మాఘగౌరి నోము కథ
ఒక బ్రాహ్మణునకు లేక లేక ఒక పుత్రికపుట్టెను. ఆమెకు యుక్తవయస్సు వచ్చినంతనె వివాహము చేసెను. కాని ఆమె పెండ్లియయిన ఐదవనాడు విధవ అయ్యెను. ఆమె దుఃఖమును చూడలేక తల్లితండ్రులు పుణ్యక్షేత్రములు దర్శించుటకు తీసుకొని వెళ్ళుచుండిరి. ఇంతలో ఒక చెరువు దగ్గర ముత్తైదువులిద్దరు ఒక చోటును, విధవలందరూ ఇంకొక చోటును అయిదేసి పద్మములను పెట్టుకొని పూజ చేయుచుండిరి. అదిచూచి ఆ బ్రాహ్మణదంపతులు అది యేమని అక్కడవారిని అడిగిరి. పుణ్యస్త్రీలలో వృద్ధురాలి రూపంలో నున్న పార్వతీదేవి వారిని తనతో తీసుకువచ్చి, వారి కుమార్తెను స్నానం చేయించెను. చెరువులోని ఇసుకను దోసెడు తీసి గట్టు మీద వేయమని విధవ బాలికతో ననెను. ఆమె అట్లు చేయగా, నది పసుపయ్యెను. రెండవ సారికూడా నట్లే చేయగా, నది కుంకుమయ్యెను. మూడవపర్యాయము అటుల చేయగా నది కొబ్బరి యయ్యెను. నాల్గవమారు చేయగా నది బెల్లమయ్యెను. ఐదవ దఫా చేయగా నది జీలకర్రయయ్యెను. తరువాత నామె ఆ బాలవితంతువును మాఘగౌరి నోము నోచుకొనమని అది నోచు పద్ధతిని చెప్పి వెడలిపోయెను. పిమ్మట తల్లితండ్రులామెతో మొదటి సంవత్సరము శేరుంబావు పసుపును, రెండవ యేట శేరుంబావు కుంకుమను, మూడవసంవత్సరము శేరుంబావు కొబ్బరిని, నాల్గవయేట శేరుంబావు బెల్లపు గుండను, అయిదవ యేట శేరుంబావు జీలకర్రను ముత్తైదువులకు వాయన మిప్పించి ముత్తైదువునకు తల్లంటి నీళ్ళు పోయించి ,భోజనము పెట్టించిరి. అయిదేళ్ళూ చేసిన తరువాత ఉద్యాపనము చేయగా నామె భర్త బ్రతికి వచ్చెను.
ఉద్యాపన:
ఈ నోము మాఘమాసములో అమావాస్య వెళ్ళిన పాడ్యమి మొదలు ముప్పది దినములు చేయవలెను. ప్రతిదినము స్నానముచేసి నీలాటి రేపులో పసుపు గౌరిని పెట్టుకొని, పసుపుతో ఐదు పద్మాలు, కుంకుమతో ఐదు పద్మాలు, పిండితో ఐదు పద్మాలు పెట్టుకొని పూజ చేయవలెను. ఈ విధముగా ఐదేండ్లు చేసిన తరువాత పసుపు గౌరిని నీటిలొ విడిచి ఐదుగురు ముత్తైదువులకు పైన చెప్పిన విధముగా వాయన మిచ్చి భోజనములు పెట్టవలెను.
Magha Gauri Nomu Katha