జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ

పరమాచార్యుల అమృతవాణి : జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ
(జగద్గురుబోధలనుండి)

వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే,
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ.

మహాకవి కాళిదాసు రఘువంశం అనే కావ్యానికి మొదట ఈ మంగళ శ్లోకం రచించాడు. జగత్తుకు అనగా ప్రపంచానికి పార్వతీపరమేశ్వరులు తలిదండ్రులవలె ఉన్నారు, అని ఆ మహాకవి అన్నాడు. ఇదేవిధంగా భగవత్‌ పాదులవారున్నూ మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః, బాంధవా శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్‌ అని ఒకచోట సెలవిచ్చారు.

ఆవు అనే పదము ఉన్నది. ఇందు రెండు అక్షరాలు ఉన్నవి. ఈ రెండక్షరాలనూ వినంగానే మనస్సులో ఒక రూపం పొడగట్టుతుంది. ఆ పదము నిర్దేశించే వస్తువుయొక్క రూపం జ్ఞప్తికి వస్తుంది. ఈ రెండక్షరాలూ ఒక గుర్తు లేక సంకేతం. ఆవు అనగానే గోవు జ్ఞప్తికి వస్తుంది, లేదా ఆవును చూడంగానే దానికి సంకేతమైన ఆవు అనే మాట మనస్సుకు తట్టుతుంది. వీనికి అవినాభావసంబంధం. అనగా ఒక దానిని మరియొకటి విడనాడని చెలిమి ఉన్నట్టున్నది. ఈ విషయాన్నే నామరూపాలని పేర్కొంటారు. వీనిలో ఒక దానినుండి మరొక దానిని వేరుచేయలేము. ఒకటి వాక్కు మరొకటి దాని అర్థము. ఈ వాగర్థాలు ఎలా సంపృక్తాలై ఉన్నవో అనగా ఒక దానిని మరొకటి వదలక చేరి ఉన్నవో, అట్లే పార్వతీపరమేశ్వరులు ఒకరి నొకరు వదలక, ప్రపంచానికి తలిదండ్రులై ఉన్నారనిన్నీ, వారికి నా వందనములనిన్నీ కాళిదాస మహాకవి మంగళాచరణం చేస్తున్నాడు. ఇదే అర్థ నారీశ్వర తత్త్వం. ఇటు చూస్తే అంబికా అటు చూస్తే అయ్యా లేక పార్వతీ పరమేశ్వరులు. సంస్కృత భాషాభ్యాసం చేసే వారందరూ ఈ శ్లోకం చదివి మరీ నమస్కరిస్తారు.

మనకు రూపు ఇచ్చేవారు మన తల్లిదండ్రులు దేహానికి కారణభూతులు తండ్రి. పుష్టి గలిగించే ఆహారమిచ్చి పోషించేది తల్లి. దేహానికి పుష్టి గలిగించే వస్తువు ఆహారము కొరత లేకుండా ఆత్మకు పుష్టి ఇచ్చేవారు ఎవరు? ఆత్మ అనగా ప్రాణం, ప్రాణానికి పుష్టి ఏది? ఆనందం, జ్ఞానం.

దేహము ఏనాడు ధరించామో ఆనాటి నుండీ ప్రాణానికి కష్టాలే. అనగా ఈ కష్టాలంతా కారణం జన్మ లేక దేహధారణ. ఇంకో జన్మ ఎత్తితే మరిన్ని కష్టాలు. కన్న తండ్రి ఏదో సంపాదించి ఇంత నిలువ చేసి పోయినాడని దేహానికి శ్రమ లేదనుకొన్నా ఆత్మకు ఎన్నో కష్టాలు, శ్రమలు, అవమానాలూ, దుఃఖాలు, దేహానికి గాని ఆత్మకుగాని ఏ విధమైన కష్టమూ ఉండగూడదని అనుకుంటే జన్మలేకుండాపోవాలి, జన్మ ఎత్తామో ఆనందం తక్కువ దుఃఖం ఎక్కువ.

దుఃఖ స్పర్శలేకుండా ఆరుగాలంలోనూ ఆనందంగా వుండేటట్టు చేసేది ఆత్మ. అందరి ఆత్మలకున్నూ పుష్టినీ, ఆనందాహారాలనూ ఇచ్చునది పరాశక్తీ పరమేశ్వరుడూ, ఆత్మ జగన్మాత, ఆయన జగత్పిత. వారికి శరణుపొందితేనే గాని జన్మ లేకుండా పోదు. జన్మ లేకుండా పోవడమంటే అవధి లేని ఆనందమే. జన్మ కలిగిందంటే ఆనందానికి ఒక కొరత అని అర్థం. ప్రాణానికి లేక ఆత్మకు, ఆహారం అంటే పుష్టి, ఏమిటీ అని ఆలోచిస్తే ఎప్పుడూ ఆనందంగా వుండడమే. ఈ ఆనందం ఇవ్వగలవారు తల్లిదండ్రులే. కొందరూ ఈశ్వరోపాసనా, కొందరు దేవ్యుపాసనా, మరికొందరు యిరువుర కూడిక ఐన శివశక్త్యుపాసనా చేస్తారు.

