నారాయణీస్తుతి
దేవ్యా హతే తత్ర మహాసురేన్ద్రే
సేన్ద్రాః సురా వహ్నిపురోగమాస్తామ్ ।
కాత్యాయనీం తుష్టువురిష్టలాభాద్
వికాశివక్త్రాబ్జవికాశితాశాః ॥ 1॥
మేధాఋషి సుర్థమహారాజుతో యిట్లనెను –
మహారాక్షసప్రభువైన శుంభుడు, అమ్మవారిచేత చంపబడిన తరువాత దేవతలందరును ఇంద్రునితోకూడ, అగ్నిహోత్రుని ముందుంచుకొని అమ్మవారివద్దకు చేరి ఆమెను స్తోత్రము చేసిరి. అప్పుడు వారి వాంఛితార్థము నెరవేరినందువలన వారందరి ముఖకమలములు వికసించియుండెను. వారి ప్రకాశమువలన దిక్కులు దీప్తిమంతములయ్యెను.(1)
దేవి ప్రపన్నార్తిహరే ప్రసీద
ప్రసీద మాతర్జగతోఽఖిలస్య ।
ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం
త్వమీశ్వరీ దేవి చరాచరస్య ॥ 2॥
ఓ జననీ ! శరణాగతులగు భక్తుల ఆర్తిన్ హరించుదేవీ ! అనుగ్రహింపుము. ఓ తల్లీ ! ఈ జగత్తునంతటిని ప్రసన్నురాలవై అనుగ్రహింపుము. ఓ విశ్వేశ్వరీ ! సకల విశ్వమును అనుగ్రహించి రక్షించుము. ఓ దేవీ! జంగమస్థావరాత్మకమైన ఈ సకలమునకును నీవే సమ్రాజ్ఞివి కదా ! (2)
ఆధారభూతా జగతస్త్వమేకా
మహీస్వరూపేణ యతః స్థితాసి ।
అపాం స్వరూపస్థితయా త్వయైత-
దాప్యాయతే కృత్స్నమలఙ్ఘ్యవీర్యే ॥ 3॥
అమ్మ ! నీ పరాక్రమము అలంఘనీయము. దుర్గా! నీవొక్కర్తవే పృథ్వీస్వరూపమున నుండుటచేత, సమస్తజగత్తునకు ఆధారభూతురాలవు అయినావు. అట్లే జలస్వరూపముగనున్న నీవే ఈ సమస్తమును పోషించుచున్నావు. (3)
త్వం వైష్ణవీశక్తిరనన్తవీర్యా
విశ్వస్య బీజం పరమాసి మాయా ।
సమ్మోహితం దేవి సమస్తమేతత్
త్వం వై ప్రసన్నా భువి ముక్తిహేతుః ॥ 4॥
నీవు విష్ణుశక్తివి.అనంతమైన బలముకలదానవు. సర్వవిశ్వమునకు మూలమైనదానవు. ఓ జననీ ! నీవే మాయాస్వరూపిణివి. ఈ జగత్తునంతటిని మోహింపచేయుచున్నావు. అనుగ్రహించినచో ప్రసన్నురాలవై ఈ లోకమునకు ముక్తికారణము నీవే అగుచున్నావు.(4)
విద్యాః సమస్తాస్తవ దేవి భేదాః
స్త్రియః సమస్తాః సకలా జగత్సు ।
త్వయైకయా పూరితమమ్బయైతత్
కా తే స్తుతిః స్తవ్యపరాపరోక్తిః ॥5॥
విద్యలన్నియు (మంత్రములన్నియు) నీ భిన్న భిన్న స్వరూపములే. లోకములందలి స్త్రీ లందరును నీ అంశస్వరూపిణులే. ఈ విశ్వమంతయును తల్లివైన నీతోడనే నిండియున్నది. స్తోత్రమ్ చేయదగిన మాటలన్నియును నీలోనే యుండుటచే ఇక నీ స్తోత్రము అనేది వేరే ఏది కలదు? స్తుతింపదగిన శ్రేష్ఠాతిశ్రేష్ఠమైన మాట నీ స్తోత్రమే కాని, అన్యమైనది ఏమి కలదు?(5)
