శ్రీ భాష్యం అప్పలాచార్యుల ఆంధ్ర అనువాదముతో
1
మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిళైయీర్!
శీర్ మల్గుమ్ ఆయిప్పాడి చెల్వచ్చిఱుమీర్ కాళ్!
కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్దకణ్ణి యశోదై యిళంజింగమ్
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై దరువాన్
పారోర్ పుగళ ప్పడిన్దేలో రెమ్బావాయ్!
తాత్పర్యము:-
ఓహో! ఇది మార్గశిర్షమాసము. వెన్నల నిండిన మంచి రోజు. ఓ అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలో సంపదలతో తులతూగుచున్న ఓ బాలికలారా !ఈ మార్గశీర్షస్నానము చేయవలెనని సంకల్పమున్నచో రండు, ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణనకు ఏవిధమగు ఆపదయు రాకుండ కాపాడుచున్న శ్రీనందగోపుల కుమారుడును అందములగు కన్నులతో అలరుచున్న యశోదయొక్క బాలసింహమును, నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱతామరల పోలు కన్నులు కలవాడును, సూర్యునివలె ప్రకాశమును, చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిని దివ్యముఖమండలము కలవాడును, అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్థించని మనకే, మన మపేక్షించు వ్రతసాధనమగు ’పర’ అను వాద్యమును ఈయనున్నాడు. మన మీ వ్రతము చేయుటను చూచి లోకులందరు సంతోషించునట్లు మీరందరు వచ్చి ఈ వ్రతములో చేరుడు.
2
వైయత్తు వాళ్వీర్గాళ్! నాముమ్ నమ్బావైక్కు
చ్చెయ్యుఙ్గిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్
పైయ త్తుయిన్ఱ పరమనడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముమ్ పిచ్చైయుమాన్దనైయుఙ్గైకాట్టి
ఉయ్యు మాణెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:-
కృష్ణుడు అవతరించిన కాలములో ఈ లోకములో పుట్టి దుఃఖమయమగు ఈ ప్రపంచములో కూడ ఆనందమునే అనుభవించుచున్నవారలారా! మేము మా వ్రతమునకు చేయు క్రియాకలాపము వినుడు – పాలసముద్రములో పండుకొనియున్న ఆ పరమపురుషుని పాదములకు ధ్వని కాకుండ మెల్లగా మంగళము పాడెదము. ఈ వ్రతసమయములో నేతిని గాని, పాలనుగాని మే మారగింపము. తెల్లవారుజాముననే లేచి స్నానము చేసెదము. కంటికి కాటుక పెట్టుకొనము. కొప్పులో పూవులు ముడువము. మా పెద్దలు ఆచరింపని పనులు ఆచరింపము. ఇతరులకు బాధ కలిగించు మాటలను, అసత్యవాక్యములను ఎచ్చోటనూ పలుకము. జ్ఞానాధికులకు అధిక ధనధాన్యాదులతో సత్కరించుచుందుము. బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షల నొసంగుచుందుము. మేము ఉజ్జీవించు విధమునే పర్యాలోచన చేసికొందుము. దీని నంతను విని, మీ రానందింప కోరుచున్నాము.
3
ఓఙ్గి యులగళన్ద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు చ్చాత్తి నీరాడినాల్
తీంగన్ఱి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు
ఓంగు పెరుఞ్జెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై ప్పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్ త్తములై పత్తి
వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్పశుక్కళ్
నీంగాదశెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:-
బలి చక్రవర్తి ఇచ్చిన దానమునందు, ఆకాశమువరకు పెరిగి, మూడు లోకములను తన పాదములచే కొలిచిన పురుషోత్తముడగు త్రివిక్రముని దివ్యనామములను గానము చేసి, మేము మా వ్రతము అను మిషతో స్నానము చేయగనే, దేశమంతయు నెలకు మూడువానలు పడి, ఈతిబాధలు లేక సుఖముగా ఉండవలెను. ఆకాశమువరకు పెరిగిన వరిచేలలో చేపలు త్రుళ్లిపడుచుండగా, కలువపూవులలో మనోహరములగు తుమ్మెదలు నిద్రించుచుండగా, సస్యములు సమృద్ధములై యుండవలెను. పాలు పితుకుటకు కొట్టములోదూరి, స్థిరముగా కూర్చుండి, పొదుగు నంటగనే పాలు కుండలు నిండునట్లు చేవు గోవులు సమృద్ధముగా నుండవలెను. నశ్వరము కాని సంపదదేశమంతా నిండవలెను.
4
ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్
ఆళియుళ్ పుక్కు ముగన్దు కొడార్ త్తేరి
ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు
పాళియందోళుడై ప్పర్పనాబన్ కైయిల్
ఆళిపోళ్ మిన్ని వలమ్బురి పోల్ నిన్రదిర్న్దు
తాళాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళ్ న్దేలో రెమ్బావాయ్
తాత్పర్యము:-
గంభీరస్వభావుడా! వర్షనిర్వాహకుడా! ఓ పర్జన్యదేవా! నీవు దాతృత్వములో చూపు ఔదార్యమును ఏ మాత్రమును సంకోచింపజేయకుము. గంభీరమగు సముద్రములో మధ్యకు పోయి, ఆ సముస్రజలమునంతను, నీవు పూర్తిగా త్రాగి, గర్జించి, ఆకాశమున వ్యాపించి, సర్వజగత్కారణభూతుడగు శ్రీ నారాయణుని దివ్యవిగ్రహము వలె శ్యామలమూర్తివై, ఆ పద్మనాభుని విశాలసుందరబాహుయుగళిలో దక్షిణబాహువునందలి చక్రము వలెమెరిసి, ఎడమచేతిలోని శంఖము వలె ఉరిమి, శార్ఙ్గమను ధనస్సునుండి విడిచిన బాణముల వర్షమా అనునట్లు లోకమంతయు సుఖించునట్లు, మేము సంతోషముతో మార్గశీర్షస్నానము చేయునట్లు వర్షించుము.
