సౌందర్యలహరి 8 : మణిద్వీప వర్ణన-2 పరమాచార్యుల వ్యాఖ్య
(గతసంచికలకోసం పోస్టు చివరలో చూడండి)
సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే
మణిద్వీపే నీపోపవనవటి చింతామణిగృహే|
శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయాం
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ || 8 ||
రాజభవనంలో నివసిస్తున్న మహారాజ్ఞి రాజరాజేశ్వరి. మనం ఆమెను ఈ విధంగా చూచినప్పుడు ఆమె రాజసభలో సింహాసనం అధివసించి దర్బారు నిర్వహిస్తుంది. ఇదివరలో చెప్పినట్లు ఈ సింహాసనం యొక్క నాలుగు కోళ్ళూ, ఆసనమూ పంచబ్రహ్మలు. ఈ సింహాసనంలో కామేశ్వరుని అంకంపై కూర్చుని ఆమె సభను నిర్వహిస్తుంది. మనం ఆమెను ఒక మహారాజ్ఞిగా, అధికారం గలదానిగా కాకుండా బ్రహ్మను లీలకు అభిముఖంగా చేసిన శృంగారస్వరూపముగా చూచినప్పుడు, ఆమె మనకు రాజదర్బారులో కాకుండా అంతఃపురంలో ఏకాంతంగా దర్శనం ఇస్తుంది. ఆ దర్శనం మనకు కలుగాలంటే ఇంద్రియాలను పూర్తిగా నశింపచేయాలి. ఆ అర్హత సాధించాలంటే మనకు శృంగారము యొక్క అంతరార్థం తెలియాలి, ఆ అర్థంలో నిమగ్నమై రమించగలిగిన పరిణతి కావాలి. రాజదర్బారులోని పంచబ్రహ్మాసనం ఇప్పుడు అంతఃపురంలో ఉంది. ఈ ఆసనంపై అమ్మవారు కామేశ్వరునితో కలసి ఉన్నది.
శ్రీపురంలో, మేరుపర్వత మధ్యశిఖరంపైన అమ్మ దేవతలకు అధినేత, రాజదర్బారు నిర్వహించేమహారాజ్ఞి. సుధాసాగరమధ్యంలో ఆమె మనకు తల్లి, ఉన్నత సాధకులకు కామేశ్వర పతివ్రత. ఆమె మనకు తల్లీ, తండ్రీను. ఆమె అనుగ్రహం మనను ఈ తల్లితండ్రుల ఏకరూపంతో లీనం చెయ్యగలదు.
ఆచార్యులు ఈ శ్లోకంలో [8] అమ్మవారి ఇంటిని – సుధాసాగరం నుండీ, కామేశ్వరుని అంకం వరకూ – వర్ణిస్తున్నారు.
[పరమాచార్యులు మనస్సులో శ్లోకంలో ప్రతీ పదమునూ మననం చేసుకుంటున్నట్లు అనిపిస్తున్నారు .]
సుధాసాగరమధ్యంలో- దేవతాలోకాలలో అయిదు వృక్షాలు ముఖ్యమైనవి, మందారము, పారిజాతము, సంతానము, కల్పకము మరియు హరిచందనము. మణిద్వీపము అనే ఈ ద్వీపంలో ఈ వృక్షాల అరణ్యాలు ఉన్నాయి. ఇక్కడి భూమి, మట్టి, రాళ్ళతో కాక విలువైన రత్నాలతో కూడి ఉంటుంది. అందుకే దీన్ని మణిద్వీపము అంటారు.
ఈ మణిద్వీపములో నీప వృక్షాలవనం ఉంది. ’నీప’ అంటే ’కదంబ’ మే. అమ్మవారికి ఇష్టమైన మధుర (మధురై) ఒక్కప్పుడు కదంబవృక్షాల అరణ్యము. తమిళంలో దీని ’కదంబం’ అంటారు. సుబ్రహ్మణ్యుడికి ఇది చాలా ఇష్టమైనది. నిజానికి తమిళగ్రంథాలలో ఆయన ’కదంబన్’ అనే పిలువబడ్డాడు. మణిద్వీపంలో కదంబవనం ఉంది. “కదంబవనవాసినీమ్ “, “కదంబవనచారిణీమ్” [“కదంబవనశాలయా“, “కదంబవన-మధ్యకామ్“], ఆచార్యులు ఇలాంటి పదాలను ప్రతీపాదంలోనూ ఉపయోగిస్తూ ఒక స్తోత్రాన్నే రచించారు. చిన్న పిల్లలుకూడా ఇలాంటి శ్లోకాలు నేర్చుకోడానికి, పఠించటానికీ ఇష్టపడుతారు. అమ్మవారు కదంబవనంలో సంతోషంగా విహరిస్తుంది. మధురైలో కదంబ అరణ్యం, మణిద్వీపంలో ఇది కదంబ ఉపవనం. ఉపవనం అంటే చిన్న అరణ్యం, సహజంగా కాకుండా మనుష్యులు ప్రయత్నం ద్వారా ఉద్భవించిన వనం. ద్వీపం అంచుల్లో దేవతావృక్షాల అరణ్యాలు, రాజభవనం వద్దకు వచ్చేటప్పుడు మనం కదంబ ఉద్యానవనం చూస్తాం.
నగరాలూ, బస్తీలూ కట్టడం కోసం మనం ప్రతీచోటా ఇష్టంవచ్చినట్లు చెట్లు కొట్టేస్తున్నాం. తరువాత, చెట్లు లేకపోతే మనిషి మనుగడకే ముప్పు అని తెలిసికొని మనం ’వనమహోత్సవాలు’ జరుపుకుంటాం. ఈ ఉత్సవాలు మనం కాగితాలపైనే చేస్తామని నాకనిపిస్తోంది. ఇదివరలో ఇన్ని నగరాలు లేనప్పుడు ఊరి చుట్టూ వనాలు ఉండేవి. కోట ఉండే రాజధానికి ఖచ్చితంగా అలాంటి వనం ఉంటుంది. ప్రకృతివైపరీత్యాలనుండే కాక, శతృసేనల నుండీ అది రక్షించేది.
గత సంచికలు: