శివలింగము

పరమాచార్యుల అమృతవాణి : శివలింగము
(జగద్గురుబోధలనుండి)

ఆకాశంలో జాబిల్లి వెన్నెలలను కురిపిస్తున్నాడు. నక్షత్రాలు చీకట్లో మెరసిపోతున్నాయి. దూరంగా నీలంగాఉన్న కొండలు, ఎన్నో యేండ్ల బరువుమోసుకుంటూ వస్తున్నవి. ఇవన్నీ ఎలాగు ఉత్పత్తి అయినవి? ఉహూ తెలియదు! పోనీ ఈ గులాబినిచూడు. ఇది మొన్ననేకదూ పుట్టింది, దీన్నెవరు సృజించారు? ఉహూ మొన్న మొగ్గగాఉండినది. ఈరోజే పూచినది. ఆనందంగా పరిమళాలు వెదజల్లుతూంది. ఒక్కొక్క రేకులో ఎన్నోనాళాలు. చూడటానికి ముచ్చటగా ఉన్నది. కాని దీనిని పుట్టించినవానిని నేనుచూడలేదు.

ఈఊరికి ఒక మృగంవస్తుంది. నాలుగువీథూలూ తిరిగి వెడుతుంది. ఈఊరుగూర్చి దీనికెంత జ్ఞానముందో, ఈ విశ్వాన్ని సృష్టించిన ఆ విశ్వకర్మనుగూర్చిన జ్ఞానమూ మనకు అంతేఉంది.

ఐతే తెలుసుకొని ఏంచెయాలి? అది వేరేవిషయం. మన అరచేతిని చూచుకుంటే అందులో అడ్డదిడ్డంగా ఎన్నో రేఖలున్నవి. ఒకగీత మనంగీయగలము? వీని నన్నిటిని ఇసుమంతైనా గర్వంలేకుండా కల్పించేఆమహాశిల్పి ఎంత, ఎట్టి ఘటకుడై ఉండాలి? మనకండ్లకు కనపడక, ఎవరికీ వెదకడానికి వీలుకానట్టు గూఢంగా గుహలోఉన్నట్లున్నాడు. వేదమున్నూ అదే చెప్పింది.

‘ఋతం పిబంతౌ సుకృతస్య లోకే
గుహా ప్రవిష్టౌ పరమే పరార్ధే-
యో వేద నిహితం గుహాయామ్‌’

ఆయన చేసిన సృష్టిలో భిన్నత్వం కనుపించక ఒకేఒక ఏకత్వం కనిపిస్తూ ఉండడం వలన, ఇంతాచేసే ఆ ఆసామీ ఎవడో ఒకడే అయివుండాలని ఈ దృష్ట ప్రపంచం స్పష్టపరుస్తున్నది. తర్కం ఈలాటిదాన్ని ‘లింగమ్‌’ అని అంటుంది. కనులకు తెలియని దానిని ఊహించడం అనుమానం. (లింగం)

ఆకాశంలో పట పట మని చప్పుడవుతుంది. మబ్బుకమ్మిందని తెలుసుకుంటాం. పొగరాజుతూ ఉంటుంది. అగ్గిపుట్టిందని అంటాం. ఇట్లా ఊహించడం పేరు లింగం. లింగమంటే చిహ్నం. సృష్టికర్తన్నూ లింగమున్నది. ఆయన అగోచరంగా ఉన్నాడు. గోచరించేది అయన సృష్టి. ఈసృష్టే ఆయనకు లింగము.

అగోచరమైన వస్తువును గోచరింపచేసేదే లింగం. చూడబోతే సర్వమూ లింగమే. కాని శాస్త్రం ఈశ్వరుణ్ణి నిర్దేశించే ఒకవస్తువును మాత్రమే లింగమని అన్నది. ‘నీకు సృష్టికర్తను చూడవలెనన్న ఇచ్ఛవుంటే శివాలయానికివెళ్ళి శివలింగం చూడు’ అన్నారు పెద్దలు. అన్నిలింగాలూ శివస్వరూపాన్ని నిర్దేశిస్తున్నప్పటికీ, స్ఫటికలింగంలో ఆయన స్వరూపం స్ఫుటంగా వ్యక్తగమవుతున్నది. స్వతహాగా దానికి రంగులేదు. దానిదాపున మంకెనపూవుపెట్టు; ఎఱ్ఱబారుతుంది. నీలిగోరింటపెట్టు; నీలి అవుతుంది. పచ్చపూవుపెట్టు; పచ్చనవుతుంది.

