ఆంధ్ర ప్రాంతం యొక్క ఔన్నత్యము, పవిత్రత

ఆంధ్ర ప్రాంతం యొక్క ఔన్నత్యము, పవిత్రత

(శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాములవారి అనుగ్రహభాషణములనుండి)

భారత ప్రజలు చాలా భాషలు మాట్లాడుతారు. ఆంధ్ర ప్రజలు తెలుగు భాష మాట్లాడుతారు. తెలుగు నాడు లేక ఆంధ్ర ప్రాంతం యొక్క ఔన్నత్యాన్ని, పవిత్రతను ప్రముఖ శివభక్తుడైన శ్రీ అప్పయ్య దీక్షితారు తన కమనీయమైన శ్లోకపాదంలో విశదీకరించారు. స్వయంగా శివాద్వైతియైన ఆయన తమిళనాడులో జన్మించి, సామవేదాన్ని అనుసరిస్తూ ఆంధ్ర దేశంలో జన్మించాలని తపన చెందారు.

ఆంధ్రత్వమాంధ్రభాషా చాన్ధ్రదేశ స్స్వ జన్మభూః |

తత్రాపి యాజుషీ శాఖా నాల్పస్య తపసః ఫలం ||

ఈ శ్లోకం ఆంధ్రులు పవిత్రులని, ఆంధ్రదేశం పవిత్ర భూమి యనే భావాన్ని వ్యక్తీకరిస్తుంది. చాలమంది తమ ఔన్నత్యాన్ని, దేశంలో తమకున్న ప్రత్యేక స్థానాన్ని ఎరుగక పోవటం దురదృష్టకరం. కనుక ఆంధ్రప్రాంతం యొక్క గొప్పతనాన్ని, కీర్తిప్రతిష్ఠలను ఒకమారు ఎవరికివారు గుర్తుచేసి కొనటం శ్రేయస్కరం.

ఆంధ్రదేశం తెలుగుదేశంగా తెలియ బడుతోంది. తెలుగు అనే పదం మూడు లింగాలు అనే అర్థంగల త్రిలింగ పదానికి వికృత రూపమే. ప్రాచీన కాలంలో ఈ దేశాన్ని త్రిలింగ దేశమనే అనేవారు. ప్రస్తుత కాలంలో మాత్రమే రాజకీయ పరిభాషలో ఈ దేశం అనేక నామాంతరాలతో పిలవ బడుతోంది.

త్రిలింగ శబ్దానికి విశేషార్థ మేమిటి ? ఆంధ్రదేశంతో సంబంధమున్న ఆ మూడు లింగాలేవి? సాధారణంగా ఒక రాతి ముక్కను ఒక పల్లెటూరు యొక్క, భూమి యొక్క హద్దులను తెలిపే సరిహద్దు రాయిగా ఉపయోగిస్తారు. అదే రాయి ఒక దేవాలయంలో మంత్ర తంత్రాలతో దైవ శక్తి నాపాదించి ప్రతిష్ఠించినచో భగవంతుని ప్రతిరూప చిహ్నంగా పరిణమిస్తుంది. ఆంధ్రదేశంలో యీ మూడు లింగాలు కేవలం దైవచిహ్నాలేగాక, తెలుగునాటికి సరిహద్దు గుర్తులుగ రూపొందాయి. ఆ విధంగా ఆంధ్రదేశం ఈ మూడు లింగాలచేత పరివేష్ఠింపబడిన ప్రాంతమైంది. ఈ సందర్భంలో పైన చెప్పిన మూడు లింగాలు ఏవనగా : దక్షిణాన కాళహస్తి, పశ్చిమంలో శ్రీశైలం, ఉత్తరదిశలో ఉన్న ద్రాక్షారామం.

