వేదం ఏం చెప్పుతోంది?

పరమాచార్యుల అమృతవాణి : వేదం ఏం చెప్పుతోంది ?

వేదంయొక్క ఉద్దేశ్యం ఏమిటి? వేదం ఎందుకొరకు ఏర్పడ్డది? కొన్ని ఉపనిషత్తులు చెప్పినరీతిగా వేదాలన్నీ ఒకే వస్తువును చూపిస్తున్నవని తెలుస్తున్నది. ఆవస్తువేది? ఓంకారానికి అర్థముగా ఉండే ఒక పరమవస్తువునే వేదాలన్నీ చూపిస్తున్నవని ఉపనిషద్‌ వాక్యం. వేదాలు వేరువేరు విషయాలను గూర్చిన్నీ వేరువేరు దేవతలను గూర్చిన్నీ చెపుతున్నవే అని మనకు సందేహం కలుగుతున్నది.

సదాశివయ్యర్‌ అని జడ్జీగారు ఒకరున్నారు. మైసూరు రాజ్యంలో వున్న పరమశివయ్య వీరికి సోదరులు. వేదము లంటే భౌతికశాస్త్రాలే. వేదం జియాలజీని-భూగర్భశాస్త్రాన్ని చెప్పుతున్నదని వారు రాశారు.

ఇంకనూ పలువురు పలు విధాలుగా చెపుతున్నారు. ఆ కాలంలో మనదేశంలో ఉన్నవారికి సూర్యుణ్ణి చూచినా చంద్రుణ్ణి చూచినా ఆశ్చర్యంగా ఉండేది. ఆ కాలం ఎక్కువగా విజ్ఞానం కలిగిన కాలంకాదు. అందుచేత వారికి తగినట్టు వారు వారు నైసర్గిక మైన దృశ్యాలు చూచి ఏమో వర్ణించారు. దానిని పాటగా పాడే శక్తి అందరికీలేదు. కొందరికి మాత్రమే ఉన్నది. వీరు పాడినపాటలే మంత్రాలని అనుకొని, వేదాలుగా హిందువులు కంఠపాఠం చేస్తూ వస్తున్నారని పాశ్చాత్యులు అభిప్రాయ పడుతున్నారు.

వీనిని అంతా చూస్తే వేదాలన్నీ ఒకవస్తువును చెప్పుచున్నవని ఉపనిషత్తులు చెప్పినా వేరువేరు విషయాలను గూర్చియే వేదాలు చెప్పుచున్నవికాని ఒక్క వస్తువుగూర్చి చెప్పుచున్నట్లు మనకు తోచటంలేదు. రామాయణం గూర్చి ఒక శ్లోకం ఉన్నది.

వేద వేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే,
వేదః ప్రాచేతసా దాసీత్‌ సాక్షా ద్రామాయణాత్మనా.


వేదవేద్యే-వేదంచేత తెలిసికోదగినవాడెవడూ? పరేపుంసి-పరమపురుషుడు శ్రీమన్నారాయణుడు. వేదవేద్యుడైన నారాయణుడు దశరథాత్మజుడైన వెంటనే వేదాలు వాల్మీకి శిశువుగా, రామాయణంగా అవతరించినవి.

వేదాలలో అనేక విషయాల ప్రస్తావన ఉన్నా అవి తీరా చెప్పేది ఒక్కవస్తువును గూర్చియే. అయినా అనేక విషయాల గూర్చి ప్రస్తావన ఎందులకూ? అనేక వస్తువుల మూలముననే మనం ఒక వస్తువును గూర్చి తెలిసికోగలం. యోగం, ధ్యానం, తపస్సు, యజ్ఞమూ, కర్మానుష్ఠానమూ ఇవి అన్నీ తుట్టతుది అయినదిగా ఏవస్తువును చూపునో ఆ వస్తువే, వేదాల సత్యతత్త్వంగా ఉన్నది. సత్యమైన ఆవస్తువు తప్ప తక్కినవన్నీ మారిపోయే వస్తువులు. కథలుగా పోయే వస్తువులు. అటుపిమ్మట ఆ కథలుగూడా మరపున పడిపోతై. వేదోక్తమైన ఆ సత్యవస్తు దర్శనానికి మననం కోసం చిత్తానికి చాలా నియమాలు ఏర్పడాలి. యాగాలు చేయడం, తపస్సు చేయడం, ధర్మాలు చేయడం, గోపురాలు కట్టడం, నూతులు త్రవ్వడం ఇవి అన్నీ చిత్తశుద్ధీ చిత్తవృత్తి నిరోధమూ చేయడం కోసమే. ఏకర్మలైనా పరమాత్మను పొందటానికై చేయవలసిన కర్మలే.

