కర్మ మార్గము

పరమాచార్యుల అమృతవాణి : కర్మ మార్గము
(జగద్గురు బోధలనుండి)

‘ఇంద్రియ వ్యాపారాలనుతగ్గించుకొని, ఏకాంతమును అలపరచుకో. పరోపకారం తప్పించి ఇతర కార్యములలో పాల్గొనవద్దు. ధనాశను వదలుకొని అరణ్యమునకు పో’ అని పెద్దలు ఉపదేశం చేశారు. ఇట్లు దానిని వదలు, దీనిని వదలు- అని మనకు పరమ ప్రీతికరంగా వుండే విషయాలను త్యాగం చేయమంటే మనం అంత సులభంగా చేస్తామా? ఆ మాటలను వింటామా? చిత్తశుద్ధి ఏర్పడితేకాని, ఈ బోధలు మనకు రుచించవు. ఈ ఉపదేశమును అమలులో పెట్టడానికి వలసిన పరిపక్వత రాదు.

అందుచేత, ‘దానిని వదలు, దీనిని వదలు’ అని చెప్పడానికి బదులుగా- ‘దీనిని చేయి, దానిని చేయి’ అని నానావిధములైన కర్మలను విధులను, నిర్దేశించారు. కార్యమును చేసే ప్రవృత్తి మనకు సహజంగానే వున్నది. అందుచేత శాస్త్రవిహితమైన కర్మలను రాగద్వేషరహితంగా చేయుటకు పూనుకొంటున్నాము. కాని కార్యమని తలపెట్టితే అందులో ఇచ్ఛాద్వేషములు పొడసూపుతూనే వుంటవి. అందుచేత మొదటనే ధ్యానమని ప్రారంభించకుండా కర్మానుష్ఠానములను చేస్తూవచ్చినామంటే, భగవత్కృపవలన ఇష్టానిష్టములు తొలగి సత్కర్మలను సరియైన విధానంలో చేయగలుగుతున్నాము. ఇచ్ఛాద్వేషములు తగ్గుటవలన చిత్తశుద్ధి ఏర్పడుతున్నది. చిత్తశుద్ధి కలిగిన పిదప ధ్యాన వ్యగ్రతకు వలసిన ఏకాగ్రత మనకు లభిస్తున్నది.

అట్టి స్థితిలో మనం అడవికి వెళ్ళి ముక్కు పట్టుకొని కూర్చోవలసిన ఆవశ్యకత ఉండదు. సర్వమూ పరమాత్మ స్వరూపమే అన్న జ్ఞానం కలుగుతుంది. ఊరూ, అడవీ, ఏకాంతమూ, జనసందడి- అన్నీ పరమాత్మ స్వరూపంగానే అనుభవానికి వస్తుంది. కార్యమూ పరమాత్మయే. ధ్యానమూ పరమాత్మయే. ఏపనిచేసినా, మన ఆత్మ శాంతికి భంగము లేదు. దక్షిణామూర్తివలె మనమూ శాంతముగా ఆనందముగా ఉండిపోవచ్చు.

గీతలో భగవంతుడు అర్జునుడికి స్వధర్మ పరిపాలన చేయమని బోధిస్తున్నాడు. అనగా యుద్ధం చేయమంటున్నాడు. ఏకార్యమూ చేయకుండాధ్యానం చేయమనీ చెప్పినాడు. ”ఎల్లకాలమూ ధ్యాననిష్ఠలో వుంటున్న జనకాది రాజర్షులు లోకక్షేమార్థము ఎప్పడూ కర్మచేస్తూనే వచ్చారు. నేనూ వారివలె నిష్కామకర్మ చేస్తున్నాను” అనిపైగా అర్జునుడితో అంటున్నాడు. ఇవన్నీ పరస్పర విరుద్ధములుగా లేవా? అంటే ఒకదాని నుండి మరొకటి ఏర్పడుతున్నది. మొట్టమొదటనే ఆత్మానుసంధానం చేయలేము. కనుక కర్మానుష్ఠానం. దాని మూలకంగా చిత్తశుద్ధి – చిత్తశుద్ధి ఏర్పడిన పిదప నిష్కామ కర్మ-నిష్కామ కర్మద్వారా ధ్యానం చేయాలని భగవంతుని బోధ- దీనిలో సిద్ధి ఏర్పడిన పిదప మనలను ఏదీ బాధించదు. లోక క్షేమంకోసం బయట కర్మ జరుగుతూ వుంటుంది; లోపల ఎక్కడాలేని ప్రశాంతి.

