ఆదిత్యహృదయస్తోత్రము

శ్రీమద్రామాయణాంతర్గత ఆదిత్యహృదయస్తోత్రము, మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుల తెలుగు తాత్పర్యము తో.

తతో యుద్ధపరిశ్రాన్తం సమరే చిన్తయా స్థితమ్ ।
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ ।
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః ॥ 2 ॥

యుద్ధమును చూచుటకై దేవతలతో కలసివచ్చిన భగవంతుడైన అగస్త్యమహర్షి, అప్పుడు, యుద్ధముచేసి అలసి, యుద్ధమునకై వచ్చి ఎదుట ఉన్న రావణునిచూచి చింతాక్రాంతుడై ఉన్న రాముని దగ్గరకు వెళ్ళి ఇట్లు పలికెను.

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ ।
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥

గొప్ప బాహువులు కల నాయనా! ఓ రామా! రామా! నిత్యమైన ఒక రహస్య స్తోత్రమును వినుము. దీనిచేత యుద్ధములో సర్వ శత్రువులను జయించగలవు.

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ ।
జయావహం జపేన్నిత్యమక్షయ్యం పరమం శివమ్ ॥ 4 ॥
సర్వమఙ్గలమాఙ్గల్యం సర్వపాపప్రణాశనమ్ ।
చిన్తాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ ॥ 5 ॥

పుణ్యప్రదమైన ఆదిత్యహృదయస్తోత్రమును నిత్యము జపించవలెను. ఇది సకల శత్రువులను నశింపజేయును. అక్షయమైన ఫలములను ఇచ్చును. చాలా పవిత్రమైనది. మంగళప్రదమైన స్తోత్రములన్నింటిలోనూ ఇది అధిక మంగళప్రదము.సకల పాపములను తొలగించును. చింతను శోకమును శాంతింపజేయును. ఆయుస్సును వృద్ధిపొందించు ఉత్తమసాధనము.

రశ్మిమన్తం సముద్యన్తం దేవాసురనమస్కృతమ్ ।
పూజయస్వ వివస్వన్తం భాస్కరం భువనేశ్వరమ్ ॥ 6 ॥

సూర్యుడు ప్రశస్తమైన కిరణములు కలవాడు. ఉదయపర్వతమందు ఉదయించువాడు (లోకులను తమ తమ పనులలో ప్రవర్తింపచేయువాడు అని కొందరు వ్యాఖ్యాతలు) దేవతలచేత, అసురులచేత కూడ నమస్కరింపబడినవాడు. తన తేజస్సుచే ఇతరుల తేజస్సులను కప్పివేయవాడు. కాంతిని ఇచ్చువాడు. సర్వలోకములను నియమించువాడు. అట్టి సూర్యుని ఆరాధింపుము.

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ।
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ॥ 7 ॥

ఇతడు సర్వదేవతాస్వరూపుడు.గొప్పతేజస్సు కలవాడు. కిరణములచేత లోకులను రక్షించువాడు. ఈ సూర్యుడు తన కిరణములచేత దేవగణములను,అసురగణములను, జనులను రక్షించుచున్నాడు.

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కన్దః ప్రజాపతిః ।
మహేన్ద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ॥ 8 ॥

ఈ సూర్యుడే బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు, స్కందుడు, నవ ప్రజాపతులు, మహేంద్రుడు, కుబేరుడు, కాలపురుషుడు,యముడు, సోముడు, వరుణుడు.

పితరో వసవః సాధ్యా అశ్వినౌ మరుతో మనుః ।
వాయుర్వహ్నిః ప్రజాః ప్రాణ ఋతుకర్తా ప్రభాకరః ॥ 9 ॥

పితృదేవతలు,వసువులు, సాధ్యులు, అశ్వినీదేవతలు, మరుత్తులు,మనువు, వాయువు, అగ్ని, ప్రజలు, ప్రాణవాయువు – ఇవన్నీ సూర్యుడే. ఇతడు ఋతువులను నిర్మించును, కాంతిని ఇచ్చును.

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ ।
సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥

అదితికుమారుడు.జగత్తు సృష్టించినవాడు. జనులను తమ కర్మలయందు ప్రేరేపించువాడు. ఆకాశమునందు సంచరించువాడు.జగత్తును వర్షాలచేత పోషించువాడు. కిరణములు కలవాడు. బంగారురంగు కలవాడు. ప్రకాశించువాడు.బంగారము రేతస్సుగాగలవాడు. పగలు కల్పించువాడు.