5
మాయనై మన్ను, వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణి విళక్కై
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వన్దు నామ్ తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి, మనత్తినాల్ శిన్దిక్క
పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్
తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్
తాత్పర్యము:-
ఆశ్చర్యకరములగు చేష్టలు కలవాడును, నిత్యము భగవత్సంబంధము గల ఉత్తరదేశమునందలి మథురానగరానికి నిర్వాహకుడును, పవిత్రము, అగాధమునగు జలముగల యమునానదిరేవే తనకు గురుతుగా కలవాడును, గోపవంశమున ప్రకాశించిన మంగళదీపము అయినవాడును, తల్లి యశోద గర్భమును ప్రకాశింప చేయునటులు త్రాడుచే కట్టబడి దామోదరు డైనవాడును నగు కృష్ణభగవానునివద్దకు మనము పవిత్రులై వచ్చి, పరిశుద్ధములగు పుష్పములతో నర్చించి, అంజలిఘ్హటించి, వాక్కుతో కీరించి, మనసార ధ్యానించినచో మన పూర్వసంచిత పాపరాశియు, ఆగామిపాపరాశియు అగ్నిలో పడిన దూదివలె భస్మమైపోవును. కావున భగవానుని నామములను పాడుడు.
6
పుళ్ళుమ్ శిలుంబినకాణ్ పుళ్ళరైయన్ కోయిలిల్
వెళ్ళై విళిశంగిన్ పేరరవమ్ కేట్టి లైయో
పిళ్ళా యెళుంది రాయ్ పేయ్ ములై నంజుణ్డు
కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్లత్తరవిల్ తుయిల మర్ న్ద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుమ్ యోగిగళుమ్
మెళ్ల వెళున్దు అరియెన్ర పేరరవమ్
ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:-
భగవదనుభవము క్రొత్తదగుటచే ఈ వ్రతముయొక్క వైభవము తెలియక తానొక్కతెయే తన భవనములో పరుండి వెలికి రాకయున్న ఒక ముగ్ధను లేపుచున్నారు.
ఆహారము నార్జించుకొనుటకై లేచి పక్షులు కలకలలాడుచు పోవుచున్నవి. ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతునకు స్వామి యగు శ్రీమహావిష్ణువు ఆలయములో తెల్లని శంఖము’సమయమైనది; సేవకురం’డని పెద్దధ్వని చేయుచున్నది. ఆధ్వని వినుట లేదా! ఓ పిల్లా! లెమ్ము. మేము ఎవరులేపగా లేచితిమన్న సందేహము కలుగవచ్చును. పూతన స్తనములందుండు విషము నారగించినవాడును, అసురావేశము గలిగి చంప నుద్యమించిన కృత్రిమ శకటమును కీలూడునట్లు పాలకై ఏడ్చి కాలు చాచి పొడిపొడి యగునట్లు చేసినవాడును, క్షీరసాగరమున చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై లోకరక్షణచింతనలో యోగనిద్ర నమరియున్న జగత్కారణభూతుడు నగు ఆ సర్వేశ్వరుని తమహృదయముల పదిలపరచుకొని మెల్లగా లేచుచున్న మునులను, యోగులను హరి-హరి-హరి అనుచుండునపుడు వెడలిన పెద్దధ్వని మా హృదయములలో చొచ్చి, చల్లబరచి, మమ్మలను మేల్కొల్పినది. నీవు కూడా లేచి రమ్ము.
7
కీశు కీశెన్రెఙ్గుమానై చ్చాత్తఙ్గలన్దు !
పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే !
కాశుమ్ పిరప్పుమ్ కలగలప్పక్కై పేర్తు
వాశ నరుఙ్గుళ లాయిచ్చియర్; మత్తినాల్
ఓశైప్పడుత్త త్తయిర రవమ్ కేట్టిలైయో
నాయకప్పెణ్పిళ్లాయ్ ! నారాయణన్ మూర్తి
కేశవనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో
తేశ ముడైయాయ్ ! తిర వేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:–
భరద్వాజపక్షులు పగలువిడిపోదుము కదా యని తెల్లవారుజామున కలసికొని అన్నివైపులా ఏవేవో మాటలాడుకొనుచున్నవి. ఆమాటలలోని ధ్వనినైననూ నీవు వినలేదా!
ఓ పిచ్చిదానా! కుసుమాలంకృతమగు కేశబంధములు వీడుటచే సుగంధములను వెదజల్లుచున్న జుట్టుముడులు గల గోపికలు, కవ్వములతో పెరుగు చిలుకునపుడు, వారిచేతుల కంకణధ్వనులు, మెడలోని ఆభరణ ధ్వనులతో కలసి, విజృంభించి, ఆకాశము నంటుచున్నవి. ఆ ధ్వనిని వినలేదా! ఓ నాయకురాలా! సర్వపదార్థములలో వాత్సల్యముతో వ్యాపించియుండి, మనకు కన్పడవలెననిమూర్తిమంతుడై కృష్ణుడుగా అవతరించి, విరోధులను నశింపజేసిన ప్రభువును కీర్తించుచుండగా వినియును, నీవు పరుండియుంటివా! నీ తేజస్సు మాకు కన్పట్టుచున్నది. దాని నడ్డగింపక మేము దర్శించి యనుభవించునట్లుతలుపు తెరవవలయును.
8
కీళ్ వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిరు వీడు
మేయ్వాన్ పరన్దనకాణ్! మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్
పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తున్నై
కూవువాన్ వన్దు నిన్రోమ్ కోదుకలముడైయ
పావాయ్ ! ఎళు న్దిరాయ్, పాడిప్పరై కొణ్డు
మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాదిదేవనై చ్చెన్రు నామ్ శేవిత్తాల్
ఆవా వెన్రారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:–
తూర్పుదిక్కు తెల్లవారుచున్నది. చిన్న బీడులోనికి మేయుటకు విడువబడిన గేదెలు విచ్చలవిడిగా పోవుచున్నవి. మిగిలిన పిల్ల లందరును గూడ వ్రతస్థలమునకు పోవుటకై బయలుదేఱి, అట్లు పోవుటయే తమకు ప్రయోజన మనునట్లు పోవుచున్నారు. ఆ పోవువారిని ఆపి మేము నిన్ను పిలుచుటకు నీ వాకిట వచ్చి నిలిచినాము. కుతూహలము కలదానా ! ఓ పడతీ ! లేచి రమ్ము ! కృష్ణగుణములను కీర్తించి వ్రతమున కుపక్రమించి వ్రతసాధనమగు పరను పొంది, కేశి యను రాక్షసుని చీల్చి చంపినవానిని, మల్లురను మట్టుపెట్టినవానిని, దేవతలకు ఆదిదేవుడైనవానిని మనము పోయి సేవించినచో అయ్యో ! అయ్యో ! మీరే వచ్చితిరే ! యని బాధపడి మన మంచి చెడ్డలను విచారించి మనలను కటాక్షించును.