ఎంత చిన్నదుఃఖం కలిగినా మనం వ్యసన పడతాం కష్టపడతాం. ఎట్టి దుఃఖం వచ్చినా అవమానం వచ్చినా చలనం లేని చిత్తవృత్తి ఏర్పడ వలెనంటే కొన్ని సాధనలు చేయాలి. దేహం పెంచడం కోసం దండాలు తీస్తాం. బస్కీలు చేస్తాం. ఇవి అన్నీ ఎంతో నియమంతో చేస్తేనే కాని దేహం పెరగదు. ఆత్మాభివృధ్ధికి కొన్ని కట్టుబాట్లుకొన్ని ప్రయత్నాలు అవసరం. వానినన్నింటినీ వేదం చెపుతుంది. వేదం చెప్పిన రీతిగా కర్మఅనుష్ఠిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి? దుఃఖ మేదిన్నీ మనదరికేరాదు. అట్టి దుఃఖాభావమునే గీత చెపుతుంది.

తం విద్యా ద్దుఃఖ సంయోగ వియోగం యోగసంజ్ఞితమ్‌
స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణ చేతసా’


సంయోగమంటే చేరిక. వియోగమంటే విడిపోవడం. దుఃఖమును తొలగించేదే యోగం అని తెలిసికో. అని కృష్ణుడు అర్జునునికి ఉపదేశం చేశాడు. అట్లా చేరే దుఃఖాన్ని వియోగం చేస్తున్నది. ఎట్టి దుఃఖం కలిగినా పోగొట్టుతుంది. దుఃఖంరాకుండానే చేయడం అనేది కానిపని. మితిలేని దుఃఖం కలుగుతూనే వుంటుంది. ఏ దుఃఖం వచ్చినా ఆ దుఃఖమును మనకు అంటనీయకుండా వియోగం చేసివేస్తుంది. గచ్చకాయకు విభూతి అంటుకోనట్లు తామరాకు మీద ఉదకబిందువులవలె మనకు కలిగే దుఃఖాలు మనకు అంటకుండా పోతవి. దానికే యోగమని పేరు. యోగానికి గుర్తు ఏమిటి?

‘యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః’

ఏది దొరికితే యీ దొరికిన దానికంటె మరియేదిన్నీ అధికమని తలపించదో అది ఒక్కటియే దొరకించుకొన దగిన వస్తువు. దానిని పొందటానికి చిత్తశుద్ధి కావాలి. ఏకాగ్రత కావాలి. చిత్తంయొక్క స్వభావం సంతత చలనం. ఒక నిముషమైనా వ్యవధిలేక అది తిరుగుతూనే ఉంటుంది. ఇట్లా తిరగడంవల్ల దానికి మాలిన్యం అమితంగా అంటుపడుతుంది. వద్దువద్దు అని చెప్పుతున్నా దాని దారి దానిదే. అది పరిగెత్తుతూనే వుంటుంది. తిరక్కుండా చలనం లేకుండా కోపించకుండా వుందాంఅని తలచినా ఎలాగో అలాగ మాలిన్యం మనస్సులో చేరుతూనే వుంటుంది.