సర్వభూతా యదా దేవీ భుక్తిముక్తిప్రదాయినీ ।
త్వం స్తుతా స్తుతయే కా వా భవన్తు పరమోక్తయః ॥ 6॥
అమ్మ ! నీవు సర్వభూతస్వరూపిణివి. ప్రకాశమానస్థితి కలదానవు. స్వర్గమును కాని, మోక్షమునుకాని, ఈయకలదానవు. సర్వమును నీవే అయ్యునూ స్తోత్రము చేయబడుచున్నావు. నిన్ను స్తుతించుటకు ఏ మాటలు యోగ్యములు కాగలవు?(6)
సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే ।
స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోఽస్తు తే ॥ 7॥
సర్వప్రాణుల హృదయమునందును, బుద్ధిరూపమ్నను ఉన్నది, స్వర్గమున, మోక్షమున ప్రసాదించునదికూడా నీవే. అట్టి నారాయణి దేవీ ! నీకు నమస్కారము. (7)
కలాకాష్ఠాదిరూపేణ పరిణామప్రదాయిని ।
విశ్వస్యోపరతౌ శక్తే నారాయణి నమోఽస్తు తే ॥ 8॥
తల్లీ! కాలముయొక్క మిక్కిలి చిన్నభాగములగు కల, కాష్ఠ, మున్నగు రూపములతో వివిధములైన అహోరాత్రము, వారము, పక్షము, మాసము, సంవత్సరములుగ కాలమును వివిధములగ పరిణమింపచేయుటలోను, అట్లే యావత్ప్రపంచమును, సంహరించుటయందును, సమర్థురాలవైన ఓ లక్ష్మీదేవీ! నీకు నమస్కారము.(8)
సర్వమఙ్గలమాఙ్గల్యే శివే సర్వార్థసాధికే ।
శరణ్యే త్ర్యమ్బకే గౌరి నారాయణి నమోఽస్తు తే ॥ 9॥
ఓ నారాయణీ! నీవు సర్వశుభములకు మిక్కిలి శుభమైనదానవు. ఆనందస్వరూపిణివి. సమస్తములైన ప్రయోజనములను సిద్ధింపజేయుదానవు. లోకములన్నింటిచే శరణు పొందదగినదానవు. అనగా శరణాగతవత్సలవు. మూడుకన్నులు కలదానవు, స్వచ్ఛమైన వర్ణము కల గౌరేదేవివి. అట్టి నీకు నమస్కారము.(9)
సృష్టిస్థితివినాశానాం శక్తిభూతే సనాతని ।
గుణాశ్రయే గుణమయే నారాయణి నమోఽస్తు తే ॥ 10॥
సృష్టిస్తిథిలయముల సామర్థ్యమునకు ఆస్పదమైనదానవు. సృష్టికి పూర్వమునుండియు ఉనికి గలదానవు. త్రిగుణములకు ఆశ్రయురాలవు. తద్గుణముల అవస్థారూపముగను నున్నదానవు. అట్టి నారాయణీ! నీకు నమస్కారము.(10)
శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే।
సర్వస్యార్తిహరేదేవినారాయణినమోఽస్తుతే॥ 11॥
నీవే శరణమని రక్షణార్థులై వచ్చిన బాధితులను, రక్షించుటయందు నిమగ్నమైయుమ్డు తల్లీ! ప్రతియొక్కరి బాధను తొలగించునట్టి దయామయా! జననీ ! ఓ నారాయణీ ! నీకు నమస్కారము.(11)