9
తూమణి మాడత్తుచ్చుత్తమ్ విళక్కెరియ
తూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
మామీర్! అవళై యెళుప్పీరో! ఉన్ మగళ్ దాన్
ఊమైయో ? అన్రిచ్చెవిడో ? అనన్దలో
ఏ మప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ?
“మామాయన్ మాధవన్ వైగున్దన్” ఎన్రెన్రు
నామమ్ పలవుమ్ నవిన్రేలో రెమ్బావాయ్!
తాత్పర్యము:-
పరిశుద్ధములగు నవవిధమణులతో నిర్మించబడిన మేడలో సుఖశయ్యపై చుట్టును దీపములు వెల్గుచుండగా అగరుధూపము గుమగుమలాడుచుండగా నిద్రపోవుచున్న ఓ అత్తకూతురా! మణికవాటపు గడియ తీయుము. ఓ యత్తా! నీవైననూ ఆమెను లేపుము. నీ కుమార్తె మూగదా? లేక చెవిటిదా? లేక జాడ్యము గలదా? లేక ఎవరైన కదలిన ఒప్పమని కావలియున్నారా? లేక గాఢనిద్ర పట్టునట్లు మంత్రించినారా? “మహామాయావీ! మాధవా! వైకుంఠవాసా!” అని అనేక నామములను కీర్తించి ఆమె లేచునట్లు చేయుము.
10
నోత్తు చ్చువర్‍క్కమ్ పుహిగిన్ఱ అమ్మనాయ్!
మాత్తముమ్ తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్; – నమ్మాల్
పోత్తప్పఱై తరుమ్ పుణ్ణియనాల్; పణ్డొరునాళ్,
కూత్తత్తిన్ వాయ్ వీళ్‍న్ద కుమ్బకరణనుమ్
తోత్తు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో ?
ఆత్త అనన్దలుడైయాయ్! అరుఙ్గలమే!
తేత్తమాయ్ వన్దు తిఱ వేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:-
మేము రాకముందే నోము నోచి దాని ఫలముగ సుఖానుభవమును పొందిన తల్లీ! తలుపు తెరవకపోయిన పోదువుగాక, మాటనైనను పలుకవా! పరిమళములతో నిండిన తులసిమాలలు అలంకరించుకొనిన కిరీటముగల నారాయణుడు, ఏమియులేని మావంటివారము మంగళము పాడిననూ ’పఱ’ అను పురుషార్థమును ఒసంగెడి పుణ్యమూర్తి, ఒకనాడు కుంభకర్ణుని మృత్యువునోటిలో పడత్రోయగా, ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడింపబడి తన సొత్తగు ఈ గాఢనిద్రను నీకు ఒసంగినాడా! ఇంత అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లీ! మాకందరకు శిరోభూషణమైనదానా! నిద్రనుండిలేచి మైకము వదలించుకొని, తేరుకుని వచ్చి తలుపు తెఱువుము, నీ నోరుతెరచి మాటాడుము, ఆవరణము తొలగించి నీ దర్శనమునిమ్ము.
11
కత్తు క్కఱవై క్కణంగళ్ పల కఱన్దు
శెతార్ తిఱ లళియ చ్చెన్రు శెరుచ్చెయ్యుమ్
కుత్త మొన్రిల్లాద కోవలర్దమ్ పొర్కొడియే
పుత్తర వల్గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు తోళిమారెల్లారుమ్ వన్దు నిన్
ముత్తమ్ పుగున్దు ముగిల్ వణ్ణన్ పేర్పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్ణాట్టి ! నీ
ఎత్తు క్కురంగుమ్ పొరుళే లోరెమ్బావాయ్.
తాత్పర్యము:-
లేగదూడలు గలవియు, దూడల వలె నున్నవియు, నగు ఆవుల మందల నెన్నింటినో పాలు పితుకగలవారును, శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధము చేయగలవారును, ఏవిధమగు దోషము లేనివారును అగు గోపాలకుల వంశమున మొలచిన ఓ బంగారుతీగా ! పుట్టలోని పాము పడగవలె నన్ను నితంబప్రదేశము గలదానా ! అడవిలోని నెమలివలె అందమైన కేశపాశముతో ఒప్పుచున్నదానా ! రమ్ము. చుట్టములును, చెలికత్తెలను మొదలుగ అందరును వచ్చిరి. నీముంగిట చేరిరి. నీలమేఘవర్ణుడగు శ్రీకృష్ణుని నామము కీర్తించుచుండిరి. కీర్తించుచున్నను నీవు ఉలుకక పలుకక ఉన్నావేమి? ఓ సంపన్నురాలా ! నీ నిద్రకు అర్థమేమో తెలుపుము.
12
కనైత్తిళం కత్తెరుమై కన్రుక్కిరంగి
నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర,
ననైత్తిల్లమ్ శేరాక్కుమ్ నర్చెల్వన్తంగాయ్
పనిత్తెలైవీళ నిన్వాశల్ కడైపత్తి
చ్చినత్తినాల్ తెన్నిలజ్ఞ్గైక్కోమానై చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తా నెళున్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్
తాత్పర్యము:-
’లేగదూడలు గల గేదెలు పాలుపితుకువారు లేక తమ దూడలను తలంచుకొని వానిపై మనసు పోవుటచే ఆ దూడలే వచ్చి పొదుగులో మూతి పెట్టినట్లు తోచి పాలు పొదుగునుండి కారిపోవుటచే యిల్లంతయు బురద యగుచున్న యొకానొక మహైశ్వర్యసంపన్నుని చెల్లెలా ! మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలిచి యుంటిమి. మీ యింటి ద్వారపు పైకమ్మిని పట్టుకొని నిలిచియుంటిమి. కోపముతో దక్షిణదిక్కున నున్న లంకకు అధిపతియైన రావణుని చంపిన మనోభిరాముడగు శ్రీరాముని గానము చేయుచుంటిమి. అది వినియైనను నీవు నోరు విప్పవా ! ఇంక మమ్మేలుకొనవా ! ఏమి యీ గాఢనిద్ర ! ఊరివారి కందరకును నీ విషయము తెలిసిపోయినది. లెమ్ము’ అని కృష్ణుని విడువక సర్వకాలములనుండుటచే స్వధర్మమునుకూడ చేయలేని దశయందున్న ఐశ్వర్యసంపన్ను డగ్ ఒక గోపాలుని చెల్లెలిని మేల్కొలిపినాడు.
