మాఘపాదివారపు నోము కథ

మాఘపాదివారము నోము

ఒక గ్రామములో లక్ష్మీదేవమ్మ అను నొక భాగ్యశాలిని వున్నది. ఆమెకు ఐదుగురు కొడుకులు. ఒక సంవత్సరమును మాఘ పూర్ణిమకు ముందర రథసప్తమి నాడామె అభ్యంగన స్నానమాచరించి అక్షతలు చేతబట్టుకొని కొడుకులను బిలిచి ‘ నాయనలారా! మాఘపాదివారపు కథ చెప్పెదను మీరు వినవలెనని’ అన్నది. కాని వారి కప్పుడే రాజుగారి సభకు వెళ్ళవలసిన కాలము మించిపోవుచున్నదని చెప్పి వారు వెళ్ళిపోయిరి. అప్పటికే సభ ప్రారంభమయి చాలాసేపు అయ్యెను. రాజా బ్రాహ్మణ బాలురను విడిగా మన్నించెను. వారి కట్టివిడి మన్నన జరుగుటచే వారు తమ తల్లి చెప్పబోయిన కథ వినకుండుటచే నట్టివిడి మన్నన జరిగెనని చింతించి యింటికి వెళ్ళిరి. లక్ష్మీదేవమ్మ మనుమలను పిలిచి కథ వినుడని కోరెను. వారు తమకు బడివేళ అయినదని చెప్పి వెళ్ళిపోయిరి. బడిలో పంతులు ఆలస్యముగా వచ్చిరని వారిని కొట్టెను. అప్పుడు వారు కథ వినకుండ వచ్చినందుకట్టి కష్టము వచ్చెనని ఏడ్చుచు ఇంటికిబోయిరి. తరువాత ఆమె నీళ్ళాడు రేవు దగ్గరకు వెళ్ళి అక్కడున్న స్త్రీలను జూచి ‘ అమ్మలారా! మాఘపాదివారపు కథ చెప్పెదను వినుడని పలికెను. కాని వారు నీళ్ళు తీసుకొని పోవలెనని చెప్పి కడవలను నెత్తినబెట్టుకొని వెళ్ళుచుండగా నడిత్రోవలో నా కడవలు బ్రరద్ధలైపోయెను. అప్పుడు వారు అయ్యో! మనము మాఘపాదివారపునోము కథ వినకుండుటవలన నిట్టి నష్టమువచ్చినది’ అని విచారించుచు నిండ్లకు పోయిరి. తరువాత నామె తన కెదురుపడిన యాయవారపు బ్రాహ్మణుని బిలిచి కథవిను మని కోరెను. కాని అతడు ‘ ప్రొద్దుపోవుచున్నది , యాయవారమునకు బోవలెను నీ కథను వినుటకు కాలము లేదు’ అని చెప్పి వెడలిపోయెను. ఆనాడాతని కేమియుదొరకలేదని పశ్చాత్తాపపడెను. తరువాతనామె కమ్మరిని కుమ్మరిని మేదరిని కథని వినుమని అడిగెను. వారు పని ఉన్నదని చెప్పి కథ వినలేదు. అప్పుడు వారికి వారివారి పనులలో కష్టములు వచ్చెను. వారాకష్టములకు కారణము లక్ష్మీదేవమ్మ చెప్పబోయిన మాఘపాదివారపు కథ వినకపోవుటయే కారణము అనుకొని విచారించిరి. అప్పుడామె ఊరు వెలుపలకు వెళ్ళి అక్కడ ఉప్పరగుడిసెలో నున్న ఉప్పరి సోదెమ్మను జూచి కథ వినుమని కోరెను. అది విని సోదెమ్మ తాను గడిచిన శనివారమునాడు ఒంటిపూట భోజనము చేసియుండుట చేతను, నాడు ఆదివారమగుట చేతను , మానెడు పాలలో చేరెడు బియ్యము వేసి పాయసము వండిపెట్టినచో