శ్రావణమంగళవారము పాట

శ్రావణమంగళవారము పాట

ఈశ్వర తనయునకు,పార్వతీపుత్రునకు గజాననునకు భక్తితోను,
విభవమునిచ్చే వైభవదాయినిని వినుతింతునిన్ను వినయముగను
||జయమంగళం నిత్యశుభమంగళం||

మహిమీద వెలసిన మంగళగౌరిని మదిలోన కొలిచెద భక్తితోను
పుడమిపైనొకరాజు సంతానహీనుడై పత్నితోగూడి కుములుచుండె ||జయ||

పరమేశ్వరుడంత జాలినొంది భూమీశుని ప్రాపుదమంచు భువికిదిగివచ్చె
జంగమదేవరగా జగతికేతెంచి భిక్షమడిగె యా భూపతిఇల్లాలిని ||జయ||

బంగారుపళ్ళెరముతో భూమీశుపత్ని భిక్షతీసుకురాగ భవ్యుడపుడు
క్షణమైన నిలువక కోమలాంగిని కానక చకచకా పోడొడంగె సాంబశివుడు ||జయ||

ఇదేమివింతయని ఇంతినివ్వెరపోయి మరునాడు ముందుగామరలివచ్చి
వెనుకగా నిలబడి కాచుకొనియుండ జగదీశుడేతెంచె జాగుసేయక ||జయ||

జంగమేశ్వరుని చూచి గట్టిగా పట్టుకొని భిక్షగైకొనవెందుకనెను
పిల్లపాపలులేని పడతి భిక్ష గైకొంగరాదనగ నా రాజపత్ని ||జయ||

మేమేమి చేయుదుము మాకేదిగతియనుచు సాష్టాంగపడిరి సాంబశివుని చెంత
భూతనాథుని గూర్చి భూరి తపమొనర్చు బాగౌను నీ భవితయనె భవ్యుడపుడు ||జయ||

సంతానవాంఛతో సతీపతులపుడు వేవేగ వనములోకి బోయి నిష్ఠగాను
తపమాచరించగా తపోధనుడేతెంచి సంతసమున ప్రత్యక్షమయ్యె సర్వేశ్వరుండు ||జయ||

సతీపతులపుడు తమ సంతానేచ్ఛను సంతసించి సాంబశివునికి చెప్పె
సర్వేశ్వరుండంత సంతసముచెంది సతీపతులతో పలికెనిట్లు ||జయ||

కాంచుమోయమ్మ కాళికాగుడివెనుక చూతవృక్షమ్ము పైన ఫలమున్నదొకటి
ఆ పండు తిన్నచో ఆకాంక్ష తీరునని సాంబశివుదంత వెడలిపోయె ||జయ||

అంతటారాజు అత్యాశతో వృక్షమందలి పండ్లన్ని కోసితెచ్చె
విప్పిచూడగా అందు ఫలమొక్కటేయుండె వింతగాను ||జయ||

అత్యాశకుపోయిన ఆ రాజునపుడు శపియించె పార్వతీ తనయుడపుడు
చేసుకున్నవారికి చేసుకున్నంత ప్రాప్తియే గాని రవ్వంత ఎక్కువైన రాదటంచు ||జయ||

ఆ పండు ఆరగించ అతివ గర్భముదాల్చె అనతికాలములో
ఉన్నత తేజస్సుతో ఉద్భవించిన సుతునిగాంచి ఉత్సాహముతో ఉప్పొంగె రాజు ||జయ||

శివయ్యాయని శివునిపేరునిపెట్టి సంతసమునవారు సంచరించంగసాగ
యువతులందరు గూడు యువరాజుకపుడు ఉగ్గుపాలనుబోసి తిలకమునుదిద్ది ||జయ||

పెంచి పెద్దగజేసి పెంపుమీరగను పెండ్లియీడుకువచ్చె నాతని కపుడు
కన్యనొకదానిని తెచ్చి కుమారునికపుడు పెండ్లిచేసె ఆ రాజు వైభవముగ ||జయ||

నవదంపతులారాత్రి హాయిపొందేటి ఆ సమయమందు
గౌరిదేవి కా వధువు భక్తురాలగుటవలన కలలోన కనుపించె కరుణించతలచి ||జయ||

తరుణీమణీ నీ పతికి గండంబు వచ్చె వేవేగలెమ్మని మేలుకొలిపె
మాంగళ్యవతియైన ఆ మహిళయపుడు మేలుకొనిజూచె మంచముక్రింద ||జయ||

కృష్ణసర్పమును జూచి గౌరిదేవిని తలంచి క్షీరపాత్రను దెచ్చి యుంచె
కాంతభక్తికి మెచ్చి కాళసర్పమపుడు కలశంబునందు దూరియుండ ||జయ||

వనిత భక్తితో వందనంబులు చేసి పాత్రమూతను బిగించి పైనపెట్టి
ఉషోదయమ్మున శివయ్య లేచి శివదర్శనానికై వెడలె కాశీపురి కి ||జయ||

పత్ని శీలము పాడుబడునని తలంచి శివయ్య రూపు శయనించె శివుడు
పడతులందరు గూడి పెండ్లి వధువులేపగా ఆ రాకుమారిలేచెనంత ||జయ||