హంసయుక్తవిమానస్థేబ్రహ్మాణీరూపధారిణి।
కౌశామ్భఃక్షరికేదేవినారాయణినమోఽస్తుతే॥ 12॥
ఓ దేవీ ! నీవు హంసతో కూడిన విమానమందు సంచరించెదవు. బ్రహ్మశక్తిరూపమును ధరించినదానివి, దర్భసంబంధమైన జలములను ఆయుధములుగా ప్రయోగించి శత్రువులను సంహరించెదవు! ఓ నారాయణీ! నీకు నమస్కారము.(12)
త్రిశూలచన్ద్రాహిధరేమహావృషభవాహిని।
మాహేశ్వరీస్వరూపేణనారాయణినమోఽస్తుతే॥ 13॥
మహేశ్వరశక్తి స్వరూపముతో, చేత త్రిశూలమును, మౌళియందు చంద్రరేఖను, కంఠమునందు సర్పమును ధరించి, నందివాహనముపై సంచరించెడు ఓ నారాయణీ! నీకు నా నమస్కారము.(13)
మయూరకుక్కుటవృతేమహాశక్తిధరేఽనఘే।
కౌమారీరూపసంస్థానేనారాయణినమోఽస్తుతే॥ 14॥
కుమారశక్తి స్వరూపమున నున్న ఓ దేవీ ! నీవు నెమిళ్ళచేతను, కోళ్ళ చేతను, ఆవరింపబడియున్న దానవు. గొప్పనైన చిల్లకోలయను ఆయుధమును ధరించియున్నదానవు! పాపరహితురాలవు. ఐన ఓ నారాయణీ ! నీకు నా నమస్కారము. (14)
శఙ్ఖచక్రగదాశార్ఙ్గగృహీతపరమాయుధే।
ప్రసీదవైష్ణవీరూపేనారాయణినమోఽస్తుతే॥ 15॥
శంఖము, చక్రము, గద, ధనుస్సు, అను శ్రేష్ఠములైన నాలుగు ఆయుధములను ధరించి ఓ వైష్ణవీశక్తీ! అనుగ్రహింపుము. ఓ నారాయణీ! నీకు నమస్కారము. (15)
గృహీతోగ్రమహాచక్రే దంష్ట్రోద్ధృతవసున్ధరే ।
వరాహరూపిణి శివే నారాయణి నమోఽస్తు తే ॥ 16॥
భయంకరమైన సుదర్శన చక్రమును ధరించియున్నదానవు! నీ దంష్ట్రచేత పృథ్వీగోళమును ఉద్ధరించినదానివి! వరాహావతారుడగు విష్ణుదేవుని శక్తియగు వారాహీరూపమును ధరించియున్న ఓ మంగళస్వరూపిణీ! నారాయణీ! నీకు నమస్కారము.
నృసింహరూపేణోగ్రేణ హన్తుం దైత్యాన్ కృతోద్యమే ।
త్రైలోక్యత్రాణసహితే నారాయణి నమోఽస్తు తే ॥ 17॥
భయంకరమగు నరసింహునిరూపముతో, క్రూరరాక్షసులను సంహరించుటకు ప్రయత్నశీలవైన ఓ నారసింహీ! ముల్లోకములను రక్షించుటయందే దయను కలిగినట్టి నారాయణీ ! నీకు నమస్కారము.
కిరీటిని మహావజ్రే సహస్రనయనోజ్జ్వలే ।
వృత్రప్రాణహరే చైన్ద్రి నారాయణి నమోఽస్తు తే ॥ 18॥
కిరీటమును, తీక్ష్ణమైన వజ్రాయుధమును ధరించి వేయికన్నులతో ఉజ్జ్వలముగ ప్రకాశించుచు వృత్రాసురుని అసువులను హరించినట్టి ఇంద్రశక్తి స్వరూపిణీ! నారాయణీ! నీకు నమస్కారము.
