సంక్షేపరామాయణమ్
న పుత్రమరణం కేచిద్ ద్రక్ష్యన్తి పురుషాః క్వచిత్ ।
నార్యశ్చావిధవా నిత్యం భవిష్యన్తి పతివ్రతాః ॥ 91॥
రాముడు రాజ్యము చేయుచున్నప్పుడు తండ్రి యుండగా పుత్రుడు మరణిచడు. స్త్రీలకు వైధవ్యదుఃఖము ఉండదు. వారు సర్వదా పతివ్రతలై యుందురు.
న చాగ్నిజం భయం కిఞ్చిన్నాప్సు మజ్జన్తి జన్తవః ।
న వాతజం భయం కిఞ్చిన్నాపి జ్వరకృతం తథా ॥ 92॥
న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా ।
రాముని రాజ్యములో అగ్ని భయము కాని, జల భయము కాని, వాత భయము కాని, జ్వర భయము కాని, క్షుద్భాధ కాని, చోరభయము కాని లేదు.
నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ ॥ 93॥
నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా ।
నగరములు, దేశములు కూడ, ధనధాన్యసమృద్ధములై ఉన్నవి. కృతయుగములో వలెనే ప్రజ లందరును సంతోషవంతులై యున్నారు.
అశ్వమేధశతైరిష్ట్వా బహువస్త్రసువర్ణకైః ॥ 94॥
గవాం కోట్యయుతం దత్త్వా బ్రహ్మలోకం గమిష్యతి ।
అసఙ్ఖ్యేయం ధనం దత్త్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ॥ 95॥
గొప్ప కీర్తి గల రాముడు వందల కొలదిఅశ్వమేధయాగముల చేతన, అనేక ‘బహుసువర్ణక’ యాగములచేతన దేవతలను పూజించి, పదివేల కోట్లగోవులను, లెక్కింప రానంత ధనమును బ్రహ్మణుల కిచ్చి, శాశ్వత మగు తన స్థానమును పొందగలడు.
రాజవంశాఞ్ఛతగుణాన్స్థాపయిష్యతి రాఘవః ।
చాతుర్వర్ణ్యం చ లోకేఽస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ॥ 96॥
రాముడు క్షత్రియులకు రాజ్యము లిచ్చి నూరింతలుగా వారి వంశములను వృద్ధి పొందింపగలడు. నాలుగు వర్ణములవారిని వారి వారి ధర్మములాచరించు నట్లు నియమించగలడు.
దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ ।
రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ॥ 97॥
రాముడు పదకొండు వేల సంవత్సరముల పాటు రాజ్యమును ప్రజలకు సుఖము కలుగు నట్లు పాలించి, బ్రహ్మలోకమును చేరగలడు.
ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ ।
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ॥ 98॥
రామచరిత్ర పరిశుద్ధిని కలిగించును. పాపములను నశింపజేయును. పుణ్యములను ఇచ్చును. ఇది వేదముతో సమానము. దీనిని చదువువాని సర్వపాపములును తొలగిపోవుని.
ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః ।
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ॥ 99॥
రామాయణమనెడి ఈ ఆఖ్యానము ఆయుర్దాయమును వృద్ధి పొందించును. దీనిని చదువువాడు పుత్రపౌత్రాదులతోను, భృత్యబంధుగణములతోను కూడి సర్వసౌఖ్యములను అనుభవించి, మరణాంతరము స్వర్గమునందు దేవతలచేత పూజింపబడును.
పఠన్ద్విజో వాగృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ ।
వణిగ్జనః పణ్యఫలత్వమీయాజ్జనశ్చ శూద్రోఽపి మహత్త్వమీయాత్ ॥ 100॥
ఈ రామాయణమును బ్రాహ్మణుడు పఠించినచో అష్టాదశవిద్యలందును ప్రావీణ్యమును పొందును. క్షత్రియుడు పఠించినచో భూమండలాధిపతియగును. వైశ్యుడు పఠించ్నచో వ్యాపారమునందు లాభమును పొందును. శూద్రుడు పఠించినచో గొప్పవాడగును.
గమనిక: ఈ తాత్పర్యములు ఆర్షవిజ్ఞానట్రస్టువారి మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెలశ్రీరామచంద్రుడు గారిచే రచించబడిన శ్రీ మద్రామాయణము-బాలకాండము గ్రన్థమునుండి కృతజ్ఞతా పురస్కరముగా తీసుకొనబడినవి.
ValmikiRamayana SamkshepaRamayanam(91-100)