వాల్మీకి మాటలను విని, సంతసించినవాడై “చెప్పెదెను వినుము” అని పలికి, ఇట్లు చెప్పెను.
బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః ।
మునే వక్ష్యామ్యహం బుద్ధా తైర్యుక్తః శ్రూయతాం నరః ॥ 7॥
ఓ వాల్మీకి మునీ! నీవు అడిగిన గుణములు అనంతములు. సాధారణ మానవులలో దొరకవు. అట్టి గుణములతో కూడిన మహాపురుషుని నిశ్చయించి చెప్పెదెను. సావధానముగా వినుము.
ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైః శ్రుతః ।
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ధృతిమాన్వశీ ॥ 8॥
ఇక్ష్వాకువంశమునందు పుట్టిన రామునిగూర్చి జను లెల్లరును వినియున్నారు. ఇతడు నిశ్చితమైన స్వభావము కలవాడు. గొప్ప పరాక్రమము కలవాడు. మంచి కాంతి కలవడు. ధైర్యము కలవాడు. ఇంద్రియనిగ్రహవంతుడు.
బుద్ధిమాన్నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః ।
విపులాంసో మహాబాహుః కమ్బుగ్రీవో మహాహనుః ॥ 9॥
ఆ రాముడు బుద్ధి, నీతి, సర్వశాస్త్ర పాండిత్యము, ఐశ్వర్యము కలవాడు. శత్రువులను నశింపచేయువాడు. అతని మూపులు ఉన్నతమైనవి. బాహువులు బలిసినవి. కంఠము శంఖము వలె ఉండును. చెక్కిళ పై భాగము ఉన్నతముగ ఉండును.
మహోరస్కో మహేష్వాసో గూఢజత్రురరిన్దమః ।
ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః ॥ 10॥
ఆ రాముని వక్షస్థలము చాల విశాలమైనది. ధనుస్సు చాల గొప్పది. అతని మూపులు సంధి ఎముకలు పైకి కనబడవు. అతడు కామక్రోధాది శత్రువులను, పాపములను పోగొట్టువాడు. అతని బాహువులు మ్రోకాళవరకును వ్రేలాడుచుండును. అతని శిరస్సు, లలాటము కూడ మంచిలక్షణములతో ఒప్పుచుండును. నడక ఎంతో అందముగా ఉండును.
ఈ తాత్పర్యములు ఆర్షవిజ్ఞానట్రస్టువారి మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెలశ్రీరామచంద్రుడు గారిచే రచించబడిన శ్రీ మద్రామాయణము-బాలకాండము గ్రన్థమునుండి కృతజ్ఞతా పురస్కరముగా తీసుకొనబడినవి.
సమః సమవిభక్తాఙ్గః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ ।
పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాఞ్ఛుభలక్షణః ॥ 11॥
ఆ శ్రీ రాముని శరీరము పొట్టిగా కాని, పొడవైనదిగా కాని లేదు. అతని అవయవములు అన్నియు హెచ్చుతగ్గులు లేక సరిగా విభజింపబడి ఉన్నవి. శరీరపు చాయ చాల చక్కనిది. తెజ్జస్సు చాలా ప్రశంసనీయమైనదుఇ. వక్షఃస్థలము బలిసి ఉండును. నేత్రములు విశాలమైనవి. అవయవముల శోభ ప్రశస్తమైనది. సాముద్రిక శాస్త్రములో చెప్పిన శుభలక్షణము లన్నియు అతని శరీరము నందున్నవి.
ధర్మజ్ఞః సత్యసన్ధశ్చ ప్రజానాం చ హితే రతః ।
యశస్వీ జ్ఞానసమ్పన్నః శుచిర్వశ్యః సమాధిమాన్ ॥ 12॥
శ్రీరాముడు శరణాగతరక్షణాది ధర్మములు బాగుగా తెలిసినవాడు, చేసిన ప్రతిజ్ఞను నిలుపుకొనును. ప్రజల హితమునకై ఎక్కువ ఆసక్తి చోపును. అన్ని విషయములను తెలిసినవాడు, పరిశిద్ధమైనవాడు, అనగా నిజాయతీ కలవాడు, గురుజనులకు లొంగి ఉండువాడు, ఆశ్రితులకు అందుబాటులో ఉండువాడు, ఆశ్రితులను రక్షించుటకై దీక్షవహించినవాడు.
ప్రజాపతిసమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః ।
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా ॥ 13॥
శ్రీరాముడు బ్రహ్మతో సమాననుడు. అందరిని మించినవాడు. సర్వలోకములను పోషించువాడు. శత్రువులను నశింపచేయువాడు. సమస్తప్రపంచమును రక్షించువాడు. ధర్మమును బాగుగా రక్షించువాడు.
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా ।
వేదవేదాఙ్గతత్త్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః ॥ 14॥
శ్రీరాముడు తనధర్మమును చక్కగ పాటించుచు తనవారి నందరిని రక్షించుచుండును. వేదవేదాంగముల రహస్యములన్నియు ఈతనికి తెలియును. ధనుర్వేదమునందు ఈతనికున్న జ్ఞానము అసాధారణమైనది.
సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞః స్మృతిమాన్ప్రతిభానవాన్ ।
సర్వలోకప్రియః సాధురదీనాత్మా విచక్షణః ॥ 15॥
రాముదు వెనుక చెప్పిన వేదవేదాంగములే కాక మిగిలిన ధర్మశాస్త్ర-పురాణ-న్యాయ-మీమాంసా-సాంఖ్య-వైశేషిక-యోగశాస్త్రముల అభిప్రాయములను, సిద్ధాంతములనుబాగుగా తెలిసికొనినవాడు. తెలిసికొన్న విషయములను ఎన్నడును మరువడు. లోకవ్యవహారములలో ఈతనికి గల ఉత్తరోత్తరయుక్తుల స్ఫురనమ్ గొప్పది. సమస్త జనులయందును ఈతనికి ప్రేమ అధికము. ఆ జనులకు కూడా రాముడనిన ప్రాణము. ఎట్టి కష్టకాలమునందైనను ఈతని మన్అస్సు కలత చెందదు. వినివారికి ఆనందము కలుగుఇ నట్లు భాషణ చేయుట యందును, సమయోచితములగు కార్యములను నిరహించుటయందును గొప్పనేర్పు కలవాడు.
సర్వదాఽభిగతః సద్భిః సముద్ర ఇవ సిన్ధుభిః ।
ఆర్యః సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శనః ॥ 16॥
నదులు ఎల్లపుడును, అనగా మూడు కాలములందును, సముద్రమును చేరుచుండు నట్లు సత్పురుషులు ఎల్లవేళల రామునివద్దకు వచ్చుచుండురు. ఈతడు ప్రతి ఒక్కరును దగ్గరకు చేరవలసిన వ్యక్తి. పూజనీయుడు. అందరి విషయమునను సమముగా ప్రవర్తించువాడు. ఈతని దర్శనము ఎల్లపుడును ఒకే విధముగ ఆనందజనకముగా ఉండును.
స చ సర్వగుణోపేతః కౌసల్యానన్దవర్ధనః ।
సముద్ర ఇవ గామ్భీర్యే ధైర్యేణ హిమవానివ ॥ 17॥
కౌసల్యకు ఆనందమును వృద్దిపొందించు ఆ రాముడే సకలగుణ ములతో కూడినవాడు. అతడు గాంభీర్యమునందు సముద్రమువంటివాడు. దైర్యమునందు హిమవత్పర్వతము వంటివాడు.
విష్ణునా సదృశో వీర్యే సోమవత్ప్రియదర్శనః ।
కాలాగ్నిసదృశః క్రోధే క్షమయా పృథివీసమః ||
ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః ||18||
రాముడు పరాక్రమునందు విష్ణువుతో సమానుడు. చంద్రదర్శనము వలె ఈతని దర్శనము ఆనందకరము. కోపము వచ్చినప్పుడు ప్రలయకాలాగ్ని వలె చాల భయంజరమైనవాడు. ఓర్పులో భూమివంటివాడు. ఇతరులకు దానముచేయుటలో కుబేరునివంటివాడు. సత్యమును సంరక్షించు విషయమున ధర్మదేవత వంటివాడు. ఈ విషయమున ఈతనిని మించినవారెవరును లేరు.
తమేవఙ్గుణసమ్పన్నం రామం సత్యపరాక్రమమ్ ॥ 19॥
జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథః సుతమ్ ।
ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతిప్రియకామ్యయా ॥ 20॥
యౌవరాజ్యేన సంయోక్తుమైచ్ఛత్ప్రీత్యా మహీపతిః ।
దశరథమహారాజు ప్రజలకు హితము చేయవలెనను కోరికతో, సమస్తసద్గుణసంపన్నుడును, అమోఘములగు బలపరాక్రమములు కలవాడును, ఎల్లప్పుడును ప్రజాహితమే కోరుచుండువడును, తనకు ప్రీతిపాత్రుడును అగు జ్యేష్ఠకుమారుడైన రాముని యువరాజుగా చేయగోరెను.
తస్యాభిషేకసమ్భారాన్ దృష్ట్వా భార్యాఽథ కైకయీ ॥ 21॥
పూర్వం దత్తవరా దేవీ వరమేనమయాచత । వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనమ్ ॥ 22॥
దశరథుని రాణులలో నొకతె యైన కైకయి రామాభిషేకమునకై సేకరించిన సాధనసామగ్రిని చూచి, దశరథుడు పూర్వము తనకు రెండు వరములిచ్చి యుండుటచే, వాటిలో ఒక వరముగా రాముని అరణ్యవాసమునకు పంపవలెననియు, రెండవ వరముగా భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెననియు, దశరథుని కోరెను.
స సత్యవచనాద్రాజా ధర్మపాశేన సంయతః । వివాసయామాస సుతం రామం దశరథః ప్రియమ్ ॥ 23॥
సత్యవాక్యమును పరిపాలించవలె నను కారణముచే, ఆ దశరథుడు, ధర్మపాశముచే బంధింపబడినవాడై, తన ప్రియపుత్రుడైన రాముని వనములకు పంపెను.
స జగామ వనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ । పితుర్వచననిర్దేశాత్కైకేయ్యాః ప్రియకారణాత్ ॥ 24॥
అతిపరాక్రమశాలియైన రాముడు కైకేయికి సంతోషము కలిగించుటకై, తండ్రి మాట మాత్రము చెప్పినంతనే దానిని ఆజ్ఞగా గ్రహించి, తన ప్రతిజ్ఞను నిలుపుకొనుచు అరణ్యమునకు వెళ్ళెను.
తం వ్రజన్తం ప్రియో భ్రాతా లక్ష్మణోఽనుజగామ హ । స్నేహాద్వినయసమ్పన్నః సుమిత్రానన్దవర్ధనః |
భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్ ||25||
లక్ష్మణుడు రామునికి చాల ఇష్టమైన తమ్ముడు. అతనియందు సహజమైన ప్రేమకలవాడు. వినయసంపన్నుడు. అతడు తన భ్రాతృ స్నేహమును చూపుచు అరణ్యమునకు పోవుచున్న ఆ రాముని వెంట వెళ్ళెను. ఇట్లు ఉత్తమకార్యము చేయుటచే తల్లి యగు సుమిత్రకు కూడ ఆనందమును వృద్ధిపొందించెను.
రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమా హితా ॥ 26॥
జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా । సర్వలక్షణసమ్పన్నా నారీణాముత్తమా వధూః ॥ 27॥
సీతాప్యనుగతా రామం శశినం రోహిణీ యథా ।
జనకుని వ్చంశమునందు పుట్టి, రామునికి భార్యయై దశరథుని కోడలైన సీత రామునకు చాల ఇష్టురాలు. ప్రాణము వంటిది. ఆమె సర్వదా రామునకు హితమునే చేయుచుండును. రాక్షసులను మోహింపచేయుటకై సృజింపబడిన దేవమాయ వలె లోకోత్తర మైన సౌందర్యము కలది. సాముద్రికశాస్త్రములో చెప్పిన మంచి లక్షణము లన్నియు ఆమెయందు ఉన్నవి. స్త్రీలలో ఉత్తమురాలు. అట్టి సీత కూడ, రోహిణి చంద్రుని అనుసరించినట్లు, ఆ రామచంద్రుని అనుసరించి వెళ్ళెను.
పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ ॥ 28॥
శృఙ్గవేరపురే సూతం గఙ్గాకూలే వ్యసర్జయత్ । గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియమ్ ॥ 29॥
గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా ।
పౌరులును, దశరథుడును చాల దూరమువరకు రాముని వెంబడించిరి. ధర్మాత్ము డైన ఆ రాముడు, గంగా తీరమునందు, శృంగిబేరమనెడి పట్టణములో, బోయల ప్రభువైన గుహుని కలిసికొనెను. సీతాలక్ష్మణ గుహులతో కూడిన ఆ రాముడు తన సారథియైన సూతుని వెనకకు పంపివేసెను.
తే వనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదకాః ॥ 30॥
చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ ।రమ్యమావసథం కృత్వా రమమాణా వనే త్రయః ॥ 31॥
దేవగన్ధర్వసఙ్కాశాస్తత్ర తే న్యవసన్ సుఖమ్ ।
ఆ సీతారామలక్ష్మణులు ఒక వనమునుండి మరొక వనము చేరుచు, గొప్ప గొప్ప నదులను దాటుచు, భరద్వాజమహర్షి ఆదేశము ప్రకారము చిత్రకూటపర్వతమును చేరిరి. అచట పర్ణశాల నిర్మించుకొని దేవగంధర్వుల వలె సుఖముగా నివసించిరి.
చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తదా ॥ 32॥
రాజా దశరథః స్వర్గం జగామ విలపన్ సుతమ్ ।
రాముడు చిత్రకూటమునకు వెళ్ళిన పిమ్మట దశరథుడు పుత్రశోకముచే పీడితుడై, పుత్రుని గూర్చి ఏడ్చుచు స్వర్గస్థుడయ్యెను.
మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠప్రముఖైర్ద్విజైః ॥ 33॥
నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః ।
దశరథుడు మరణించిన పిదప వసిష్ఠాదులు రాజ్యము చేయు మని భరతుని ఆజ్ఞాపించిరి. అయినను, తనకు రాజ్యము చేయు సామర్థ్యమున్నను, భరతుడు రామునిపై తన కున్న గౌరవముచే, రాజ్యమునకు ఒప్పుకొనలేదు.
స జగామ వనం వీరో రామపాదప్రసాదకః ॥ 34॥
రాగద్వేషాదులు జయించి ఆ భరతుడు రాముని అనుగ్రహింప చేసికొనుటకై అరణ్యమునకు వెళ్లెను.
గత్వా తు స మహాత్మానం రామం సత్యపరాక్రమమ్ ।
అయాచద్భ్రాతరం రామమార్యభావపురస్కృతః ॥ 35॥
భరతుడు వినయముతో సుమహాత్ముడును, సత్యవ్రతుడును, తన సోదరుడును అగు, రాముని చేరి ప్రార్థించెను.
త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోఽబ్రవీత్ ।
“నీవు సమస్తధర్మములను తెలిసినవాడవు. అన్నగా రుండగా తమ్ముడు రాజ్యము చేయరాదు అను ధర్మము నీకు తెలియనిది కాదు. అందుచేత నీవే రాజు కావలెను”అని భరతుడు రామునితో చెప్పెను.
రామోఽపి పరమోదారః సుముఖః సుమహాయశాః ॥ 36॥
న చైచ్ఛత్పితురాదేశాద్రాజ్యం రామో మహాబలః ।
రాముడు అందరికిని సంతోషమునే కలిగించును. తనను ఆశ్రయించిన వారికి సాయుజ్యము మొదలైన సకలాభీష్టములను ఇచ్చును. ఎవరైన యాచించినంతమాత్రముననే”యాచకుల మనోరథములను తీర్చు భగ్యము నా కబ్బినది కదా” అని సంతోషించును. :న హ్యర్థినః కార్యవశాదుపేతాః కకుత్థ్సవంశే విముఖాః ప్రయాంతి” (ఏదైన కార్యమును కోరి కకుత్థ్సవంశము వారి వద్దకు వచ్చిన యాచకులు ఎన్నడును నిరాశులై వెళ్ళరు) అని విష్ణుపురాణములో చెప్పి నట్లు ప్రసిద్ధమైన దానజనిత కీర్తికలవాడు. ఆశ్రయించిన వారి అభీష్టములను నెరవేర్చుటకు సమర్థుడు. ఇంతటి మృదుస్వబావు డైనను రాముడు, తండ్రి యాజ్ఞను అనుసరించవలెనను దీక్షచే , భరతుడు ఎంత ప్రార్థించినను రాజ్యమును స్వీకరించుటకు అంగీకరించలేదు.
పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్త్వా పునః పునః ॥ 37॥
నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః ।
“నేను వచ్చునంతవరుకును నా పాదుకలను నా ప్రతినిధిగా రాజ్యము చేయుటకై ఉంచుకొనుము” అని చెప్పి తన పాదుకలను భరతునకిచ్చి, రాముడు అతనికి అనేకవిధముల బోధించి అయోధ్యకు పంపెను.
స కామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్ ॥ 38॥
నన్దిగ్రామేఽకరోద్రాజ్యం రామాగమనకాఙ్క్షయా ।
రాముని తిరిగి తీసుకొనివెళ్లవలె నన్న కోరిక తీరని భరతుడు ఆ రామపాదుకలనే సేవించుచు, రాముడు సుఖముగా తిరిగి రావలెనని మనస్సులో కోరుకొనుచు, అయోధ్యాసమీపమున నున్న నందిగ్రామ మనెడు గ్రామములో నివసించి రాజ్యమును చేసెను.
గతే తు భరతే శ్రీమాన్సత్యసన్ధో జితేన్ద్రియః ॥ 39॥
రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ ।తత్రాగమనమేకాగ్రో దణ్డకాన్ ప్రవివేశ హ ॥40||
భరతుడు వెళ్లగానే రాముడు, అతడు వచ్చుటకు తనకు కలిగిన ప్రతిజ్ఞాభంగభయము పోవుటచే సర్వాతిశయి యగు కాంతి కలవాడై, భరతుడెఅంత నిర్బంధించినను తన ప్రతిజ్ఞనుండి చలింపక, కౌసల్యాభరతాదులు చేసిన ప్రార్థనలు వ్యాజముగా తీసికొని తాను మరల రాజ్యమును అంగీకరించుటకు అవకాశమున్నను, రాజ్యభోగములపై ఎంతమాత్రము చాపలము చూపక, అయోధ్యా పౌరులును భరతాదులును మాటిమాటికి ఆ చిత్రకూటపర్వతమునకు వచ్చుచుందురు అని ఊహించి, పిత్రాజ్ఞాపాలనమునందు సావధానుడై దండకావనమును ప్రవేశించెను.
ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవలోచనః ।
విరాధం రాక్షసం హత్వా శరభఙ్గం దదర్శ హ ॥ 41॥
సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్యభ్రాతరం తథా ।
పద్మములవంటి నేత్రములు గల రాముడు, దండకారణ్యమును ప్రవేశించిన వెనువెంటనే విరాధుడను రాక్షసుని చంపి, శరభంగ – సుతీక్ష్ణ – అగస్త్యమహర్షులను, అగస్త్యుని సోదరుని చూచెను.
అగస్త్యవచనాచ్చైవ జగ్రాహైన్ద్రం శరాసనమ్ ॥ 42॥
ఖడ్గం చ పరమప్రీతస్తూణీ చాక్షయసాయకౌ ।
అగస్త్యుడు తన కింద్రు డిచ్చిన ధనుస్సును, కత్తిని, తరగని బాణములు గల అమ్ములపొదులను తీసికొనుమని రామున కీయగా అతడు తనకు తగిన ఆయుధములు దొరకినందులకు చాల సంతసించి, వానిని గ్రహించెను.
వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ ॥ 43॥
ఋషయోఽభ్యాగమన్సర్వే వధాయాసురరక్షసామ్ ।
రాముడు శరభంగమహర్షి తపోవనములో వాసము చేయుచుండగా ఆ చుట్టు ప్రక్కల నున్న ఋషులందరును, ” అసురులను, రాక్షసులను సంహరింపుము” అని ప్రార్థించుటకై రామునివద్దకు వచ్చిరి.
స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తదా వనే ॥ 44॥
ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతి రక్షసామ్ ।
ఋషీణామగ్నికల్పానాం దణ్డకారణ్యవాసినామ్ ॥ 45॥
రాక్షసనివాస మైన ఆ వనములో ఆ ఋషులు చేసిన ప్రార్థనను రాముడు అంగీకరించెను. “యుద్ధములో రాక్షసులను సంహరించెదను” అని అగ్నితుల్యతేజస్కు లగు ఆ దండకారణ్యవాసిమునులకు మాట ఇచ్చెను.
తేన తత్రైవ వసతా జనస్థాననివాసినీ ।
విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణీ ॥ 46॥
రాము డా దండకారణ్యములోనే నివసించుచు, ఆ దండకారణ్యమునందు, రావణుని సేనానివేషస్తాన మగు జనస్థానమునందు వాసము చేయు, కామరూపిణి యగు శూర్పణఖ యను రక్కసిని ముక్కుచెవులు కోసి విరూపిణిగా చేసెను.
తతః శూర్పణఖావాక్యాదుద్యుక్తాన్సర్వరాక్షసాన్ ।
ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసమ్ ॥ 47॥
నిజఘాన రణే రామస్తేషాం చైవ పదానుగాన్ ।
శూర్పణఖ విరూపిత యైన పిమ్మట ఆ శూర్పణఖ మాట విని యుద్ధమునకు వచ్చిన ఖరుని, త్రిశిరసుని, దూషణుని, వారి అనుచరులైన సకల రాక్షసులను రాముడు యుద్ధమునందు సంహరించెను.
వనే తస్మిన్నివసతా జనస్థాననివాసినామ్ ॥ 48॥
రక్షసాం నిహతాన్యాసన్సహస్రాణి చతుర్దశ ।
దండకారణ్యమునందు నివసించు నపుడు రాముడు జనస్థానములో నివసించు రాక్షసులలో పదునాలుగు వేలమందిని సంహరించెను.
తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః ॥ 49॥
సహాయం వరయామాస మారీచం నామ రాక్షసమ్ ।
పిమ్మట రావణుడు జ్ఞాతుల మరణవార్త విని, మిక్కిలి కోపించినవాడై, తనకు సాహాయ్యముచేయు మని మారీచు డను రాక్షసుని కోరెను.
వార్యమాణః సుబహుశో మారీచేన స రావణః ॥ 50॥
న విరోధో బలవతా క్షమో రావణ తేన తే ।
ఓ రావణా! మహాబలవంతులైన ఖరుడు మొదలగు పదునాలుగు వేల రాక్షసులను చంపి నట్టి బలవంతుడైన రామునితో వైరము పెట్టుకొనకుము” అని మారీచుడు రావణుని అనేక పర్యాయములు వారించెను.
అనాదృత్య తు తద్వాక్యం రావణః కాలచోదితః ॥ 51॥
జగామ సహమారీచస్తస్యాశ్రమపదం తదా ।
మృత్యువు సమీపించుటచే రావణుడు మారీచుని మాటలు వినలేదు. అతనిని వెంటబెట్టుకొని రాముని ఆశ్రమమునకు వెళ్లెను.
తేన మాయావినా దూరమపవాహ్య నృపాత్మజౌ ॥ 52॥
జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషమ్ ।
మాయావి యైన మారీచుని ద్వారా రామలక్ష్మణులు పర్ణశాలనుండి చాల దూరము వెళ్లిపోవునట్లు చేసి, రాముని భార్య యగు సీతను అపహరించెను. ఆమెను విడిపించుటకై వచ్చిన జటాయువును చంపెను.
గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీమ్ ॥ 53॥
రాఘవః శోకసన్తప్తో విలలాపాకులేన్ద్రియః ।
రాముడు, చచ్చుటకు సిద్ధమైపడిఉన్న జటాయువును చూచి, ఆ జటాయువు వలన సీతాదేవిని రావణుడు అపహరించినట్లు విని, మిక్కిలి దుఃఖితుడై, ఇంద్రియములను వశములో ఉంచుకొనజాలక విలపించెను.
తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషమ్ ॥ 54॥
మార్గమాణో వనే సీతాం రాక్షసం సన్దదర్శ హ ।
కబన్ధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనమ్ ॥ 55॥
అత్యధిక మైన దుఃఖముతో రాముడు జటాయువునకు దహనసంస్కారము చేసి సీతకై వెదుకుచు, ఆ వనములో వికృత మైన ఆకారముతో, భయంకరముగా ఉన్న కబంధుడనెడి రాక్షసుని చూచెను.
తన్నిహత్య మహాబాహుర్దదాహ స్వర్గతశ్చ సః । స చాస్య కథయామాస శబరీం ధర్మచారిణీమ్ ॥ 56॥
శ్రమణీం ధర్మనిపుణామభిగచ్ఛేతి రాఘవ ।
బలిష్ఠములైన బాహువులు గల రాముడు ఆ కబంధుని చంపి దహనసంస్కారము చేయగా, అతడు స్వర్గమునకు వెళ్లెను. అతడు స్వర్గమునకు పోవుటకుముందు “ఓ రామా! ధర్మమును ఆచరించుటయందు నేర్పుకలదియు, ధర్మమును ఆచరించునదియు, అగు ఒక శబరస్త్రీ సన్న్యాసాశ్రమమును స్వీకరించియున్నది, ఆమె వద్దకు వెళ్లుము” అని చెప్పెను.
సోఽభ్యగచ్ఛన్మహాతేజాః శబరీం శత్రుసూదనః ॥ 57॥
శబర్యా పూజితః సమ్యగ్రామో దశరథాత్మజః ।
మహాతేజశ్శాలియు, శత్రుసంహారకుడును అయిన రాముడు భక్త పరాధీనుడు గాన తానే స్వయముగ శబరి దగ్గరకు వెళ్లెను. శబరి ఆ రాముని చక్కగా పూజించెను.
పమ్పాతీరే హనుమతా సఙ్గతో వానరేణ హ ॥ 58॥
హనూమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః ।
రాముడు పంపాసరస్తీరమునహనుమంతునితోపరిచయ మేర్పరచుకొని పిదప ఆతని మాట ప్రకారము సుగ్రీవునితో స్నేహము చేసికొనెను.
సుగ్రీవాయ చ తత్సర్వం శంసద్రామో మహాబలః ॥ 59॥
ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషతః ।
మహాబలుడగు రాముడు తనవృతాంతమునంతను, మొదటినుండియు సుగ్రీవహనుమంతులకు చెప్పి, విశేషించి సీతావృత్తాంతమును వారికి తెలిపెను.
సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః ॥ 60॥
చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికమ్ ।
సుగ్రీవుడు రాముని వృత్తాంత మంతయు విని, తనవలెనే దుఃఖితుడైన మహాబలునితో పరిచయము కలిగినందుకు సంతోషించి, అగ్నిసాక్షికముగా రామునితో మైత్రి చేసిక్నెను.
తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి ॥ 61॥
రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ ।
“నీకును వాలికిని విరోధమెట్లు ఏర్పడినది?” అని రాముడు ప్రశ్నింపగా, సుగ్రీవుడు దుఃఖించుచు, స్నేహముతో రామునకు ఆ వృత్తంతము అంతయు తెలిపెను.
ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి ॥ 62॥
వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః ।
వాలిని చంపెద అని రాముడు ప్రతిజ్ఞ చేసెను. సుగ్రీవుడు కూడా రామునకు వాలి యొక్క బలవిశేషములను గూర్చి చెప్పెను.