శివదూతీస్వరూపేణ హతదైత్యమహాబలే ।
ఘోరరూపే మహారావే నారాయణి నమోఽస్తు తే ॥ 19॥
శివునిదూతగా పంపిన కౌశికీదేవి రూపముననున్నదానవు. రాక్షసులను సంహరించిన గొప్పబలమును కలదానవు. భయంకరమైన రూపము కలదానివి. తీక్ష్ణమగు కంఠధ్వని కలిగినట్టి నారాయణీ! నీకు నమస్కారము.
దంష్ట్రాకరాలవదనే శిరోమాలావిభూషణే ।
చాముణ్డే ముణ్డమథనే నారాయణి నమోఽస్తు తే ॥ 20॥
కోఱలతో కూడిన భయంకరమగు ముఖము కలదానవు! కపాలముల మాలను ఆభరణముగ ధరించినదానవు! కాళికాదేవీ! ముండాసురుని సంహరించినట్టి నారాయణీ! నీకు నమస్కారము.
లక్ష్మి లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టి స్వధే ధ్రువే ।
మహారాత్రి మహామాయే నారాయణి నమోఽస్తు తే ॥ 21॥
విష్ణుపత్నీ! హ్రీ స్వరూపిణీ! (లజ్జారూపిణి) మహావిద్యా స్వరూపిణీ! (శ్రద్ధా స్వరూపిణి) ఆస్తిక్యధారణరూపిణీ!, పుష్టిరూపిణి – పురుషార్థ సాధనసామర్థ్యము కలదానివి స్వధారూపిణి – పితృహవిర్ధాన మంత్రస్వరూపిణీ! ధృవరూపిణి – త్రికాలాబాధ్యమైన నిత్యత్వము కలదానవు! మహారాత్రి స్వరూపిణి – సుఖస్వరూపిణీ! మహావిద్యాస్వరూపిణీ – మాయారూపిణీ అనిత్య- అశుచి-దుఃఖ-అనాత్మ-స్వరూపిణీ ! ప్రప్పంచరూపమగు మాయాస్వరూపిణీ! ఓ నారాయణీ! నీకు నమస్కారము.
మేధే సరస్వతి వరే భూతి బాభ్రవి తామసి ।
నియతే త్వం ప్రసీదేశే నారాయణి నమోఽస్తుతే ॥ 22॥
ఓ మేధాస్వరూపిణీ ! వాగ్రూపిణీ! సర్వశ్రేష్ఠస్వరూపిణీ! సత్త్వరజస్తమో రూపీణీ! నియమస్వరూపిణీ ! సకలాధీశ్వరీ! నారయణీ! అనెగ్రహింపుము. నీకు నమస్కారము.
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే ।
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే ॥ 23॥
సర్వస్వరూపిణీ- సర్వము నీదైన ఆకారముకలదానివి! సర్వేశ్వరీ – సమస్తవిశ్వమునకు సమ్రాజ్ఞివి! సర్వశక్తి సంపన్నురాలవు- సకలములైన సామర్థ్యములతో కూడియున్నదానవు! ఓ దేవీ! మమ్ము సమస్త భయకారణములనుండి రక్షింపుము. ఓ దుర్గామాతా! నీకు నమస్కారము.
ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితమ్ ।
పాతు నః సర్వభూతేభ్యః కాత్యాయని నమోఽస్తు తే ॥ 24॥
హే కాత్యాయనీ! ఈ నీ ముఖము సుమపేశలమై మూడు కన్నులతో అలంకృతమై యున్నది. అది మమ్ము సకలవిధములైన భయములనుండి కాపాడుగాక! నీకు నమస్కారము.
జ్వాలాకరాలమత్యుగ్రమశేషాసురసూదనమ్ ।
త్రిశూలం పాతు నో భీతేర్భద్రకాలి నమోఽస్తు తే ॥ 25॥
భద్రకాళీ! అగ్నిజ్వాలలవలె భీకరమును, మిక్కిలి ఉగ్రమును, రాక్షసులందరును మట్టుపెట్టగలదియునైన నీ త్రిశూలము మమ్ము సమస్త భయములనుండి రక్షించుగాక! మంగళకారిణియగు కాళీ! నీకు నమస్కారము.