ఆశా, కోపమూ, మోహము ఇవి అన్నీ చిత్తమాలిన్యాలు. ”చిత్తమల మఱువిత్తుశ్శివమాక్కి” అని తిరువాచకం చెపుతూంది. చిత్తమలం పోతే శివుడు కాగలడు. అంతవరకూ జీవుడే. చిత్తమాలిన్యం తొలగినందనే జీవుడు శివుడు. ఈ చిత్తశుద్ధికొరకే గుళ్ళుకట్టడం యాగాలు చేయడం. ఇవి ఈశ్వరునకు సంబంధించిన కర్మలు. బావులు త్రవ్వడం గోపురాలు కట్టడం మొదలైన కర్మలకు ‘పూర్తం’ అని పేరు. యాగాలు చేయటానికి ‘ఇష్టం’ అని పేరు. రెంటినీ కలిపి ఇష్టాపూర్తాలని అంటారు.

ఇష్టాపూర్తాలు శరీరశుద్ధి చేస్తవి. కాని ఇవి అసలు సంగతులు కావు. ఇవి చిత్తమాలిన్యం పోగొట్టుకోడానికి మాత్రం సాధనాలు. చాంచల్యమునూ చిత్తవృత్తినీ నిరోధించి ఏకాగ్రచిత్తంతో తెలిసికోదగిన ఒక సత్యవస్తువునకు కొంచెం ఎడమయిన సాధనాలు. ఆ వస్తుదర్శనం కలుగగానే దానితో వేరు కావాలని తోచదు. తోస్తే అతడింకా స్వామిని చూడలేదనే అర్థం-‘యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః’. మనం పొందదగ్గ వస్తువులు పొందామా అని పరిశీలించుకోడానికి ఇది ఒక గుర్తు. మరొక గుర్తు ఏమంటేః

యస్మిన్‌ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే

ఎంత దుఃఖం వచ్చినా కదలక మెదలక కలగిపోకుండా ఉండగలిగామా మనకు సత్యవస్తువు కనబడినట్లే అని అర్థం. మనకనేక దుఃఖాలు పొసగుతై. ఊరుకూ వాడకూ అది దుఃఖంగా తోచవచ్చు. కాని మనకట్లా తోచదు. గచ్చకాయవలె తామరాకుమీది నీటి బొట్టువలె దుఃఖం కొంచెమయినా అంటక ఇంకొకటి కావాలని తోచక సదా ఆనందంగా కూచుంటే దానికి అట్లా కూచోగలిగిన స్థితి ‘యోగం’ అని అనిపించుకొంటుంది- ‘తం విద్యాద్దుఃఖ సంయోగం వియోగం యోగ సజ్ఞితమ్‌’ దుఃఖమును అంటనీయక-దుఃఖసంయోగాన్ని వియోగం చేసేది యోగం.

క్రమాచారం నియతజీవనం వీనిచేతనే మనం మన శ్చంచలతను వదలించుకొని ఏకాగ్రత పొంది ధ్యానమును పెంపు చేసికోడానికి వీలవుతుంది. ఈ శరీరం అనే పంజరంలోంచి ఆత్మ లేచిపోవడానికి ముందే సద్విద్యచేత ప్రతివారూ యోగస్థితిని పొందవలెనని కాళిదాసు రఘువంశంలో చెప్పాడు. వేదవస్తువు రాఘవుడే. ఆ ఒక్క వస్తువునూ పొందడానికే ఇన్ని శాస్త్రాలూ, యజ్ఞాలూ, తపస్సులూ, ధ్యానాలూ, చిత్తవృత్తి రహితం అయితేనేగాని ఆ వస్తువు కానరాదు. ఈ వృత్తి రాహిత్యం మెట్టుమెట్టుగా క్రమంగా గాని కలుగదు.