సుగ్రీవః శఙ్కితశ్చాసీన్నిత్యం వీర్యేణ రాఘవే ॥ 63॥
రాఘవప్రత్యయార్థం తు దున్దుభేః కాయముత్తమమ్ । దర్శయామాస సుగ్రీవో మహాపర్వతసన్నిభమ్ ॥ 64॥
సుగ్రీవుడు రాముని చూచినది మొదలు “ఇతడు వాలిని చంప సమర్థుడో కాడో ” అని సందేహిమ్చుచుందెను. అతడు రామునివిషయమున తనకు నమ్మకము కలుగుటకై, కొండవలె నున్న, దుందుభి యను రాక్షసుని కళేబరము రామునకు చూపెను. (పూర్వ మొకప్పుడు దానిని వాలి చాలదూరముగ విసరి వేసెను.)
ఉత్స్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్థి మహాబలః । పాదాఙ్గుష్ఠేన చిక్షేప సమ్పూర్ణం దశయోజనమ్ ॥ 65॥
ఊహింపరాని బలము కలవాడును, ఆ బలమునకు తగి నట్లు కార్యము చేయు సమర్థము లైన బాహువులు కలవాడును అగు రాముడు అస్థిమయమైన ఆ దుందుభికళేబరమును చూచి,”ఇది ఎంత?” అని నవ్వి, కొంచె మైనను తక్కువ లేకుండా పది యోజనముల దూరములో పడునట్లు, దానిని తన పాదాంగుష్ఠముతో ఎత్తి విసరెను.
బిభేద చ పునస్తాలాన్ సప్తైకేన మహేషుణా । గిరిం రసాతలం చైవ జనయన్ప్రత్యయం తదా ॥ 66॥
అప్పుడా రాముడు, సుగ్రీవున కింకను నమ్మకము కలుగునటకై ఒక్క బాణముచే ఏడు మద్దిచెట్లను, పర్వతమును, పాతాళమును భేదించెను.
తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః స మహాకపిః కిష్కిన్ధాం రామసహితో జగామ చ గుహాం తదా ॥ 67॥
రాముడు ఆ సప్తసాలాది భేదనము చేసిన పిమ్మట సురీవునకు నమ్మిక కుదిరెను. తనకు రాజ్యము లభించునని అతడు సంతసించి, రాముని వెంటబెట్టుకొని గుహ వలె నున్న క్ష్కింధా పట్టణమునకు వెళ్లెను.
తతోఽగర్జద్ధరివరః సుగ్రీవో హేమపిఙ్గలః । తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః ॥ 68॥
కిష్కింధ ప్రవేశించి, బంగారువంటి వన్నె గల వానర శేష్ఠుడైన సుగ్రీవుడు గర్జించెను. ఆ మహానాదము విని వాలి గృహమునుండి బైటకు వచ్చెను.
అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః । నిజఘాన చ తత్రైవ శరేణైకేన రాఘవః ॥ 69॥
వాలి, యుద్ధమునకు వెళ్లవద్దని నివారించుచున్న తారను ఒప్పించి, సుగ్రీవునుతో యుద్ధమునకు తలపడె. అచట రాముడు ఒక్క బాణముతో వాలిని చంపెను.
తతః సుగ్రీవవచనాద్ధత్వా వాలినమాహవే । సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్ ॥ 70॥
రాముడు సుగ్రీవుని ప్రార్థనప్రకారము వాలిని సంహరించి, అతని రాజ్యమునందు సుగ్రీవునే పట్టాభిషిక్తుని చేసెను.
స చ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః ।
దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజామ్ ॥ 71॥
వానరశ్రేష్ఠుడగు సుగ్రీవుడు వానరు లందరిని రప్పించి, సీతాదేవిని అన్వేషించుటకై అన్ని దిక్కులకు పంపెను.
తతో గృధ్రస్య వచనాత్సమ్పాతేర్హనుమాన్బలీ ।
శతయోజనవిస్తీర్ణం పుప్లువే లవణార్ణవమ్ ॥ 72॥
మహా బలశాలి యగు హనుమంతుడు సంపాతి యనెడు గ్రద్దచెప్పిన ప్రకారము నూరు యోజనముల వెడల్పు గల లవనసముద్రమును దాటెను.
తత్ర లఙ్కాం సమాసాద్య పురీం రావణపాలితామ్ ।
దదర్శ సీతాం ధ్యాయన్తీమశోకవనికాం గతామ్ ॥ 73॥
హనుమంతుడు రావణుడు పాలించుచున్న లంకాపురము చేరి, అచట అశోకవనములో రామునే ధ్యానించుచు ఉన్న సీతాదేవిని చూచెను.
నివేదయిత్వాఽభిజ్ఞానం ప్రవృత్తిం వినివేద్య చ ।
సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణమ్ ॥ 74॥
హనుమంతుడు, తన చేతికి రాముడిచ్చిన అంగుళీయకమును సీతాదేవికి గుర్తుగా ఇచ్చి, సుగ్రీవునితో రామునకు మైత్రి కలుగుట మొదలగు వృత్తాంతమును విన్నవించి, ఆమెను ఊరడించి, అశోకవనబహిర్ద్వారమును చూర్ణంచేసెను.
పఞ్చ సేనాగ్రగాన్ హత్వా సప్త మన్త్రిసుతానపి ।
శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ ॥ 75॥
హనుంతుడు సేనాపతుల నైదుగురిని, మంత్రిపుత్రులను ఏడుగురిని చంపి, శూరుడైన అక్షకుమారుని వధించి, ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు కట్టువడెను.
అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ ।
మర్షయన్రాక్షసాన్వీరో యన్త్రిణస్తాన్యదృచ్ఛయా ॥ 76॥
తతో దగ్ధ్వా పురీం లఙ్కామృతే సీతాం చ మైథిలీమ్ ।
రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్మహాకపిః ॥ 77॥
పరాక్రమశాలియగు హనుమంతుడు, పూర్వము బ్రహ్మదేవుడు తన కిచ్చిన వరముల ప్రభావములవలన, తనను బ్రహ్మాస్త్రబంధము వదిలిపోయినట్లు తెలిసినను, తనను త్రాళ్లచే కట్టి ఈడ్చుకొనిపోవుచున్న రాక్షసులను వధించుటకు సమర్థుడైనను, రావణుని చూడ గోరి, ఆ రాక్షసుల బాధలను సహించెను. రావణునితో మాటలాడిన పిమ్మట సీతాదేవి నివసించు ప్రదేశము తప్ప లంకాపురి నంతయు కాల్చి, రామునకీ సంతోషవార్త చెప్పటకై మరల రాముని సమీపమునకు వెళ్లెను.
సోఽభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణమ్ |
న్యవేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్త్వతః ॥ 78॥
అతిబుద్ధిశాలి యగు హనుమంతుడు, సీతావియోగము కలిగినను ఎంతమాత్రము ధైర్యము తగ్గని రాముని వద్దకు వెళ్ళి, అతనికి ప్రదక్షిణనమస్కారము చేసి “చూచితిని సీతను” అని యథార్థముగా విన్నవించెను.
తతః సుగ్రీవసహితో గత్వా తీరం మహోదధేః ।
సముద్రం క్షోభయామాస శరైరాదిత్యసన్నిభైః ॥ 79॥
సుగ్రీవుడుతో కలసి రాముడు సముద్రతీరము చేరి, సముద్రుడు తనకు వశము కానందుకు కోపించి, సూర్యునివలె తీక్ష్ణములైన బాణములచే సముద్రుని క్షోభింపచేసెను.
దర్శయామాస చాత్మానం సముద్రః సరితాం పతిః ।
సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్ ॥ 80॥
నదులకు పతియైన సముద్రుడు రాముని కోపమునకు భయపడి నిజరూపముతో కనబడి చెప్పగా, అతని మాటలప్రకారము రాముడు నీలునిచే సేతువు కట్టించెను.
తేన గత్వా పురీం లఙ్కాం హత్వా రావణమాహవే ।
రామః సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్ ॥ 81॥
రాముడు ఆ సేతుమార్గమున లంకలోనికి ప్రవేశించెను. యుద్ధము నందు రావణుని సంహరించెను. సీతను పొంది, “పరగృహములో చాలకాలము వసించిన భార్యను ఎట్లు పరిగ్రహింతును?” అని చాల సిగ్గుపడెను.
తామువాచ తతో రామః పరుషం జనసంసది ।
అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతీ ॥ 82॥
ఆ కారణమువలన రాముడు జనులందరిలోను, సీతతో పరుషముగా మాటలాడెను. మహాపతివ్రత యగు ఆ సీతాదేవి ఆ మాటలను సహింపజాలక అగ్నిలో ప్రవేశించెను.
తతోఽగ్నివచనాత్సీతాం జ్ఞాత్వా విగతకల్మషామ్ ।
బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః ॥83॥
“సీత ఎట్టిపాపమును లేనిది” అని అగ్ని చెప్పగా రాముడు చాల సంతసించెను. దేవతలు పూజింపగా ప్రకాశించెను.
కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరమ్ ॥
సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః ।|84॥
మహాత్ముడైన రాముడు లోకకంటకుడైన రావణుని చంపుటచే స్థావరజంగమాత్మకములైన మూడు లోకములను, దేవతాఋషిగణసహితముగా సంతోషించినవి.
అభిషిచ్య చ లఙ్కాయాం రాక్షసేన్ద్రం విభీషణమ్ ।
కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోద హ ॥ 85॥
రాముడు పూర్వము విభీషణుని సముద్రతీరమున అభిషిక్తుని చేసెను. ఇపుడు లంకాపురంలో కూడ విభీషణుని రాక్షసరాజునుగా అభిషిక్తుని చేసి, కృతకృత్యుడైయ్యెను. తన ప్రతిజ్ఞ నెరవేరునో లేదో అను చింత తొలగిపోయెను. రాముని సత్యవ్రత మత్యాశ్చర్యకరము కదా!
దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ ।
అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః ॥ 86॥
రాముడు తనను చూడ వచ్చిన దేవతలనుండి వరమును పొందెను. దాని ప్రకారము మృత్యులైన వానరులనందరిని బ్రతికించుకొనెను. స్నేహితులతో కూడి, పుష్పక విమానారూఢుడై అయోధ్యకు బయలుదేరెను.
భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః ।
భరతస్యాన్తికే రామో హనూమన్తం వ్యసర్జయత్ ॥ 87॥
సత్యమునందు స్థిరముగ నిలచువాడును, లోకాభిరాముడును అగు రాముడు భరద్వాజాశ్రమమునకు వెళ్ళెను. హనుమంతుని భరతుని వద్దకు పంపెను.
పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవసహితస్తదా ।
పుష్పకం తత్సమారుహ్య నన్దిగ్రామం యయౌ తదా ॥ 88॥
ఆ రాముడు సుగ్రీవవిభీషణాదులతో కూడి, పూర్వవృత్తాంతములను చెప్పుకొనుచు నందిగ్రామమునకు వెళ్ళెను.
నన్దిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోఽనఘః ।
రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ॥ 89॥
ఎట్టి పాపములు లేని ఆ రాముడు నందిగ్రామమున సోదరుల నందరిని కలిసెను. వారందరును జడలను విడచిరి. మునివేషమును విడుచుటచే సీతతో గార్హస్థ్యమును అవలంబిచెను. మరల రాజ్యమును పొందెను.
ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః ।
నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్షభయవర్జితః ॥ 90॥
రాముడు రాజ్యాభిషిక్తుడు కాగా, లోక మంతయు సంతోషాతిశయముచే గగ్గుర్పాటు చెందెను. రాముడు రాజు కావలెననెడి తమ కోరిక తీరుటచే ప్రజలెల్లరు ప్రీతి చెందిరి. ఆనందాతిశయముచే స్థావర జంగమాత్మకమగు లోకము యొక్క శరీరము వృద్ధి చెందినది. ప్రజలందరును చక్కగా ధర్మము నాచరించుచుండిరి. లోకమందు పీడలు, వ్యాధులు, దుర్భిక్షముల భయము తొలగిపోయెను.
గమనిక: ఈ తాత్పర్యములు ఆర్షవిజ్ఞానట్రస్టువారి మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెలశ్రీరామచంద్రుడు గారిచే రచించబడిన శ్రీ మద్రామాయణము-బాలకాండము గ్రన్థమునుండి కృతజ్ఞతా పురస్కరముగా తీసుకొనబడినవి.
న పుత్రమరణం కేచిద్ ద్రక్ష్యన్తి పురుషాః క్వచిత్ ।
నార్యశ్చావిధవా నిత్యం భవిష్యన్తి పతివ్రతాః ॥ 91॥
రాముడు రాజ్యము చేయుచున్నప్పుడు తండ్రి యుండగా పుత్రుడు మరణిచడు. స్త్రీలకు వైధవ్యదుఃఖము ఉండదు. వారు సర్వదా పతివ్రతలై యుందురు.
న చాగ్నిజం భయం కిఞ్చిన్నాప్సు మజ్జన్తి జన్తవః ।
న వాతజం భయం కిఞ్చిన్నాపి జ్వరకృతం తథా ॥ 92॥
న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా ।
రాముని రాజ్యములో అగ్ని భయము కాని, జల భయము కాని, వాత భయము కాని, జ్వర భయము కాని, క్షుద్భాధ కాని, చోరభయము కాని లేదు.
నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ ॥ 93॥
నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా ।
నగరములు, దేశములు కూడ, ధనధాన్యసమృద్ధములై ఉన్నవి. కృతయుగములో వలెనే ప్రజ లందరును సంతోషవంతులై యున్నారు.
అశ్వమేధశతైరిష్ట్వా బహువస్త్రసువర్ణకైః ॥ 94॥
గవాం కోట్యయుతం దత్త్వా బ్రహ్మలోకం గమిష్యతి ।
అసఙ్ఖ్యేయం ధనం దత్త్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ॥ 95॥
గొప్ప కీర్తి గల రాముడు వందల కొలదిఅశ్వమేధయాగముల చేతన, అనేక ‘బహుసువర్ణక’ యాగములచేతన దేవతలను పూజించి, పదివేల కోట్లగోవులను, లెక్కింప రానంత ధనమును బ్రహ్మణుల కిచ్చి, శాశ్వత మగు తన స్థానమును పొందగలడు.
రాజవంశాఞ్ఛతగుణాన్స్థాపయిష్యతి రాఘవః ।
చాతుర్వర్ణ్యం చ లోకేఽస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ॥ 96॥
రాముడు క్షత్రియులకు రాజ్యము లిచ్చి నూరింతలుగా వారి వంశములను వృద్ధి పొందింపగలడు. నాలుగు వర్ణములవారిని వారి వారి ధర్మములాచరించు నట్లు నియమించగలడు.
దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ ।
రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ॥ 97॥
రాముడు పదకొండు వేల సంవత్సరముల పాటు రాజ్యమును ప్రజలకు సుఖము కలుగు నట్లు పాలించి, బ్రహ్మలోకమును చేరగలడు.
ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ ।
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ॥ 98॥
రామచరిత్ర పరిశుద్ధిని కలిగించును. పాపములను నశింపజేయును. పుణ్యములను ఇచ్చును. ఇది వేదముతో సమానము. దీనిని చదువువాని సర్వపాపములును తొలగిపోవుని.
ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః ।
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ॥ 99॥
రామాయణమనెడి ఈ ఆఖ్యానము ఆయుర్దాయమును వృద్ధి పొందించును. దీనిని చదువువాడు పుత్రపౌత్రాదులతోను, భృత్యబంధుగణములతోను కూడి సర్వసౌఖ్యములను అనుభవించి, మరణాంతరము స్వర్గమునందు దేవతలచేత పూజింపబడును.
పఠన్ద్విజో వాగృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ ।
వణిగ్జనః పణ్యఫలత్వమీయాజ్జనశ్చ శూద్రోఽపి మహత్త్వమీయాత్ ॥ 100॥
ఈ రామాయణమును బ్రాహ్మణుడు పఠించినచో అష్టాదశవిద్యలందును ప్రావీణ్యమును పొందును. క్షత్రియుడు పఠించినచో భూమండలాధిపతియగును. వైశ్యుడు పఠించ్నచో వ్యాపారమునందు లాభమును పొందును. శూద్రుడు పఠించినచో గొప్పవాడగును.
ValmikiRamayana SamkshepaRamayanam
గమనిక: ఈ తాత్పర్యములు ఆర్షవిజ్ఞానట్రస్టువారి మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెలశ్రీరామచంద్రుడు గారిచే రచించబడిన శ్రీ మద్రామాయణము-బాలకాండము గ్రన్థమునుండి కృతజ్ఞతా పురస్కరముగా తీసుకొనబడినవి.
Other related posts