సౌందర్యలహరి 10 : అద్వైతరసానుభూతి : పరమాచార్యుల వ్యాఖ్య
సుధాధారా సారైః చరణ యుగళాంతర్విగళితైః
ప్రపంచం సించంతీ పునరపి రసామ్నాయ మహసః
అవాప్య స్వాం భూమిం భుజగనిభ మధ్యుష్ఠవలయం
స్వమాత్మానం కృత్వా స్వపిషి కుల కుండే కుహరిణి || 10 ||
సారాంశం: అమ్మా! నీ పాదద్వయం నుండి జాలువారిన అమృతధారలచే లోకమును తడుపుతావు. అమృతరూపమగు చంద్రుని వలన నీ స్వస్థానము చేరుటకు పాము వలెనున్న నీ నిజరూపముని పొంది సూక్ష్మరంధ్రము గల సుషుమ్నా ద్వారమున ఉన్న మూలాధారమందు సర్వదా నిద్రించెదవు.
తరువాతి శ్లోకంలో (10) అద్వైతరసానుభూతి అమృత రసానుభూతిగా మారే విషయం చెప్పబడినది. అద్వైతసిద్ధి రసం, దాన్ని అనుగ్రహించే అమ్మవారు, దానిని అందుకునే జీవుడు – నిజానికి ఈ మూడింటి మధ్యా భేదంలేదు. లాంఛనప్రాయంగా దీనిని ‘రసానుభవము’ అని వ్యవహరిస్తారుగానీ నిజానికి ఇది వర్ణనాతీతము. కానీ ఆ అనుభవానికి ముందూ, అనుభవం తరువాతా ఆ అనుభవానికి అతి దగ్గరగా ఉండే ఒక స్థితి ఉంటుంది. ఆ స్థితిలో ఒక త్రిపుటి – రసము, దానిని ప్రసాదించేది, దానిని అనుభవించేది అనే త్రిపుటి – ఉంటుంది. నేను పద్మములగురించి చెప్పాను. అవి చెరువులో పెరిగే తామరలవంటివి కావు. మన చెరువులలోని పద్మాలు సూర్యకాంతిలో వికసిస్తాయి. చంద్రుని వెన్నెలలో ముకుళిస్తాయి. అగ్గియొక్క వెచ్చదనం వాటిని కమిలిపోయేలా చేస్తుంది. కానీ ఈ కుండలినీ పద్మాలు కాండములలో – అగ్నికాండము, సూర్యకాండము, చంద్ర కాండము ఈ కాండములలో – వికసిస్తాయి. చివరకి శిరస్సులోని పూర్ణచంద్రుడు సహస్రారకమలాన్ని వికసింపజేస్తాడు. అందునుండి అమృతము వెన్నెలవలె ప్రవహిస్తుంది. దాన్నే రసము అంటారు, దానిని అమ్మవారు అనుగ్రహిస్తారు.
చంద్రుని మోముపై అమ్మవారి పాదాలు మన సద్గురువుని పాదములరూపంలో దర్శనమిస్తాయి. నిజానికి ఇక్కడినుండే అమృతం ప్రవహిస్తుంది, కానీ చంద్రునినుండి ప్రవహిస్తున్నట్లు అగుపిస్తుంది. అమృతం గురించి తెలిసేది, అనుభవించేది జీవుడు. కానీ అమ్మవారే రసమూ, రసానుభూతిపొందేదీ కూడా అనే అద్వైతభావన ఉంటుంది.
Soundaryalahari 10 : Rasanubhavamu : Paramacharya Vyakhya