శంకరస్తోత్రాలు : సౌందర్యలహరి 3
(శ్లోకం, తాత్పర్యం, పరమాచార్యుల వ్యాఖ్యాసంగ్రహంతో)
అవిద్యానామన్తస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబకమకరన్దస్రుతిఝరీ ।
దరిద్రాణాం చిన్తామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి ॥ 3॥
(పాఠాంతరాలు – 1. మిహిరద్వీపనగరీ – మిహిరోద్దీపనగరీ, 2. స్రుతిఝరీ – శృతిఝరీ, 3. భవతి – భవతీ)
సూర్యుడు చీకట్లు తొలగించి వెలుగునిచ్చినట్లు, అమ్మవారి పాదధూళి అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞానప్రకాశమును ఇచ్చునట్టిది. మందమతుల మోడువారిన బుద్ధులను సారవంతంచేయునట్టి చైతన్యమనే పూలగుత్తులనుండి వచ్చు తేనె ప్రవాహము. దరిద్రులకు సకలసంపదలను ఇచ్చునట్టి చింతామణుల మాల. (హిరణ్యాక్షునిచేత సముద్రములో దాచబడిన భూమిని వెలికితీసినట్టుల) సంసారసాగరమున మునిగియున్నవారలను ఉద్ధరించునట్టి ఆదివరాహరూపములోని శ్రీ మహావిష్ణుని కోఱ.
లౌకికులకు ప్రజ్ఞ, సంపదలనూ, సాధకులకు జ్ఞానమోక్షములనూ అమ్మవారు అనుగ్రహిస్తుందని శంకరులు అంటున్నారు.
———
అమ్మవారి పవిత్ర పాదపద్మములను శంకరులు స్తుతించుచున్నారు.
Soundaryalahari 3 (with Paramacharya Vyakhyasangraha)