హినస్తి దైత్యతేజాంసి స్వనేనాపూర్య యా జగత్ ।
సా ఘణ్టా పాతు నో దేవి పాపేభ్యో నః సుతానివ ॥ 26॥
దేవీ ! ఏ ఘంట తన నాదముతో జగత్తునంతను నింపి రాక్షసుల తేజస్సును హరింపజేయునో, అట్టి ఘంట తల్లిదండ్రులు తమ కన్నబిడ్డలను కాపాడునట్లు మమ్ము పాపములనుండి రక్షించుగాక!
అసురాసృగ్వసాపఙ్కచర్చితస్తే కరోజ్జ్వలః ।
శుభాయ ఖడ్గో భవతు చణ్డికే త్వాం నతా వయమ్ ॥ 27॥
రాక్షసుల రక్తముయొక్క క్రొవ్వుయొక్క పంకముచేత పూయబడి నీ చేతివలన మిక్కిలి ప్రకాశవంతమై వెలుగుచున్న నీ ఖడ్గము శిష్టప్రాణుల రక్షణకొరకు క్షేమమును కలుగజేయుగాక! దేవి! నీకు నమస్కరించుచున్నాను.
రోగానశేషానపహంసి తుష్టా
రుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ ।
త్వామాశ్రితానాం న విపన్నరాణాం
త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాన్తి ॥ 28॥
ఓయమ్మా! నీవు ఆరాధనాదులచే తృప్తిపొందినచో, సకలములైన రోగములను, ఉపద్రవములను, పోకార్పగలవు. అట్లే క్రోధము వహించినచో అశేషములైన కోరికలను (సాధకుని) కామములను నశింపజేయగలవు. నిన్ను శరణుపొందిన వారికి ఆపదలే కలగవు. నిన్ను ఆశ్రయించినవారు నిజమైన ఆశ్రయమును పొందినవారగుదురు. లేక ఇతరులకు ఆశ్రయభూతులగుదురు.
ఏతత్కృతం యత్కదనం త్వయాద్య
ధర్మద్విషాం దేవి మహాసురాణామ్ ।
రూపైరనేకైర్బహుధాత్మమూర్తిం
కృత్వామ్బికే తత్ప్రకరోతి కాన్యా ॥ 29॥
ఓ భగవతీ! ఓ అంబికామాతా! నీ సర్వరూపమును పెక్కువిధములగా అనేకరూపములలోనికి మార్చుచు ధర్మద్వేషులైన మహారాక్షసులతో యుద్ధము చేసి వారిని సంహరించితివి. ఇట్టి కార్యమును వేరే ఏ స్త్రీ యైనను చేయగలదా? ఎవ్వరునూ చేయలేరని భావము.
విద్యాసు శాస్త్రేషు వివేకదీపే-
ష్వాద్యేషు వాక్యేషు చ కా త్వదన్యా ।
మమత్వగర్తేఽతిమహాన్ధకారే
విభ్రామయత్యేతదతీవ విశ్వమ్ ॥ 30॥
తర్కవైశేకాది విద్యలయందును లేక షోడశ్యాది మహామంత్రములయందును, శిక్షాదిషడంగములయ్ందును, న్యాయాది షడ్దర్శనములయ్ందును, ఈశాద్యుపనిషత్తులయందును, ఋగాది వేదవాక్యముల యందును ఓ యమ్మా! నీకంటె అన్యులెవరు వర్ణింపబడియున్నారు? మిక్కిలి భయంకరమగు అహంకార మమకారములతోకూడిన గొప్ప చీకటితో నిండిన గోతితో ఈ విశ్వమంతయును నిలుపుదుల లేకుండ తిరుగుచున్నది.
