పరమాచార్యుల స్మృతులు : ఇంక దండంతో పని లేదు
(బాలూమామ స్వానుభవం : పరమాచార్యుల దివ్యసమక్షంలో ’ఈ-పుస్తకం’ నుండి)
దీపావళి ఇంకా రెండు రోజులుందనగా – శ్రీవారు అప్పటికి ఇంకా అజగరస్థితి మొదలు పెట్టలేదు (దీని గురించి ఈ వ్యాసంలో తరువాత చెప్పబడుతుంది) – శ్రీవారు భిక్ష స్వీకరించలేదు. వారు తమ తుది ప్రస్థానం గురించి చాలా సంకేతాలిచ్చేవారు, మాకే ఏమీ అర్థం కాలేదు.
ధర్మ పాటీ అక్కడకు వచ్చింది.
“ఏమిటి ఈ రోజు విశేషం? ఏం చేస్తున్నావు ?”
“భాగవతం చదువుతున్నాను”
“భాగవతంలో భగవానుడేంచేస్తున్నాడు ?”
“బాలలీల! ఆడుకుంటున్నాడు”
“నీకు తెలుసా ? నేను కూడా ఒక లీల చూపబోతున్నాను”, అన్నారు శ్రీవారు. మేము పట్టించుకోలేదు. అది మెదలు, మొదటి ప్రశ్న.
శ్రీవారు భిక్ష స్వీకరించలేదు. బాగా జ్వరంగా ఉంది. శ్వాస తీసుకునేటప్పుడు పిల్లికూతలు (గురక) వినిపిస్తున్నాయి. బాగా చిక్కిపోయారు. పడుకునే ఉన్నారు. అలాంటి సమయాలలో కన్నన్ మామ మంచి సహాయకుడు. ఏనుగంత బలం ఉందతనికి. అతని తెలివి మాకు లేదు.
“ఏమిటిది ? శ్రీవారు భిక్ష తీసుకోకపోతే మనం ఒప్పుకోవాలా ? శ్రీవారిని కూర్చోబెట్టండి. తడిగుడ్డతో తుడవండి. విభూతి తీసుకువచ్చి శ్రీవారికి అద్దండి. “
ఆ చెప్పిందంతా చేశాము. శ్రీవారిని తడిగుడ్డతో తుడిచి, విభూతి నుదిటికి అద్దాము.
“ఒక గిన్నెలో అన్నం కలిపి తీసుకురమ్మని శ్రీకంఠన్ తో చెప్పండి. వెంగుడి డాక్టర్ని పిలవండి. శ్రీవారు చాలా బలహీనంగా ఉన్నారు. నాడి చూపాలి.”
అలాంటి సమయాల్లో శ్రీవారి వద్దకు వెళ్ళటానికి శ్రీకంఠన్ భయపడతాడు. నాకే శ్రీవారివద్ద చనువు. నేను అన్నం తీసుకొచ్చాను. వైద్యుడు వచ్చారు. శ్రీవారు వైద్యుని ఎదురుగా భిక్ష స్వీకరించారు. అదే మొదలు. శ్రీవారు మరొకరు – ఆ వైద్యుడు – చూస్తూండగా భిక్షచేయటం.
కాసేపటి తరువాత, తిరుకడవూర్ రామమూర్తి, అరకోణం బాలు, నేను శ్రీవారి సన్నిధిలో ఉన్నాము.
“నీ సంగతేంటి ? ఏంచేస్తావు ?”
“నాకేం తెలుసు ? శ్రీవారు ఉన్నప్పుడు నాకు భయం దేనికి ?”, అని నవ్వాను. వారి ప్రశ్న ప్రాముఖ్యాన్ని మాత్రం అర్థం చేసుకోలేదు.
“నీ సంగతేంటి ?” రామమూర్తివేపు చూస్తూ అన్నారు శ్రీవారు.
“విత్తు వేసినవాడే చెట్టుకి నీరు పోస్తాడు”, అంటూ వేదాంతం వల్లించాడు రామమూర్తి.
“చెట్ల గురించి ఏమి మాట్లాడుతున్నాడు ?” అని నన్నడిగారు శ్రీవారు. నేను రామమూర్తి అన్న మాటలు మళ్ళీ చెప్పాను.
శ్రీవారి దండం అక్కడ ఉంది. శ్రీవారికీ దండానికీ మధ్య వెళ్ళరాదు. మేము ఆ మధ్యలోకి వెళ్ళకుండా శ్రీవారి వద్దకు వెళ్ళలేక పోయాము.
” దండం ఇక్కడ ఉంది” అన్నాడు అరకోణం బాలు.
” ఇంక దండంతో పని లేదు” అన్నారు శ్రీవారు.
ఆరోజు తరువాత శ్రీవారు దండాన్ని ముట్టుకోలేదు. అది, తమ ఉపసంహారం గురించి మాకు నర్మగర్భంగా చెప్పడం.
“నేనొక కొండచిలువ లాగా కొంతకాలం పడుకోవాలనుకుంటున్నాను. నోరు తెరచి వెల్లకిలా కదలకుండా పడుకుని ఉంటూ నోట్లో ఏం పడితే అదే ఆహారంగా తీసుకోవాలి” అని శ్రీవారు కుంభకోణం రాజమణిశాస్త్రితో చాలాకాలం క్రితం చెప్పారు.
చెప్పినట్లే శ్రీవారు అలా మూడేళ్ళు చేశారు.
మూడో యేట, మళ్ళీ దీపావళి సమయం.
మాకు దీపావళినాట యమునికి దీపం వెలిగించి, ’యమాయ, ధర్మాయ’ అంటూ నామాలు చదవటం ఆనవాయితీ. పెద్ద ఇనప దీపపు సమ్మెలో ధాన్యం పోసి, అందులో మరో మట్టి దీపపు ప్రమిద పెట్టి దానిలో బోలెడు నెయ్యి పోసి , పెద్ద వత్తిని యముడిని ఆవాహనచేస్తూ వెలిగిస్తాము. తెలుగువాళ్ళు ఆనాడు యమతర్పణాలు ఇస్తారు. మేము చెయ్యము. ఆంత నెయ్యి వలన దీపం ఐదారు రోజులు వెలుగుతుంది.
ఆ సంవత్సరం దీపం బోలెడు చప్పుడు చేసి, ఒక గంటలోపల మట్టి ప్రమిద ముక్కలైపోయింది. అదో దుశ్శకునమని మాకు తెలుసు.
మార్గశిరమాసంలో శ్రీవారు వెళ్ళిపోయారు.
reposted