అయితే వీరి వద్దకు పోవలసిన అవసరం? జబ్బుతో తీసుకుంటున్న మనిషి వైద్యుని దగ్గరకు వెళతాడు. డబ్బులేని వాడు యాచనకో చేబదులుకో శ్రీమంతుని వెతుక్కుంటూ వెడతాడు. ఒక్కొక్క పని కోసం ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళవలసి వుంటుంది. మనకు అది లేదూ, ఇది లేదూ అనేకొరతా, ఫలానావాడు అవమానించాడు అనిన్నీ లేక తగిన మర్యాద చేయలేదు అనే దుఃఖమున్నూ జన్మతో వచ్చింది. ఈ కొరతలను పోగొట్టుకోవలెనంటే, మనసుకు ఒక పూర్ణత్వం సిద్ధించాలంటే పార్వతీ పరమేశ్వరుల వద్దకు వెళ్ళాలి.

మనస్సుకు ఎప్పుడూ ఏదో ఒక చింత. దీనికి కారణం ఏమిటీ? జన్మ. డబ్బులేని వాడు యాచనకు శ్రీమంతుని కడకు వెళ్ళినట్లే ”జన్మ ఇక మనకు వద్దు” అని అనుకొన్నవాడు జన్మలేనివాని కడకు వెళ్ళాలి. అతని అనుగ్రహమాత్రాన జన్మరాహిత్యం సులభంగాసిద్ధిస్తుంది. జన్మ లేకపోతే చింతలేదు. అందువల్ల చావు పుట్టుకలులేని పార్వతీపరమేశ్వరుల కడకు మనము వెళ్ళాలి.

మనకందరికీ చావు పుట్టుకలున్నవని తెలుసు. పుట్టుకకు కారణం కామం. చావునకు కారణం కాలుడు. కామకారణంగా కలిగిన వస్తువు కాలగ్రస్తమై నశించిపోతూంది. కామ వీక్షణంతో మోడు కూడా చిగిరిస్తుంది. కాలదర్శనంతో ఎండిపోయి జీర్ణిస్తుంది. ”కాలో జగద్భక్షకః”. కాలంవచ్చిందంటే సూర్యచంద్రాదులున్నూ చూపులేకుండా పోతున్నారు.

కామం లేకపోతే పుట్టుక లేదు. కాలం లేకపోతే చావు లేదు. ఈ రెండింటినీ జయించాలంటే పరమేశ్వరుని వద్దకు వెళ్ళాలి. అసామాన్యమయిన ఇట్టి వరం అనుగ్రహించగల ఆ వర ప్రసాది ఎటువంటి వాడు?

”కాముని కంటితో నీఱుచేశాడట
కాలుని కాలితో తన్ని వేశాడట”

మన్మథుణ్ణి చూచి నంతమాత్రాన దగ్ధంచేసినవాడికీ, కాలుని కాలితో తన్నిన కాలకాలునికీ చావుపుట్టుకలులేవు. ఆయన అనుగ్రహం గనుక సంపాదించుకుంటే మనకు కూడా పుట్టటం గాని గిట్టటంగాని ఉండదు.

పరమేశ్వరుడు ఒక్కడు ఉంటే సరిపోదూ మరి అంబిక అవసరమేమిటీ? పార్వతీ పరమేశ్వరులు వాగర్థాలు కదా, ఈశ్వరుడు కాముని నిగ్రహించింది నొసలికంటితో. అర్థనారీశ్వర ప్రకృతులగు వీరికి మూడోకన్ను ఉమ్మడి. దానిలో ఆయనకు సాబాలూ ఆమెకుసాబాలూ, కాలుని తన్నినది ఎడమకాలితో, ఆకాలు అంబికది. అందుచేత కామ విజయానికీ కామనిగ్రహానికీ అమ్మవారి అనుగ్రహంకూడా ఉండాలి. జన్మవద్దనుకుంటే మనం ఈ పురాణదంపతుల నిద్దరినీ చేర్చి ఉపాసనచేయాలి. ఏకశరీరులై ఉన్నందున మన పని చాలా తేలికయింది. వారి అనుగ్రహం ఉంటేచాలు చావుపుట్టుకల సంత మనకుండదు.

సంగీతంద్వారా భగవదుపాసనచేసినవారిలో ముత్తయ్య దీక్షితులు, త్యాగయ్య, శ్యామశాస్త్రి అనే మువ్వురు గాయక శ్రేష్ఠులు ఉన్నారు. దీక్షితుల వారు నవావరణ కీర్తనలను వీణమీద పాడి అమ్మవారిని ఆరాధించేవారు. శ్రీ చక్రార్చనచేసేవారు. సంగీతమందు అభిరుచి ఉన్నవారికి ఈ విషయం తెలిసి ఉంటుంది. దీక్షితులవారు ఒకనాడు ఆలాపన చేస్తూ అందే మునిగిపోయి ఉన్నారు. ఆనాడు కార్తిక అమావాస్య ”శ్రీ శ్రీమీనాక్షీ మే ముదం దేహి” అనే చరణం పాడుతున్నారు. పాట చివర ”పాశమోచనీ” అని ఉంటుంది. ‘ముదం దేహి పాశమోచని’ అని పాడుతూండగా వారిశ్వాస అట్టే ఆగిపోయింది. మరణబాధే లేదు. సంకీర్తనచేస్తూ తన్మయులైపోయారు. ఎప్పుడూ దేనిని తలుస్తూ ఉన్నారో ఆ వస్తువే అయిపోయారు. మరణమనేది లేక ఆనందంలో లయం పొంది జనన మరణాలులేని స్థితినిపొందారు.

చావుపుట్టుకలు రెండున్నూ దుఃఖం కలిగించేవే. జనన నివృత్తిని వెతకికొంటూ ప్రపంచానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులను తలచుచూ ”జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ” అని మనము వారికి శరణాగతి చెయ్యాలి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s