పోతన భాగవతం : శివుడు దేవప్రార్థితుండై హాలాహలమును పానము సేయుట (ఎనిమిదవ స్కందము )
క. కంటే జగముల దుఖము, వింటే జలజనిత విషము వేడిమి; ప్రభువై
యుంటకు నార్తుల యాపద, గెంటించుట ఫలము; దాన గీర్తి మృగాక్షీ!
ఓ హరిణాక్షీ! లోకాల దుఃఖాన్ని ఆలోకించినావా? నీళ్ళలో పుట్టిన ఈ విషం వేడిమి ఎంతటిదో విన్నావా? శక్తి కలిగిన ప్రభువు కష్టపడుతున్న వారి కష్టాన్ని తొలగించాలి. దానివల్ల కీర్తి చేకూరుతుంది.
క. ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన, ప్రాణుల రక్షింపవలయు బ్రభువుల కెల్లం;
బ్రాణుల కిత్తురు సాధులు, ప్రాణంబులు నిమిష భంగురము లని మగువా!
ఓ మగువా! ప్రాణభయంతో ఆశ్రయించిన ప్రాణులను కాపాడడం ప్రభువుల కర్తవ్యం. ప్రాణాలు నిమిషంలో నశించిపోయేవి. అందువల్లనే ఉత్తములు ప్రాణుల ప్రాణరక్షణకోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయరు.
క. పరహితము సేయు నెవ్వడు, పరమ హితుం డగును భూత పంచకమునకుం
బరహితమె పరమ ధర్మము, పరహితునకు నెదురులేదు పర్వేందుముఖీ!
పంచభూతాలకూ పరమాప్తుడై పరులకు సహాయం చేయడం కోసం ఎవడు సుముఖుడవుతాడో అటువంటి వానికి ఎక్కడా తిరుగులేదు. పరోపకారమే పరమోత్తమధర్మం.
క. హరిమదినానందించిన, హరిణాక్షి! జగంబులెల్ల నానందించున్
హరియును జగములు మెచ్చగ, గరళము వారించు టొప్పుగమలదళాక్షి!
ఓ కమలాక్షి! విష్ణువు మనస్సు ఆనందపడితే అన్ని లోకాలూ ఆనందపడుతాయి. విష్ణువూ, లోకాలూ సంతోషించే విధంగా హాలాహలాన్ని అదుపు చేయడం మంచిది.
క. శిక్షింతు హాలాహలమును, భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్
రక్షింతుబ్రాణి కోట్లను, వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖీ!
ఓ పద్మముఖీ! హాలాహలాన్ని దండిస్తాను. తియ్యతియ్యని పండ్లరసమువలె దీనిని ఆరగిస్తాను. ఈనాడు ప్రాణుల సమూహాన్ని కాపాడుతాను చూడు.
వ. అని పలికిన ప్రాణవల్లభునకు వల్లభ ’దేవా! దేవర చిత్తంబుకొలంది నవధరింతురు గాక!’ యని పలికెనని చెప్పిన యమ్మునీంద్రునకు నరేంద్రుండిట్లనియె.
పై విధంగా పలికిన ప్రాణేశ్వరుడైన మహేశ్వరునితో “స్వామీ! మీ మనస్సుకు తగినట్లు నిశ్చయించుకొండి” అని భవాని పలికింది- అని చెప్పగా శుకునితో పరీక్షిత్తు ఇట్లా అన్నాడు-
మ. అమరన్ లోకహితార్థమంచు నభవుండౌగాక యం చాడెబో
యమరుల్ భీతిని మ్రింగవే యనిరి వో యంభోజ గర్భాదులుం
దముగావన్ హర! లెమ్ము లెమ్మనిరి వో తాజూచి కన్గంట న
య్యుమ ప్రాణేశ్వరు నెట్లు మ్రింగుమనె నయ్యుగ్రానలజ్వాలలన్.
వ. అనిన శుకుండిట్లనియె.
లోకానికి మేలుకలుగుతుందని శివుడు ’సరే’ అన్నాడనుకో! భయంతో కూడిన దేవతలు “స్వామి! మ్రింగండి” అని అన్నారనుకో! బ్రహ్మాదులు “మమ్ము రక్షింపుము. లెమ్ము” అని ప్రార్థించినారనుకో! పార్వతీదేవి కన్నులారా ఆ హాలాహలాన్ని చూస్తూ భయంకరమైన ఆ అగ్ని జ్వాలను మ్ర్ంగుమని ప్రాణకాంతునితో ఎట్లా చెప్పింది. – అని అడిగిన పరీక్షిత్తుతో శుకుడు ఇట్లా అన్నాడు:-
క. మ్రింగెడువాడు విభుండని, మ్రింగెడిదియు గరళ మనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ, మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!
మ్రింగేవాడు తన భర్త అని తెలిసీ, మ్రింగేది విషమని తెలిసీ దానివల్ల ప్రజలకు మేలుకలుగుతుందనే ఉద్దేశంతో సర్వమంగళయైన ఆ పార్వతీదేవి మ్రింగుమని చెప్పింది. ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని ఎంతగా నమ్మిందో!
మ. తనచుట్టున్ సురసంఘముల్ జయజయధ్వానంబులన్ బొబ్బిడన్
ఘన గంభీర రవంబుతో శివుడు లోకద్రోహి! హుం పోకు ర
మ్మని కెంగేలదెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలం
బన సర్వంకషమున్ మహావిషము నాహారించె హేలాగతిన్.
