నువ్వులూ నీళ్ళూ ఎక్కడకువెళ్ళుతాయి?

పరమాచార్యుల అమృతవాణి : నువ్వులూ నీళ్ళూ ఎక్కడకు వెళ్ళుతాయి ?
(జగద్గురుబోధలనుండి)

మనిషికి మూడువిధాలైన ఋణము లున్నవి. మొదట దేవఋణం. రెండవది ఋషి ఋణం. మూడవది పితృ ఋణం. ఇవే కాక సంఘంలో ఉన్నందువలనఅతిథి అభ్యాగతులను ఆదరించవలసియున్నది. దీనిని మనుష్య యజ్ఞం అని అంటారు. బ్రహ్మయజ్ఞం ఋషులతృప్తికోసంచేసేది. బ్రహ్మమనగా వేదమని ఒక అర్థం. వేదములను అధ్యయనం చేయుటలో అథ్యాపనం చేయటం బ్రహ్మయజ్ఞం. ఇవి అందరూ చేసేవికావు. ఒక్క బ్రాహ్మణ జాతి మాత్రం చేయవలసిన విధి. అందరూ చేయవలసిన సామాన్యకర్మ ఒకటి యున్నది. అది భూత యజ్ఞం. అనగా ఒక మనుష్యులే కాక సృష్టిలో ఉన్న సమస్త జీవరాసులనూ ఉద్దేశించి ప్రేమ పురస్కరంగా వానికి ఆహార సదుపాయాలు కల్పించడమే భూతయజ్ఞం. ఈ విధంగా పితృయజ్ఞం, దేవయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం అని యజ్ఞములను ఏదో ఒక రూపములో చేయవలసిన విధి మనకున్నది. వైదిక ధర్మరీత్యా ప్రతి ఒక్కరూ తమ తమ కర్మలను సకృత్తుగా నిర్వర్తించి ఈశ్వ రార్పణ చేయడమే బ్రహయజ్ఞ మని చెప్పవచ్చును. 

వేదము మాతృ దేవో భవ, పితృ దేవో భవ- అని శాసిస్తున్నది. తల్లి తండ్రులయెడ వినయంగా వుంటూ చేతనైన సేవ చేయటం ప్రతిఒక్కరికీ కనీసపు ధర్మం. పుట్టినప్పటి నుండి పెరిగి పెద్ద అయ్యేంతవరకు మనకు మన తల్లిదండ్రులు చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారము చేయుట మన పని. అందుచేత సాధ్యమైనంత వఱకు వారి మనస్సు నొప్పించక నడచుకోవటం మనవిధి. తల్లిదండ్రులు గతించిన పిదప శాస్త్రసమ్మతముగా శ్రాద్ధ తర్పణ క్రియలు అందరూ తప్పక చేయ వలసి యున్నది. బ్రతికి ఉన్నప్పుడు తల్లిదండ్రుల బాగోగులు గమనించవలె నని చెప్పే సంఘసంస్కర్తలు మరణించిన పిదప మనము చేయవలసిన శాస్త్ర విహిత పైతృకకర్మలను ఒప్పు కోవటం లేదు. అది వారికి సరిహాసంగా వున్నది. 

నువ్వులు, తర్పణజలం. పిండములు, బియ్యము, అరటికాయలు, బ్రాహ్మణులకు పెట్టే భోజనము- ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తున్నాము- ఇవి ఎక్కడో కనిపించని పితరుల కెట్లా పోయి చేరుతవి? పితరులు మళ్ళా ఎక్కడో ఎదో ఒకరూపంలో పుట్టారనే అనుకొందాం. కానీ ఈ వస్తువులు వాళ్ళకు ఎట్లా పోయి చేరుతవి? ఇదంతా వట్టి పిచ్చితనం అని వాళ్ళు అంటారు. 

నువ్వులు నీళ్ళూ ఎక్కడకు వెళ్ళుతాయి? 

ఈ సందర్భంలో ఒక కథ చెప్పాల్సి వస్తుంది. 

