సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే
మణిద్వీపే నీపోపవనవటి చింతామణిగృహే|
శివాకారే మంచే పరమశివ పర్యంకనిలయాం
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ || 8 ||
శివలోకమేమో కైలాసము, విష్ణువుకు వైకుంఠము, అలాగే లలితాంబకూ ఒక లోకముంది. శివుడికీ, విష్ణువుకూ ఒక్కో లోకమే. లలితాంబకు రెండు ఇళ్ళున్నాయి. మొదటిది – ’బ్రహ్మాండము” అని పిలువబడేదానిలో, అన్ని గ్రహాలూ చుట్టూతిరిగే మేరుపర్వతముయొక్క శిఖరాలలో ఒకదాని పైన. ఆ మేరుపర్వత ఇతర శిఖరాలపై బ్రహ్మ, విష్ణు, శివలోకాలు ఉన్నాయి. అమ్మవారిలోకం ఈ మూడు శిఖరాల మధ్యలో, వీటికంటే ఉన్నతంగా ఉన్న శిఖరముపైన ఉన్నది. లలితాసహస్రనామములో సుమేరుమధ్యశృంగస్థా అనే నామములోనూ ఇదే చెప్పబడింది.
అమ్మవారి రెండో ఇల్లు బ్రహ్మాండానికి వెలుపల ఉంది. ఆవిడ ఒక మహా అమృతసముద్రాన్ని సృష్టించి దాని మధ్యలో ఉన్న ఒక ద్వీపంలో నివసిస్తోంది. లలితాసహస్రనామంలో ఈ అమృతసముద్రమును సూచించిన తరువాత కామాక్షీ నామము వస్తుంది. సుధాసాగరమధ్యస్థా; కామాక్షీ; కామదాయినీ. అమ్మవారి ఈ ఇంటి గురించి ఆచార్యులు ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు.
ఈ లోకాన్ని (ఇదివరకే చెప్పినట్లు) అమ్మవారే సృష్టించింది. అమ్మవారు అనుగ్రహించిన శక్తితో దైవశిల్పి విశ్వకర్మ మేరుమధ్యశృంగముపై ఉన్న లోకాన్ని నిర్మించాడు. అమ్మవారు భండాసురసంహారానికై ఒకసారి కనుపించగానే దేవతలందరూ “ఈమె మన మహారాజ్ఞి రాజేశ్వరి” అని నినదించారు. తరువాత సామ్రాజ్యపటాభిషేకం జరిపారు. విశ్వకర్మ, మహారాజ్ఞికోసం అనేక దుర్గాలతో ఉన్న ఒక రాజప్రసాదాన్ని- ఒక శ్రీపురాన్ని – మేరు శిఖరంపై నిర్మించాడు. కానీ, ఈ శ్లోకంలో ఆచార్యులు సుధాసాగరమధ్యం లో ఉన్న శ్రీపురాన్ని వర్ణిస్తున్నారు.
మేరుశిఖరంపై ఉన్నదైనా, అమృతసముద్రమధ్యలోనిదైనా అమ్మవారిలోకాలలో భేదం లేదు. బహిప్రాకారం నుండి రాజసం ఉట్టిబడుతూ అమ్మవారు అధివసించి ఉన్న అంతరప్రాసాదం వరకూ, అన్ని ప్రాకారాలూ, సరస్సులూ, పరివారమూ అన్నీ సమానమే. అమ్మవారి ఈ రాజధానిని శ్రీపురమనీ, శ్రీనగరమనీ అంటారు. దీని చుట్టూ ఇరవై అయిదు దుర్గాలూ, ప్రాకారాలూ ఉన్నాయి. ఈ దుర్గాలు ఇనుము నుండి బంగారము వరకూ ఉండే వివిధ లోహాలతోనూ, నవరత్నాలతోనూ నిర్మింపబడాయి. ఇంకా ముందుకు వెడుతున్నకొద్దీ సూక్ష్మ భేదాలతో మనోదుర్గాలు, జ్ఞానదుర్గాలు, అహంకారదుర్గాలూ ఉన్నాయి. చివరగా సూర్యచంద్రుల ప్రకాశముతోనూ, మన్మథుని దీప్తితోనూ చేయబడిన రక్షణస్థావరాలు ఉన్నాయి. ఈ కోటల మధ్యలో అడవులూ, దేవతావృక్షాల ఉద్యానవనాలూ, ప్రవాహాలూ, పిల్లకాలువలూ ఉన్నాయి. వీటన్నింటినీ దాటిపోయిన తరువాత, ఇరువై అయిదవ ఆవరణలో – ఇదీ ఒక ప్రాకారమే – తామలపూవులతో నిండి ఉన్న మహాపద్మవనం అనబడే సరస్సు ఉంది. ఇదో అగడ్త. అందులో చింతామణులతో – ఇటుకలతో కాదు- చేయబడిన అమ్మవారి రాజ భవనం ఉంది.