దేవతలు శివుని చుట్టూ చేరి జయ జయ ధ్వానాలు చేసినారు. శివుడు గంభీర కంఠస్వరంతో “ఓహో! లోకద్రోహీ! పోవద్దు. రా! రా!” అంటూ అన్ని చోట్లా వ్యాపించిన మహావిషాన్ని తన చేయి చాచి పట్టుకొని కబళంగా చేసి నేరేడు పండు వలె విలాసంగా భుజించినాడు.
వ. అ య్యవిరళ మహాగరళ దహన పాన సమయంబున.
మ. కదలం బాఱవు పాప పేరు; లొడలన్ ఘర్మాంబుజాలంబు వు
ట్టదు; నేత్రంబులు నెఱ్ఱగావు; నిజజూటా చంద్రుడుం గందడున్;
వదనాంభోజము వాడ; దా విషము నాహ్వానించుచో డాయుచో
బదిలుండై కడి సేయుచోదిగుచుచో భక్షించుచో మ్రింగుచోన్.
పరమేశ్వరుడు ప్రచండమైన ఆ విషాగ్నిని ఆహ్వానించేటప్పుడూ, దానిని సమీపించేటప్పుడూ, పదిలంగా కబళం చేసేటప్పుడూ, నోటిలో ఉంచుకునేటప్పుడూ, తినేటప్పుడూ, మ్రింగేటప్పుడూ ఆయన శరీరం మీద సర్పహారాలు కదలలేదు. చెమటలు గ్రమ్మలేదు. కన్నులు ఎఱ్ఱబడలేదు. సిగలోని చంద్రుడు కందలేదు. వదనపద్మం వాడిపోలేదు.
క. ఉదరము లోకంబులకును, సదనం బగు టెఱిగి శివుడు చటుల విషాగ్నిం
గదురుకొన గంఠబిలమున, బదిలంబుగ నిలిపె సూక్ష్మఫలరసము క్రియన్.
పరమేశ్వరుని ఉదరం సమస్త లోకాలకు సదనం.అందువల్ల ఆయన ఆభయంకర విషాగ్ని లోనికి పోనీయకుండా ఏదో ఫలరసంలాగా జాగ్రత్తగా గొంతులోనే ఉండేటట్లు నిలుకొన్నాడు.
క. మెచ్చిన మచ్చిక కలిగిన, నిచ్చిన నీవచ్చుగాక యిచ్ఛ నొరులకుం
జిచ్చుగడిగొనగ వచ్చునె, చిచ్చఱచూ పచ్చుపడిన శివునకుదక్కన్.
మెచ్చినపుడూ నచ్చినపుడూ ఇతరులకు ఇచ్చవచ్చినంత ఈయవచ్చును. అంతేగానీ ఇతరులకోసం భగ భగ మండే చిచ్చును మ్రింగటం చిచ్చరకన్నుగల శివునకు తప్ప ఎవరికి సాధ్యమౌతుంది?
ఆ. హరుడున్ గళమునందు హాలాహలము వెట్ట, గప్పు గలిగి తొడవు కరణి నొప్పె;
సాధురక్షణంబు సజ్జనులకు నెన్న, భూషణంబు గాదె భూవరేంద్ర!
ఓ రాజా! శివుడు మ్రింగకుండా హాలాహలాన్ని కంఠాన ధరించడంవల్ల ఆయన గొంతుకు నలుపు ఏర్పడి అది ఒక అలంకారం వలే ఒప్పింది. ఆలోచిస్తే సాధుసంరక్షణం ఉత్తములకు ఒక ఆభరణమే కదా!
వ. తదనంతరంబ.
క. గరళంబు గంఠబిలమున, హరుడు ధరించుటకు మెచ్చి యౌ నౌ ననుచున్
హరియు విరించియు నుమయును, సురనాథుడు బొగడి రంత సుస్థిరమతితోన్.
విషాన్ని శివుడు తన కుత్తుకలో ధరించడం చూచి విష్ణువూ బ్రహ్మా పార్వతీ దేవేంద్రుడూ ’మేలు మేలు’ అంటూ మెచ్చుకొన్నారు. అచ్చమైన మనస్సుతో పొగడినారు.
క. హాలాహల భక్షణ కథ, హేలాగతి విన్న వ్రాయనెలమిబఠింపన్
వ్యాళానల వృశ్చికముల, పాలై చెడ రెట్టి జనులు భయవిరహితులై.
వ. మఱియు నా రత్నాకరంబు సురాసురులు ద్రచ్చునెడ.
ఓ రాజా! ఎటువంటి జనులైనా ఈ “హాలాహలభక్షణం” కథను సంతోషముగా వినినా వ్రాసినా చదివినా భయానికి గురికారు. వారు పాముల వల్లనూ తేళ్ళవల్లనూ అగ్నివల్లనూ కష్టాన్నీ పొందరు.
అనంతరందేవతలూ, రాక్షసులూ మళ్ళీ సముద్రమథనాన్ని కొనసాగించినారు.
(టిటిడి పోతన భాగవతం పుస్తకం నుండి)
Potana Bhagavata : Shiva’s halahala bhakshana (eigth adhyaya)