మోక్షము

పరమాచార్యులఅమృతవాణి : మోక్షము

(జగద్గురుబోధలనుండి) 

మనకందరికి బిడ్డలంటే ఉత్సాహం, వాత్సల్యం, ప్రేమ ‘లాలిస్తే బిడ్డలూ, పూజిస్తే దేవుళ్ళూ’ అని సామెత, ఉండనే ఉన్నది. బిడ్డలకు బుద్ధి వృద్ధి కానంతవరకూ కామక్రోధాదులుకలుగవు. వారికోపం క్షణికం. వారిదుఃఖంక్షణికం. ఒక నిమిషంలో ఏడుపు ఇంకో నిమిషానికి ఆనందం. ఏదీ దీర్ఘంగా ఉండదు. కాని మనకో? శోకంగాని క్రోధంగాని కలిగిందంటే మనకు ఆయువున్నంతవరకూ ఉంటుంది. ద్వేషమూ అంతే. అది వేళ్ళు తొక్కి మహావృక్షం అవుతుంది. శిశువులకువలె క్షణికంగా ఉన్నా ఫరవాలేదుగాని ఈ గుణాలు లోతులోతులకు పోక పైపైనే వస్తూ పోతూ ఉంటే అదే నిజమయిన జ్ఞానం. ఇట్లా ఎవరయినా ఉండగలిగి నారంటే అది అమ్మచూపు చలవ. అంబికా దయాచిహ్నం. 

శక్నో తీహైవ య స్సోఢుం ప్రాక్‌ శరీర విమోక్షణాత్‌ 
కామక్రొధోద్భవం వేగం స యుక్త స్స సుఖీ సరః.


అని గీతాశ్లోకం. 

మోక్ష మనేది చచ్చిపోయిన తరువాత ఏదో లోకానికి పోయి అనుభవించడంకాదు. అది ఈ లోకంలోనే చేతికందిన పండల్లే కరతలామలకం కావాలి. ఇప్పుడు మోక్షమబ్బితేనే చచ్చింతరువాత మోక్ష మబ్బడం. ప్రస్తుతం దుఃఖంతో కష్టంతో జీవితం గడపి చచ్చిన తరువాత మోక్షం వస్తుందని ఎదురుచూస్తే ప్రయోజనంలేదు. 

మనం స్వల్పకారణానికిగూడా సాధారణంగా దుఃఖిస్తూ వుంటాం, భయపడుతూ ఉంటాం. ఆ స్వల్పకారణం కామం’ కోరిక కావచ్చు. మనలో కొందరకు తొందరగా కామక్రోధాదులు కలుగడంలేదు. ‘ఏమి వచ్చినా సరేకానీ’ అని గుండెనిబ్బరంతో వారుంటారు. మరికొంచెం కామక్రోధాదులు విజృంభించినవారు వానిప్రకోపానికి తాళుకోలేక లొంగిపోతారు. కాని జ్ఞానులమనసు ఒకొంతయినా అలజడి చెందదు. 

మరణానికి ముఖ్యకారణాలు నాలుగు. అవి భయము, కోపము, కామము, దుఃఖము. కామక్రోధాదులకు అరిషడ్వర్గమునిపేరు. వీనిని జయించడమే మోక్షం. 

బాల్యం మొదలుకొని కామక్రోధాలను అణచినవాడు చిరంజీవి అవుతాడు. ఎంత వాన వచ్చినా తడియని గొడుగును ‘వాటర్‌ ఫ్రూప్‌’ గొడుగు అని అంటాము. మనం కూడా ఆగొడుగువలె కామ-ఫ్రూప్‌, క్రోధ-ఫ్రూప్‌, శోక-ఫ్రూప్‌ కావాలి. అయితే అదే ముక్తి. అదే మోక్షం. అది చనిపోయిన తరువాత దొరికే వస్తువు కాదు. ఈలోకంలోనే మనకు అట్టి స్థితి కలిగిందా లేదా అని పరిశోధనచేసికొంటూ ఉండాలి ఈ లోకమే ఆపరీక్షకు ఒరపిడిరాయి. మనకు శిశుస్వభావం ఏర్పడిపోవాలి. భయముగాని, దుఃఖముగాని మనసులో అతుక్కొనిపోకుండా చేసికోవాలి. ఈ పక్వస్థితి మరింత కమియ పండితే మనమున్నూ సాక్షాద్దక్షిణామూర్తి వలె ఉండిపోతాం. 

