బ్రాహ్మణునకు ఉచితమైన వృత్తి
(పరమాచార్యుల అమృత అనుగ్రహభాషణములనుండి)
ప్రజలు జీవికకై ఎన్నో వృత్తులను అవలంబించుచున్నారు, ఆ వృత్తులు తప్పు అనియో తక్కువ అనియో వాళ్ళు అనుకోవడంలేదు. కానీ పూర్వం డబ్బు కోసం ఈశ్వరుని పూజా, కూలికి విద్యచెప్పడం చాల హీనంగా పరిగణించేవారు. దీనికి కారణం, ఆత్మతృప్తికి, అనందానికీ చేయవలసిన పనిని ఉదరపోషణార్ధం చేయటం సముచితం కాదనియే, అంటే వాళ్ళు విద్యాదానం భగవదారాధనక్రింద లెక్కకట్టేవారన్నమాట.
శాస్త్రములు ప్రతిఒక్కరూ తమ కులధర్మాన్ని పాటిస్తూ జాతికి విధించిన వృత్తితో ధనార్జన చేయాలని విధించినవి. బ్రాహ్మణుడు చేయవలసిన వృత్తి ఏది? తమిళంలో బ్రాహ్మణుని, ‘ఆరుతొళిలర్’ అని అంటారు. అతడు ఆరువిధాలైన వృత్తులు అవలంబించవచ్చునని అర్థం. బ్రాహ్మణుడు షట్కర్మ నిరతుడు. అవి ఏవి? ఒకటి అధ్యయనం, రెండవది అధ్యాపనం, ఇవికాక ఇతరవృత్తులలో అతడు కుశలత సంపాదించి వానిని ఇతరులకు నేర్పాలి.
అంటే బ్రాహ్మణుడు అన్ని వృత్తులను తెలిసికొని ఉండవలెనని కాదు. తన అధ్యాపక వృత్తికి భంగం లేకుండా, అనుష్ఠానాలకు నిరోధంకాక నాలుగైదు వృత్తులలో కౌశల్యం సంపాదించి ఇతరులకు వానిని నేర్పాలని భావం. బ్రాహ్మణులు, ఈ విధంగా ఉండిరని ఇతిహాసాలూ పురాణాలూ చెప్పుతున్నవి. బ్రాహ్మణులు, ఆయుర్వేదము, అర్ధశాస్త్రము, నాట్యశాస్త్రము, ధనుర్వేదము మొదలైనవానిని నేర్చి ఇతరులకు బోధించేవాళ్ళు.
ఆయా జాతులకు తగిన వృత్తిని నేర్పాలేకానీ ఆ వృత్తులను అతడు అవలంబించరాదు. ఆ విద్యను ధనార్జనకుకానీ, జీవనోపాయమునకు గానీ అతడు వినియోగించరాదు. శిష్యులిచ్చే దక్షిణతో అతడు తృప్తిపడాలి. అతని ధ్యేయం అధ్యాపకమేగాని ఆర్జన కాదు. అతని కులమునకు ఉచితమైన వృత్తి ఇతరులకు విద్యను బోధించుటే. అధీతిబోధాచరణలు, ఈశ్వరప్రణిధానము బ్రాహ్మణునకు విధించిన కర్మ.
కొందరు దీనిని తెలుసుకోకుండా బ్రాహ్మణులను నిందిస్తారు. ఆత్మార్థం, లోకసంగ్రహం కోసం బ్రాహ్మణునికి ఎన్నో విధులు అనుష్టానాలు అననుకూలాలూ ఉన్నాయి. కష్టాలూ, క్లేశాలు, లెక్కచేయక బ్రాహ్మణుడు లోక క్షేమార్థమే తన కాలాన్ని వినియోగించాలి.
బ్రాహ్మణుడు ఆరువృత్తులు అవలంబించవచ్చునని చెప్పాం. రెంటిని అధ్యయనం అధ్యాపనం గూర్చి మనం చర్చించినాం. మిగతా నాలుగు యజ్ఞం, యాజనం, దానం ప్రతిగ్రహం. యజ్ఞం ఆత్మార్థం చేసుకొనేది. యాజనం ఇతరులకోసం చేసేవి. యజ్ఞం, దానంలో రాబడిలేదు. ఖర్చే, యాజనముల ప్రతిగ్రహనలో(తీసుకొనుట) రాబడి ఉన్నది. కానీ ఒక ముఖ్యవిషయం ఏమిటంటే యాజక ప్రతిగ్రహాల్లో, దాతయొక్క పాపాలు గ్రహీత అనుభవించవలసి వస్తుంది.
దానాలు తీసుకొనే పక్షంలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దానికొక పెద్ద లిస్టు ఉన్నది. ఒక్కొక్కదానానికి ఒక్కొక్క ప్రాయశ్చిత్తం ఉంది. బ్రాహ్మణులకు భీతి కలిగించేటందుకు కాదు ఈ విధిని ఏర్పరచినది. ఈ శాస్త్రములను వ్రాసినదీ బ్రాహ్మణులే. యాజనం కంటే యజ్ఞమే శ్రేష్ఠం. అది ఆత్మార్ధం చేసేది. దక్షిణకోసం కాదు. కానీ యాజనకూడా అతని విధియే. అందుమూలంగా వచ్చిన దక్షిణను అతడు పుణ్యకార్యాలకై వెచ్చించాలి.
కాబట్టి బ్రాహ్మణునికి ఆరు వృత్తులున్నా అందులో ఆదాయానికి ఆస్పదంలేదు. యాజన ప్రతిగ్రహాల్లో వచ్చే ధనం ధర్మకార్యాలకై వినియోగం చేయాలి. అధ్యాపనలో రాబడి ఉన్నా విద్యను దానం చేయాలే కానీ దాని మూలంగా ఆర్జన చేయరాదు. అట్లు చేస్తేనే అది ఈశ్వరార్చన ఔతుంది. ఆచార్యుడు అట్లా దక్షిణ తీసుకొన్నా శిష్యుడు తాను చెప్పిన విద్య పూర్తిగా గ్రహించినాడన్న నమ్మకము కలిగిన మీదటే దక్షిణ తీసుకొనేవారు.
జనకుడు యాఙవల్క్యునికి శిష్యుడు. ఒక్కొక్క ఉపదేశము పూర్తికాగానే జనకుడు గురువుకు దక్షిణలు ఇస్తున్నాడు. దక్షిణ ఇచ్చినపుడంతా, యాఙవల్క్యుడు దక్షిణను తిరిగి జనకునికే ఇచ్చేసేవాడు. ”నాతండ్రి అభిప్రాయం ఏమంటే ఉపదేశం పూర్తిగా ఇచ్చినపిదపే దక్షిణను గ్రహించాలి”, అని యాజ్ఞవల్క్యు డు జనకునితో చెప్పాడు. ఈ విషయం బృహదారణ్యక ఉపనిషత్తు-నాలుగవ అధ్యాయం మొదటి బ్రాహ్మణంలో చెప్పబడి యున్నది.