కథవినెదననెను. ఆమె కోరిన ప్రకారము లక్ష్మీదేవమ్మ పాయసము వండిపెట్టెను. సోదెమ్మ గర్భిణి అగుటచే ఆ పాయసము తిని సొమ్మసిల్లి నిద్రపోయెను. ఆమె గర్భమందలి పిల్ల లక్ష్మీదేవమ్మతో ‘ మాయమ్మ కడుపుమీద అక్షతలు వేసి కథ చెప్పిన యెడల నేను కథను వినెద’ననెను, ఆమె అట్లే చేసి కథచెప్పుకొనెను. అంతలో సోదెమ్మలేచి కథ చెప్పమని అడెగెను. లక్ష్మీదేవమ్మ ఆమెతో ‘అమ్మా! నీ కడుపులోని పిల్ల కథ విన్నది. నీకు మగపిల్లవాడు పుట్టిననూ, ఆడపిల్లపుట్టిననూ నాకు కబురంపు’ మని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయెను. కొంతకాలమునకు ఉప్పరి సోదెమ్మ ఆడపిల్లను కనెను. వెంటనే ఆమె వార్తను లక్ష్మీదేవమ్మకు తెలియజేసెను. అంతట లక్ష్మీదేవమ్మ అక్కడకు వెళ్ళి ఆ శిశువును తీసుకొనిపోయి, అడవిలో రావిచెట్టునకు కోకతో ఉయ్యాలవేసి బిడ్డనందు నిద్రపుచ్చి-

ఈ బిడ్డ ఇంచుక ఏడ్వకుండాను పాడండి పాటలు పక్షివరులారా! ఊపండి ఊయెలా వృక్షజాలములారా- నీడనొసగుడు నీలమేఘములారా! కన్నతల్లికి నేడు గట్టిపని వుంది- పెంచిన తల్లియు పురమేగుతుంది, 

అని పాడి తనయింటికి వెళ్ళిపోయెను. వృక్షములు ఊయల ఊపుచుండగా, పక్షులు కిలకిలమని పాటలు పాడుచుండగా , ఆబిడ్డసుఖముగా నున్నది. అంత ఒకానొక రాజామార్గమున వెడలుచూ చక్కని చుక్కవలె విచ్చిన మొగ్గవలె అందాల నిగ్గువలె వున్న ఆకన్యను చూచి ఆశ్చర్యపోయి, ఆమెకు సవారీ మీద నెక్కించుకొని, తన గ్రామమునకు పోవుచుండెను . ఆబిడ్డపోయిన దారిలోనున్న చేలు కంకికికుంచెడయ్యెను. పాడుబడ్డ గ్రామములు పట్టణములయ్యెను. అది చూచి రాజు పరివారములోని వారందరూ ఆశ్చర్యపడి, ఆకన్యమహత్తును పొగడిరి. పిమ్మట రాజామెను తన మొదటిభార్ యవద్దకు పంపెను. అంతవరకు సంతానహీనముగావున్న రాజు పట్టపురాణి ఆమె రాకచేత పుత్రవతి అయ్యెను. ఆ కన్య రాకవలన పట్టణము మహాశోభాయమానముగా నగుటచేత ప్రజలామెను రమాదేవియని పిలువదొడగిరి, పిమ్మట కొంతకాలమునకు రాజు రమాదేవిని పెండ్లాడెను. అందుచే రాణికి రమాదేవిమీద క్రోధాసూయలుకలిగెను. రమాదేవి చాలా అందగత్తె. రాజామెను ఎక్కువగా ప్రేమించుచుండెను. రాణికి అది మిగులకష్టముగా నుండుటచే రమాదేవికి నగలు లేకపోయిన ఎడల నామె అందము తగ్గునని యెంచి, ఒకనాడు తన నగలు, రమాదేవి నగలు ఒక భరిణెయందుంచి, దాసిచే సముద్రములో పడవేయించినది. ఆభరిణెనొక పెద్దచేప మ్రింగెను. జాలరులా చేపనుబట్టి యది చాల పెద్దదగుటచే తమ రాజుకు కానుకగా బంపిరి. రాజు ఆ చేపను పెద్దభార్య యింటికి బంపి తానారాత్రి భోజనమున కామె ఇంటికివత్తునని ఆ చేపను వండించి ఉంచమని కబురంపెను. ఆమె ‘ మాటలు తేటలు రమాదేవి దగ్గరనా? మాపటి భోజనము మాత్రం నా యింటి దగ్గరనా?’ యని విసుగుకొని చేపను రమాదేవియింటికే పంపివేసెను. రమాదేవి దానిని దాసిచే కోయించుచుండగా దానికడుపులోని భరిణెనుండి ఘల్లున నగలు రాలినవి. ఆనగల నన్నింటినీ తీసుకొని ఆమె చక్కగా అలంకరించుకొని రాజునకు కబురంపెను. రాజు వచ్చి రమాదేవి అలంకారములనుచూచి ముగ్ధుడై ఆసంగతి పెద్దభార్యతో  చెప్పుటకు ఆమె అంతఃపురమునకేగెను. రమాదేవికి నగలు దొరికినసంగతి ఆమె కంతకుపూర్వమే తెలియుటచే నామె రమాదేవిని చంపవలెనని, పాయసములో విషముపెట్టి చంపించుటకు సిద్ధపడుచుండ అంతలోరాజు అక్కడకువెళ్ళి  అది విషపుపాయసమని తెలియక దాన్ని త్రాగిమరణించెను. రాణి సహగమనము చేయుటకు సిద్ధపడుచుండ నాసంగతి రమాదేవికి కబురంపినది. రమాదేవికూడ సహగమనము చేయవలెనని బయలుదేరుచుండగా నొక వృద్ధబ్రాహ్మణుడామె ఇంటికివచ్చి ‘ఎక్కడకు వెళ్ళుతున్నావమ్మా?’ యని ప్రశ్నించెను. ‘భర్తతో మరణించుటకు పతితో సహగమనము చేయుటకు వెళ్ళుచుంటి’ నని బదులుచెప్పెను. అది విని అతడు ‘సౌభాగ్యవతీభవ’ అంతపని జరుగరాదు. నాకు కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళిచ్చి, నీవుకూడా కాళ్ళు కడుగుకొమ్ము యనెను. ఆమె యట్లె చేసెను. వెంటెనే అతడు నాకు దాహమునిచ్చి నీవుకూడా దాహము పుచ్చుకోవలెను. అప్పుడామె ‘మొగుడిశవం మొగసాల వున్నది. మగనికొరకు నేను మొత్తుకొనుచుంటిని, దాహం పుచ్చుకొనుటకు ధర్మం’ కాదనెను. అది విని వృద్ధబ్రాహ్మణుడు, ‘ సౌభాగ్యవతీభవ’ అంతగతిపుట్టరాదు. నేను చెప్పినట్లు చేయ’ మనెను. ఆమె యట్లే చేసినది.  అతడు తనకు తలయంటి నీళ్ళుపోసి గంధము ఇమ్మని అడిగి ఆమెనుకూడ తలయంటికొని, పసుపురాసుకొనమని ఆజ్ఞాపించెను. అందులకామె భయపడి ‘స్వామి మగడుపోయి ఏడ్చుచూ కాళ్ళు కడుగుకొని కాళ్ళుదాచుకొంటిని. దాహం పుచ్చుకొని కడుపు దాచుకొంటిని పసుపురాసుకొని ముఖమెట్లుదాచగలనని ‘ ఆమె ప్రశ్నించినది. అందుకా బ్రాహ్మణుడు ‘సౌభాగ్యవతీభవ’ నీ కెందుకమ్మా అంత భయము? నేచెప్పినట్లు చేయుమనెను. ఆమెయట్లే చేసినది. పిమ్మట నామె యాతడు చెప్పినట్లతనికి బొట్టుపెట్టి, తనుకూడాబొట్టు పెట్టుకొని అతనికి భోజనముపెట్టి, తనుకూడా భోజనముచేసి, అతనికి