శివానన్దలహరీ : 81-90

శంకరస్తోత్రాలు : శివానందలహరీ : 81 – 90

కంచిత్కాలముమామహేశ భవతః పాదారవిన్దార్చనైః
కంచిద్ధ్యానసమాధిభిశ్చ నతిభిః కంచిత్కథాకర్ణనైః ।
కంచిత్ కంచిదవేక్షనైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం
యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్స ముక్తః ఖలు ॥ 81 ॥

శంకరులు జీవన్ముక్తులు అనగా ఎవ్వరో‌ చెప్పుచున్నారు.

ఉమామహేశ్వరా! కొంచెము సేపు నీ‌ పాదపద్మములను పూజించుటలోనూ, కొంచెము సేపు నీకు నమస్కారములు చేయుటలోనూ, కొంచెము సేపు నీ‌ధ్యానము లోనూ, సమాధిలోనూ, కొంచెము సేపు నీ‌ కథలను వినుటలోనూ, కొంచెము సేపు నీ‌ దర్శనములలోనూ, కొంచెము సేపు నిన్ను స్తుతించుటలోనూ, ఈ‌ విధముగా సంతోషముగా నీకు మనస్సర్పించిన స్థితిని చేరినవాడు జీవన్ముక్తుడు.

శంకరులు ఈ శ్లోకముద్వారా మనస్సును బాహ్యవిషయములపై నిలుపక నిరంతర భగద్విషయ నిమగ్నము అవవలెనని ఉపదేశిస్తున్నారు. కేవలం ఒకే విషయముపై మనస్సు నిశ్చలముగా ఉండుట దుస్సాధ్యము కాబట్టి, జపధ్యానాది బహువిధ భగవత్సంబంధ కర్మలను ఆచరించవలెనని ఉపదేశిస్తున్నారు.

ఉమామహేశ అనే సంబోధన ద్వారా ఇరువురినీ‌ సేవించాలని సూచితము.

బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే
ఘోణిత్వం సఖితా మృదఙ్గవహతా చేత్యాది రూపం దధౌ ।
త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహభాగో హరిః
పూజ్యాత్పూజ్యతరః స ఏవ హి న చేత్ కో వా తదాన్యోఽధికః ॥ 82 ॥

పార్వతీ‌పతీ! హరి (త్రిపురాసురసంహారమున) నీకు బాణము అయినాడు. వృషభరూపములో‌ నీకు వాహనము అయినాడు. నారాయణియై అర్థశరీరముతో‌ నీకు భార్య అయినాడు. నీ‌ పాద దర్శనమునకై వృషభరూపము దాల్చినాడు. నీకు మిత్రుడు అయినాడు. నీ తాండవవేళ మృదంగము వాయించువాడు అయినాడు. నీ పాదములయందు తన నేత్రమును సమర్పించినాడు (శివుని సహస్రకమలపూజలో‌ ఒక కమలము తక్కువ అవగా, విష్ణువు తన కంటినే పూవుగా సమర్పించినాడని పురాణగాధ). నీ‌ శరీరమందు ఒక భాగముగానే‌ వర్తించినాడు. అందుచేతనే పూజ్యులచేతకూడా పూజింపబడినవాడు అయినాడు. కానిచో, వానికంటే శ్రేష్ఠుడు ఎవరున్నాడు ?
శివుని అమితముగా సేవించుట చేతనే విష్ణువుకు సర్వపూజ్యత్వం లభించిందని భావం.

జననమృతియుతానాం సేవయా దేవతానాం
న భవతి సుఖలేశః సంశయో నాస్తి తత్ర ।
అజనిమమృతరూపం సామ్బమీశం భజన్తే
య ఇహ పరమసౌఖ్యం తే హి ధన్యా లభన్తే ॥ 83 ॥

జనన మరణములు కల దేవతలను పూజించుటచే‌ కొంచెము కూడ సుఖము కలుగదు. ఈ‌ విషయములో‌ సందేహము లేదు. పుట్టుట, గిట్టుట లేనివాడూ, అమ్మవారితో కలసి ఉన్నవాడు అయిన పరమేశ్వరుని ఎవ్వరు ఈ‌ లోకముననే పూజించెదరో వారు ధన్యులు, మోక్షమును పొందెదరు.

శివ తవ పరిచర్యాసన్నిధానాయ గౌర్యా
భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే ।
సకలభువనబన్ధో సచ్చిదానన్దసిన్ధో
సదయ హృదయగేహే సర్వదా సంవస త్వమ్ ॥ 84 ॥

శివా! సకల లోక బంధువా! సచ్చిదానంద సముద్రుడా! భవా! గౌరీదేవితో‌ కలసి నీవు దయతో నా హృదయగృహంలో ఎప్పటికీ నివసింపుము. మీకు సపర్యలు చేయుటకై గుణవంతురాలగు నా బుద్ధి కన్యను ఇచ్చెదను.

శివ (మంగళము, సౌభాగ్యము), భవ (ఉత్పాదకత్వం), సకలభువనబంధు, సచ్చిదానందసింధు, సదయ – ఈ‌ శబ్దములతో‌ శంకరులు తమ బుద్ధి కన్య యొక్క వరుని (శివుని) గుణములను చూపుతున్నారు.

