శ్రీ కృష్ణ జన్మాష్టమి/ జయంతుల నిర్ణయము
శ్రీ కృష్ణావతార శుభ సందర్భమునకు సంబంధించిన వ్రతములు రెండు-
1. శ్రీ కృష్ణ జన్మాష్టమీ వ్రతం
2. శ్రీ కృష్ణ జయంతీ వ్రతము
జన్మాష్టమీ నిర్ణయము:– శ్రావణమాస కృష్ణపక్షమున అష్టమి నిశీథా వ్యాప్తిని బట్టి జన్మాష్టమి నిర్ణయము. ఈ అష్టమి శుద్ధమైననే (సప్తమీ విద్ధ కాకున్ననే) వైష్ణువులకు గ్రాహ్యము. సప్తమి ఉదయాత్పరం – నిశీథాత్పూర్వం ఏ మాత్రము ఉన్ననూ అష్టమీ విద్ధయగును. స్మార్తులకు విద్ధాష్టమియూ గ్రాహ్యమే.
జయన్తీ విషయము :- సూర్యుడు సింహరాశిలో నుండగా శ్రావణ మాస కృష్ణ పక్షమున అష్టమికి రోహిణీ యోగమున్నచో అది జయన్తి యగును లేదా భాద్రపద కృష్ణపక్షము అందు అయినను-సూర్యుడు సిమ్హరాశిలో ఉన్నప్పుడే -అష్టమికి రోహిణీ యోగమున్నచో అనుకల్పముగా జయంతి యగును. ఈ అష్టమికి రోహిణీ యోగము నిశీథమున గావచ్చు- తత్పూర్వము/ పరమందైనను గావచ్చును గాని ప్రతి సంవత్సరమిట్ట యోగము లభించునను నియమము లేదు. ఇదంతయు స్మార్తవ్రతం.
వైష్ణవులకు రోహిణి కూడా కృత్తికా విద్ధ కాకూడదు. శ్రావణమున గాని, భాద్రపదమునగాని- సింహరాశిలో సూర్యుడున్నప్పుడే – సప్తమీ విద్ధగాని అష్టమికి కృత్తికా విద్ధ కాని రోహిణితో నిశీథమున గాని, మరొక సమయమున కాని, ఏ మాత్రము యోగమున్నను జయంతి యగును. ఆనాడు సంక్రాంతి దోషము ఉండరాదు. ఇట్టివి రెండు సందర్భములు వచ్చునచో రెండవదే గ్రాహ్యము. ఒక్కటి అయినను లభించనిచో అష్టమ్యాం వా నవమ్యాం వా దశమ్యాం యది రోహిణీ శుద్ధాష్టమికి కాకున్నను, నవమికి గాని/ దశమికి గానిశుద్ధ రోహిణీ యోగము ఉన్నప్పుడే జయన్తి. ఇదియును లభించనిచో సింహమాసమున శ్రావణ కృష్ణమున మృగశీర్షలో జయన్తి యని వైష్ణవ మతము. (వ్రత నిర్ణయ కల్పవల్లి)
ఇక ఈ సంవత్సరము:-
శ్రావణ కృష్ణ ద్వితీయ శనివారం (౧౭-౦౮-౨౦౧౯) నుండి భాద్రపద కృష్ణ తృతీయ మంగళవారం (౧౭-౦౯-౨౦౧౯) వరకు సూర్యుడు సింహరాశిలో ఉండగా-
23-08-2019 శుక్రవారము నాడు
శ్రావణ కృష్ణ సప్తమి ఉదయం 08:06 వరకు
కృత్తిక రాత్రి 03:45 వరకు ఉండగా
24-08-2019 శనివారం నాడు
అష్టమి ఉదయం 08:29 వరకు
రోహిణి రాత్రి తెల్లవారుజాము 04:14 వరకు ఉన్నది.