చివరకు, లోకమంతా మాయ. పరమాత్మ ఒక్కటే సత్యము- అన్న బోధ కలుగుతుంది, మనంవేరు, పరమాత్మవేరు; కార్యం వేరు ‘నేను కర్తను’ – వేరు – అన్న ఆలోచనలు లేకుండా అద్వైతంగా బ్రహ్మగా ఉండవలెననే భగవత్పాదులవారి సిద్ధాంతం. ఆయన పేరును పెట్టుకొన్న నేనూ, ఎప్పడూ వైదికకర్మలు, పూజ, జపం, పరోపకారం – ఇవన్నీ చేయమని చెప్పటం ఎందుకనగా మనం ఉన్న స్థితిలో ఇక్కడనుంచి ప్రారంభిస్తేకాని, మనకు ధ్యాననిష్ఠకు వలసిన చిత్తైకాగ్రత కుదరదుకనుక, ఇట్లు ఆరంభించిచేస్తూ వచ్చినామంటే, ఈ కర్మలు సోపానములవలె సాయపడి అద్వైత శిఖరానికి మనలను అందరినీ తీసుకొని వెళ్ళగలవు. శ్రీకృష్ణపరమాత్మ, శంకర భగవత్పాదులు సూచించిన మార్గమూ ఇదే. మొదట కర్మ పిదప ఉపాసన అనగా భక్తి, చివర జ్ఞానము.

ఇట్లు క్రమముగా శ్రద్ధతో భక్తితో విశ్వాసంతో విహిత కర్మలనుచేస్తూ వచ్చినామంటే – దానికి తగిన పక్వత కలిగి ఆత్మధ్యానమునకు అలవాటుపడి కర్మలలో ప్రవృత్తుల మైనప్పటికీ, చిత్తము చెదరనిస్థితి మనకు ఏర్పడుతుంది. అలజడి అన్నమాటలేక, ‘మందస్మితం స్ఫురిత ముగ్ధ ముఖారవిందం’ అని ఆచార్యపాదులు వర్ణించిన దక్షిణామూర్తిని- ఆనందమూర్తిని- మనం ప్రతిరోజూ స్మరిస్తూ వచ్చినామంటే ఆత్మధ్యానస్థితికి సులభంగా వెళ్ళగలం.

కర్మ, భక్తి, ధ్యానము- పరస్పర విరుద్ధములకావు; పరస్పర సాహాయ్యకములే. కర్మానుష్ఠానములన్నీ – ధ్యానసమాధిలో లయం కావలసినవే. ఆ స్థితి ఒకటి ఉన్నదని మనం ఆరంభంనుంచీ జ్ఞప్తిలో ఉంచుకోవాలి. మన లక్ష్యమూ అదేకదా! ప్రతిరోజూ కొంత కాలమైనా ధ్యానానికి నిర్దేశించి, ఏపనీచేయక శాంతంగా, ఒక నిర్దిష్ట కాలంలో, నిర్దిష్ట ప్రదేశంలో కూర్చుండి ధ్యాన మభ్యసించవలసిన విధి మనకున్నది. ధ్యానం చేస్తున్నాము కదా కర్మానుష్ఠానములో ఏమున్నది? ఇవన్నీ అర్థరహితమైన క్రియాకలాపమని మనం అనుకోరాదు. Rituals are meaningless అని ఈసడించుకోరాదు. కర్మానుష్ఠానం మనం విధిగా చేయవలసినదే. దానిచేత చిత్తమాలిన్యం తొలగిపోతుంది. అపుడు హృదయంలో – జ్యోతీరూప శివదర్శనమై – దక్షిణామూర్తి యొక్క ఆనందావిర్భావం- అనుభవమౌతుంది.

1 Comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s