లింగములలో బ్రహ్మపీఠము, విష్ణుపీఠము, శివపీఠము అని మూడుపీఠాలున్నవి. శ్రీకాళహస్తిక్షేత్రంలోని గర్భగృహమూర్తియందు సాలెపురుగు, పాము, ఏనుగు-మూడు స్వరూపాలు కలసి ఉన్నవని ఐతిహ్యం. అదే క్షేత్రమునకు ఇరువది మైళ్ళ దూరంలో ‘గుడిమల్ల’మను మరొక శివస్ధాన మున్నది. అందలిమూర్తి పరశురామ ప్రతిష్ఠ. లింగము యొక్క అధోభాగం గంధర్వరూపం. మధ్యభాగం పరశురాముడు, శీరం శివస్వరూపం. బ్రహ్మ ఒకప్పుడు శాపవశాత్తు, చిత్రసేనుడనే గంధర్వుడైనాడట. అందుచే లింగపు అధోభాగం గంధర్వరూపం బ్రహ్మను చూచిస్తుంది. ‘మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణుపిరూణ, అగ్రతః శివరూపాయ’- అని, అశ్వత్థవృక్షం గూర్చిన్నీ ఇట్టి వాడుకే ఉన్నది. ఊర్థ్వమూల మథశ్శాఖ మశ్వత్థం ప్రాహుర వ్యయమ్‌’- అన్న గీతావాక్యం ఇతర వృక్షాలవలెకాక సంసార వృక్షానికి మూలం ఊర్థ్వభాగమందున్నూ, శాఖలు అధోభాగమందున్నూ ఉన్నవని చెప్పుతూంది.

లింగమును పూజించవలెనంటే నర్మదనుండి లింగం రావాలి. పంచాయతన పూజకు ఐదుమూర్తులు, ‘ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాధం, మహేశ్వరం,’ ఏకలింగ పూజచేస్తే, నివేదన చండేశ్వరునికి అర్పితమవుతుంది. అందుచేతనే శివాలయాలలో ప్రసాదాలుండవు. గర్భగుడిలోకి బ్రాహ్మలు సైతమూ పోరాదు. అభిషేక జలమునూ, స్వామి నిర్మాల్యమునూ తొక్కవలసివస్తుంది. అయితే ఎవరో ఒకరు లోనికి వెళ్ళకపోతే పూజాదికాలు ఎట్లా జరుగుతవి? దీక్షపొందిన ద్విజులు దీనికై ఏర్పడి ఉన్నారు.

పుస్తకమును కంటికి చాలా దగ్గరగా పెట్టినా కనపడదు. పుస్తకంలోని విషయాలను అప్పుడు గ్రహించలేము. స్వామి దర్శనమునకున్నూ ఇదే అనువర్తిస్తుంది. అతిదూరంగానూకాక అతి దగ్గరగానూకాక స్వామికి ఎదుట నిలుచుని దర్శనం చేయడం ఉత్తమం. ఇండ్లలో శివలింగంపూజ మాత్రం చేయరాదు. పంచాయతన పూజ చేయాలి. దేశంలో ఆయా ప్రదేశాలలో దొరకేశిలలు పంచమూర్తులు. సూర్యమూర్తి తంజావూరు దాపున ఉన్న నదిలో స్ఫటికరూపంగా దొరుకుతుంది. గణనాథుని స్వరూపమయిన ఎర్రరంగు శిలగంగానది కుపనదియగు శోణభద్రలో దొరుకుతుంది. సాలగ్రామం నేపాళంలోని గండకీనదిలో కన్పడుతుంది. అంబిక కాళహస్తిలోని స్వర్ణముఖిలో అగపడుతుంది. బాణలింగం నర్మదలోని ఓంకార కుండంలో లభిస్తున్నది. ఇట్లే పూజలలో విష్ణు పంచాయతన పూజయున్నూ, శక్తిపంచాయతన పూజయున్నూ ఉన్నవి.

