విష్ణు కాంత నోము కథ
ఒక బ్రాహ్మణపడుచు తమ్మునకు పెండ్లి నిశ్చయమైనపు డెపుడును ఆమె భర్తకు జబ్బుచేయుచుండెను. అట్లనేక సమయములందు ఆమె తమ్ముని వివాహ ప్రయత్నమున కాటంకమురాగా ఆమెభర్తకు జబ్బుచేయుటచే బంధువులు విసిగి పెండ్లి ముహూర్తము నిశ్చయించిరి. అప్పుడామె భర్తకు ప్రాణమీదకు వచ్చెను. కానీ ఆమె అది లెక్కచేయకుండ భర్తనింట విడిచి తాను తమ్ముడి పెండ్లి చూచుటకు పుట్టింటికి పోవుచుండెను. దారిలో నొక విష్ణు కాంత చెట్టు పువ్వులు రాలియుండగా ఆమె వాటిని త్రొక్కుకొనుచు పోవుచుండెను. అంతలో విష్ణు కాంతము ’నోము నోచిన పూలను, కాలరాచిపోవుచున్న యువతిని చూడుడు, చెరువులోన చెంగలువలారా! యన్నమటలు విన్నవమ్మా విష్ణుకాంతా! కన్నావమ్మా విష్ణు కాంతా! ప్రియమైనభర్తకు ప్రాణంమీదకు వస్తే చాపనుచుట్టి నట్టింట బెట్టి చిన్న తమ్ముని పెండ్లి చూడ ప్రయాణమైన పడతిని చూస్తిమివింతగావుందో విష్ణు కాంతా’ యన్న మాటలు వినిపించినను, వాటిని లెక్క చేయకుండను, ఆమె ఆగకుండా పెండ్లికి వెళ్ళి తిరిగివచ్చుచు, విష్ణుకాంత దగ్గర ఆగి ముందన్న మాటలకు అర్ధమేమిటని అడిగెను. అప్పుడా వృక్షరాజు ఆమె పూర్వము విష్ణుకాంత నోమునోచి ఉల్లంఘించుటచే తమ్ముని పెండ్లి భర్త అనారోగ్యముగ నుండుట సంభవించెననియు, శుభకార్యములందనారోగ్యములు లేకుండట కానోమును తిరిగినోచి వాయనమియ్యవలెననియు తెలిపెను. ఆమె అట్లేయని నోము నోచుకొని ఏడాది ఐన తర్వాత ఉద్యాపనము చేసుకొని నిత్యకల్యాణము పచ్చతోరణముతో నుండెను.
ఉద్యాపన:
విష్ణు కాంతకు పదమూడు జోడుల నేతి గారెలను నైవేద్యముపెట్టి, ఇంకొక పదమూదు జతల నేతి గారెలను ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో వాయన మియ్యవలెను.
Vishnu Kantha Nomu Katha