13
పుళ్ళిన్ వాయ్ కీణ్డానైప్పొల్లా వరక్కనై,
క్కిళ్ళి క్కళైన్దానై క్కీర్తిమై పాడిప్పోయ్,
ప్పిళ్ళైగళెల్లారుమ్ పావైక్క,ళమ్బుక్కార్,
వెళ్ళియెళు న్దువియాళముఱఙ్గిత్తు,
పుళ్ళుమ్ శిలుమ్బిన గాణ్ పోదరి క్కణ్ణినాయ్,
కుళ్ళక్కుళిరక్కుడైన్దు నీరాడాదే,
పళ్ళిక్కిడత్తియో పావాయ్ ! నీనన్నాళాల్,
కళ్ళమ్ తవిర్‍న్దు కలన్దేలో రెమ్బావాయ్
తాత్పర్యము:-
పక్షిశరీరమును ఆవేశించిన బకాసురుని నోరు చీల్చి తన్ను కాపాడుకొని, మనను కాపాడిన శ్రీకృష్ణుని, దుష్టరాక్షసుడగు రావణుని పదితలలను హేలగా చిగుళ్లు త్రుంపినట్లు త్రుంపి పారవేసిన శ్రీరాముని గానముచేయుచు పోయి మన తోడిపిల్లలందరును వ్రతక్షేత్రమును చేరినారు. లోన తుమ్మెదగల తామరపూలనుబోలిన కన్నులు గలదానా! లేడివంటి చూపులు గలదానా! శుక్రుడు ఉదయించుచున్నాడు, గురుడస్తమించుచున్నాడు. పక్షులు కూయుచున్నవి. కృష్ణవిరహతాపము తీరునట్లు చల్లగా అవగాహనమొనర్చి స్నానమొనర్పక పాన్పుపై పండుకునియుండెదవేల ? ఓ సుకుమారస్వభావా! ఈ మంచిరోజున నీవు నీ కపటముని వీడి మాతో కలసి ఆనందము ననుభవించుము.
14
ఉజ్ఞ్గల్ పుళైక్కడై తోట్టత్తు వావియుల్
శెజ్ఞ్గళు నీర్వాయ్ నెగిలిన్దుఆంబల్వాయ్ కూమ్బినకాణ్
శెజ్ఞ్గల్పొడిక్కూరై వెణ్ బల్ తవత్తవర్
తజ్ఞ్గల్ తిరుక్కోయిల్ శజ్ఞ్గిడువాన్ పోగిన్రార్
ఎజ్ఞ్గలై మున్న మెళుప్పువాన్ వాయ్ పేశుమ్
నజ్ఞ్గా యెలున్దిరాయ్ నాణాదాయ్ నావుడై యాయ్
శజ్ఞ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్
పజ్ఞ్గయక్కణ్ణానై ప్పాడేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:-
స్నానము చేయుటకు గోపికల నందరను లేవుదునని చెప్పి నిద్రించుచున్న ఒక యమెను ఇందు మేల్కొలుపుచున్నారు.
ఓ పరిపూర్ణురాలా ! నీ పెరటితోటలో దిగుడుబావిలోని ఎఱ్ఱతామరలు వికసించినవి. నల్లకలువలు ముడుచుకొనిపోవుచున్నవి. లెమ్ము. ఎఱ్ఱని కాషాయములను దాల్చి తెల్లని పలువరుస గలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమ తమ యాలయములలో ఆరాధన మొనర్చుటకై పోవుచున్నారు లెమ్ము. మమ్ములను ముందుగానే మేల్కొని వచ్చి లేపుదునని మాట నిచ్చినవు. మరచితివా ! ఓ లజ్ఞావిహీనురాలా ! లెమ్ము. ఓ మాటనేర్పు గలదానా ! శంఖమును చక్రమును ధరించినవాడును, ఆజానుబాహువును అయిన పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు లేచి రమ్ము.
15
ఎల్లే యిలంగిళియే ! యిన్నమురంగుదియో?
శిల్లెన్రళై యేన్మిన్? నజ్ఞ్గైమీర్, పోదరుగిన్రేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పణ్డేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీజ్ఞ్గళే, నానేదా నాయుడుగ
ఒల్లై నీపోదాయ్, ఉనక్కెన్న వేఱుడైయై ?
ఎల్లారుమ్ పోన్దారో? పోన్దార్, ఫోన్దెణ్ణిక్కొళ్
వల్లానై కొన్రానై మాత్తారై మాత్తళిక్క
వల్లానై మాయనై ప్పాడేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:-
ఈ పాసురమున లోనున్న గోపికకు, బయటి గోపికలకు సంవాదము నిబంధింపబడినది.
బయటి గోపికలు: ఓ లేత చిలుకవంటి కంఠమాధుర్యము కలదానా! ఇంకను నిద్రించుచున్నావా! అయ్యో ఇది యేమి?
లోని గోపిక: పూర్ణలగు గోపికలారా! చీకాకు కలుగునట్లు జిల్లుమని పిలువకుడు. నేనిదే వచ్చుచున్నాను.
బయటి గోపికలు: నీవు చాల నేర్పు గలదానవు. నీమాటలలోని నైపుణ్యమును, కాఠిన్యమును మేమింతకు ముందే యెరుగుదుము.
లోని గోపిక: ఏ నేర్పుగలవారు. కఠినలు. పోనిండి నేనే కఠినరాలను.
బయటి గోపికలు: నీకీ ప్రత్యేకత ఏమి? అట్లేకాంతముగా నుండెదవేల? వేగముగా వెలికి రమ్ము.
లోని గోపిక: అందరు గోపికలును వచ్చినారా?
బయటి గోపికలు: వచ్చిరి. నీవు వచ్చి లెక్కించుకొనుము.
లోని గోపిక: సరే! నేను వచ్చి ఏమి చేయవలెను?