వేదాలు ఈశ్వరుని వర్ణిస్తూ ఆయనకు కన్నులు లేవు. కాళ్ళూలేవు, చెవులులేవు. అయినా ఆయన అన్నిటినీ చూడగలడు, అన్నిటినీ చేయగలడు-అని చెప్పినవి. సర్వద్రష్టయైన సర్వేశ్వరునికి కన్నులు లేవంటే ఆయన అమూర్తియని భావము. రూపరహితమైన బాణలింగం ఆయన నిరవయవత్వం సూచిస్తుంది. అది వర్తులాకారంగా ఉన్నందున ఆద్యంతరహితం అని తెలుపుతుంది. స్ఫటికానికి రంగులేదు. కనుక స్ఫటికలింగం నిర్గుణ చిహ్నం. స్ఫటిక లింగాన్ని గులాబి పువ్వుతో అలంకరిస్తే అదియున్నూ ఎరుపు అవుతుంది. అట్లే ఏరూపములో మనం ఈశ్వరుని ధ్యానిస్తామో ఆఆకృతినే ఆయనయున్నూ అనుగ్రహార్థం తాలుస్తాడు. విష్ణువునుగా ధ్యానిస్తే శంఖ చక్ర గదా కౌస్తుభధారియై ఆయన మనకు కన్పడుతాడు. ఆయనకొకరూపమంటూ ప్రత్యేకించి లేదు, ‘లోకంలోని ఉత్కృష్టవస్తువులన్నీ నా రూపాలే.’ ఐశ్వర్యం. అందం, శాంతం, కరుణ, సహిష్ణుత, వాసన, ఇవన్నీ ఒక ఆకృతిపొందితే అది నారూపే. భక్తునికి మేలి వస్తువులలో ప్రీతి ఉంటే ఆ వస్తు స్వరూపంగావనే నేనాతనికి దర్శన మిస్తున్నాను. కాని అంతా మాయే, అని ఆయన నారదున కుపదేశిస్తాడు. అనగా మనభావంకొద్దీ ఆయన ఆకృతి. మనం తలచుకుంటే ఆయన గుణి, లేనిచో నిర్గుణుడు. నిర్గుణ చిహ్నమైన స్ఫటికలింగం శ్రేష్ఠమైన పరమేశ్వర మూర్తులలో ఒకటి. దాని దర్శనం శ్రేయస్కరం. ఆ కారణంచేతనే సన్న్యాసులు స్ఫటికలింగాన్ని పూజించడం.

శివాలయంలోని గర్భగృహ మందలి మూర్తికి మహాలింగమని పేరు. ఒక్కొక్క క్షేత్రంలో మహాలింగం ఒక్కొక్క పేరుతో వ్యవహరింప బడుతూంది. కపాలేశ్వరుడు, వల్మీకనాథుడు అనుపేర్లు మహాలింగాలకు పెట్టినవే. దక్షిణాదిని ‘తిరుమవడమరుదూరు’ అనే క్షేత్రం ఉన్నది. దానికి మధ్యార్జునమని నామాంతరం. ఇందొక విశేషం. తక్కిన క్షేత్రాలవలె కాక, ఇందలి మహాలింగానికి మహాలింగమనే పేరు. ఉత్తరమున కర్నూలుకు సమీపంలో ఉన్న శ్రీశైలక్షేత్రం మల్లికార్జున క్షేత్రం, దక్షిణమున తిరువల్వేలి జిల్లాలో బుడార్జున మున్నది. ఈ రెండింటికినీ మధ్యనున్నది మధ్యార్జునం. ఇందలి మహాలింగానికి నామాంతరం లేదు. మహాలింగమనే పేరు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s