ఆంధ్రప్రదేశ్‌లో శివునకు అంకితమైన ఇంకా చాల పవిత్ర క్షేత్రాలున్నాయి. వాటిలో ప్రముఖమైన వానిని పంచారామ పవిత్రక్షేత్రా లంటాం. ఆరామం అనే పదానికి క్షేత్రం అని అర్థం. భగవంతుడు ఇలాంటి ప్రదేశాల్లోనే సుఖశాంతులతో వసిస్తాడు. ఈ ఆరామము లేవనగా : గోదావరి నదీతీరంలో ఉన్న ద్రాక్షారామం, ‘అమరారామం’లేక అమరావతి, కాకినాడ వద్దగల సామర్లకోట లేక కుమారారామం, భీమవరం, క్షీరారామం. ఈ స్థలాల్లోని లింగాలు చాల ప్రముఖమైనవి. క్షీరారామం నుండి భీమవరం వరకు లింగాలు బహు సంఖ్యలో దర్శనమిస్తాయి. వీటిలో కొన్ని లింగాలు బౌద్ధ స్థూపాలని కొందరంటారు. కాని అది సత్యంకాదు. కాళహస్తి, శ్రీశైలం, ద్రాక్షారామాలలోని లింగాలు ప్రముఖమైన, ప్రసిద్ధికెక్కిన మహా లింగాలు. ఈ స్థలాలన్నింటిలోను మహావైభవంగా ఈ లింగాలకు అభిషేకం చేయబడుతుంది. వస్త్రాలు ఈయబడుతాయి. పూజావిధానలన్నీ జరుపబడుతాయి. తిరుపతిలో వేంకటరమణుని ఆలయంగాక ఆంధ్రదేశంలో నృసింహుని ఆలయాలు కూడ ఉండటం గమనిస్తాం. విశాఖపట్నం నుండి దండకారణ్యం ప్రాంతంలోంచి పయనిస్తుంటే రామభక్తిని బోధించే పాఠశాలలు గల చాల ప్రదేశాల్ని మనం చూడగల్గుతాం. ఇవిగాక పుట్టకొండలో నృసింహక్షేత్రం వెలసియుంది. ఈ క్షేత్రంలో నివసించి ఆ దేవదేవుని దర్శిస్తే పునర్జన్మ వుండదని వాడుక. కాని ఆంధ్రదేశం ప్రధానంగా శివలింగాల ప్రదేశమే. ఇక్కడ ఉన్న పంచారామక్షేత్ర సదృశములు మరొక రాష్ట్రంలో లేవు.

తమిళనాడులో మాత్రం పంచ భూతక్షేత్రాలున్నాయి. కంచిలో ఏకామ్రేశ్వర రూపంలో పృథ్వీలింగం ఉన్నది. ఈ లింగానికి అభిషేకం చేయరు. కవచానికి చేస్తారు. తర్వాత పునుగు మొదలైన సువాసన ద్రవ్యాలు పులిమి, అలంకారం చేస్తారు. జలానికి ప్రాతినిధ్యం వహించే లింగం అప్‌లింగంగా జంబుకేశ్వరంలో ఉంది. అక్కడ ఇప్పటికి లింగానికి క్రింది నేలనుండి జలం పైకివస్తూనే ఉంటుంది. ప్రస్తుతం గర్భగుడి నుండి అక్కడ పైకివచ్చు నీటిని బయటకు పంపుటకు విద్యుచ్ఛక్తి ఆధారంగా పనిచేసే పంపులను ఏర్పాటు చేశారు. తిరువన్నామలైలో తేజోలింగం స్థాపితమై ఉంది. తేజస్సు పంచభూతాల్లోని అగ్నికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కాని ఇది భౌతిక తేజస్సు కాదు. జ్ఞాన తేజస్సు మాత్రమే. ఈ రోజునకు కూడ చాలా మంది మహర్షులు, సన్యాసులు అక్కడ నివసించి జ్ఞానజ్యోతిని పొందుతారు. కాళహస్తిలో వాయుభూతానికి ప్రాతినిధ్యం వహించు వాయులింగం వుంది. అచ్చటి గర్భగుడిలోని జ్యోతి మిణుకు మిణుకు మంటూ గాలి వలన ‘అటూ ఇటూ’ అన్ని వేళలా వూగుతూ ఉంటుంది. చిదంబరంలో ఆకాశలింగ చిహ్నంగా నటరాజు వెలసి ఉన్నాడు. ఒక్క తిరువన్నామలైలో తప్ప మిగతా క్షేత్రాలలోని లింగాలన్నీ ప్రత్యక్ష రూపంలో ఉంటాయి. వాటిని మనం నేరుగా దర్శించగలం. ఒక్క తేజోలింగం విషయంలో మాత్రం అది మనకు నేరుగా కనబడదు. దానికి కారణం అది భౌతికమైన తేజస్సుకాక ఆధ్యాత్మిక తేజస్సు కావటమే.

