తిరుప్పావై –17 వ పాశురము
శ్రీ భాష్యం అప్పలాచార్యుల ఆంధ్ర అనువాదముతో
పాశురము
అమ్బరమే , తణ్ణీరే శోఱే అఱమ్ శెయ్యుమ్
ఎమ్బెరుమాన్ ! నన్దగోపాలా! ఎళున్దిరాయ్,
కొమ్బనార్కెల్లామ్ కొళున్దే ! కులవిళక్కే
ఎమ్బెరుమాట్టి! యశోదాయ్! అఱివురాయ్!
అమ్బర మూడఱుతోఙ్గి యులగళన్ద
ఉమ్బర్ కోమానే ! ఉఱఙ్గాదెళున్దిరాయ్
శెమ్ పొర్కళ లడిచ్చెల్వా ! బలదేవా !
ఉమ్బియుమ్ నీయు ముఱఙ్గేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:
వస్త్రములు కావలసిన వారికి వస్త్రములు, మంచినీరు కావలసిన వారికి మంచినీరు, అన్నము కావలసినవారికి అన్నము, ఫలాభిసంధి లేక ధర్మబుద్ధితో దానము చేయు నందగోపాలా! మా స్వామీ! మేల్కొనుము. ప్రబ్బలి చెట్లవలె సుకుమారములగు శరీరములు గల స్త్రీలలో చిగురువంటిదానా ! మావంశమునకు మంగళదీపము వంటి దానా! మా స్వామినీ! యశోదా! మేల్కొనుము. ఆకాశమధ్య భాగమును చీల్చుకొని పెరిగి లోకముల నన్నిటిని కొలిచిన త్రివిక్రమా! నిత్యసూరులకు నాయకుడా! నిరింపరాదు. మేల్కొనుము. స్వచ్చమైన ఎఱ్ఱని బమ్గారముతో చేయబడిన కడియము కాలిన దాల్చిన బలరామా! నీవును, నీ తమ్ముడును మేల్కొనవలెను.
అని గోపికలు ప్రార్థించిరి.
Tiruppavu (Tiruppavai) – with Sri Bhashyam Apaalacharya’s telugu translation.