ఏ వస్తువును తెలిసికొంటే మరొకటి కావాలని తోచదో అది ఎట్టి దుఃఖాన్నయినా పోగొట్టగల సామర్థ్యం కలది. అది ఎవరిమీద నయినా కోపం కలుగనీయదు. మీదు మిక్కిలి కరుణ కలిగిస్తుంది. మనకేది సంభవించినా సంభవింపనీ. మనవలన ఇతరులకు ఇతరప్రాణు లేవయినా సరే వాని అన్నిటికీ కష్టం. దుఃఖం కలుగకూడదు అన్న కరుణ పుటుతుంది. ఈశ్వరుడు లోకసంహారం చేయడంకూడా పరమ కారుణ్యం వల్లనే అని చెప్పాలి. ఎంత దుఃఖం వచ్చినా మనకు అంటనీయని స్థితి. – దుఃఖ సంయోగ వియోగస్థితి – అదే పరమకరుణ. ఆస్థితి కొంచెం కొంచెంగా రావాలి. దీనికోసమయియే శైశవం నుంచీ వేదాధ్యయనం చేసేది. శాస్త్రాలు విద్యలు చదివేదిన్నీ.

‘శైశవేఽభ్యస్తవిద్యానామ్‌’ బిడ్డలుగా ఉన్నప్పుడే మేలి గురువువద్ద మంచి చదువు నేర్చి సన్మార్గంలో ప్రవేశించే జ్ఞానం పొందడం ముఖ్యవిధి.

యౌవనే విషయైషిణామ్‌’ వంశం మనతో అంతరించి పోకుండా ¸ యౌవనంలో తాము ప్రియపడిన ఒక స్త్రీని పెండ్లాడి వంశవృద్ధి చేసికోవాలి. ఇది మనం జీవాలకు చేసే సహాయం. అనేక జీవాలు తమ తమ పాపాలను పోగొట్టుకోడానికి శరీరం ధరించాలి. వానికి సాయం చేసేందుకు మనం కళ్యాణం చేసుకోవాలి.

ప్రాయం పడమరకు ఇంకా తిరగక ముందే యోగస్థితి పొందడానికి చిత్తనిరోధం, దుఃఖరాహిత్యానికి యాగాలు, యజ్ఞాలు, హోమాలు ఇష్టాపూర్తాలు చేస్తారూ. ఆశ, కోపం, కామం కలుగకుండా చిత్తాన్ని పరిశుద్ధంచేసి కొంటారు. ”వార్ధాకే మునివృత్తీనామ్‌” ముసలితనంలో మునులు తపస్వుల దగ్గరకు పోయి ఉపదేశం పొంది తపస్సు చేయాలి. తెలిసికోదగ్గ వేదవేద్యమయిన వస్తువుకోసం సాధన కొనసాగించాలి.

”యోగే నాం తే తనుత్యజామ్‌” కడపట ఈ శరీరాన్ని యోగంతో వదలాలి. యోగమంటే వియోగమే అని గీత చెపుతుంది. అనగా దుఃఖం అనేది లేక నిత్యమూ ఆనందంగా ఉండడమే. ఏడుస్తూ దేహం వదలితే మళ్ళా ఏడ్చే దేహమే వస్తుంది. అందుచేత దేహం వదలేటప్పుడు ఆనందంగా ఉండాలి. ఏలాటి దుఃఖసమయంలోనయినా మనశ్చలనం లేక ధర్మాన్నే ఆనందంగా అనుసరించే వ్యక్తి ఒకడున్నాడంటే అట్టి వ్యక్తి రాముడే. రామ అనే శబ్దానికే ఆనందంగా ఉండేవా డని అర్థం. దానిచేతనే వేదాలలో తెలిసికోబడే పరమపురుషుడు దాశరథిగా ఆవిర్భవించాడట-‘వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే‘ వేదానికి శరీరిగా ఉండేవాడు దశరథునికి కొడుకుగా పుట్టాడు. వేదం వాల్మీకికి శిశువుగా రామాయణంగా అవతరించింది.

ఆ రామాయణం ఏమి చెపుతూంది? వేదాలు ధర్మమును చెపుతై. ఆలాటి ధర్మస్వరూపుడే రాముడు అని రాముని తల్లి కౌసల్య, అడవులకు పోయే రామచంద్రుడితో చెప్పిన మాటలవల్ల రాముడు ‘ధర్మస్వరూపుడు’. అని గోచరిస్తుంది.