రక్షాంసి యత్రోగ్రవిషాశ్చ నాగా
యత్రారయో దస్యుబలాని యత్ర ।
దావానలో యత్ర తథాబ్ధిమధ్యే
తత్ర స్థితా త్వం పరిపాసి విశ్వమ్ ॥ 31॥
రాక్షసులున్నచోట, భయంకరమగు విషముగల సర్పములున్నచోట, శత్రువులున్నచోట, చోరసైన్యములున్నచోట, కార్చిచ్చుగల అరణ్యమండు, బడబానలముగల సముద్రమునందు చిక్కుపడినప్పుడు ఓయమ్మా! నీవే ఉండి ఈ జీవులను, ప్రపంచమును, నీవు రక్షించుచుందువు.
విశ్వేశ్వరి త్వం పరిపాసి విశ్వం
విశ్వాత్మికా ధారయసీహ విశ్వమ్ ।
విశ్వేశవన్ద్యా భవతీ భవన్తి
విశ్వాశ్రయా యే త్వయి భక్తినమ్రాః ॥ 32॥
విశ్వేవేశ్వరీ! ఈ సమస్త ప్రపంచమును, నీవు పరిపాలించుచున్నావు. ఓ విశ్వాత్మికా! ప్రకృతిస్వరూపిణివై నీవే ఈ విశ్వమునంతను ధరించుచున్నావు. విశ్వనాథునకు- శివునంతటివానికి కూడ నీవు వందనీయురాలవగుచున్నావు అని ఇట్టి భావనతో ఎవరు నీకు ప్రేమతో భక్తిపూర్వకంగా నమస్కరింతురో, వారు విశ్వమునకంతటికిని ఆశ్రయమును ఇచ్చువారగుదురు.
దేవి ప్రసీద పరిపాలయ నోఽరిభీతే-
ర్నిత్యం యథాసురవధాదధునైవ సద్యః ।
పాపాని సర్వజగతాం ప్రశమం నయాశు
ఉత్పాతపాకజనితాంశ్చ మహోపసర్గాన్ ॥ 33॥
ఓయమ్మా! నీవు ఆరాధనాదులచే తృప్తిపొందినచో, సకలములైన రోగములను, ఉపద్రవములను, పోకార్పగలవు. అట్లే క్రోధము వహించినచో అశేషములైన కోరికలను (సాధకుని) కామములను నశింపజేయగలవు. నిన్ను శరణుపొందిన వారికి ఆపదలే కలగవు. నిన్ను ఆశ్రయించినవారు నిజమైన ఆశ్రయమును పొందినవారగుదురు. లేక ఇతరులకు ఆశ్రయభూతులగుదురు.
ప్రణతానాం ప్రసీద త్వం దేవి విశ్వార్తిహారిణి ।
త్రైలోక్యవాసినామీడ్యే లోకానాం వరదా భవ ॥ 34॥
మాతా! విశ్వమునందలి బాధలనన్నింటిని నశింపజేయగల తల్లీ! ఈ ముల్లోకములలో నివసించుచున్న, నీకు నమస్కరించుచున్న జనులందరకును పరప్రదానవుకమ్మని నిన్ను ప్రార్థించుచున్నాము. అనుగ్రహింపుము.
దేవ్యువాచ ॥
వరదాహం సురగణా వరం యన్మనసేచ్ఛథ ।
తం వృణుధ్వం ప్రయచ్ఛామి జగతాముపకారకమ్ ॥ 35॥
దేవతలారా! నేను వరములిచ్చుదానను, మీరు మీ మనస్సుకు ఇష్టమైన వరమును కోరుకొనుడు, అట్టి లోకోపకారకమగు వరమును ఇచ్చెదను.
దేవా ఊచుః ॥
సర్వాబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ।
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరివినాశనమ్ ॥ 36॥
అఖిలేశ్వరీ! మా శత్రువులను నశింపజేయుము. ముల్లోకముల సమస్థములైన దుఃఖములను శమింపజేయుము. ఇదియే నీచేత చేయబడుచుండుగాక! అని మా కోరిక.