పురుషసూక్తం చెపుతుంది – ‘అమృతుడుగా వుండిపోవడమే మోక్షం అని. ఏడుస్తూ ప్రాణాలు వదలితే అది మరణం. అట్లా దుఃఖపడక ప్రాణాలను వదలడమే మోక్షం. 

దుఃఖంవేరు. బాధవేరు. దేహంలో బాధఉండవచ్చు. ఎంత బాధవున్నా కొందరు చాలాథైర్యంతో సహిస్తారు. మరికొందరు అయ్యో అమ్మో అని దొరలిదొరలి ఏడుస్తారు. బాధలేకుండా జీవించడం మనకు చేతగానిపని. కాని ఎంతబాధ ఉన్నా దుఃఖంవున్నా బహిర్గతంకాకుండా ఓర్చుకోవడం మనకు చేతనయినదే. అందుచేతనే ఏడుస్తూ ప్రాణాలువదలడంమరణమనిన్నీ శోకం ఏమాత్రమూ లేకుండా ప్రాణాలు వదలడం మోక్షమనిన్నీ చెప్పడం. ఆస్థితికే అమృతం అనిపేరు. ఆస్థితిని ఇచటనే – ‘ఇహైవ’ మనం పొందాలి. దానికి ఉపాయం ఏమంటే మనం శిశువుల సారళ్యం అలవాటు చేసుకోవడమే. శిశువే దైవం కావాలి. మనం దేనితో ఎక్కువనేస్తం ఉంచుకొంటామో ఆ వస్తువుగానే ఐపోతాం. అందుచేతనే మహర్షులు దేవిని – ‘తల్లీ! నీవు నాకు కుమారివై పుట్టు!’ అని కోరుకోడం. 

శిశువులే సాధారణంగా దేవతాస్వరూపులు. భగవంతుడే శిశువుగా అవతరించినప్పుడు వారిని లాలించి పాలించిన మహానుభావులు శిశుస్వభావులే అవుతారు. వారి మనస్సుకు కామక్రోధాదుల మురికి అంటదు. అట్టి మహాభాగ్యం భృగుకాత్యాయనులకే దొరికింది. 

వయస్సు వచ్చినా మనం బాలురలాగా ఉండాలి-‘బాలోన్మత్త పిచాచవత్‌’, ‘నీవు శిశువవు అయితే భగవంతుడ వవుతావు’ అని ఉపనిషత్తులు చెపుతై. బిడ్డలకు కోపశోకా లట్లా దీర్ఘకాలం ఉండవో అలాగే మనకున్నూ అట్టి స్థితి అభ్యాసంమీద రావాలి. ఎట్టి కష్టాలువచ్చినా ఓరిమితో ఆనందంగా ఉండడమే అమృతత్వ మనిన్నీ మోక్షమనిన్నీ చెప్పడం. 

శక్నో తీహైవ య స్ఫోఢుం ప్రాక్‌ శరీర విమోక్షణాత్‌, 
కామక్రోధోద్భవం వేగం స యుక్త స్స సుఖీ నరః. 

ఇక్కడనే ఈలోకంలోనే ఉన్నపుడు ఎవడుసహిస్తాడో-‘శక్నో తీహైవ’ సహించడం దేనిని కామక్రోధాల వేగాన్ని. 