బయటి గోపికలు: బలిష్ఠమగు కువలయాపీడము అను ఏనుగును చంపిన వాడును, శత్రువుల దర్పమును అణచినవాడును, మాయావియు అగు శ్రీకృష్ణుని కీర్తన గానము చేయుటకు రమ్ము.
16
నాయగనాయ్ నిన్ర నన్దగోపనుడైయ
కోయిల్ కాప్పానే ! కొడిత్తోన్రుమ్ తోరణ
వాశల్ కాప్పానే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
ఆయర్ శిరుమియరోముక్కు అరై పరై
మాయన్ మణివణ్ణన్ నెన్నెలేవాయ్ నేర్ న్దాన్
తోయోమాయ్ వన్దోమ్ తుయిలెళప్పాడువాన్
వాయాల్ మున్నమున్నమ్ మాత్తాదే అమ్మా! నీ
నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:-
అందరకును నాయకుడై యున్న నందగోపుని భవనమును కాపాడు భవనపాలకా! లోనికి విడువుము. జెండాతో ఒప్పుచున్న తోరణములతో శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలకా! మణులచే సుందరమైన తలుపుల గడియను తెరవుము. గోపబాలికలమగు మాకు మాయావియు, మణివర్ణుడును అగు శ్రీకృష్ణపరమాత్మ ధ్వనిచేయు పఱ యను వాద్యమును ఇచ్చెదనని నిన్ననే మాట యిచ్చెను. మేము వేరొక ప్రయోజనమును కాంక్షించి వచ్చినవారము కాము. పరిశుద్ధభావముతో వచ్చితిమి. శ్రీకృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయ వచ్చితిమి. స్వామీ! ముందుగనే నీవు కాదనకుము. దగ్గరగా ప్రేమతో ఒకదాని నొకటి చేరి బిగువుతో నిలిచియున్న తలుపులను నీవే తెరచి మమ్ములను లోనికి పోనీయవలెను అని గోపికలు భవనపాలకుని, ద్వారపాలకుని అర్థించిరి.
17
అమ్బరమే , తణ్ణీరే శోఱే అఱమ్ శెయ్యుమ్
ఎమ్బెరుమాన్ ! నన్దగోపాలా! ఎళున్దిరాయ్,
కొమ్బనార్కెల్లామ్ కొళున్దే ! కులవిళక్కే
ఎమ్బెరుమాట్టి! యశోదాయ్! అఱివురాయ్!
అమ్బర మూడఱుతోఙ్గి యులగళన్ద
ఉమ్బర్ కోమానే ! ఉఱఙ్గాదెళున్దిరాయ్
శెమ్ పొర్కళ లడిచ్చెల్వా ! బలదేవా !
ఉమ్బియుమ్ నీయు ముఱఙ్గేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:
వస్త్రములు కావలసిన వారికి వస్త్రములు, మంచినీరు కావలసిన వారికి మంచినీరు, అన్నము కావలసినవారికి అన్నము, ఫలాభిసంధి లేక ధర్మబుద్ధితో దానము చేయు నందగోపాలా! మా స్వామీ! మేల్కొనుము. ప్రబ్బలి చెట్లవలె సుకుమారములగు శరీరములు గల స్త్రీలలో చిగురువంటిదానా ! మావంశమునకు మంగళదీపము వంటి దానా! మా స్వామినీ! యశోదా! మేల్కొనుము. ఆకాశమధ్య భాగమును చీల్చుకొని పెరిగి లోకముల నన్నిటిని కొలిచిన త్రివిక్రమా! నిత్యసూరులకు నాయకుడా! నిరింపరాదు. మేల్కొనుము. స్వచ్చమైన ఎఱ్ఱని బమ్గారముతో చేయబడిన కడియము కాలిన దాల్చిన బలరామా! నీవును, నీ తమ్ముడును మేల్కొనవలెను.
అని గోపికలు ప్రార్థించిరి.
18
ఉన్దు మదకళిత్త! నోడాద తోళ్వలియన్
నన్ద గోపాలన్ మరుమగళే ! నప్పిన్నాయ్ !
కన్దమ్ కమళుమ్ కుళలీ ! కడై తిరవాయ్
వన్దెఙ్గుమ్ కోళియళైత్తనగాణ్ మాదవి
ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలి నఙ్గల్ కూవినగాణ్
పన్దార్ విరలి ! ఉన్ మైత్తునన్ పేర్పాడ
చ్చెన్దామరైక్కైయాల్ శీరార్ వళై యొలిప్ప
వన్దు తిరువాయ్ మగిళ్న్దు ఏలో రెమ్బావాయ్.
తాత్పర్యము:
ఏనుగులతో పోరాడగలిగిన వాడును, మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము గలవాడును, మదము స్రవించుచున్న ఏనుగులు కలవాడును, యుద్ధములో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడలా! సుగంధము వెదజల్లుతున్న కేశపాశముగల ఓ నీలాదేవీ! తలుపు గడియ తెరవుము. కోళ్ళు అంతట చేరి అరచుచున్నవి. మాధవీలత ప్రాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూయుచున్నవి. కావున తెల్లవారినది. చూడుము. బంతి చేతితో పట్టుకొనిన దానా! నీబావ గుణములను కీర్తించుటకు వచ్చితిమి. నీవు సంతోషముతో లేచి నడచి వచ్చి,ఎర్ర్తామర పూవును బోలిన నీ చేతితో, అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వనిచేయునట్లు తలుపు తెరుము.
19
కుత్తు విళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్
మెత్తెన్ర పఞ్చశయనత్తిన్ మేలేరి
కొత్తలర్ పూజ్ఞ్గళల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తుక్కిడన్ద మలర్ మార్పా ! వాయ్ తిరవాయ్
మెత్తడజ్ఞ్కణ్ణినాయ్ నీ యున్మణాలనై
ఎత్తనైపోదుమ్ తుయిలెళ వొట్టాయ్ కాణ్
ఎత్తనై యేలుమ్ పిరివాత్త గిల్లాయాల్
తత్తువ మన్రుత్తకవేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:
గుత్తిదీపములు చుట్టును వెలుగుచుండగా, ఏనుగు దంతములతో చేయబడిన కోళ్ళు గల మంచముపైనున్న, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము, ఎత్తు, వెడల్పు కలిగిన పాన్పుపై నెక్కి, గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకొనిన కేశపాశము గల నీలాదేవీయొక్క స్తనములపై తన శరీరమును ఆనుకొనిపరుండి విశాలమైన వక్షఃస్టలము గల శ్రీకృష్ణా! నోరు తెరిచి మాటాడుము. కాటుక పెట్టుకొనిన విశాలమైన కన్నులు గల ఓ నీలాదేవీ! నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీయవు? ఇంతమాత్రపు ఎడబాటు కూడ ఓర్వలేకుండుట నీ స్వరూపమునకు, నీ స్వభావమునకు తగదు.
