సౌందర్యలహరి 8 : మణిద్వీప వర్ణన-3 పరమాచార్యుల వ్యాఖ్య
(గతసంచికలకోసం పోస్టు చివరలో చూడండి)
సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే
మణిద్వీపే నీపోపవనవటి చింతామణిగృహే|
శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయాం
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ || 8 ||
అమ్మవారి రాజభవనం నీపవృక్షవనంలో ఉంది. కేవలం చింతామణులతోనే నిర్మింపబడడంచేత మెరుపులీనుతూ ఉంటుంది. మన ఆలోచనలన్నింటినీ రత్నాలుగా మారిస్తే – మనం అమ్మవారిని ఏకాగ్రచిత్తంతో ధ్యానిస్తే, మన చింతనలన్నీ రత్నాలయితే, (రత్నాల్లాంటి ఆలోచనలు) మనం అమ్మవారికి ఈ చింతనరత్నాలతో ఒక దేవాలయం నిర్మిస్తే, అది కూడా ఒక చింతామణిగృహం అవుతుంది. అమ్మవారు అందులో ఉంటుంది, అంటే మన ఆలోచనల్లో ఉంటుందన్నమాట. అమ్మవారు మనలో నిండిపోవటానికి, మొదటగా అమ్మవారు మనకు వెలుపల ఉన్నట్లు ధ్యానించటం ఒక మార్గం. చివరికి ఆవిడ మనలోపల నివసించాలి. అభిరామభట్టు ” నీ దేవాలయం ఇక్కడా? అక్కడా? నా హృదయంలో ఉన్నదా? ” అని అడుగుతాడు. ఆయనే తాను రచించిన ’ అభిరామి అంతాది ’ లో అంటాడు – “ఏకస్వరూపంగా ఉన్న తల్లి అనేక రూపాలు ధరించి ప్రపంచమంతా నిండిపోయింది. ప్రపంచం లయమైనప్పుడు పరమాత్మ అవుతుంది. అంత గొప్ప తల్లి, ఎలాగో నా చిన్ని హృదయంలో నివసిస్తోంది “.
చింతామణి గృహంలో అమ్మవారు శివాకారంలో ఉన్న శయ్యపై కూర్చుని ఉంది. మీకు ఇదివరలో పంచబ్రహ్మాసనం గురించి చెప్పాను. పంచబ్రహ్మలపైన పరబ్రహ్మముయొక్క సగుణస్వరూపమైన కామేశ్వరుడు అంటే పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయన అంకముపై అమ్మవారు కూర్చుని ఉంది. అంటే పరమేశ్వర-పర్యంకము పైన. ‘అంకము’ అనే పదానికి ‘తొడ’ అని అర్థము. ‘పర్యంకము’ అంటే చాలా అర్థాలు చెప్పవచ్చును – పరుపు, శయ్య, నడుముచుట్టూ కట్టుకునే వస్త్రము, తొడ. ఈ పదంనుండీ ‘పల్లకీ’ అనే పదం వచ్చింది.
కామేశ్వరుని తొడ అనే శయ్యే అమ్మవారి శయ్య.
ఆచార్యులు ఈ పర్యంకముపై కూర్చుని ఉన్న అమ్మను కామేశ్వరి అనో, రాజరాజేశ్వరి అనో, శృంగారసుందరి అనో అనలేదు. ఆమెను ‘చిదానందలహరి’ అని వ్యవరించి జ్ఞానము యొక్క ఉన్నతులకు చేర్చారు. ఆచార్యుల సాహితీప్రతిభలో ఇదే గొప్పదనం. స్వామితో కూడి ఉన్న అమ్మవారు మూర్తీభవించిన శృంగారమైనా అది ఆత్మ-శృంగారం అని వ్యవహరించబడుతుంది. సత్యవస్తువుకు అభిన్నమైన స్పృహ వల్ల జనించిన బ్రహ్మానందము కదా అది (అమ్మవారు) ? కూర్చున్నది ఈ శయ్యపైనో లేక ఆ సింహాసనం పైనో, ఉన్నది ఈ లోకంలోనో లేక ఆ లోకంలోనో, లేకపోతే ఈ ఇంటిలోనో లేక ఆ ఇంటిలోనో. కానీ, అమ్మవారు చిదానందలహరీ ప్రవాహము. ఈ విషయాన్ని స్పష్టపరుస్తున్నారు ఆచార్యులు.
తరువాతి సంచిక : అమ్మవారి నిజమైన పూజ ఏది ?
గత సంచికలు: