భద్రాచల రామదాసు కీర్తన: పాహి రామప్రభో
రాగం: మధ్యమావతి
తాళం: ఝంప/ ఆది
పాహిరామప్రభో పాహిరామప్రభో
పాహిభద్రాద్రి వైదేహిరామప్రభో పా..
ఇందిరా హృదయారవిందాదిరూఢ
సుందారాకార ఆనంద రామప్రభో
ఎందునేజూడ మీసుందరాననము
కందునో కన్నులింపొంద రామప్రభో పా..
బృందారకాది సద్బృందార్చితావతార
వింద ముని సందర్శితానంద రామప్రభో
తల్లివినీవె మాతండ్రివినీవె మా
ధాతవునీవె మాభ్రాత రామప్రభో పా..
నీదు బాణంబులను నాదుశత్రులబట్టి
బాధింపకున్నావదేమి రామప్రభో
ఆదిమధ్యాంత బహిరాంతరాత్ముడవనుచు
వాదింతునే జగన్నాథ రామప్రభో పా..
శ్రీరామ రామేతి శ్రేష్ఠమంత్రము సారె
సారెకును వింతగా జదువ రామప్రభో
శ్రీరామ నీనామ చింతనామృతపాన
సారమే నాదుమది గోరు రామప్రభో పా..
కలికిరూపముదాల్చి కలియుగంబున నీవు
వెలసితివి భద్రాద్రినిలయ రామప్రభో
అవ్యయుడవైన నీయవతారముల జూచి
దివ్యులైనారు మునులయ్య రామప్రభో పా..
పాహిశ్రీరామ నీపాదపద్మాశ్రయుల
పాలింపుమా భద్రశైల రామప్రభో పా..
పాహిరామప్రభో పాహిరామప్రభో
పాహిభద్రాద్రి వైదేహిరామప్రభో పా..
Pahi Ramaprabho : Bhadrachala Ramadasa