వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(71-80)

సంక్షేపరామాయణమ్

స చ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః ।
దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజామ్ ॥ 71॥

వానరశ్రేష్ఠుడగు సుగ్రీవుడు వానరు లందరిని రప్పించి, సీతాదేవిని అన్వేషించుటకై అన్ని దిక్కులకు పంపెను.

తతో గృధ్రస్య వచనాత్సమ్పాతేర్హనుమాన్బలీ ।
శతయోజనవిస్తీర్ణం పుప్లువే లవణార్ణవమ్ ॥ 72॥

మహా బలశాలి యగు హనుమంతుడు సంపాతి యనెడు గ్రద్దచెప్పిన ప్రకారము నూరు యోజనముల వెడల్పు గల లవనసముద్రమును దాటెను.

తత్ర లఙ్కాం సమాసాద్య పురీం రావణపాలితామ్ ।
దదర్శ సీతాం ధ్యాయన్తీమశోకవనికాం గతామ్ ॥ 73॥

హనుమంతుడు రావణుడు పాలించుచున్న లంకాపురము చేరి, అచట అశోకవనములో రామునే ధ్యానించుచు ఉన్న సీతాదేవిని చూచెను.

నివేదయిత్వాఽభిజ్ఞానం ప్రవృత్తిం వినివేద్య చ ।
సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణమ్ ॥ 74॥

హనుమంతుడు, తన చేతికి రాముడిచ్చిన అంగుళీయకమును సీతాదేవికి గుర్తుగా ఇచ్చి, సుగ్రీవునితో రామునకు మైత్రి కలుగుట మొదలగు వృత్తాంతమును విన్నవించి, ఆమెను ఊరడించి, అశోకవనబహిర్ద్వారమును చూర్ణంచేసెను.

పఞ్చ సేనాగ్రగాన్ హత్వా సప్త మన్త్రిసుతానపి ।
శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ ॥ 75॥

హనుంతుడు సేనాపతుల నైదుగురిని, మంత్రిపుత్రులను ఏడుగురిని చంపి, శూరుడైన అక్షకుమారుని వధించి, ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు కట్టువడెను.

అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ ।
మర్షయన్రాక్షసాన్వీరో యన్త్రిణస్తాన్యదృచ్ఛయా ॥ 76॥
తతో దగ్ధ్వా పురీం లఙ్కామృతే సీతాం చ మైథిలీమ్ ।
రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్మహాకపిః ॥ 77॥

పరాక్రమశాలియగు హనుమంతుడు, పూర్వము బ్రహ్మదేవుడు తన కిచ్చిన వరముల ప్రభావములవలన, తనను బ్రహ్మాస్త్రబంధము వదిలిపోయినట్లు తెలిసినను, తనను త్రాళ్లచే కట్టి ఈడ్చుకొనిపోవుచున్న రాక్షసులను వధించుటకు సమర్థుడైనను, రావణుని చూడ గోరి, ఆ రాక్షసుల బాధలను సహించెను. రావణునితో మాటలాడిన పిమ్మట సీతాదేవి నివసించు ప్రదేశము తప్ప లంకాపురి నంతయు కాల్చి, రామునకీ సంతోషవార్త చెప్పటకై మరల రాముని సమీపమునకు వెళ్లెను.

సోఽభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణమ్ |
న్యవేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్త్వతః ॥ 78॥

అతిబుద్ధిశాలి యగు హనుమంతుడు, సీతావియోగము కలిగినను ఎంతమాత్రము ధైర్యము తగ్గని రాముని వద్దకు వెళ్ళి, అతనికి ప్రదక్షిణనమస్కారము చేసి “చూచితిని సీతను” అని యథార్థముగా విన్నవించెను.

తతః సుగ్రీవసహితో గత్వా తీరం మహోదధేః ।
సముద్రం క్షోభయామాస శరైరాదిత్యసన్నిభైః ॥ 79॥

సుగ్రీవుడుతో కలసి రాముడు సముద్రతీరము చేరి, సముద్రుడు తనకు వశము కానందుకు కోపించి, సూర్యునివలె తీక్ష్ణములైన బాణములచే సముద్రుని క్షోభింపచేసెను.

దర్శయామాస చాత్మానం సముద్రః సరితాం పతిః ।
సముద్రవచనాచ్చైవ నలం సేతుమకారయత్ ॥ 80॥

నదులకు పతియైన సముద్రుడు రాముని కోపమునకు భయపడి నిజరూపముతో కనబడి చెప్పగా, అతని మాటలప్రకారము రాముడు నీలునిచే సేతువు కట్టించెను.

గమనిక: ఈ తాత్పర్యములు ఆర్షవిజ్ఞానట్రస్టువారి మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెలశ్రీరామచంద్రుడు గారిచే రచించబడిన శ్రీ మద్రామాయణము-బాలకాండము గ్రన్థమునుండి కృతజ్ఞతా పురస్కరముగా తీసుకొనబడినవి.

ValmikiRamayana SamkshepaRamayanam(71-80)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s