పక్కమీదున పరపురుషునిగాంచి తల్లడిల్లుచు నుండె తరుణి యపుడు
నన్నాదరించుమో నా తండ్రి నా మాట వినుమనియె ఆ తరుణీమణి ||జయ||

నా భర్తకోసమై నేనొక్కవ్రతంబు చేయపూనుకొంటిననియె
బాటసారులకు భక్తితో సేవలుచేసి తాంబూలమిత్తుననియె ||జయ||

అట్లు చేసినచో ఆ భర్త లభించునని ఆత్మవిశ్వాసముతో ఆ తరుణి యుండె
శివదర్శనార్థమై కాశికేగిన శివయ్య గంగాస్నానము చేసి కాలభైరవునిగాంచి ||జయ||

కాశివిశ్వేశ్వరుని కాంచి అన్నపూర్ణనుగొల్చి భక్తిమీరగ ఒప్పుగాను
తీర్థయాత్రలు చేసి తిరువేణిదర్శించి తిరిపెమును తనివితీర దర్శించి ||జయ||

భక్తిశ్రద్ధలతో భగవంతునికొల్చి తిరిగిపచ్చి మామనగరు జొచ్చె
తా సతి సల్పు అన్నదానము జూసి స్వయంపాకముతో సంతృప్తిజెందె ||జయ||

అనంతరమా రాజపుత్రుడు అరుగుపై నిలుచొని యుండగా
తాంబూలమిచ్చిన తరుణీమణి తో మాకేల ఇదియనుచు త్రిప్పిబంపె ||జయ||

బాటసారులందరూ బాగుగా భుజియించి తాంబూలమందుకొని సేవించగా
మీరేల ఒల్లరని మహిళలందరు గూడి రాజభవనమునకూ గొనిపోయిరంత ||జయ||

నేనేమి చేసితి నన్నేల నిల్పితిరి నేచేసిన తప్పిదమేమనియె
పడతి వస్తున్న పతిని జూచి మనమునయెంతయో ముదము నొందె ||జయ||

భర్తకెదురేగి తాంబూలమిచ్చి ఈతడే నా భర్త అనియె నా ఇల్లాలు
విడివడిన వధూవరులు వేవేగమే గూడి ఆనందాబ్ధిలో ఓలలాడిరపుడు ||జయ||

నా పూజ నెరవేరి నా పతిని జేరితిని నా తండ్రి ముద్దుపట్టియనైతిననియె
కారణమేమని ధరణీపతియడుగగా మామగారితో అల్లుడిట్లనియె ||జయ||

కాశికిబోవు కాంక్షతోబోయి విశ్వేశ్వరునిదర్శిమ్చి మరలివచ్చితిననెను
సౌశీల్యవతి శీలమును మెచ్చి సంతసించిరంత బంధువులందరు ||జయ||

శివయ్యతండ్రిని శీఘ్రముగ పిలిపించి విషయమంతయు విన్నవించె
గోదాన, భూదాన, స్వర్ణదానములన్నియు సంతృప్తిగ చేసి సంతసమందిరపుడు ||జయ||

ఘనమైన దానములగు అశ్వ గజ అన్నదానములు చేసిరీ ఘనతగాను
వధూవరులు ఆ రాత్రి తల్లిదండ్రాదులను తలచుకొనంగ ||జయ||

ముత్యాలపల్లకిలో ముద్దులకూతురు పచ్చలపల్లకీనిచ్చి పంపె
ఉన్నతమైన ఉత్తమాశ్వమునిచ్చి కూతుర్ని అల్లుడ్ని పంపెనపుడు ||జయ||

పత్నితోడ శివుడు తన సీమ చేరంగ ప్రజలెల్ల పరమానందమొందిరి
అత్తమామలపుడు కోడలిదరిచేరి ఆదరంబున పలికెనిట్లు ||జయ||

ఏ నోము నోచితివి ఏ పూజచేసితివి ఎటులనాపుత్రుని కాపాడితివి
నాబిడ్డ నాపట్టి అల్పాయుష్కుని ఎట్లు కడచేర్చితి వనియె ||జయ||

అంతనాకన్య అత్తమామలకు ప్రణమిల్లి విన్నవించె వినయముతో నిట్లు
మంగళగౌరి మహిమగలతల్లి ని వైధవ్యమును బాపే వైభోగదాయనిని ||జయ||

ప్రేమతో పూజించి భక్తితో సేవించ ఆయమ్మ నను కరుణించెననియె
అదివిన్న శివయ్య తలితండ్రులు కోడలిని కడుప్రేమతో చూసి ||జయ||

ఆయురారోగ్యములు సౌభాగ్య సిరిసంపదలతో తులతూగుమని దీవించిరపుడు
మంగళగౌరిని మదినిండ పూజించు మగువలకు కలుగు మాంగల్యములు ||జయ||

మంగళగౌరిని సేవించి కోరినకోర్కెలు తీర్చుకొనండి మగువలారా!
||జయమంగళం నిత్యశుభమంగళం||

(గౌరీ పూజాదికం పుస్తకం నుండి)

Mangala Gowri Vratam Song Pata

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s