ఒక పెద్దమనిషి తన కుమారుణ్ణి చదవటానికి పట్టణంలో వదలి పెట్టినాడు. ఆ పిల్లవాడు పరీక్షకు డబ్బుకట్ట వలసి వచ్చింది. వెంటనే తండ్రికి నీవు డబ్బును తంతీ మని యార్డరు చేయవలసిన దని కోరినాడు. కుమారుడు అడిగిన డబ్బు తీసుకొని తండ్రి తపాలా ఆఫీసుకు వెళ్ళినాడు. ఈ పెద్దమనిషి గ్రామీణుడు. పైకమును తంతీ ఆఫీసు ఉద్యోగికి అప్పచెప్పి దానిని పంపవలసిన దని కోరినాడు- తంతుల ద్వారా ఆ డబ్బు ఉద్యోగి పంపుతాడని, ఆ అమాయకుడు అనుకొన్నాడు. ఉద్యోగి డబ్బును తీసి, మేజాలో భద్ర పరచి, సరే పంపుతాను’- అని అన్నాడు. ‘నే నిచ్చిన డబ్బు నీదగ్గరే వుంచుకొన్నావే ? అది మా వాడికి ఎట్లా పోయి చేరుతుంది?’ అని అతని ప్రశ్న. ‘ఎట్లా చేరుతుందా? ఇదో ఈ విధంగా’ అని అతడు టెలిగ్రాఫ్‌ మీద తంతిని పంప సాగినాడు. డబ్బు ఇక్కడే వున్నదే? ఇతడేమో పోయి చేరుతుంది అని అంటున్నాడే. ఇదెట్లా సాధ్యం? అని పల్లెటూరి వాని సందేహం సందేహంగానే నిలచిపోయింది. మనియార్డరు మాత్రం పిల్లవానికి సురక్షితంగా పోయి చేరింది. 

మనం పితరులకూ, దేవతలకూ అర్పించే వస్తువులు కూడా ఈ విధంగానే చేరవలసిన చోటుకుపోయి చేరుతవి. శాస్త్రసమ్మతంగా మనం ఈ క్రియలను నిర్వర్తిస్తే పితృదేవతలు అవి ఎవరికి పోయి చేరవలయునో వారికి చేరేటట్లు చూస్తారు. ఒకవేళ పితరులు ఆసరికే ఎక్కడో పశువులుగా పుట్టివుంటే ఈ వస్తువులు గ్రాసరూపంగా వారికి అందుతవి. ఈ విధంగా వస్తువులను తగిన రూపంలో చేరవేయటానికి వలసిన స్తోమతను పితృ దేవతలకు పరమేశ్వరుడు ఇచ్చి వున్నాడు. అందు చేత శ్రాద్ధంలో మనము అర్పించే వస్తువులను స్వీకరించే దానికి వాళ్ళు ప్రత్యక్షంగా రావలసిన పనిలేదు. 

పితరులయందు విశ్వాసము శాస్త్రములలో శ్రద్ధ అవసరము. టీపార్టీలలో ఫలాని వారి ఆరోగ్యం కోసం నేను దీనిని త్రాగుతున్నాను- అని టోస్ట్‌ చెప్పడం మన కందరికీ తెలిసినదే. తాను త్రాగితే ఎదుటి వాడికి ఆరోగ్య మెట్లా కలుగుతుంది? ఇది మనోభావమేకదా? విశ్వాసమే కదా? శ్రాద్ధము అనగా శ్రద్ధతో చేయవలసిన క్రియ అని అర్థం. ఏ కార్యాన్ని మనం చేసినా దానికున్న నియమాలు, విధులు మనం పాటించవలసి వుంటుంది. ఒక ఉత్తరం వ్రాసి- ‘ఈ తపాలాపెట్టె అందంగా లేదు. నా వద్ద ఇంతకంటే మంచి పెట్టే వున్నది; అందులో ఈ ఉత్తరాన్ని వేస్తాను ఉత్తరం ఎందుకు పోయి చేరదు?’ అని వితండవాదం చేస్తే జరుగుతుందా? అందుచేత ఏ కార్యాన్నిగానీ మనం సకృత్తుగా చేయాలంటే వాని వాని విధులను పాటించవలసి వుంటుంది. పెద్దలు అందులకే ‘యథాశాస్త్రం, యథావిధి’ అన్నారు. కర్మ సఫలం కావాలంటే శాస్త్రవిధులను పాటించక తప్పదు.

Parmacharya : Where would Til and Water Go ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s