కాని పంచారామాలు ఆంధ్రదేశంలో మాత్రమే ప్రత్యేకంగా నెలకొని వున్నాయి. అవి శివునికి అంకితమైనవి. ఆంధ్రప్రాంతము శివునితో మరొక విధంగా కూడ సన్నిహిత సంబంధం కల్గివున్నది. ఆంధ్రలో బిడ్డకు అక్షరాభ్యాసం చేసేటప్పుడు ప్రథమంగా బోధింపబడేది.

”ఓం నమః శివాయేతి సిద్ధం”

మన పరిసర ప్రాంతమైన తమిళనాడులో మాత్రం అక్షరాభ్యాస సమయంలో బిడ్డకు ఈ క్రింది విధంగా బోధిస్తారు.

”ఓం నమో నారాయణాయేతి సిద్ధం”

తమిళనాడులోని శివారాధకులైన తల్లిదండ్రులు కూడ తమ బిడ్డలకు పై విధంగానే బోధిస్తారు. కాని ఆంధ్రదేశంలో వైష్ణవులైన తల్లిదండ్రులు సహితం తమ బిడ్డలకు ఈ క్రింది విధంగానే బోధిస్తారు.

”ఓం నమః శివాయేతి సిద్ధం”

అంతేగాదు, తెలుగుభాష, లిపికూడ శివపార్వతులకు సన్నిహిత సంబంధం కల్గివుంటాయి. తెలుగు లిపి పరాశక్తి యొక్క యంత్రాలలో ముద్రలకొరకు ఉపయోగపడుతుంది. పరమాత్మ యొక్క స్త్రీ లింగ రూపమే పరాశక్తి. అందుచేత దేవి విషయంలో వామవర్తపూజ విధింపబడింది. తెలుగు లిపిలోని అక్షరాలు వామదిశగా వంకరతిరిగి ఎడమ వైపునకు వలయం పూర్తిచేస్తాయి. ఇతర భాషల విషయంలో అలాగాక అక్షరాల వంపు, చుట్టు తిరుగుటలు కుడివైపునకు జరుగుతాయి. మరియు తెలుగు లిపిలోని ఎక్కువ అక్షరాలు వలయాకృతంగా వ్రాయబడతాయి. ఈ వలయాలు కూడ వామ దిశగా గీయబడతాయి. తెలుగు లిపిలో మామూలుగా ఉండే 50 అక్షరాలు కాక రెండు అదనంగా ఉంటాయి. దానిలో ఒక సున్నితమైన ‘జ’, ఒక సున్నితమైన ‘చ’ ఉంటాయి. ఈ రెండు అదనపు అక్షరాలు సంబంధిత అక్షరాలయొక్క సున్నిత రూపాలుగ పరిగణింపబడతాయి. వామ దిశలో వలయించు (చుట్టూ తిరుగు) అక్షరాలు కల్గిన తెలుగు లిపి పరాశక్తి యంత్రాలలో ముద్రలకొరకు వినియోగింపబడుతోంది. దీని వలన తెలుగు లిపి పరాశక్తితో సన్నిహిత అనుబంధం కలిగి యుండుటను గమనిస్తాం.