పొరుగూరు పోయే బిడ్డకు తల్లి తినుబండారాలు కట్టి యివ్వడం వాడుక. రామునికి కౌసల్య యిచ్చిన తినుబండం ఏమిటి? ఆమె ఇచ్చిన ఆశీర్వాదమే.

‘యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ
స వై రాఘవశార్దూల ధర్మస్త్వా మభిరక్షతు’


రాఘవా! నీవు ఏ ధర్మాన్ని ధైర్యంతో నియమంతో ఆచరిస్తావో, ఆ ధర్మమే నిన్ను కాపాడేని’

ధృతి అంటే ధైర్యం. ఒకడు పరిహసిస్తాడని లెక్కచేయక ఎవరేమన్నా ధైర్యంతో ఉండడమే ధృతి. ‘ఎవరేమన్నా సరే’ అని కొందరు కొన్నాళ్ళు ధైర్యంతో ఉంటారు. పిదప పిదప మెల మెలగా దాన్ని వదిలివేస్తారు. దానికి ఒక కట్టుబాటో నియమమో ఉండదు. దానివల్ల ప్రయోజనం శూన్యం.

రాఘవుడు ధర్మాన్ని కట్టుబాటుతో నియమంతో ఒక పూటయినా వదలక కాపాడుకొంటూ వచ్చాడు. మనశ్చలనం లేక ధర్మం పాటిస్తూవచ్చాడు. ఎవరు నవ్వేది, మరి ఎవరడ్డు పెట్టేది మన ధర్మాన్ని మనం ఇందువల్ల వదలరాదు. ఆ ధర్మస్వరూపి ధర్మరక్షణ చేశాడు. అందుచేతనే అడవికి పోతూవున్నపుడు కౌసల్య కుమారుడికి ‘ధర్మంగా వర్తించుకో’ అని మాత్రమే చెప్పక, ఏ ధర్మాన్ని నీవు ధైర్యంతో నియమంతో కాపాడుకుంటూ వచ్చావో, ఆధర్మమే నిన్ను కాపాడుతుందని ఆ ఆపదల నన్నిటినీ నివృత్తి చేసే ఆశీర్వాదం చేస్తూంది.

ఒక కుక్క దొంగలబారినుండి మనలను కాపాడవలెనంటే దానిని మనం చక్కగా కాపాడాలి. మనం దేనిని కాపాడతామో అది మనలను కాపాడుతుంది- ”నీవు ధర్మాన్ని రక్షించుకొంటూ వచ్చావు, ఇకముందు గూడా రక్షించుకొంటూ వస్తావు. అదే. ఆధర్మమే నిన్ను రక్షించుకొంటుంది’ అని ఇతరులు చెప్పటం అటుంచి సొంత తల్లి ‘తన బిడ్డ అడవులపాలయిపోతున్నాడే’ అని దుఃఖించక ఇట్లా చెబుతూంది. కూడా పుట్టిన సోదరుడే ‘అన్నా! ధర్మం. ధర్మం’ అంటూ ధర్మానికి కట్టుబడి ఉండడముచేతనే నీకు ఇంత శ్రమ ఇంత కష్టమూ సంభివిస్తూంది. దాన్ని వదలివేశావా నీకీబాధ ఉండదు’ అని ఎన్నోసారులు చెప్పాడు. ‘ఎవరు నవ్వినా, నాయనా! రాఘవా! ఏధర్మాన్ని నీవుధైర్యంతో నియమంతో వదలక అనుష్ఠిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది.’ అని తల్లి ఆశీర్వదిస్తున్నది.

‘ధర్మం తలకాస్తుంది’ అని ఒకసామెత ఉంది. ఆడవిలో రాఘవుని తల కాచింది ధర్మమే. రావణునికి పది తలలున్నప్పటికి తాను చేసిన ఆధర్మం ఒక తలనయినా కాచలేక పోయింది.