తాంబూలము ఇచ్చి, తానుకూడా తాంబూలమును సేవించినది. అంతనావృద్ధ బ్రాహ్మణుడు విష్ణుమూర్తిగా మారి ‘ అమ్మాయీ నీభక్తికి మెచ్చితిని, నీవుతల్లిగర్భమున ఉన్నప్పుడే మాఘపాదివారపుకథవిని పవిత్రురాలవైతివి. నీకేమి కావలయనో కోరుకొనుము, ఇచ్చెదెననెను. ఆమె మిగుల సంతోషించి తనకు పతిభిక్ష పెట్టవలసినదిగా కోరినది. విష్ణుదేవుడు అటులేనని అక్షతలనిచ్చి వాటిని ఆమె భర్తశవంమీద చల్లవలెనని చెప్పి అదృశ్యుడయ్యెను. తరువాత నామె అక్షతలుపట్తుకొని తన భర్తశవముదగ్గరకు వెళ్ళి దానికి ముమ్మారు ప్రదక్షిణముచేసి అక్షతలు మీద చల్లెను. వెంటనే రాజు నిద్రనుండి లేచినటులలేచెను. అదిచూచి అక్కడున్న వారాశ్చర్యపడి ‘ఏమినోము నోచితివమ్మా’ యని అడిగిరి. అందుకామె నేను ఏనోము నోచలేదు. ఏ వ్రతము చేయలేదు. మాఘపూర్ణిమకు ముందువచ్చు రథసప్తమినాడు మాఘపాదివారపునోముపట్టి ‘లక్ష్మీదేవమ్మ’ అను నామెకథ చెప్పుచుండగా ఆకథ నేను వింటిని. ఈ ఘటన ఆకథ విన్న ఫలమేగాని చేసినఫలము గాదని రమాదేవి చెప్పినది. అక్కడవున్న వారందరూ ‘ ఆహా! ఆనోము కథవిన్నంత మాత్రముననే ఇంతటి మహాత్మ్యము వచ్చినది. దానిని నోచినచో ఇంకెంతటి ఫలమబ్బునోగదా’ అని అనుకొని మాఘపాదివారమునోము నోచుటకు మొదలిడిరి. రాజతనయిద్దరి భార్యలతో కూడ ఆనోమునునోపించి సుఖముగా నుండెను.

దీనికి ఉద్యాపనము:– ఈనోము పట్టిన అయిదేండ్ల అరువాత ఉద్యాపనము చేయవలెను. నోముపట్టినవారు మొదటి సంవత్సరము పాలుత్రాగకుండ సంవత్సరాంతమున ఒక ఆదివారమునాడు అయిదుగురు ముత్తయిదువులకు పరమాన్నముతో భోజనము పెట్టవలయును. రెండవయేటమజ్జిగ త్రాగకుండ ఐదుగురు ముత్తయిదువులకు పెరుగువడ్డించెవలెను. మూడవయేట పప్పుతినకుండ ఐదుగురు ముత్తయిదువులకు బూరెలతో భోజనము పెట్టవలెను, నాలుగవ సంవత్సరము తలంటుకొనకుండ ఐదుగురు ముత్తయిదువులకు తలంటి భోజనము పెట్టవలెను. ఐదవయేట తాంబూలము వేసుకొనకుండ ఐదుగురు ముత్తయిదువులకు తాంబూలము లొసంగవలెను. ఆఖరి సంవత్సరమున అయిదుగురు పుణ్యస్త్రీలకు అయిదు రవికెల గుడ్డలను యిచ్చి ఉగ్గు గిన్నెయు ఉయ్యాలకు చీర యిచ్చి ఆదినారాయణమూర్తికి అయిదు మూళ్ళ అంగవస్త్రమునిచ్చి వుద్యాపన చేసుకొనవలెను.

Maghapadivarapu nomu kathaFor related posts, click on -> https://shankaravani.org/category/%e0%b0%a8%e0%b1%8b%e0%b0%ae%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s