రాముని గుణగణాల వర్ణన
(శ్రీభాష్యం అప్పలాచార్యులవారి తత్వదీపికా వ్యాఖ్యనుండి)
అయోధ్యాకాండ తొలి సర్గ వాల్మికిచే రాముని గుణగణాల వర్ణన.
శ్రీరాముడు మానవుడుగా జన్మించి మానవులలో తప్పక ఉండవలసిన కొన్ని గుణములను ప్రదర్శించినాడు.వానిని మనము ఎరుంగవలెను.
సచ నిత్యం ప్రశాంతాత్మా మృదు పూర్వంతు భాషతే |
ఉచ్య మానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే ||
అతడు నిత్యమూ ప్రశాం తమగు మనసు కలవాడు.ఆతని మనసులో ఎన్నడునూ కామముగాని , క్రోధము గాని , లోభము గాని చోటు చేసుకొనవు. అందుకే నిశ్చలముగా ఉండును. మనసున ప్రశాంత స్థితి కలిగి ఉండుట మానవునకు ప్రధానముగా ఉండవలెను.
రెండవది మాట. శ్రీరాముడు ఎల్లప్పుడునూ ఎదుటివారి మనసునొప్పి చెందకుండ వినుటకు ఇంపుగ సుకుమారముగ , మధురముగ మాటాడెడివాడు. ఎవరైననూ తనను గూర్చి పరుషముగ మాటాడిననాడు కూడ దానికి బదులు చెప్పెడివాడుకాదు. బదులు చెప్పక పోవుట సమాధానము చెప్పెడి శక్తిలేక కాదు. ప్రశాంతమైన మనసు కలవాడు అగుటచే ఎదుటివారు మాటాడిన మాటకు ఆతని మనసున కోపము కలిగెడిదికాదు. కోపము కలిగిన నాడు మాట పరుషముగా వచ్చును. ఆతనికి కోపమే రాకపోవుటచే పరుషమైన మాట వచ్చెడిదికాదు. ఎవరైననూ పరుషమైన మాటలు ఆడిననూ వారితో మృదువుగా వారిని లాలించుచూ మాటాడెడివాడు గాని పరుషముగా మాటాడెడివాడుకాదు.
ఈస్థితిని మానవులు నేర్చుకొనవలెను.