భద్రాచల రామదాసు కీర్తన: తక్కువేమి మనకు
రాగం: నాదనామక్రియ
తాళం: ఆది (సౌరాష్ట్ర – ఆది)
పల్లవి:
తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు త..
ప్రక్కతోడుగా భగవంతుడు తన
చక్రధారియై చెంతనె యుండగ త.
చరణములు:
మ్రుచ్చుసోమకుని మునుజంపినయా
మత్స్యమూర్తి మనపక్షమునుండగ త..
సురలకొరకు మందరగిరి మోసిన
కూర్మావతారుని కృప మనకుండగ త..
దురాత్ముడౌ హిరణ్యాక్షు ద్రుంచిన
వరాహమూర్తి మనవాడై యుండగ త..
హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా
పరచిన నరహరి ప్రక్కన నుండగ త..
భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
వామనుండు మనవాడై యుండగ త..
ధరలో క్షత్రియులను దండించిన
పరశురాముని దయ మనకుండగ త..
దశగ్రీవు మును దండించిన యా
దశరథరాముని దయ మనకుండగ త..
ఇలలో యదుకులమున నుదయించిన
బలరాముడు మన బలమైయుండగ త..
దుష్టకంసుని ద్రుంచినట్టి శ్రీ
కృష్ణుడు మనపై కృపతోనుండగ త..
కలియుగాంత్యమున కలిగిన దైవము
కలికిమూర్తి మము గాచుచు నుండగ త..
నారాయణదాసుని గాచిన శ్రీమన్
నారాయణు నెరనమ్మియుండగ త..
రామదాసు నిల రక్షించెదనని
ప్రేమతో పలికిన ప్రభువిట నుండగ త..
Takkuvemi manaku : Bhadrachala Ramadasa