కామక్రోధాదులవేగం ఓర్చుకోడం సామాన్యమయిన పనికాదు. వాని వేగం మనలను ఈడ్చుకో పోతుంది. పోయే రైలు పక్క నిలుచుంటే దాని వేగోద్ధతి మనలను కూడా లాక్కోపోతుంది. ఆలాగే వీని వేగంకూడా. కామక్రోధాలను అణచాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు తెలియకుండానే వాని వేగం మనలను లాక్కోపోతుంది. ఎవడీ వేగాన్ని ఓరుస్తాడో అతడే యోగయుక్తుడు. యోగయుక్తాత్ముడు. శరీరం వదలుటకు ముందే ఈ లోకమునందే ఈ శరీరం ఉన్నప్పుడు కామక్రోధ ప్రకోపం ఓర్చుకోవాలి. శిశువులవలె సహజస్థితికి వచ్చే రీతి అలవాటు కావాలి. కృష్ణ భగవానునకూ కామమూ ఒకలీల, కోపమూ ఒకలీల. మనం కూడా ఇట్లా నేర్చుకోవాలి. శిశుభావం కలగడానికి మనం స్వామిని శిశువునుగా భావించి ఆరాధించాలి. మన కేభావం సహజంగా ఇష్టమో ఆభావంతో భగవదారాధన చేయాలి. 

చనిపోయిన తరువాత వైకుంఠలోనో కైలాసంలోనోఆస్థితి మనకు దొరుకుతుందని అనుకోవడం పొరపాటు. ఈలోకంలో సుఖదుఃఖాలలో ఏదో ఒకటి ఉంటుంది. పుణ్యంచేసి వైకుంఠానికి వెడతాడని అనుకుందాం. ఆ పుణ్యం అంతా అయిపోగానే ఎవరియో ఒకరి శాపానికిగురియై మళ్ళా ఈలోకానికి మరలి రావలసియే వస్తుంది. ఈ లోకమునందే భగవంతుని అంబికను శిశువుగా భావించి ఆరాధించి కోపకామ దుఃఖాదులను పోగొట్టుకోవాలి. దేవిని శిశుభావనతో పూజిస్తే మనకున్నూ శిశుభావం వస్తుంది. ఆమె అపుడే సాక్షాత్కరిస్తుంది. దానికే అమృతమనిపేరు. ఆస్థితి కలగడానికి ఆమె అనుగ్రహం ఉండాలి. ‘ఆమె మనకు దేవామృతం ఇస్తుంది’ అని చెప్పడానికి ఇదే తాత్పర్యం. మంచి జ్ఞానమే అమృతం. కన్నతల్లులు దేహానికి పుష్టి కలిగించే పాలిస్తారు. శ్రీమాత లోకజనని. ఆత్మకు పుష్టికలిగించే జ్ఞానక్షీరం ఇస్తుంది. శ్రీ మాతా పార్వతిగా ఆవిర్భవించినప్పుడు- 

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే, 
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి సమోఽస్తుతే. 


అని దేవీమాహాత్మ్యం చివర ముక్కంటిగా శివస్వరూపిణిగా చెప్పబడింది. అంబికను సర్వమంగళ అనిన్నీ లక్ష్మిని మంగళ దేవత అనిన్నీ అంటారు. ఆమెయే మళ్ళానారాయణి ఆమెయే కన్యాకుమారియై మన కామ మోహం భయం దుఃఖం మొదలైన వానిని పోగొట్టి శిశుస్వభావులను చేసి మరణవేళ చలనంలేని మనోభావంవుంచి అన్ని అవస్థలలోనూ ఆనందంగా ఉండేటటులుచేసే అమృతం ఇచ్చి సర్వమంగళంగా క్షేమంగా ఉండేటట్లు అనుగ్రహిస్తుంది. 

ఇది చమత్కరించిన మాట శివశక్తుల కభేదం శక్తి లేకుంటే శివుడున్నూలేడు. శక్తిచేతనే లోకంలో జనననివృత్తి ఏర్పడుతున్నది. తలిదండ్రులగు శివశక్తి శివుల కటాక్షంచేత కాలజయం కలుగుతుంది. జన్మసాఫల్యం అంటే జన్మనివృత్తే. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s