తిరుప్పావై –16 వ పాశురము
శ్రీ భాష్యం అప్పలాచార్యుల ఆంధ్ర అనువాదముతో
పాశురము :-
నాయగనాయ్ నిన్ర నన్దగోపనుడైయ
కోయిల్ కాప్పానే ! కొడిత్తోన్రుమ్ తోరణ
వాశల్ కాప్పానే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
ఆయర్ శిరుమియరోముక్కు అరై పరై
మాయన్ మణివణ్ణన్ నెన్నెలేవాయ్ నేర్ న్దాన్
తోయోమాయ్ వన్దోమ్ తుయిలెళప్పాడువాన్
వాయాల్ మున్నమున్నమ్ మాత్తాదే అమ్మా! నీ
నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.
తాత్పర్యము:-
అందరకును నాయకుడై యున్న నందగోపుని భవనమును కాపాడు భవనపాలకా! లోనికి విడువుము. జెండాతో ఒప్పుచున్న తోరణములతో శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలకా! మణులచే సుందరమైన తలుపుల గడియను తెరవుము. గోపబాలికలమగు మాకు మాయావియు, మణివర్ణుడును అగు శ్రీకృష్ణపరమాత్మ ధ్వనిచేయు పఱ యను వాద్యమును ఇచ్చెదనని నిన్ననే మాట యిచ్చెను. మేము వేరొక ప్రయోజనమును కాంక్షించి వచ్చినవారము కాము. పరిశుద్ధభావముతో వచ్చితిమి. శ్రీకృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయ వచ్చితిమి. స్వామీ! ముందుగనే నీవు కాదనకుము. దగ్గరగా ప్రేమతో ఒకదాని నొకటి చేరి బిగువుతో నిలిచియున్న తలుపులను నీవే తెరచి మమ్ములను లోనికి పోనీయవలెను అని గోపికలు భవనపాలకుని, ద్వారపాలకుని అర్థించిరి.
Tiruppavu (Tiruppavai) – with Sri Bhashyam Apaalacharya’s telugu translation.