మూల గౌరి నోము కథ
ఒక రాచబిడ్డ మూలగౌరి నోము నోచుకుని సకలైశ్వర్యములతో, సామ్రాజ్యమేలు భర్తతో, సద్గుణవంతులగు పుత్రులతో, ముద్దుగొలిపే ముని మనుమలతో అలరారు చుండెను. ఆమె వ్రత మహాత్మ్యమును పరీక్షింపగోరి పార్వతీ పరమేశ్వరు లామె భర్తకు విరోధియగు నొక రాజుహృదయములో ప్రవేశించి, అతనితో యుద్ధమును చేయించిరి. ఆమె భర్తకన్న నతడు అల్పవంతుడై యుండియు దైవబలసమేతుడైయుండ విజయమునంది ఆమె భర్తను బంధుకోటిని చంపెను. యుద్ధములో మరణించిన ఆమె బంధువులను వీరస్వర్గమునకు వెళ్ళుటకు యమభటులు వచ్చిరి. అది గాంచిన యా రాణి మహా ధైర్యముతో యుద్ధభూమియందు నిలిచి యమదూతలతో –
శ్లో|| దొడ్డవారగు యమదూతలారా! తొలగిపొండి
పతిసౌఖ్యము నిలుపుకొనుటకు పసుపు వాయన మిచ్చేను
భాగ్యాలు నిలుపుకొనుటకు బంగారము వాయన మిచ్చేను
ఇల్లు వాకిళ్ళు నిలుపుకొనుటకు తెల్ల చీర వాయన మిచ్చేను
తోటల కొఱకు బాటల కొఱకు తోపు చీర వాయన మిచ్చేను
బిడ్డల సంతతి కోరుచు బీరకాయలు వాయన మిచ్చేను
కడుపు చలువ కొఱకు కండ చక్కెర వాయన మిచ్చేను
చిన్న మనుమలు సుఖాల కొఱకు చెఱుకు గడలు వాయన మిచ్చేను
పసిపాపల ఓలలాడవలెనని పసినిమ్మపళ్ళు వాయన మిచ్చేను
అల్లుళృ సంతోష మందవలెనని అరిసెలు వాయన మిచ్చేను
కూతుళ్ళు సిరిసంపదలు కోరి కుడుములు వాయన మిచ్చేను
బంధువుల బాగును గోరి బంతి పూలు వాయన మిచ్చేను
పొరుగువారి బాగునెంచి పొగడపూలు వాయన మిచ్చేను
ప్రజలంతా పెంపొందుటకై వజ్రాలు వాయన మిచ్చేను
రాజ్యమంతా సుభిక్షమగుటకై రత్నాలు వాయన మిచ్చేను
పాడిపంటల అభివృద్ధికై పాయసము వాయన మిచ్చేను
శాంతి దేశంలో నిలుచుటకై చల్ల పునుకులు వాయన మిచ్చేను
అందరిలో నాధిక్యతకై అద్దాలు వాయన మిచ్చేను
పేరు ప్రతిష్టతలు పెంపు నందగా గారెలు వాయన మిచ్చేను
పుణ్యలోకము పొందుటకై బూరెలు వాయన మిచ్చేను
స్వర్గ లోకమందుటకై స్వర్ణ రాశిని వాయన మిచ్చేను
ప్రాణ భయములు లేకుండటకై పాయసము వాయన మిచ్చేను
కోరికలన్నీ తీర్చుటకై కొబ్బరికాయలు వాయన మిచ్చేను
అకాల మరణములు లేకుండుటకై అరటి పండ్లు వాయన మిచ్చేను
పట్ట లేరు మీరెవ్వరును నాభర్త ప్రాణాలు
దొడ్డవారగు యమదూతలారా! తొలగిపొండి
అని యనుసరికి వారామె పాతివ్రత్యమహిమముందు నిలువలేక యుద్ధములో మరణించిన వారి ప్రాణములను వదలిపోయిరి. అంతట పార్వతీ పరమేశ్వరులు ఆమె ప్రభావమునకు సంతోషించి, ఆమె బంధువులందరినీ యుద్ధములో చచ్చినవారిని బ్రతికించి, ప్రత్యక్షమై కావలసిన వరములు ఆమె కొసగి వెళ్ళిపోయిరి.
ఉద్యాపన:
కథలో చెప్పిన యిరువది ఐదు వస్తువులను పుణ్యస్త్రీలకు వీలైనపుడు వాయన మియ్యవలెను. ఐదుగురు ముత్తైదువులను పిలిచి పసుపు రాసి, బొట్టు పెట్టి దక్షిణ తాంబూలాలతో ఒక్కొక్క ముత్తైదువునకు అయిదేసి వస్తువులను వాయన మియ్యవలెను.
Mula Gauri Nomu Katha