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ ।
తిమిరోన్మథనః శమ్భుస్త్వష్టా మార్తణ్డకోఽంశుమాన్ ॥ 11॥

ఆకుపచ్చనిగుఱ్ఱములు కలవాడు. వెయ్యి కిరణములు కలవాడు. సప్త అను పేరు గల గుఱ్ఱము కలవాడు (అని గోవిందరాజులు).ఏడు గుఱ్ఱములు కలవాడు. కిరణములుగలవాడు. చీకటిని నశింపజేయువాడు. సుఖమును ఇచ్చువాడు.ప్రాణులను సంహరించువాడు. బ్రహ్మాండమును ప్రళయము తరువాత మరల సృజించువాడు. కిరణములు కలవాడు.

హిరణ్యగర్భః శిశిరస్తపనోఽహస్కరో రవిః ।
అగ్నిగర్భోఽదితేః పుత్రః శఙ్ఖః శిశిరనాశనః ॥ 12॥

సూర్యుడు బ్రహ్మ,విష్ణు,రుద్రరూపుడు. చల్లనివాడు, తపింపజేయువాడు. పగటిని కల్పించువాడు. స్తుతించబడువాడు. అగ్నిగర్భమునందుకలవాడు. అదితియొక్క పుత్రుడు. శాంతించువాడు. శిశిరమును నాశనముజేయువాడు.

భగవతే హిరణ్యగర్భాయ నమః అను ద్వాదశాక్షరి ఆదిత్యహృదయరహస్యమని వ్యాఖ్యాతలు వ్రాసినారు.

వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః ।
ఘనవృష్టిరపాం మిత్రో విన్ధ్యవీథీ ప్లవఙ్గమః ॥ 13॥

సూర్యుడు ఆకాశమునకు ప్రభువు. రాహువుని భేదించువాడు. ఋగ్యజుః సామవేదముల సారమును పొందినవాడు. అధికమైన వర్షమునిచ్చువాడు. ఉదకమునకు మిత్రుడు. ఆకాశమున శీఘ్రముగా సంచరించువాడు.

ఆతపీ మణ్డలీ మృత్యుః పిఙ్గలః సర్వతాపనః ।
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః ॥ 14॥

సూర్యుడు ఎండ ఇచ్చువాడు. మండలముగలవాడు. శత్రుసంహారకుడు. ఉదయసమయమున ఎఱ్ఱగా ఉండువాడు. అందరికీ తాపము కలిగించువాడు. పండితుడు. ప్రపంచ వ్యవహారము నడుపువాడు. గొప్ప తేజస్సుకలవాడు. అందరియందు ప్రేమకలవాడు. అందరి సంసారమునకు కారణభూతుడు.

నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః ।
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఽస్తు తే ॥ 15॥

సూర్యుడు అశ్విన్యాది నక్షత్రములకు, చంద్రాది గ్రహములకు, తారలకు అధిపతి. జగత్తుకు స్థాపకుడు. అగ్న్యాది తేజస్సులమధ్య అధికతేజస్సు కలవాడు. అట్టి సూర్యునకు నమస్కారము. ఓ ద్వాదశ స్వరూపములు కలవాడా! నీకు నమస్కారము. ( ఇన్ద్రో ధాతా భగః పూషా మిత్రోఽథ వరుణోఽర్యమా అర్చిర్వివస్వాన్ త్వష్టా చ సవితా విష్ణురేవ చ )

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః ।
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ॥ 16॥

పూర్వ(తూర్పు) పర్వతరూపునకు నమస్కారము. పశ్చిమపర్వతరూపునకు నమస్కారము. జ్యోతిర్గణముల అధిపతికి నమస్కారము. దినాధిపతికి నమస్కారము.

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః ।
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ॥ 17॥

ఉపాసకులకు విజయమును, ఉన్నతిని, క్షేమమును (మంగళమును) ఇచ్చువాడు, ఆకుపచ్చని గుఱ్ఱములు కలవాడు అయిన సూర్యునకు నమస్కారము. నమస్కారము. వేయికిరణములు కలవాడా, నమస్కారము. నమస్కారము.

నమ ఉగ్రాయ వీరాయ సారఙ్గాయ నమో నమః ।
నమః పద్మప్రబోధాయ ప్రచణ్డాయ నమో నమః ॥ 18॥

ఉగ్రునకు నమస్కారము. వీరునకు నమస్కారము. శీఘ్రముగ వెళ్ళువానికి నమస్కారము. నమస్కారము. పద్మములను వికసింపచేయువానికి నమస్కారము. తీక్ష్ణమైన నీకు నమస్కారము.

