సంక్షేపరామాయణమ్
తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి ॥ 61॥
రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ ।
“నీకును వాలికిని విరోధమెట్లు ఏర్పడినది?” అని రాముడు ప్రశ్నింపగా, సుగ్రీవుడు దుఃఖించుచు, స్నేహముతో రామునకు ఆ వృత్తంతము అంతయు తెలిపెను.
ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి ॥ 62॥
వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః ।
వాలిని చంపెద అని రాముడు ప్రతిజ్ఞ చేసెను. సుగ్రీవుడు కూడా రామునకు వాలి యొక్క బలవిశేషములను గూర్చి చెప్పెను.
సుగ్రీవః శఙ్కితశ్చాసీన్నిత్యం వీర్యేణ రాఘవే ॥ 63॥
రాఘవప్రత్యయార్థం తు దున్దుభేః కాయముత్తమమ్ । దర్శయామాస సుగ్రీవో మహాపర్వతసన్నిభమ్ ॥ 64॥
సుగ్రీవుడు రాముని చూచినది మొదలు “ఇతడు వాలిని చంప సమర్థుడో కాడో ” అని సందేహిమ్చుచుందెను. అతడు రామునివిషయమున తనకు నమ్మకము కలుగుటకై, కొండవలె నున్న, దుందుభి యను రాక్షసుని కళేబరము రామునకు చూపెను. (పూర్వ మొకప్పుడు దానిని వాలి చాలదూరముగ విసరి వేసెను.)
ఉత్స్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్థి మహాబలః । పాదాఙ్గుష్ఠేన చిక్షేప సమ్పూర్ణం దశయోజనమ్ ॥ 65॥
ఊహింపరాని బలము కలవాడును, ఆ బలమునకు తగి నట్లు కార్యము చేయు సమర్థము లైన బాహువులు కలవాడును అగు రాముడు అస్థిమయమైన ఆ దుందుభికళేబరమును చూచి,”ఇది ఎంత?” అని నవ్వి, కొంచె మైనను తక్కువ లేకుండా పది యోజనముల దూరములో పడునట్లు, దానిని తన పాదాంగుష్ఠముతో ఎత్తి విసరెను.
బిభేద చ పునస్తాలాన్ సప్తైకేన మహేషుణా । గిరిం రసాతలం చైవ జనయన్ప్రత్యయం తదా ॥ 66॥
అప్పుడా రాముడు, సుగ్రీవున కింకను నమ్మకము కలుగునటకై ఒక్క బాణముచే ఏడు మద్దిచెట్లను, పర్వతమును, పాతాళమును భేదించెను.
తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః స మహాకపిః కిష్కిన్ధాం రామసహితో జగామ చ గుహాం తదా ॥ 67॥
రాముడు ఆ సప్తసాలాది భేదనము చేసిన పిమ్మట సురీవునకు నమ్మిక కుదిరెను. తనకు రాజ్యము లభించునని అతడు సంతసించి, రాముని వెంటబెట్టుకొని గుహ వలె నున్న క్ష్కింధా పట్టణమునకు వెళ్లెను.
తతోఽగర్జద్ధరివరః సుగ్రీవో హేమపిఙ్గలః । తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః ॥ 68॥
కిష్కింధ ప్రవేశించి, బంగారువంటి వన్నె గల వానర శేష్ఠుడైన సుగ్రీవుడు గర్జించెను. ఆ మహానాదము విని వాలి గృహమునుండి బైటకు వచ్చెను.
అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః । నిజఘాన చ తత్రైవ శరేణైకేన రాఘవః ॥ 69॥
వాలి, యుద్ధమునకు వెళ్లవద్దని నివారించుచున్న తారను ఒప్పించి, సుగ్రీవునుతో యుద్ధమునకు తలపడె. అచట రాముడు ఒక్క బాణముతో వాలిని చంపెను.
తతః సుగ్రీవవచనాద్ధత్వా వాలినమాహవే । సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్ ॥ 70॥
రాముడు సుగ్రీవుని ప్రార్థనప్రకారము వాలిని సంహరించి, అతని రాజ్యమునందు సుగ్రీవునే పట్టాభిషిక్తుని చేసెను.
గమనిక: ఈ తాత్పర్యములు ఆర్షవిజ్ఞానట్రస్టువారి మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెలశ్రీరామచంద్రుడు గారిచే రచించబడిన శ్రీ మద్రామాయణము-బాలకాండము గ్రన్థమునుండి కృతజ్ఞతా పురస్కరముగా తీసుకొనబడినవి.
ValmikiRamayana SamkshepaRamayanam(61-70)