‘వేదోఽఖిలో ధర్మమూలమ్‌’ వేదమే ధర్మమును చెపుతూంది. వేదాలలో వర్ణింపబడిన పరమపురుషుడు దశరథునకు కొడుకుగా అవతరించా డనీ, ‘వేదవేద్యే పరే పుంసి’ అనే శ్లోకం చెపుతూంది. కౌసల్యాదేవి వాక్యంవల్ల ‘ధర్మ స్వరూపుడే రాముడు’ అని తెలియవస్తూంది. ఇంకో చోట ‘రామో విగ్రహవాన్‌ ధర్మః‘ అని ఉన్నది. ధర్మం అనేది మనోభావం. అది ఒక రూపం ధరిస్తే ఎలావుంటుంది అని అంటే రాముడై కూచుంటుంది అని అర్థం. ఆపత్కాలంలో కూడా ఒక అడుగయినా వెనుకాడకుండా ధైర్యంతో నియమంతో ఉండే రూపమే ధర్మం. ఆ ధర్మ స్వరూపమే రామావతారం. వేదాలవలన తెలియదగిన వస్తువే అందరకూ కంటికి కనబడే వస్తువుగా అవతరించింది. అపుడే వేదం సైతం రామాయణంగా అవతరించింది. వేదగరిమ ‘ఇంతది’ అని చెప్పలేము. గొప్పవానిని వేదాలని చెప్పడము వాడుక. ఆళువారు ప్రబంధాలు కూడా వేదమే. ‘వేదాలను తమిళంలో చెప్పిన శఠగోపుడు. ‘ఇట్లా చెప్పినతడు శఠగోపుడు’ అని దానికి తాను కర్తనని చెప్పుకొన్నాడు. అయినా దీనిని చులకనగా చూడవద్దు. వేదాలనే వారు తమిళప్రబంధంగా గానం చేశారు.’ అని ఒక రచయిత అన్నాడు. ఇట్లా చెప్పడములో ఉద్దేశ్యం? ‘వేదం గొప్పదనియే కదా! భారతం అయిదో వేదం’ అని అంటారు. వేదం అనంతం. అనంతమయిన వస్తువు ఒక పరమ వస్తువే. ఆవస్తుజ్ఞానం కలవాడు ఎన్నికష్టాలు కలిగినా చింతా చలనమూ లేక ధర్మమును రక్షించుకొంటాడు. సమర్థ రామదాసస్వామి శిష్యుడు శివాజీ పరమధార్మికు డనిన్నీ యుద్ధాలలో చిక్కిన శత్రువుల కన్యలను యువతులనుగూడా జాగరూకతతో వారివారితావులకు పంపేవా డనిన్నీ ఆ శత్రువులే అభినందించారు. సాక్షాద్రామచంద్రమూర్తినే లక్ష్యంగా పెట్టుకొన్న రామమంత్ర జపపరాయణులకు కామం, మోహం మొదలయిన మకిల యేదీ మనస్సు కంటదు. అట్టివారు ధర్మమార్గం వదలిపోరు.

రామకీర్తనచేసే చోటులలో ఆంజనేయు డుంటాడని వాడుక. శ్రీరామునీ ఆంజనేయునీ తలచితే చాలు. వీ రిరువురూ లేక రామాయణమే లేదు. రామాయణమే వేదల. వేదోపదేశాలు జ్ఞానమార్గానికి చేరినవి. వేదాత్మకమయిన రామాయణం ధర్మమార్గానికి చేరినది.

‘వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే
వేదః ప్రాచేతసా దాసీ త్సాక్షాద్రామాయణాత్మనా’


వేదాలవల్ల తెలుసుకోదగిన పరమపురుషుడు దశరథునికి కొడుకుగా అవతరించినందున రామాయణరూపం ఎత్తిన వేదాలయొక్క సారం రామనామంలో ఇమిడి ఉంది. ఆ రామనామం చిత్తమాలిన్యం పోగొట్టి వేరొకదానిమీద ఆశ కలుగనీయక సదా ఆనందంగా ఉండేటటులు చేస్తుంది.

Parmacharya : Essence of Veda

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s