పరమాచార్యుల అమృతవాణి :‌ కార్తీక దీపము

పరమాచార్యుల అమృతవాణి :‌ కార్తీక దీపము
(జగద్గురుబోధల నుండి)

కార్తీకపౌర్ణమి సాయంసమయంలో ప్రమిదలలో చమురుపోసి దీపములు వెలిగించే ఆచారము ఆసేతు హిమాచలము ఉంది. ప్రతియింటి గుమ్మమునందు ఈనాడు దీపాల వరుస మినుకు మినుకు మంటూ ఉంటుంది. ఈవాడుక ఏనాటినుండి ప్రారంభమైనదో చెప్పలేము. అనాదిగ ఈరోజున కనీసము ఒక దీపమైనా ఇంటింట వెలిగిస్తారు. ఈ దీపం వెలిగిస్తూ చెప్పవలసిన శ్లోకము ఒకటి ఉంది. ఆశ్లోకానికి అర్థము- ”ఈ రోజున ఎవరీ దీపమున ఆవాహన చేసిన మూర్తిని స్మరిస్తూ, దీపదర్శనం చేస్తారో- ఈ దీపజ్యోతి ఎవరిమీద ప్రసరిస్తుందో వారు పాపముక్తులై పునర్జన్మ లేని స్థితిని పొందురుగాక!’– అని.

అనేక స్థలములలో విగ్రహములలో ఈశ్వరుని ఆవాహన చేయురీతినే ఈరోజు దీపములో దామోదరుడనే మూర్తినో లేక ఉమాదేవీ సహితుడైన త్య్రంబకునో- ఆవాహనచేసి ప్రార్థిస్తారు. ఇది సంప్రదాయము. కేశవ, నారాయణ, మాధవ- అని చెప్పు నామములతో పండ్రెండవ నామము, దామోదరుడు, ఆయననో లేక ఉమాసహితుడైన త్య్రంబకునో ఆవాహన చేస్తారు.

గొప్ప తపస్వులైన మహర్షులు కొన్నిచోట్ల మహాలింగములలో తమ తపోబలముచే ఈశ్వరుని ఆవాహనచేసి, ఈ లింగములయందు ప్రతిష్ఠుడవై దర్శనార్థము వచ్చే భక్తకోటుల పాపాలను నివృత్తి చేయవలసినదని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆయా స్థలాలలో ఉండే మూర్తులపై భక్త శేఖరులైన ఆళ్వారులు, నాయనమ్మారులు ఎన్నో భక్తి గీతాలు పాడి ఉన్నారు. అందుకే ఇట్టి క్షేత్రాలలో‌ఒక విశేషం ఉంటుంది.

ఇదే రీతిని కొన్ని తీర్థాలలో కూడ ఋషులు- ఈతీర్థములో స్నానము చేసినవారికి పాపనివృత్తి కావలెనని- సంకల్పించి ప్రార్థనలు చేసి ఉన్నారు. అందుచే ఈ తీర్థాలకు కూడ ఒక విశేషము ఉంది. వాగనుగ్రహము కలవారు ఇట్టి తీర్థములను కీర్తించారు. అట్లే కృత్తికా పూర్ణిమనాడు దీపములో ఈశ్వరుని ఆవాహనచేసి- ఈ దీపజ్వాలను చూచినను సరే- ఈ దీపజ్వాలపైబడిననుసరే, చూచుటకు శక్తికల జీవులు, శక్తిలేని జీవులు – ఏవి అయినను-వాని పాపములు నశించాలి అని ప్రార్థన చేస్తారు. పాపములు తొలగి ‘లోకా స్సమస్తా స్సుఖనో భవన్తు’, అనే సంకల్పము ఋషులు వెలిబుచ్చారు. కృత్తికానక్షత్రము, పూర్ణిమతిథి-రెండూ ఈరోజు కలిసి వస్తున్నాయి. నక్షత్రము ఒకరోజున, పూర్ణిమ ఒకరోజున వచ్చుటకూడ ఉంది. దేవాలయాలకు కృత్తికా నక్షత్రమే ముఖ్యము. తిరువణ్ణామలైలో కృత్తికా నక్షత్రమన కృత్తికా దీపము వెలిగిస్తారు. ఇండ్లలో పూర్ణిమనాడు దీపాలు పెటతారు. దీపము వెలిగించి ఆ దీపకలికా జ్యోతిలో ఉమాదేవీ సహిత త్య్రంబకమూర్తినో, దామోదరమూర్తినో ఆవాహనచేసి- ‘కీటాః పతంగాః’ అనే శ్లోకం చదువుతారు.

ఈ దీపదర్శనమువలన మనుష్యుల పాపములేకాదు. పశుపక్షి కీటకముల పాపములు సైతము నశిస్తాయి. మన మలి పుట్టుక ఏదో మనకు తెలియదు. మనము ఏమ్రాను అయినా కావచ్చు. మశకమయినా కావచ్చు. అందుచేతనే సమస్త ప్రాణికోటికి పాపనివృత్తి – ప్రసాదించాలి – అని ప్రార్థన చేయుట.