20
ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్రు
కప్పమ్ తవిర్కుమ్ కలియే తుయిలెళాయ్
శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్ ! శెత్తార్కు
వెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిలెళాయ్
శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిరు మరుంగుల్
నప్పిన్నై నంగాయ్ ! తిరువే ! తుయిలెళాయ్
ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై
ఇప్పోతే యెమ్మై నీరాటేలే రెమ్బావాయ్.
తాత్పర్యము:
ముప్పడిమూడుకోట్ల అమరులకు వారి కింకను ఆపద రాకముందే పోయి, యుద్ధభూమిలో వారికి ముందు నిలిచి, వారికి శత్రువుకవన కలిగెడి భయమును తొలగించెడి బలశాలీ! మేల్కొనుము. ఆర్జవము కలవాడా! రక్షణముచేయు స్వభావము గలవాడా! బలము కలవాడా! ఆశ్రితుల శత్రువులనే నీ శత్రువులుగా భావించి వారికి భయజ్వరమును కల్గించువాడా! నిర్మలుడా! మేల్కొనుము.
అంగారు కలశలములను పోలిన స్తనములను, దొండపండువలె ఎఱ్ఱని పెదవియును, సన్నని నడుమును కల ఓ నీలాదేవీ! పరిపూర్ణురాలా! లక్ష్మీ సమానురాలా! మేల్కొనుము. వీచుటకు ఆలపట్టమును(విసినకఱ్ఱను) కంచుటద్దమును మా కొసంగి నీ వల్లభుడగు శ్రీ కృష్ణునితో కలసి మేము స్నానమాడునట్లు చేయుము.
21
ఏత్తకలంగ ళెదిరిపొంగి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కల్
ఆత్త ప్పడైత్తాన్ మగనే ! యరివురాయ్
ఊత్తముడైయాయ్ ! పెరియాయ్ ! ఉలగినిల్
తోట్రమాయ్ నిన్ర శుడరే ! తుయిలెళాయ్
మాత్తారునక్కు వలితులైన్దు ఉన్ వా శర్కణ్
ఆత్తాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే
పోత్తిరియామ్ వన్దోమ్ పుగళ్ న్దు ఏలోరెమ్బావాయ్
తాత్పర్యము:
పొదుగుకింద నుంచిన కడవలు చరచర నిండి, పొంగి పొరలునట్లు ఆగక, పాలు స్రవించు అసంఖ్యాకములగు, ఉదారములగు, బలసిన, ఆవులు గల నందగోవుని కుమారుడా! మేల్కొనుము. ప్రమాణదార్ఢ్యము గల పరబ్రహ్మస్వరూపా! ఆశ్రితరక్షణ ప్రతిజ్ఞాదార్ఢ్యము గల మహామహిమసంపన్నా! ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్వరూపా! నిద్రనుండి లెమ్ము. శత్రువులు నీ పరాక్రమునకు లొంగి నీ వాకిటికి వచ్చి నీ దాసులై నీ పాదారవిందముల నాశ్రయించినట్లు మేము కూడ నిన్ను వీడి యుండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి.
22
అంగణ్ మాజ్ఞాలత్తరశర్ అభిమాన
బజ్ఞ్గమాయ్ వన్దు నిన్ పళ్ళిక్కట్టిల్ కీళే
శజ్ఞ్గమిరుపార్ పోల్ వన్దుతలై ప్పెయ్ దోమ్
కింగిణివాయ్ చ్చెయద తామరప్పూప్పోలే
శెంజ్ఞ్గణ్ శిరిచ్చిరిదే యేమ్మేల్ విళియావో
తింగళు మాదిత్తియను మెళున్దార్పోల్
అజ్ఞ్గణ్ణిరణ్డుం కొండు ఎజ్ఞ్గళ్ మేల్ నోక్కుదియేల్
ఎజ్ఞ్గళ్ మేల్ చాబ మిళన్దేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:
సుందరము, విశాలము నగు మహాపృటివీమండలము నంతను ఏలిన రాజులు తమకంటె గొప్పవారు లేరెనెడి అహంకారమును వీడి, తమను జయించిన సార్వభ్ॐఉని సింహాసనము క్రింద గుంపులు గుంపులుగ చేరియున్నట్లు, మేమును అభిమానభంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగ చేరి యున్నాము. చిరుగంట ముఖమువలె విడియున్న తామరపువ్వువలె వాత్సల్యముచే ఎర్రగా నున్న నీ కన్నుఅను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపజేయుము.
సూర్యచంద్రు లిరువురు ఒక్కసారి ఆకసమున ఉదయించున ట్లుండెడి నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షించితివా! మేము అనుభవించియే తీరవలె ననెడి శాపమువంటి కర్మకూడ మమ్ములను వీడిపోవును.
23
మారిమలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గుమ్
శీరియ శిఙ్గమరివిత్తుత్తీ విళిత్తు
వేరిమయిర్ పొఙ్గ వెప్పాడుమ్ పేర్ న్దుదరి
మూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పురప్పట్టు
పోదరుమాపోలే, నీ పూవైప్పూవణ్ణా ! ఉన్
కోయిల్ నిన్రిఙ్గనే పోన్దరుళి కోప్పుడైయ
శీరియ శిఙ్గాసనత్తిరున్దు యామ్ వన్ద
కారియమారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్
తాత్పర్యము:-
పర్వతగుహలో వర్షాకాలమున కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యము గల సింహముమేల్కొని, తీక్ష్ణమగు చూపుల నిటు నటు చూచి, ఒకవిధమగు వాసన గల తన ఒంటివెండ్రుకలు నిగుడునట్లు చేసి, అన్నివైపులదొర్లి , దులుపుకొని, వెనుకకు ముందుకు శరీరమునుచాపి, గర్జించి, గుహనుణ్డి వెల్వడి వచ్చునట్లు, ఓ ఆతసీపుష్పసవర్ణా! నీవు నీ భవనము నుండి ఇట్లే బయటకి వేంచేసి రమణీయసన్నివేశముగల లోకోత్తరమగు సింహాసనమును అధిష్ఠించి మేము వచ్చిన కార్యమును ఎరుంగ ప్రార్థించుచున్నాము.
