సంక్షేపరామాయణమ్
చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తదా ॥ 32॥
రాజా దశరథః స్వర్గం జగామ విలపన్ సుతమ్ ।
రాముడు చిత్రకూటమునకు వెళ్ళిన పిమ్మట దశరథుడు పుత్రశోకముచే పీడితుడై, పుత్రుని గూర్చి ఏడ్చుచు స్వర్గస్థుడయ్యెను.
మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠప్రముఖైర్ద్విజైః ॥ 33॥
నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః ।
దశరథుడు మరణించిన పిదప వసిష్ఠాదులు రాజ్యము చేయు మని భరతుని ఆజ్ఞాపించిరి. అయినను, తనకు రాజ్యము చేయు సామర్థ్యమున్నను, భరతుడు రామునిపై తన కున్న గౌరవముచే, రాజ్యమునకు ఒప్పుకొనలేదు.
స జగామ వనం వీరో రామపాదప్రసాదకః ॥ 34॥
రాగద్వేషాదులు జయించి ఆ భరతుడు రాముని అనుగ్రహింప చేసికొనుటకై అరణ్యమునకు వెళ్లెను.
గత్వా తు స మహాత్మానం రామం సత్యపరాక్రమమ్ ।అయాచద్భ్రాతరం రామమార్యభావపురస్కృతః ॥ 35॥
భరతుడు వినయముతో సుమహాత్ముడును, సత్యవ్రతుడును, తన సోదరుడును అగు, రాముని చేరి ప్రార్థించెను.
త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోఽబ్రవీత్ ।
“నీవు సమస్తధర్మములను తెలిసినవాడవు. అన్నగా రుండగా తమ్ముడు రాజ్యము చేయరాదు అను ధర్మము నీకు తెలియనిది కాదు. అందుచేత నీవే రాజు కావలెను”అని భరతుడు రామునితో చెప్పెను.
రామోఽపి పరమోదారః సుముఖః సుమహాయశాః ॥ 36॥
న చైచ్ఛత్పితురాదేశాద్రాజ్యం రామో మహాబలః ।
రాముడు అందరికిని సంతోషమునే కలిగించును. తనను ఆశ్రయించిన వారికి సాయుజ్యము మొదలైన సకలాభీష్టములను ఇచ్చును. ఎవరైన యాచించినంతమాత్రముననే”యాచకుల మనోరథములను తీర్చు భగ్యము నా కబ్బినది కదా” అని సంతోషించును. :న హ్యర్థినః కార్యవశాదుపేతాః కకుత్థ్సవంశే విముఖాః ప్రయాంతి” (ఏదైన కార్యమును కోరి కకుత్థ్సవంశము వారి వద్దకు వచ్చిన యాచకులు ఎన్నడును నిరాశులై వెళ్ళరు) అని విష్ణుపురాణములో చెప్పి నట్లు ప్రసిద్ధమైన దానజనిత కీర్తికలవాడు. ఆశ్రయించిన వారి అభీష్టములను నెరవేర్చుటకు సమర్థుడు. ఇంతటి మృదుస్వబావు డైనను రాముడు, తండ్రి యాజ్ఞను అనుసరించవలెనను దీక్షచే , భరతుడు ఎంత ప్రార్థించినను రాజ్యమును స్వీకరించుటకు అంగీకరించలేదు.
పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్త్వా పునః పునః ॥ 37॥
నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః ।
“నేను వచ్చునంతవరుకును నా పాదుకలను నా ప్రతినిధిగా రాజ్యము చేయుటకై ఉంచుకొనుము” అని చెప్పి తన పాదుకలను భరతునకిచ్చి, రాముడు అతనికి అనేకవిధముల బోధించి అయోధ్యకు పంపెను.
స కామమనవాప్యైవ రామపాదావుపస్పృశన్ ॥ 38॥
నన్దిగ్రామేఽకరోద్రాజ్యం రామాగమనకాఙ్క్షయా ।
రాముని తిరిగి తీసుకొనివెళ్లవలె నన్న కోరిక తీరని భరతుడు ఆ రామపాదుకలనే సేవించుచు, రాముడు సుఖముగా తిరిగి రావలెనని మనస్సులో కోరుకొనుచు, అయోధ్యాసమీపమున నున్న నందిగ్రామ మనెడు గ్రామములో నివసించి రాజ్యమును చేసెను.
గతే తు భరతే శ్రీమాన్సత్యసన్ధో జితేన్ద్రియః ॥ 39॥
రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ ।తత్రాగమనమేకాగ్రో దణ్డకాన్ ప్రవివేశ హ ॥40||
భరతుడు వెళ్లగానే రాముడు, అతడు వచ్చుటకు తనకు కలిగిన ప్రతిజ్ఞాభంగభయము పోవుటచే సర్వాతిశయి యగు కాంతి కలవాడై, భరతుడెఅంత నిర్బంధించినను తన ప్రతిజ్ఞనుండి చలింపక, కౌసల్యాభరతాదులు చేసిన ప్రార్థనలు వ్యాజముగా తీసికొని తాను మరల రాజ్యమును అంగీకరించుటకు అవకాశమున్నను, రాజ్యభోగములపై ఎంతమాత్రము చాపలము చూపక, అయోధ్యా పౌరులును భరతాదులును మాటిమాటికి ఆ చిత్రకూటపర్వతమునకు వచ్చుచుందురు అని ఊహించి, పిత్రాజ్ఞాపాలనమునందు సావధానుడై దండకావనమును ప్రవేశించెను.
గమనిక: ఈ తాత్పర్యములు ఆర్షవిజ్ఞానట్రస్టువారి మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెలశ్రీరామచంద్రుడు గారిచే రచించబడిన శ్రీ మద్రామాయణము-బాలకాండము గ్రన్థమునుండి కృతజ్ఞతా పురస్కరముగా తీసుకొనబడినవి.
ValmikiRamayana SamkshepaRamayanam(32-40)