సంక్షేపరామాయణమ్
తస్యాభిషేకసమ్భారాన్ దృష్ట్వా భార్యాఽథ కైకయీ ॥ 21॥
పూర్వం దత్తవరా దేవీ వరమేనమయాచత । వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనమ్ ॥ 22॥
దశరథుని రాణులలో నొకతె యైన కైకయి రామాభిషేకమునకై సేకరించిన సాధనసామగ్రిని చూచి, దశరథుడు పూర్వము తనకు రెండు వరములిచ్చి యుండుటచే, వాటిలో ఒక వరముగా రాముని అరణ్యవాసమునకు పంపవలెననియు, రెండవ వరముగా భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెననియు, దశరథుని కోరెను.
స సత్యవచనాద్రాజా ధర్మపాశేన సంయతః । వివాసయామాస సుతం రామం దశరథః ప్రియమ్ ॥ 23॥
సత్యవాక్యమును పరిపాలించవలె నను కారణముచే, ఆ దశరథుడు, ధర్మపాశముచే బంధింపబడినవాడై, తన ప్రియపుత్రుడైన రాముని వనములకు పంపెను.
స జగామ వనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ । పితుర్వచననిర్దేశాత్కైకేయ్యాః ప్రియకారణాత్ ॥ 24॥
అతిపరాక్రమశాలియైన రాముడు కైకేయికి సంతోషము కలిగించుటకై, తండ్రి మాట మాత్రము చెప్పినంతనే దానిని ఆజ్ఞగా గ్రహించి, తన ప్రతిజ్ఞను నిలుపుకొనుచు అరణ్యమునకు వెళ్ళెను.
తం వ్రజన్తం ప్రియో భ్రాతా లక్ష్మణోఽనుజగామ హ । స్నేహాద్వినయసమ్పన్నః సుమిత్రానన్దవర్ధనః |
భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్రమనుదర్శయన్ ||25||
లక్ష్మణుడు రామునికి చాల ఇష్టమైన తమ్ముడు. అతనియందు సహజమైన ప్రేమకలవాడు. వినయసంపన్నుడు. అతడు తన భ్రాతృ స్నేహమును చూపుచు అరణ్యమునకు పోవుచున్న ఆ రాముని వెంట వెళ్ళెను. ఇట్లు ఉత్తమకార్యము చేయుటచే తల్లి యగు సుమిత్రకు కూడ ఆనందమును వృద్ధిపొందించెను.
రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమా హితా ॥ 26॥
జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా । సర్వలక్షణసమ్పన్నా నారీణాముత్తమా వధూః ॥ 27॥
సీతాప్యనుగతా రామం శశినం రోహిణీ యథా ।
జనకుని వ్చంశమునందు పుట్టి, రామునికి భార్యయై దశరథుని కోడలైన సీత రామునకు చాల ఇష్టురాలు. ప్రాణము వంటిది. ఆమె సర్వదా రామునకు హితమునే చేయుచుండును. రాక్షసులను మోహింపచేయుటకై సృజింపబడిన దేవమాయ వలె లోకోత్తర మైన సౌందర్యము కలది. సాముద్రికశాస్త్రములో చెప్పిన మంచి లక్షణము లన్నియు ఆమెయందు ఉన్నవి. స్త్రీలలో ఉత్తమురాలు. అట్టి సీత కూడ, రోహిణి చంద్రుని అనుసరించినట్లు, ఆ రామచంద్రుని అనుసరించి వెళ్ళెను.
పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ ॥ 28॥
శృఙ్గవేరపురే సూతం గఙ్గాకూలే వ్యసర్జయత్ । గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియమ్ ॥ 29॥
గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా ।
పౌరులును, దశరథుడును చాల దూరమువరకు రాముని వెంబడించిరి. ధర్మాత్ము డైన ఆ రాముడు, గంగా తీరమునందు, శృంగిబేరమనెడి పట్టణములో, బోయల ప్రభువైన గుహుని కలిసికొనెను. సీతాలక్ష్మణ గుహులతో కూడిన ఆ రాముడు తన సారథియైన సూతుని వెనకకు పంపివేసెను.
తే వనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదకాః ॥ 30॥
చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ ।రమ్యమావసథం కృత్వా రమమాణా వనే త్రయః ॥ 31॥
దేవగన్ధర్వసఙ్కాశాస్తత్ర తే న్యవసన్ సుఖమ్ ।
ఆ సీతారామలక్ష్మణులు ఒక వనమునుండి మరొక వనము చేరుచు, గొప్ప గొప్ప నదులను దాటుచు, భరద్వాజమహర్షి ఆదేశము ప్రకారము చిత్రకూటపర్వతమును చేరిరి. అచట పర్ణశాల నిర్మించుకొని దేవగంధర్వుల వలె సుఖముగా నివసించిరి.
గమనిక: ఈ తాత్పర్యములు ఆర్షవిజ్ఞానట్రస్టువారి మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెలశ్రీరామచంద్రుడు గారిచే రచించబడిన శ్రీ మద్రామాయణము-బాలకాండము గ్రన్థమునుండి కృతజ్ఞతా పురస్కరముగా తీసుకొనబడినవి.
ValmikiRamayana SamkshepaRamayanam(21-31)