కాగా 23-08-2019 శుక్రవారము నాటి అష్టమి సప్తమీ విద్ధయే అయినను, నిశీథ వ్యాప్తిని బటీ ఆనాడు స్మార్తులకు శ్రీకృష్ణ జన్మాష్టమి యోగము కనిపించుచున్ననూ- ఆనాటి నిశీథము తరువాత రాత్రి 03:45 నుండి మరునాడు 24-08-2019 శనివారం ఉదయం 08:29 వరకు అష్టమీ రోహిణీ యోగము కూడా ప్రస్ఫుటముగనే యున్నది. కాల మాధవీయమున ఇట్టి సందర్భమునకు నిర్ణయమిట్లున్నది-
అష్టమీ పూర్వేద్యుః నిశీథా దర్వాగేవ ప్రవృత్తా|
రోహిణీ తు నిశీథా దూర్ధ్వా మారభ్య పరేద్యుః నిశీథాత్పూర్వమేవ సమాప్తా|
అష్టమీపరేద్యుర్యదా కదా వా సమాప్తా|
అత్ర పరేద్యుర్నక్షత్రం బహులమ్| తిథి రల్పా| అథాపి-
పూర్వ విద్ధాష్టమీ యాతు ఉదయే నవమీ దినే|
మొహూత మపి సంయుక్తా సంపూర్ణ సాష్టమీ భవేత్||
(సంయుక్తా = రోహిణ్యా సంయుక్తా)
అతః అత్రాపి పరేద్యురేవ జయన్తీ – అని.
దీనిని బట్టి 24-08-2019 శనివారం నాడు స్మార్తులకు శ్రీకృష్ణ జయంతి యగును.
ఇట్లు 23-08-2019 అహుక్రవారం నాడు జన్మాష్టమి, 24-08-2019 శనివారం నాడు జయన్తి యును అగుచున్నవి.
మంచిదే. కానీ ఎప్పుడైనా ఇలా ఒక సంవత్సరమున ఈ యోగములు రెండునూ వచ్చుచో జయన్తీ వ్రతమును ఒక్క దానినే ఆచరించిన సరిపోవుననీ- జన్మాష్టమి వ్రతము దానిలో అంతర్భూతమైపోవుననీ నిర్ణయ సింధువులో-
యస్మిన్వర్షే జయన్త్యాఖ్యా యోగో జన్మాష్టమీ తదా|
అన్తర్భూతా జయన్త్యాం స్యాత్ ఋక్షయోగ ప్రశస్తితః||
అనగా అష్టమీ నిశీథ వ్యాప్తి కంటే – అష్టమీ రోహిణీ యోగమునకే ప్రశస్తి ఎక్కువ గనుక – జయన్తిలో జన్మాష్టమి కలిసిపోవునని నిర్ణయించబడినది.
గమనిక:-
శ్రీకృష్ణజన్మాష్టమీ కర్తవ్యములు :- ఉపవాసము, జాగరణము, శ్రీకృష్నాదుల పూజ, చంద్రార్ఘ్యము ఇత్యాదులు. (కాలమాధవీయం బట్టి)
కాగా, జయన్తీ వ్రతమున కూడా కర్తవ్యములు అవియే. తేడా యేమనగా జయన్తి నాటి ఉపవాసము మాత్రము దానసహితము అని కాలమాధవీయమున వివరించబడినది గనుక జయన్తిలో జన్మాష్టమి అంతర్భూతమగుననుట సముచితమే.
కనుక ఈ సంవత్సరము 24-08-2019 శనివారం నాడు స్మార్తులు శ్రీకృష్ణ జయన్తీ వ్రతమునే ఆచరించనగును.
ఇక వైష్ణవ విషయము:–
24-08-2019 శనివారం నాటి ఉదయమున సప్తమీ విద్ధగాని, శ్రావణ కృష్ణపక్షాష్టమికి కృత్తికా విద్ధగాని రోహిణి యోగమున్నది. సూర్యుడు సింహరాశిలో ఉండును. సంక్రాన్తి దోషము లేదు. భాద్రపదమున ఇట్టి యోగము లేదు.
కనుక 24-08-2019 శనివారం నాడు వైష్ణవులకు కూడా నిస్సంశయముగా శ్రీకృష్ణజయన్తి అగును.
కనుక ఈ సంవత్సరము 24-08-2019 శనివారం శ్రావణ కృష్ణాష్టమి నాడు స్మార్తులకు, వైష్ణవులకును, అందరకును శ్రీకృష్ణ జయన్తి సకల శుభప్రదము.
(శ్రీ కంచి కామకోటి పీఠ పంచాంగం నుంచి )
Krishna Janmashtami / Jayanti Nirnayam
1 Comment