వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(41-50)

సంక్షేపరామాయణమ్

ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవలోచనః ।
విరాధం రాక్షసం హత్వా శరభఙ్గం దదర్శ హ ॥ 41॥
సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్యభ్రాతరం తథా ।

పద్మములవంటి నేత్రములు గల రాముడు, దండకారణ్యమును ప్రవేశించిన వెనువెంటనే విరాధుడను రాక్షసుని చంపి, శరభంగ – సుతీక్ష్ణ – అగస్త్యమహర్షులను, అగస్త్యుని సోదరుని చూచెను.

అగస్త్యవచనాచ్చైవ జగ్రాహైన్ద్రం శరాసనమ్ ॥ 42॥
ఖడ్గం చ పరమప్రీతస్తూణీ చాక్షయసాయకౌ ।

అగస్త్యుడు తన కింద్రు డిచ్చిన ధనుస్సును, కత్తిని, తరగని బాణములు గల అమ్ములపొదులను తీసికొనుమని రామున కీయగా అతడు తనకు తగిన ఆయుధములు దొరకినందులకు చాల సంతసించి, వానిని గ్రహించెను.

వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ ॥ 43॥
ఋషయోఽభ్యాగమన్సర్వే వధాయాసురరక్షసామ్ ।

రాముడు శరభంగమహర్షి తపోవనములో వాసము చేయుచుండగా ఆ చుట్టు ప్రక్కల నున్న ఋషులందరును, ” అసురులను, రాక్షసులను సంహరింపుము” అని ప్రార్థించుటకై రామునివద్దకు వచ్చిరి.

స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తదా వనే ॥ 44॥
ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతి రక్షసామ్ ।
ఋషీణామగ్నికల్పానాం దణ్డకారణ్యవాసినామ్ ॥ 45॥

రాక్షసనివాస మైన ఆ వనములో ఆ ఋషులు చేసిన ప్రార్థనను రాముడు అంగీకరించెను. “యుద్ధములో రాక్షసులను సంహరించెదను” అని అగ్నితుల్యతేజస్కు లగు ఆ దండకారణ్యవాసిమునులకు మాట ఇచ్చెను.

తేన తత్రైవ వసతా జనస్థాననివాసినీ ।
విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణీ ॥ 46॥

రాము డా దండకారణ్యములోనే నివసించుచు, ఆ దండకారణ్యమునందు, రావణుని సేనానివేషస్తాన మగు జనస్థానమునందు వాసము చేయు, కామరూపిణి యగు శూర్పణఖ యను రక్కసిని ముక్కుచెవులు కోసి విరూపిణిగా చేసెను.

తతః శూర్పణఖావాక్యాదుద్యుక్తాన్సర్వరాక్షసాన్ ।
ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసమ్ ॥ 47॥
నిజఘాన రణే రామస్తేషాం చైవ పదానుగాన్ ।

శూర్పణఖ విరూపిత యైన పిమ్మట ఆ శూర్పణఖ మాట విని యుద్ధమునకు వచ్చిన ఖరుని, త్రిశిరసుని, దూషణుని, వారి అనుచరులైన సకల రాక్షసులను రాముడు యుద్ధమునందు సంహరించెను.

వనే తస్మిన్నివసతా జనస్థాననివాసినామ్ ॥ 48॥
రక్షసాం నిహతాన్యాసన్సహస్రాణి చతుర్దశ ।

దండకారణ్యమునందు నివసించు నపుడు రాముడు జనస్థానములో నివసించు రాక్షసులలో పదునాలుగు వేలమందిని సంహరించెను.

తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః ॥ 49॥
సహాయం వరయామాస మారీచం నామ రాక్షసమ్ ।

పిమ్మట రావణుడు జ్ఞాతుల మరణవార్త విని, మిక్కిలి కోపించినవాడై, తనకు సాహాయ్యముచేయు మని మారీచు డను రాక్షసుని కోరెను.

వార్యమాణః సుబహుశో మారీచేన స రావణః ॥ 50॥
న విరోధో బలవతా క్షమో రావణ తేన తే ।

ఓ రావణా! మహాబలవంతులైన ఖరుడు మొదలగు పదునాలుగు వేల రాక్షసులను చంపి నట్టి బలవంతుడైన రామునితో వైరము పెట్టుకొనకుము” అని మారీచుడు రావణుని అనేక పర్యాయములు వారించెను.

గమనిక: ఈ తాత్పర్యములు ఆర్షవిజ్ఞానట్రస్టువారి మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెలశ్రీరామచంద్రుడు గారిచే రచించబడిన శ్రీ మద్రామాయణము-బాలకాండము గ్రన్థమునుండి కృతజ్ఞతా పురస్కరముగా తీసుకొనబడినవి.

ValmikiRamayana SamkshepaRamayanam(41-50)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s