సంక్షేపరామాయణమ్
తేన గత్వా పురీం లఙ్కాం హత్వా రావణమాహవే ।
రామః సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్ ॥ 81॥
రాముడు ఆ సేతుమార్గమున లంకలోనికి ప్రవేశించెను. యుద్ధము నందు రావణుని సంహరించెను. సీతను పొంది, “పరగృహములో చాలకాలము వసించిన భార్యను ఎట్లు పరిగ్రహింతును?” అని చాల సిగ్గుపడెను.
తామువాచ తతో రామః పరుషం జనసంసది ।
అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతీ ॥ 82॥
ఆ కారణమువలన రాముడు జనులందరిలోను, సీతతో పరుషముగా మాటలాడెను. మహాపతివ్రత యగు ఆ సీతాదేవి ఆ మాటలను సహింపజాలక అగ్నిలో ప్రవేశించెను.
తతోఽగ్నివచనాత్సీతాం జ్ఞాత్వా విగతకల్మషామ్ ।
బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః ॥83॥
“సీత ఎట్టిపాపమును లేనిది” అని అగ్ని చెప్పగా రాముడు చాల సంతసించెను. దేవతలు పూజింపగా ప్రకాశించెను.
కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరమ్ ॥
సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః ।|84॥
మహాత్ముడైన రాముడు లోకకంటకుడైన రావణుని చంపుటచే స్థావరజంగమాత్మకములైన మూడు లోకములను, దేవతాఋషిగణసహితముగా సంతోషించినవి.
అభిషిచ్య చ లఙ్కాయాం రాక్షసేన్ద్రం విభీషణమ్ ।
కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోద హ ॥ 85॥
రాముడు పూర్వము విభీషణుని సముద్రతీరమున అభిషిక్తుని చేసెను. ఇపుడు లంకాపురంలో కూడ విభీషణుని రాక్షసరాజునుగా అభిషిక్తుని చేసి, కృతకృత్యుడైయ్యెను. తన ప్రతిజ్ఞ నెరవేరునో లేదో అను చింత తొలగిపోయెను. రాముని సత్యవ్రత మత్యాశ్చర్యకరము కదా!
దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ ।
అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః ॥ 86॥
రాముడు తనను చూడ వచ్చిన దేవతలనుండి వరమును పొందెను. దాని ప్రకారము మృత్యులైన వానరులనందరిని బ్రతికించుకొనెను. స్నేహితులతో కూడి, పుష్పక విమానారూఢుడై అయోధ్యకు బయలుదేరెను.
భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః ।
భరతస్యాన్తికే రామో హనూమన్తం వ్యసర్జయత్ ॥ 87॥
సత్యమునందు స్థిరముగ నిలచువాడును, లోకాభిరాముడును అగు రాముడు భరద్వాజాశ్రమమునకు వెళ్ళెను. హనుమంతుని భరతుని వద్దకు పంపెను.
పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవసహితస్తదా ।
పుష్పకం తత్సమారుహ్య నన్దిగ్రామం యయౌ తదా ॥ 88॥
ఆ రాముడు సుగ్రీవవిభీషణాదులతో కూడి, పూర్వవృత్తాంతములను చెప్పుకొనుచు నందిగ్రామమునకు వెళ్ళెను.
నన్దిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోఽనఘః ।
రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ॥ 89॥
ఎట్టి పాపములు లేని ఆ రాముడు నందిగ్రామమున సోదరుల నందరిని కలిసెను. వారందరును జడలను విడచిరి. మునివేషమును విడుచుటచే సీతతో గార్హస్థ్యమును అవలంబిచెను. మరల రాజ్యమును పొందెను.
ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః ।
నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్షభయవర్జితః ॥ 90॥
రాముడు రాజ్యాభిషిక్తుడు కాగా, లోక మంతయు సంతోషాతిశయముచే గగ్గుర్పాటు చెందెను. రాముడు రాజు కావలెననెడి తమ కోరిక తీరుటచే ప్రజలెల్లరు ప్రీతి చెందిరి. ఆనందాతిశయముచే స్థావర జంగమాత్మకమగు లోకము యొక్క శరీరము వృద్ధి చెందినది. ప్రజలందరును చక్కగా ధర్మము నాచరించుచుండిరి. లోకమందు పీడలు, వ్యాధులు, దుర్భిక్షముల భయము తొలగిపోయెను.
గమనిక: ఈ తాత్పర్యములు ఆర్షవిజ్ఞానట్రస్టువారి మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెలశ్రీరామచంద్రుడు గారిచే రచించబడిన శ్రీ మద్రామాయణము-బాలకాండము గ్రన్థమునుండి కృతజ్ఞతా పురస్కరముగా తీసుకొనబడినవి.
ValmikiRamayana SamkshepaRamayanam(81-90)