తెలుగు భాష విషయానికొస్తే అది శివునితో ఎడలేని అనుబంధం కలిగి ఉంది. ఆంధ్రపేర్లలో ఎక్కవ భాగం ‘ఒ’ తో అంతమౌతాయి. ఈ ‘ఒ’ అక్షరం శివునితో సంబంధం కల్గి ఉంటుంది. ఆ విధంగా లిపి శక్తి స్వరూపంగాను, భాష శివస్వరూపం గాను ఉండి ఆ రెండూ శబ్ధార్థముల కలయికను, శివపార్వతుల సమ్మేళనమును స్ఫురింపచేస్తాయి. ఇదే విషయాన్ని కాళిదాసు రఘువంశంలో ఈ క్రింది శ్లోకంలో చెప్పియున్నాడు.

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే |

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ ||

ఇక్కడ కృష్ణయజుర్వేదాన్ని అనుసరించే వారిసంఖ్య చాల ఎక్కువ. ఋగ్వేదాన్ని అనుసరించేవారు కొద్దిమంది ఉండవచ్చు. అలాగే శుక్లయజుర్వేదాన్ని అనుసరించేవారు కూడ బహుకొద్ది మంది ఉండవచ్చు. కాని సామవేదం అనుసరించే వారి సంఖ్య శూన్యమనే చెప్పాలి. యజుర్వేదంలో మధ్యస్థానంలో శ్రీరుద్రం, దానికి మధ్యలో పంచాక్షరి, పంచాక్షరికి మధ్యలో శివశబ్దం తటస్థపడతాయి. అలా యజుర్వేదం అతిసన్నిహితంగా శివునితో అనుబంధం కలిగి ఉంది. యజుర్వేదాన్ని అనుసరించే ఆంధ్రులు బహుసంఖ్యలో శివారాధకులై యున్నారు.

అప్పయ్యదీక్షితులు అలాంటి పవిత్రభూమియైన ఆంధ్ర ప్రాంతంలో జన్మించాలని మిక్కిలిగా పరితపించారు. మామూలు కొద్దిమాత్రపు తపస్సుతో ఆ ఫలితాన్ని ఎవరూ పొందలేరని కూడ వ్యక్తం చేశారు. కాని తపస్సు ఏ పరిమాణంలో చేస్తే దానిని సాధించవచ్చో నుడువలేదు.

ఆ విధంగా తెలుగునాడు లేక త్రిలింగదేశం శివునకు, శివారాధనకు అంకితమైన పవిత్రభూమియై యున్నది. శివస్వరూపమైన, శివనామం మధ్యలో కల్గిన యజుర్వేదాన్ని, సరిహద్దులుగా వెలయు చున్న మూడు లింగాలను, శివునితో పరాశక్తితో అనుబంధితమైన భాషాలిపుల్ని కలిగి ఈ దేశం ప్రత్యేకాకర్షణలతో విరాజిల్లు తోంది. ఉద్యోగాల కొరకు, వ్యాపారాలు, పారిశ్రామిక వృత్తులు నిర్వహించు నిమిత్తం చాలమంది ఆంధ్ర ప్రాంతంనుండి ఇతర ప్రదేశాలకు వెళ్లి స్థిరపడి యుండవచ్చు. కాని వారి ప్రత్యేక సంస్కృతిని, సాంప్రదాయాన్ని వారు విడనాడకూడదు. కాన ప్రతివాడు తన భారతీయతను, తన సంస్కృతిని, సాంప్రదాయాన్ని జ్ఞప్తియందుంచుకొని తన ధర్మాల్ని యథావిధిగా నిర్వహిస్తూ ప్రేమభావాన్ని ఇనుమడింప చేసుకోవాలి. మనిషి ఏ ప్రాంతంలోవున్నా, అదే తన స్వదేశమని ఎల్లవేళల స్మరణకు తెచ్చుకుంటూ తన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ధర్మాన్ని పరిరక్షించుకొని పోషిస్తూ ఉండటంతో బాటు, తన సంస్కృతీ సాంప్రదాయాల్ని కాపాడమని అనిశం భగవంతుని ప్రార్థించాలి.

భగవంతుడు మిమ్మల్నందర్ని అనుగ్రహిస్తూ, భారతీయ సంస్కృతీ సంప్రదాయ ధర్మ రక్షణలో మీలో ప్రతివానికి తోడ్పడుగాక !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s