దేవ్యువాచ ॥
వైవస్వతేఽన్తరే ప్రాప్తే అష్టావింశతిమే యుగే ।
శుమ్భో నిశుమ్భశ్చైవాన్యావుత్పత్స్యేతే మహాసురౌ ॥ 37॥
దేవతాలారా! వైవస్వత మన్వంతరమందలి ఇరువది యెనిమిదియవ యుగమునందు శంభుడు నిశుంభుడు అను పేరు కలిగిన వేరే ఇరువురు గొప్ప రాక్షసులు జన్మింతురు..
నన్దగోపగృహే జాతా యశోదాగర్భసమ్భవా ।
తతస్తౌ నాశయిష్యామి విన్ధ్యాచలనివాసినీ ॥ 38॥
గోపాలకుడగు నందునియింటియందు అప్పుడు నేను అతని భార్యయగు యశోదయొక్క గర్భమునందు అవతరించి వింధ్యపర్వతమున నివసించెదను. అచటినుండియే (శుంభుడు నిశుంభుడు అను) ఆ రాక్షసులు ఇరువురిని సంహరింతును.
పునరప్యతిరౌద్రేణ రూపేణ పృథివీతలే ।
అవతీర్య హనిష్యామి వైప్రచిత్తాంశ్చ దానవాన్ ॥ 39॥
మరల నేను మిక్కిలి భయంకరమైన రూపముతో భూమండలమునందు (నందజగా) అవతరించి వైప్రచిత్తులగు రాక్షసులను సంహరించెదను..
భక్షయన్త్యాశ్చ తానుగ్రాన్ వైప్రచిత్తాన్ మహాసురాన్ ।
రక్తా దన్తా భవిష్యన్తి దాడిమీకుసుమోపమాః ॥ 40॥
భయంకరులును, అజ్ఞానులును ఐన వైప్రచిత్తులనెడు ఆ గొప్ప రాక్షసులను తినుచుండగా నా దంతములు దానిమ్మ పువ్వులవలె ఎఱ్ఱనైపోవును..
తతో మాం దేవతాః స్వర్గే మర్త్యలోకే చ మానవాః ।
స్తువన్తో వ్యాహరిష్యన్తి సతతం రక్తదన్తికామ్ ॥41 ॥
అప్పుడు స్వర్గమునందలి దేవతలును, భూలోకమునందలి మనుష్యులును, నన్ను స్తోత్రము చేయుచు ఎల్లప్పుడును నన్ను రక్తదంతికయని చెప్పుచుందురు. లేక రక్తదంతిక యని చెప్పుచు స్తుతించుచుందురు.
భూయశ్చ శతవార్షిక్యామనావృష్ట్యామనమ్భసి ।
మునిభిః సంస్మృతా భూమౌ సమ్భవిష్యామ్యయోనిజా ॥ 42॥
మరల నూరు సంవత్సరముల పర్యంతముగ ఎచ్చటను నీరేలేని తీవ్రమగు కాటకము వచ్చును. మునులచేత స్తోత్రము చేయబడినదాననై అయోనిజగా అవతరింతును.
తతః శతేన నేత్రాణాం నిరీక్షిష్యామ్యహం మునీన్ ।
కీర్తయిష్యన్తి మనుజాః శతాక్షీమితి మాం తతః ॥ 43॥
అప్పుడు నేను నా నూరుకన్నులచేత మునిశేష్ఠులను చూచుట కారణముగా అప్పటినుండి నన్ను మానవులందరును శతాక్షియను పేరుతో కీర్తించుచుందురు.
తతోఽహమఖిలం లోకమాత్మదేహసముద్భవైః ।
భరిష్యామి సురాః శాకైరావృష్టేః ప్రాణధారకైః ॥ 44॥
దేవతలారా! వర్షములు కురియుజంతవరకు నా శరీరమునుండి పుట్టినట్టివియును, ప్రాణములను రక్షించునట్టివియును ఐన శాకములచేత (ఆహారపదార్థములచేత ) సకలవిశ్వమును కాపాడుచుందును.