24
అన్రిప్వులక మళన్దా యడిపోత్తి
శెన్రఙ్గుత్తెన్నిలఙ్గైశెత్తాయ్! తిఱల్ పోత్తి
పొన్రచ్చగడ ముదైత్తాయ్ ! పుగళ్ పోత్తి
కన్రు కుడైయా వెడుత్తాయ్ ! కుణం పోత్తి
కున్రుకుడైయా వెరిన్దాయ్ ! కళల్ పోత్తి
వెన్రు పగైక్కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి
ఏన్రెన్రున్ శేవగమే యేత్తిప్పఱై కొళ్వాన్
ఇన్రుయామ్ వన్దోమ్ మిరఙ్గేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:-
ఆనాడు బలి చక్రవర్తి తనది కాని రాజ్యమును తాను ఆక్రమించి దేవతలను పీడింపగా ఈ లోకమునంతనూ వానివద్దనుండి దానము పట్టి పాదములతో కొలిచిన మీ దివ్యపాదారవిందములకు మంగళము.
రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావణుడుండు లంకకేగి సుందరమగు భవనములు, కోటయూ గల దక్షిణదిశనున్న లంకలో రాక్షసులను చెండాడిన మీ బాహుపరాక్రమమునకు మంగళము.
శ్రీ కృష్ణునకు రక్షణకై యుంచిన బండిపై ఆవేశించిన రాక్షసును చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలు చాచి నేలకూల్చిన మీ అప్రతిమకీర్తికి మంగళము.
వత్సముపై ఆవేశించిన అసురునితో వెలగచెట్టుపైనావేశించిన యసురుని చంపుటకై ఒడిసెలరాయి విసరినట్లుగా వెలగచెట్టుపైకి దూడను విసరునపుడు ముందు వెనుకలకు పాదములుంచి నిలిచిన నీ దివ్యపాదములకు మంగళము.
ఇంద్రుడు తనకు యాగము లేకుండ చేసెనను కోపముచే రాళ్లవాన కుర్పించగా గోపాలురకు బాధ కలుగుకుండునట్లు గోవర్ధనపర్వతమును గుదుగువలె ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగలము.
శత్రువులను సమూలముగా పెకలించి విజయము నార్జించి ఇచ్చెడి మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము.
ఈ ప్రకారముగా నీ వీరచరిత్రలనే కీర్తించి పఱయనెడి వ్రతసాధనము నందగ మే మీనాడు వచ్చినారము. అనుగ్రహింపుము.
25
ఒరుత్తి మగనాయ్ పిఱన్దు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర,
తరక్కిలానాగి త్తాన్ తీఙ్గు నినైన్ద
కరుత్తై ప్పిళ్ళైపిత్తు కఞ్జన్ వయిట్రిల్
నెరుప్పెన్న నిన్ర నెడు మాలే ! యున్నై
అరుత్తిత్తు వన్దోమ్ , పఱై తరుతియాకిల్
తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యామ్పాడి
వరుత్తముమ్ తీర్ న్దు మగిళిన్దేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:-
భగవానుడే తనకు కుమారుడుగా కావలెనని కోరి, శంఖచక్రగదాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగల్గిన సాటిలేని దేవకీదేవకి కుమారుడవై జన్మించి, శ్రీకృష్ణుని లీలలను పరిూర్ణముగా అనుభవించి, కట్టను కొట్టను భగవానుని వశమొనర్చుకొనిన అద్వితీయవైభవముగల యశోదకు, ఆ రాత్రియే కుమారుడవై, దాగి పెరిగినవాడా! అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్టభావముతో నున్న కంసుని అభిప్రాయమును వ్యర్థము చేసి వాని కడుపులో చిచ్చువై, నిన్ను చంపవలెనని తలంచిన వానిని నీవే చంపిన ఆశ్రితవ్యామోహము గలవాడా! నిన్నే కోరి వచ్చినారము. పఱ యను వాద్యము నిచ్చిన ిమ్ము. సాక్షాత్తు లక్ష్మియే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యమును, నీ వీరచరిత్రమును, కీర్తించి శ్రమను వీడి ఆనందించుచున్నాము.
26
మాలే ! మణివణ్ణా ! మార్గళి నీరాడువాన్
మేలైయార్ శెయ్వనగళ్ వేణ్డువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లామ్ నడుఙ్గ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్ పాఞ్జశన్నియమే
పోల్వన శఙ్గఙ్గళ్, పోయ్ ప్పాడుడై యనవే
శాల ప్పెరుమ్ పఱైయే, పల్లాణ్డిశైప్పారే
కోలవిళక్కే, కొడియే, విదామే
ఆలినిలై యాయ్ ! అరుళేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:-
ఆశ్రితవ్యామోహము కలవాడా! ఇంద్రనీలమణిని పోలిన కాంతియు స్వభావమును కలవాడా! అఘటితఘటనాసామర్థ్యముచే చిన్న మర్రియాకుపై యమరి పరుండువాడా! మేము మార్గశీర్షస్నానము చేయగోరి దానికి కావలిసిన పరికరము లర్థించి నీ వద్దకు వచ్చితిమి. ఆ స్నానవ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు. నీవు వినుచో దానికి కారణములను విన్నవించెదము.
ఈ భూమండల మంతను వణకునట్లు శబ్దముచేయు, పాలవలె తెల్లనైన, నీ పాంచజన్యమనెడి శంఖమును బోలిన శంఖములు కావలెను. విశాలమగు చాల పెద్ద ‘పఱ’ యను వాద్యములు కావలెను. మంగళగానము చేయు భాగవతులు కావలెను. మంగళదీపములు కావలెను. ధ్వజములు కావలెను. మేలుకట్లు కావలెను. పై పరికరములను కృపచేయుము. అని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించిరి.