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే ।
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ॥ 19॥

బ్రహ్మ-విష్ణు-శివాత్మకునకు, సూర్యునకు, ఆదిత్యరూపమైన తేజస్సు కలవానికి, కాంతి కలవానికి, సర్వసంహారము చేయువానికి, రౌద్రరూపము కలవానిని నమస్కారము.

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే ।
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ॥ 20॥

చీకటిని, మంచుని, శత్రువులను, కృతఘ్నులను నశింపచేయువానికి, అపరిచ్ఛిన్నమైన స్వరూపము కలవానికి, ప్రకాశించుచున్నవానికి, జ్యోతిస్సుల అధిపతికి నమస్కారము.

తప్తచామీకరాభాయ హరయే విశ్వకర్మణే ।
నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే ॥ 21॥

కాల్చిన బంగారము వంటి కాంతి కలవానికి, హరికి, విశ్వస్రష్టకు, తమోవినాశకునకు, ప్రకాశస్వరూపునకు, లోకసాక్షికి నమస్కారము.

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః ।
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ॥ 22॥

ప్రభువైన ఇతడే జగత్తును ప్రళయకాలమునందు నశింపచేయును. దానినే సృష్టించును. ఇతడు కిరణములచేత శుష్కింపచేయును. తపింపజేయును. వర్షించును.

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ।
ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ ॥ 23॥

అన్ని ప్రాణులూ నిద్రించుచుండగా ఇతడు వాటిలో అంతరాత్మ రూపమున ఉండి మేల్కొని ఉండును. ఇతడే అగ్నిహోత్రము. అగ్నిహోత్రము చేయువారికి ఫలమునిచ్చువాడు.

దేవాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ ।
యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమప్రభుః ॥ 24॥

దేవతలు, క్రతువులు, క్రతువుల ఫలమూ కూడ సూర్యుడే. లోకములో ఉన్న సమస్త కృత్యముల (యజ్ఞయాగాదుల) విషయమున మిక్కిలి సమర్థుడు ఇతడే.

ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాన్తారేషు భయేషు చ ।
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ ॥ 25॥

రామా! ఆపదలలోను, దుర్గమప్రదేశములలోను, భయసమయములలోను, ఈ ఆదిత్యుని కీర్తించు ఏ మానవుడూ నశించడు.

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ ।
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి ॥ 26॥

జగత్తునకు ప్రభువైన ఈ దేవదేవుని ఏకాగ్రచిత్తముతో పూజించుము. ఈ ఆదిత్య హృదయమును మూడు పర్యాయములు జపించినచో యుద్ధములలో జయము పొందగలవు.

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ।
ఏవముక్త్వా తదాఽగస్త్యో జగామ స యథాగతమ్ ॥ 27॥

ఓ మహాబాహూ! నీవు ఈ క్షణమునందే రావణుని చంపగలవు. అగస్త్యుడీవిధముగా పలికి వచ్చిన విధముగానే వెళ్ళిపోయెను.

ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా ।
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ ॥ 28॥

గొప్ప తేజస్సుగల రాముడు అప్పుడు అది విని శోకమును విడిచిపెట్టెను. రాముడు చాల సంతోషించి నిశ్చలమైన మనస్సుతో ఆ మంత్రమును ధరించెను.

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ ।
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ ॥ 29॥
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధార్థం సముపాగమత్ ।
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ ॥ 30॥

పరాక్రమవంతుడైన ఆ రాముడు మూడు పర్యాయములు ఆచమనము చేసి పవిత్రుడై సూరుణ్ణి చూచి, ఆదిత్యహృదయమును జపించి గొప్ప సంతోషమును పొందెను. ధనుస్సు గ్రహించి రావణుని చూచి సంతోషించిన మనస్సుతో యుద్ధమునకై వచ్చెను. సర్వప్రయత్నములచేత ఆతనిని చంపుటకు నిశ్చయించుకొనెను.

అథ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః ।
నిశిచరపతిసఙ్క్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి ॥ 31॥

ఆపుడు సంతోషించిన సూర్యుడు రోమాంచము కలిగిన శరీరముతో దేవగణము మధ్య నిలచి, రాముణ్ణి చూచి, రావణుడు మరణింపనున్నాడని తెలిసికొని (లేదా రావణుడు మరణించునట్లు అనుగ్రహించి) “తొందరపడుము” అని పలికెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే యుద్ధకాణ్డే పఞ్చోత్తరశతతమః సర్గః ॥
శ్రీమద్రామాయణాంతర్గత ఆదిత్యహృదయస్తోత్రము, మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుల తెలుగు తాత్పర్యము తో.

Aditya Hridayam

1 Comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s