సౌందర్యలహరి 8 : నిజమైన పూజ: పరమాచార్యుల వ్యాఖ్య

సౌందర్యలహరి 8 : నిజమైన పూజ : పరమాచార్యుల వ్యాఖ్య

(గతసంచికలకోసం పోస్టు చివరలో చూడండి)

సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే
మణిద్వీపే నీపోపవనవటి చింతామణిగృహే|
శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయాం
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ || 8 ||

అచార్యులు అంటున్నారు – అలాంటి ఇంటిలో ఉన్న చిదానందలహరీ ప్రవాహమైన నిన్ను ఎవరో కొంతమంది ధన్యులు పూజిస్తున్నారు.  “ భజంతే త్వాం ధన్యాః కతిచన“ ఈ వాక్యం అన్వయక్రమంలో “ కతిచన ధన్యాః త్వాం భజంతే” అవుతుంది.  దీని అర్థం – ఎవరో కొంతమంది ధన్యులు నిన్ను పూజిస్తున్నారు – అని. 

“కొంతమంది” ఎందుకు ? అమ్మవారి పూజ చాలామందే చేస్తున్నారు కదా. రోజురోజుకీ వీరి సంఖ్య పెరుగుతోంది కూడా. కానీ ఏవో కొన్ని పదాలు గొణగటం, కర్పూరం వెలిగించటం అనేది నిజమైన పూజ అవుతుందా ? 

మరి నిజమైన పూజ ఏది ? 

అమ్మవారి స్వరూపాన్ని నేను గతశ్లోకంలో వర్ణించానుకదా. ఆ స్వరూపాన్ని మనం భావనచేయాలి , మన హృదయంలో ముద్రించుకోవాలి. మనం కూడా ఇప్పడిదాకా వర్ణింపబడిన అమ్మవారి ఇంటిలో నివసిస్తున్నామని భావించుకోవాలి. అమ్మవారి అనుగ్రహమే చుట్టూ ఉన్న కల్పవృక్షాల అరణ్యమూ, సుధాసముద్రమూ  అని భావించాలి. అమ్మ అనుగ్రహము వలన మన భూమి రత్నగర్భగా మారిందని భావించాలి. మన పూజా గృహము చింతామణులతో నిర్మించబడినదనీ, మన కోరికలను తీరిస్తుందనీ భావించాలి. దీనిని సాలోక్య మోక్షము అంటారు. సాధారణంగా మన ఇష్టదైవము యొక్క లోకానికి వెళ్ళటమే సాలోక్య మోక్షము అంటారు. కానీ, మనం నివసించే చోటే – అది ఏదైనా సరే – మన ఇష్టదైవము యొక్క లోకము అని భావన చేయటమే ఉత్తమము అని నాకు అనిపిస్తోంది. 

సాలోక్యం తరువాత సామీప్యం. (అంటే ఇష్టదైవమునకు దగ్గరగా వెళ్ళటం). సుధాసముద్రపుతీరం నుండీ, అరణ్యాలూ, వనాలూ దాటుతూ,  అమ్మవారి భవనంలోని శయ్యదగ్గరకు వెళ్ళటం సామీప్యం

సాలోక్యానికీ, సామీప్యానికీ తరువాత సారూప్యం.  ఎలాగయితే కీటకము తుమ్మెదపయినే మనస్సు నిలిపి తానూ తుమ్మెదగా మారిపోతుందో, అమ్మవారి స్వరూపాన్ని భావన చేస్తూ, మనమూ ఆ స్వరూపాన్ని పొందుతాము. గతశ్లోకంలో చెప్పబడిన అమ్మవారి స్వరూప వర్ణనలో  మునిగిపోయి, పరమేశ్వరపర్యంకముపై ఉన్న అమ్మవారిని భావనచేసి ధ్యానంచేయాలి. ఇది మన సారూప్యమోక్షానికి దారితీస్తుంది. 

మోక్షములలో అత్యున్నతమైనది సాయుజ్యమోక్షము – మన ఇష్టదైవము తో ఐక్యమయిపోవటం. అంటే, మన ఇష్టదైవము తో కేవలం రూపసారూప్యమే కాకుండా ఆ దైవంతో ఏకమయిపోవటం, అదే సత్యము మనం అయిపోవటం. స్వస్పృహ యొక్క అనంతానందప్రవాహమైన ఆ సత్యాన్నే ఆచార్యులు చిదానందలహరి అంటున్నారు. ఆ లహరిలో మనం లీనమయిపోవాలి. అది సాయుజ్యం. దాని తరువాత ఇంక చేసే పూజలేమీ లేవు.  ఆ స్థితి వచ్చేవరకూ, మనం పూజ చేయవలసిన పరిస్థితిలో ఉన్నంతవరకూ ఆ చిదానందలహరితో  ఏకమయ్యే దృష్టిని పెంపొందిచుకుంటూ ఉండాలి. 

అమ్మవారు లోకానికి చేరటం, ఆమె రూపాన్ని పొందటం, ఆమెలో ఐక్యమయిపోవటం ఇవ్వన్నీ క్రమక్రమంగా జరగనీయండి. ప్రస్తుతం మనం మనలను ఆయా స్థితులకు (సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య ) మానసికంగా సంసిద్ధపరుచుకోవాలి. మనం పూజకు కూర్చున్నప్పుడు మన మనస్సు పూర్తిగా ఆమెపై లగ్నం కావాలి. “ఆఫీసుకి లేటు అయిపోయిందా ?, క్యాంటీను లో ఏ రకం వడ చేస్తారో ?” ఇలాంటి ఆలోచనలు మనస్సును ప్రక్కత్రోవ తొక్కించకూడదు. మనస్సు సుధాసముద్రతరంగాలలో మునిగిపోయి చివరకు చిదానందసముద్రపు ఉప్పెన అయిన అమ్మవారిలో కలిసిపోవాలి. 

మనం ఈ పద్ధతి లో పూజ చేస్తున్నామా ? బహుశా మనలో కొంతమంది చేస్తారేమో. పూర్వజన్మల సుకృతాల చేత లభించిన పుణ్యం ఉన్నవారు మాత్రమే అమ్మవారి స్వరూపంలో చిదానందరసానుభూతి పొందేంత వ్యగ్రతతో పూజ చేస్తారు. ఆచార్యులు ఈ అతి కొద్దిమంది ధన్యులనే “కతిచన ధన్యాః” అని అన్నారు. 

గత సంచికలు:

సౌందర్యలహరి 8 -ఉపోద్ఘాతం 1 ;

సౌందర్యలహరి 8 – ఉపోద్ఘాతం 2 ;

సౌందర్యలహరి 8 : మణిద్వీప వర్ణన-1

సౌందర్యలహరి 8 : మణిద్వీప వర్ణన-2

సౌందర్యలహరి 8 : మణిద్వీప వర్ణన-3

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s