27
కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా ! ఉన్దన్నై
ప్పాడిప్పఱై కొణ్డుయామ్ పెఱుశమ్మానమ్
నాడుపుగళుమ్ పరిశినాల్ నన్రాగ
చ్చూడగమే తోళ్ వళైయే,తోడే, శెవిప్పూవే,
పాడగమే,యెన్రనైయ పల్ కలనుమ్ యామణివోమ్,
ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు
మూడ నెయ్ పెయ్ దు ముళఙ్గైవళివార
క్కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్
తాత్పర్యము:-
తనతో కూడని శత్రువులను జయించెడి కళ్యాణగుణసంపద గల గోవిందా! నిన్ను కీర్తించి వ్రతసాధనమగు పర యను వాద్యమును పొంది, పొందదలచిన ఘనసన్మానము లోకులందరు పొగడెడి తీరులో నుండును. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు, బాహువులకు దండకడియములు, చెవిక్రిందభాగమున దాల్చెడి దుద్దు, పైభాగమున పెట్టుకొనెడి కర్ణపూవులు, కాలియందెలు మొదలగు అనేకాభరణములను మేము దాల్పవలయును. తరువాత మంచి చీరలను దాల్పవలయును. దానితరువాత పాలు, అన్నము మునుగుట్లు నేయిపోసి ఆ మధురపదార్థము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చొని చల్లగా, హాయిగా భుజింపవలెను. అని గోపికలు తమ వ్రతఫలమును ఇందు విన్నవించిరి.
28
క ఱవైగళ్ పిన్ శెన్రు కానమ్ శేర్ న్దుణ్బోమ్,
అఱివొన్రు మిల్లాద వాయ్ క్కులత్తు ఉన్దన్నై
ప్పిఱవి పె ఱున్దనై పుణ్ణియమ్ నాముడైయోమ్
కు ఱైవొన్రు మిల్లాద గోవిన్దా !ఉన్దన్నోడు
ఉఱవేల్ నమక్కి ఙ్గొళిక్క వొళియాదు
అఱియాద పిల్లెగళోమ్, అన్బినాల్ ఉన్దన్నై
చ్చిఱుపేరళైత్తనవుమ్ శీఱి యరుళాదే
ఇఱైవా నీ తారాయ్ పఱైయేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:-
పశువులవెంట వానిని మేపుటకై అడవికి పోయి, అచటనే శుచి నియమములు లేక తిని, జీవించియుండుటయే ప్రయోజనముగా తిని, తిరిగెడివారము. ఏమియు జ్ఞానము లేని మా గోపవంశమును మాతో సజాతీయుడవై నీవు జన్మించిన పుణ్యమే మాకున్న పుణ్యము. మాకెన్ని లోపము ఉన్నను తీర్చగల్గినట్లు ఏ లోపము లేనివాడవు కదా నీవు . గోవిందా! ఓ స్వామీ! నీతో మాకు గల సంబంధము పోగొట్టుకొన వీలుకాదు. లోకమర్యాద నెరుంగని పిల్లలము. అందుచే ప్రేమవలన నిన్ను చిన్నపేరుపెట్టి పిలిచినాము . దానికి కోపము తెచ్చుకొని మమ్ములననుగ్రహింపక యుండకుము. మాకు అపేక్షితమగు పఱను ఒసంగుము.
29
శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్
ప్పొత్తామరై యడియే ప్పోత్తుమ్ పోరుళ్ కేళాయ్
పెత్తమ్మేయ్ త్తుణ్ణం కలత్తిల్ పిఱన్దనీ
కుత్తేవలెంగళై క్కొళ్ళమల్ పోగాదు
ఇత్తై పఱై కొళ్వా నన్రుకాణ్ గోవిన్దా !
ఎత్తైక్కుమేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో
డుత్తోమే యావోమునక్కే నామాళ్ శెయ్ వోమ్
మత్తై నఙ్కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్
తాత్పర్యము:-
బాగుగా తెల్లవారకమునుపే నీవున్నచోటికి మేము వచ్చి, నిన్ను సేవించి, బంగారు తామరపూవువలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ప్రయోజనము వినుము. పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగకైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారము కాము. ఏనాటికిని, ఏడేడు జన్మలకును నీతో వీడరాని బంధుత్వము కలవారుమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మా ఇతరములయిన కోరిక లేవియు లేకుండునట్లు చేయుము. దానికి కోపము తెచ్చుకొని మమ్ములననుగ్రహింపక యుండకుము. మాకు అపేక్షితమగు పఱను ఒసంగుము.
30
వఙ్గ క్కడల్ కడైన్ద మాదవనై క్కేశవనై
త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళ యార్ శెన్ఱిరైఞ్జి
అఙ్గప్పరై కొణ్డవాతైయణిపుదువై
పైఙ్గమల త్తణ్ తెరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న
శఙ్గత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే
ఇఙ్గప్పరిశురై ప్పారిరణ్డు మాల్వరైత్తోళ్
శె ఙ్గణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తిన్బురువ రెమ్బావాయ్
తాత్పర్యము:-
ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మథింపచేసి, లక్ష్మీదేవినిపొంది మాధవుడైనవానిని, బ్రహ్మరుద్రులకు కూడ నిర్వాహకుడైనవానిని, ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగువారును, విలక్షణాభరణములను దాల్చినవారును అగు గోపికలు చేరి, మంగళము పాడి, పఱ యను వాద్యము లోకులకొరకును, భవద్దాస్యమును తమకొరకును పొందిరి. ఆప్రకారము నంతను, లోకమునకు ఆభరణమైయున్న శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి, సర్వదా తామరపూసలమాలను మెడలో ధరించియుండు శ్రీ భట్టనాథుల పుత్రిక యగు గోదాదేవి ద్రావిడభాషలో ముప్పది పాశురములలో మాలికగా కూర్చినది.
ఎవరీ ముప్పది పాశురములను క్రమము తప్పక చదువుదురో, వారు ఆనాడు గోపికలా శ్రీకృష్ణునినుండి పొందినఫలమును, గోదాదేవి వ్రతము నాచరించి పొందిన ఫలముగూడ పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే, పుండరీకాక్షుడను, పర్వతశిఖరముల వంటి బాహుశిరస్సులు గలవాడును, శ్రీ వల్లభుడును, చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాదించును.
Tiruppavu (Tiruppavai) – with Sri Bhashyam Apaalacharya’s telugu translation.
for more related posts, visit -> https://shankaravani.org/tag/%e0%b0%97%e0%b1%8b%e0%b0%a6%e0%b0%be%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b1%80/