రేగులగౌరినోము కథ
ఒక మహారాజునకు సంతానములేక చాల విచారించుచుండెరు. అతని భార్య ఎన్నో నోములు నోచెను.కాని ఫలితము శూన్యము అందుచే నామె యొకనాడు “అన్ని నోములు నోచితిని, కాని ఆది నారాయణునకు దయలేదు” అని విలపింపదొడగెను. అంతలో విష్ణుమూర్తి వైష్ణవ రూపమున అక్కడకు వచ్చి”అమ్మా! నీవు చేసిన తప్పుకు భగవంతుని నిందించెదవేల? రేగులగౌరి నోము నోచి ఉద్యాపనము మరచిపోయితివి. అందుచే నీకు సంతానప్రాప్తి కలుగలేదు. ఇప్పటికైన మించినదిలేదు. ఆ నోము నోచుకొనుము” అనెను. అందుకామె, స్వామి! అదెట్లు నోచవలయనో సెలవొసంగుడు యని ప్రార్ధింప నతడు “అమ్మా ! రెండున్నర సోలల బంగారు రేగుపండ్లు చేయించి, దక్షిణ తాంబూలములతో వాటినొక బ్రాహ్మణునకు వాయన మియ్యవలయునని” చెప్పి వెడలిపోయెను. ఆ ప్రకారముచేసి సంతానమును పొంది సుఖముగా నుండెను.
ఉద్యాపన:
ఈ కథను చెప్పుకని యేడాది పొడుగున అక్షతలు వేసుకొనవలయును.ఆ తరువాత తొమ్మిది తవ్వల రేగుపండ్లలో నొక బంగారు రేగుపండు వేసి ఒక ముసలి బ్రాహ్మణునకు దక్షిణ తాంబూలాదులతో వాయన మియ్యవలెను.
Regula Gauri Nomu Katha