అట్లతద్దె నోము కథ
ఒక రాచచిన్నది తోడిచెలికతైలతో కలసి అట్లతద్దెనోమును నోచుటకు ఉపవాసముండెను. మూడు జాములు దాటుసరికి రాచబిడ్డ సుకుమారి యగుటచే శోషవచ్చి పడిపోయెను. అంతట ఆమె అన్నలు వచ్చి ఆమె యట్లు పడిపోవుటకు కారణమును తల్లివలన గ్రహించిరి, వారు తమ చెల్లెలు చంద్రుడు వచ్చువరకు ఉండలేదని అనుకొని ఒక చింతచెట్టుకొమ్మకు అద్దముకట్టి దానికి యెదుట ఆరికెకుప్పకు అగ్గిని పెట్టి, చెల్లిని లేపి ’అడుగో చంద్రుడు వచ్చెను, భోజనమును చేయు’మనిరి. అద్దములోని నిప్పును చూచి, చంద్రుడేవచ్చెననుకుని ఆమె భోజనము చేసెను. కొంతకాలమునకు ఆమెకు యుక్తవయస్సు రాగా ఆమె అన్నలు పెండ్లి సంబంధములు చూచుచుండిరి. ఎన్ని సంబంధములు వెతికినను ముసలివరుడే దొరుకుటచే కడకు వారు విసిగి తమ చెల్లెలిని ముసలివానికిచ్చి పెండ్లిచేయ నిశ్చయించిరి. ఆ సంగతి తెలిసిన రాచబిడ్డ ’అయ్యో! అట్లతద్దెనోము నోచినవారికి పడుచుమొగుడు దొరుకునని చెప్పిరి. కాని నాకీ ముసలి మొగుడే దాపురించుచున్నాడు’ అని విచారించి వృద్ధభర్తను వివాహమాడుటకు అంగీకరింపలేదు. అన్నలామెనెంతో బలవంతపెట్టి వివాహముచేయనెంచిరి. కాని ఆమె అందులకు సమ్మతించక ఒకనాటి రాత్రి అడవికి పోయి ఒక మఱ్ఱిచెట్టు క్రింద తపస్సుచేయుచుండెను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూచి, “ఓ కన్యామణీ! నీ వేల తపస్సు చెయుచున్నావు ? మేము పార్వతీ పరమేశ్వరులము. నీ కష్టములను మాతో చెప్పుము” అనిరి. అంత అమె వారికతిభక్తితో నమస్కరించి తన వివాహవిషయమును చెప్పెను. వారది విని “అమ్మా! నీవు అట్లతద్దె నోమునోచి చంద్రదర్శనము కాక పూర్వమే భోజనముచేసి, ఉల్లంఘన చేసితివి. అందుచే నీకు ముసలి మగని సంబంధం వచ్చుచున్నది. కావున ఇంటికి పోయి నోమునోచుకుని దీపాలవేళ వరకు ఉపవాసముండి పిమ్మట భోజనము చేయు”మని చెప్పి అదృశ్యమయిరి. అంతనామె తన యింటికివెళ్ళి జరిగిన విషయమును తల్లిదండ్రులకు చెప్పి యధావిధిగా నోమునోచుకొనెను. తరువాత ఆమెకు చక్కని పడుచుమగనితో పెండ్లి జరిగెను.
ఉద్యాపనము
అట్లతద్దెనాడు నోమునోచుకుని పగటివేళ భోజనము చేయక, నీరు త్రాగక ఉపవాసముండి చీకటి పడినంతనే గౌరీదేవికి పదియట్లు నైవేద్యము పెట్టి, పదియట్లను ఒక తోరమును ముత్తయిదువునకు వాయినమియ్యవలెను. అట్లు పది సంవత్సరములు చేసిన పిమ్మట పదేసి అట్లు, ఒక డబ్బును, నల్లపూసల కోవను, లక్కజోడును, పదిమంది ముత్తయిదువులకు వాయినమియ్యవలెను. పద్ధతి తప్పినను ఫలము తప్పదు. భక్తితప్పకుండిన ఫలము కలుగును.
Attlatadde Nomu Katha