శాకమ్భరీతి విఖ్యాతిం తదా యాస్యామ్యహం భువి ।
తత్రైవ చ వధిష్యామి దుర్గమాఖ్యం మహాసురమ్ ॥ 45॥
అప్పుడు నేను శాకంభరియని ఈ లోకమున ప్రసిద్ధిని పొందగలను. ఆ సమయమున దుర్గమాఖ్యుడగు మహారాక్షసుని వధింపగలను..
దుర్గాదేవీతి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి ।
పునశ్చాహం యదా భీమం రూపం కృత్వా హిమాచలే ॥ 46॥
రక్షాంసి భక్షయిష్యామి మునీనాం త్రాణకారణాత్ ।
తదా మాం మునయః సర్వే స్తోష్యన్త్యానమ్రమూర్తయః ॥ 47॥
అప్పుడు నాకు దుర్గయనెడు ప్రసిద్ధమైన నామమేర్పడును. మఱల నేను భయంర స్వరూపమును ధరించి హిమాలయ పర్వతమునందు మునులను రక్షించుటకొరకై రాక్షసులను భక్షించెదను. ఆ సందర్భమున నన్ను ఆ మునులందరును మిక్కిలి విధేయతతో నన్ను స్తోత్రము చేయుదురు.
భీమాదేవీతి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి ।
యదారుణాఖ్యస్త్రైలోక్యే మహాబాధాం కరిష్యతి ॥ 48॥
తదాహం భ్రామరం రూపం కృత్వాసంఖ్యేయషట్పదమ్ ।
త్రైలోక్యస్య హితార్థాయ వధిష్యామి మహాసురమ్ ॥49॥
దుర్గాదేవిగా నేను భయంకరరూపమును ధరించి హిమవత్పర్వతమునందు భయంకరమగు రాక్షసులను సంహరించెదను. అప్పుడు నాకు భీమాదేవి యను పేరు కలుగును. అరుణుడను పేరుగల రాక్షసుడు ముల్లోకములకు మిక్కిలి దుఃఖమును కలిగించును. అప్పుడు నేను ముల్లోకములకు మేలు కలుగుటకొరకు లెక్కలేనన్ని ఆఱుకాళ్ళుగల తుమ్మెద్దలతో కూడిన భ్రామరీరూపమును ధరించి వానిని సంహరింపగలను.
భ్రామరీతి చ మాం లోకాస్తదా స్తోష్యన్తి సర్వతః ।
ఇత్థం యదా యదా బాధా దానవోత్థా భవిష్యతి ॥50 ॥
తదా తదావతీర్యాహం కరిష్యామ్యరిసంక్షయమ్ ॥ 51॥
అసంఖ్యాకమైన భ్రమరములతో భ్రామరీ రూపమును ధరించి నన్ను ప్రపంచమందంతటను, జనులు భ్రామరియని కీర్తించుచుందురు. ఈవిధముగ రాక్షసులవలన ఎప్పుడెప్పు బాధ కలుగుచుండునో, అప్పుడప్పుడు నేను అవతరించి శత్రువులను సంహరుంచుచుందును.
॥ స్వస్తి శ్రీమార్కణ్డేయపురాణే సావర్ణికే మన్వన్తరే దేవీమాహాత్మ్యే
నారాయణీస్తుతిః సమ్పూర్ణా ॥
శ్రీ దుర్గాసప్తశతియందు ఏకాదశీఅధ్యాయము (గీతాప్రెస్, గోరఖ్పూర్ పుస్తకమునుండి)
Narayani Stuti
_____________________________________________________________
Narayani stuti complete : నారాయణి స్తుతి పూర్తి (పారాయణస్తోత్రం) ->