చాలా దూరంలో ఉండేవారికి కూడ తెలిసేరీతిని పెద్ద గోపురమువలె చెత్తచెదారము వేసి మంట వేస్తారు. ఆలయములో నుండి ఈశ్వరుని ఆవాహనచేసిన ఒక దీపాన్ని తెచ్చి దీనిని తగులబెట్టుతారు. తిరువణ్ణామలైలో పర్వతశిఖరముపై – అణ్ణామలై దీపమని- మైళ్ళకొలది తెలిసే రీతిగా – దీపము వెలిగిస్తారు.

జ్వాలాదర్శనముచేసే జనుల పాపములేకాక కీటాః – పురుగులు, పతంగాః – పక్షులు, మశకాః – దోమలు, వృక్షాః – చెట్లు, వీని కన్నిటికీ జన్మనివృత్తి కావాలి. చెట్లు చేమలు లతలు కొన్ని రోజు నీరు పోయకపోతే వాడిపోతాయి. శోషిస్తాయి. ఇది మనము ఎఱిగిందే. వాని జన్మసైతము నివృత్తి కావాలి. జల్సేజలములో ఉండే చేపలు, ఇతర జలజీవములు, స్థల్సేస్థావరాలైన జంతువులు- ”దృష్ట్యా ప్రదీపం న చ జన్మభాగినః”. త్ర్యంబకుని ఆవాహన చేసిన దీపము చూచినా, ఆ దీపజ్వాలయొక్క వెలుతురు వానిపైపడినా – పుష్టివర్థకుడైన మహేశ్వరుని కృపచే సమస్త జీవులకు పాపనివృత్తి కావలెనని కరుణాస్వరూపులైన మహర్షులు ప్రార్థించి ఉన్నారు.

ద్విపాదులైనను చతుష్పాత్తులైనను లోకం అంతా క్షేమంగా ఉండాలి. కొన్నిటికి పాదములే ఉండవు. వానిదొక వింత జన్మ. మరికొన్ని జీవాలకు వేలకొలది కాళ్లు. అవి సహస్రపాదులు. ‘తే ద్విపాద్‌ చతుష్పావ్‌’ అని వేదములో చెప్పబడింది. ‘సకలము క్షేమముగా ఉండాలి’ అని మనము ప్రార్థన చెయ్యాలి. మనము మాత్రము క్షేమము ఉంటే చాలదు. ‘లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు’ అని అన్ని లోకాల సుఖమూ కూడ కోరాలి.

కృత్తికా దీపమునాడు చెప్పవలసిన శ్లోకము

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః|
దృష్ట్యా ప్రదీపం నర జన్మభాగినః భవన్తి త్యం శ్వవచాహి విప్రాః||

పై శ్లోకమును విడివిడిగా భాగించి స్ఫుటంగా చెప్పడం. ఈ దీపకాంతి ప్రసరించిన మానవులు పశువులు పక్షులు కీటకములు అన్నీ తమ పాపాలను పొగొట్టుకొని క్షేమంగా ఉండాలి అనియే. అదే ఈ శ్లోక తాత్పర్యము. ఇది పరంపరగా వస్తూ ఉంది. ఈశ్వరుని ఆవాహన చేసిన ఈ దీప ప్రకాశమే పరమేశ్వర స్వరూపము, పాపవిమోచకము.

కృత్తికానక్షత్రము సుబ్రహ్మణ్యస్వామి షణ్ముఖుని – జ్ఞాపకార్థమైఉంది. ఈ ఆరు నక్షత్రములకు వేరు వేరు పేర్లు ఉన్నాయి. ఈ ఆరు నక్షత్రములే షణ్మాతృకలైన సుబ్రహ్మణ్యస్వామియొక్క తల్లులుగా చెప్పబడుతూ ఉన్నవి.

మరొక విశేషం, ఏమంటే – శివాలయంలోను, విష్ణ్వాలయంలోను కూడా చేసే ఉత్సవము – కృత్తికానక్షత్ర దీపోత్సవము ఒక్కటే. ఒక్కొక్క క్షేత్రములో ఒక్కొక్క ఉత్సవము విశేషము. కాని అన్ని గుడులలో, అన్ని క్షేత్రములలో – ఒకే రోజున విశేషముగా – మూర్తి భేదములేక చేసే ఉత్సవం ఇదే ‘లోకా స్సమస్తాస్సుఖినో భవన్తు’ అనే వాక్యానికి వ్యాఖ్యానమా? అన్నట్లు – ఈనాడు దీపదర్శనం చేసే సమస్త ప్రాణికోటికి జన్మనివృత్తి ఔతోంది. అందుచే మనము కృత్తికా పూర్ణిమనాడు (కార్తికమాసమున పూర్ణిమనాడు) దీపదర్శనముచేసి- దామోదరుని ఉమాసహిత త్ర్యంబక మూర్తిని ఆ దీపజ్వాలలో ఆవాహనచేసి ఆ ప్రకాశ ప్రసరణముచే పాపనివృత్తులమై లోకులక్షేమానికై ప్రార్థించుట కర్తవ్యము.

ఈ మనోభావము సార్వజనికము కావాలి. అప్పుడందరి ఆపదులు తొలుగుతాయి. అందరి సుఖమే మనసుఖము అందరి క్షేమమే మన క్షేమము. ‘లోకాస్సమస్తా సుఖినోభవన్తు’ అనే ప్రార్థనయే మనము అనవరతము చేయవలసినది.

Paramacharya Amrutavani : Kartika Deepam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s