జలధిమథనదక్షో నైవ పాతాళభేదీ
న చ వనమృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః ।
అశనకుసుమభూషావస్త్రముఖ్యాం సపర్యాం
కథయ కథమహం తే కల్పయానీన్దుమౌలే ॥ 85 ॥


శివుడు క్షీరసాగర మథనంలో పుట్టిన కాలకూట విషమును నేరేడుపండువలే తినినవాడు. ఆ మథనంలో‌ ఉద్భవించిన చంద్రుని శిరముపై పువ్వువలె ధరించినవాడు. పాతాళలోకమునందుండు సర్పములు ఆయనకు భూషణములు. అడవిఏనుగు చర్మము ఆయన ధరించే వస్త్రము. శివునికి తగిన పరిచర్యలు పూజలో తాము చేయలేమని శంకరులంటున్నారు.

చంద్రశేఖరా! నీకు ఆహారము, పుష్పము, ఆభరణము, వస్త్రములతో‌ కూడిన పూజను నేను ఏ విధముగా చేయగలను ? నేను సముద్రమథనము చేయుటకు సమర్థుడను కాను. కాబట్టి కాలకూటవిషము ఆహారముగానూ, చంద్రుని కుసుమముగానూ‌ ఈయలేను. పాతాళమును భేదించలేను. కాబట్టి సర్పములు ఆభరణముగా తేలేను. అడవిలో‌ మృగములను వేటాడుటకు బోయవాడను కాదు. కాబట్టి గజచర్మము ఆభరణముగా సమర్పించలేను. ఏమి చేయను ?

భావనామాత్రసంతుష్టాయై నమోనమః – సద్భావేన హి తుష్యంతి దేవాః సత్పురుషాః ద్విజాః…

పూజాద్రవ్యసమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే
పక్షిత్వం న చ వా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభమ్ ।
జానే మస్తకమఙ్ఘ్రిపల్లవముమాజానే న తేఽహం విభో
న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్త్వేన తద్రూపిణా ॥ 86 ॥


శంకరులు, పూజాద్రవ్యములున్ననూ పూజచేయుట కష్టమే‌ అని అంటున్నారు. దిగంతాలు వ్యాపించియున్న స్థాణుస్వరూపమును భావన ఎటుల చేసేది ?

ఉమాపతీ ! పూజాద్రవ్యములన్నియూ విశేషముగా సమకూర్చబడినవి. కానీ పూజ ఎట్లు చేయుదును ? దుర్లభమైన హంస వరాహ రూపములు నేను పొందలేను. కాబట్టి నాకు నీ‌ శిరస్సు, పాదపద్మములు తెలియవు. ప్రభో! ఆ రూపములు ధరించిన బ్రహ్మ, విష్ణువుల చేతనే యదార్థము తెలిసికొనబడలేదు. (వారూ‌ తెలిసుకొనలేకపోయారు). నేనెంత ?
జ్యోతిర్లింగముగా ఆవిర్భవించిన పరమేశ్వరుని ఆద్యంతములు కనుగొనవలెనని వరాహరూపము ధరించి విష్ణువూ, హంసరూపములో‌ బ్రహ్మా ప్రయత్నించిన పురాణగాధ ఈ శ్లోకములో‌ ఉటంకించబడినది.

అశనం గరళం ఫణీ కలాపో
వసనం చర్మ చ వాహనం మహోక్షః ।
మమ దాస్యసి కిం కిమస్తి శంభో
తవ పాదామ్బుజభక్తిమేవ దేహి ॥ 87 ॥


శంకరులు భగవంతుని ఏమి ప్రార్థించవలెనో‌ మనకు నేర్పుతున్నారు.

శంభో! నీవు భుజించునది విషము. నీకు ఆభరణము సర్పము. నీవు ధరించు వస్త్రము గజ చర్మము. నీ‌ వాహనము ఒక ముసలి యెద్దు. ఇక నాకు నీవు ఏమి ఈయగలవు ? ఈయుటకు నీవద్ద ఏమున్నది ? నీ‌ పాదపద్మములయందు భక్తిని మాత్రము ప్రసాదింపుము.

ఈశ్వరుడు గుణదోషములు లేనివాడు. అట్టి వానిని సాధారణ ప్రాపంచిక కోర్కెలు కాక భక్తిమాత్రమే కోరదగిన వస్తువు అనిశంకరులు ఉపదేశిస్తున్నారు.

యదా కృతాంభోనిధిసేతుబన్ధనః
కరస్థలాధఃకృతపర్వతాధిపః ।
భవాని తే లఙ్ఘితపద్మసంభవః
తదా శివార్చాస్తవభావనక్షమః ॥ 88 ॥


శివార్చన, స్తుతి, ధ్యానము సాధారణవిషయములు కావని శంకరులు ఉగ్గడిస్తున్నారు.

ఓ‌ శివా! ఎప్పుడు నేను – సముద్రమునకు సేతువుగట్టినవాడనూ (శ్రీరాముని వంటి వాడను), అఱచేతితో‌ పర్వతరాజమును అణచినవాడను (అగస్త్యుడు వింధ్యాచలమును అణచెను, అటువంటివాడను), బ్రహ్మనుమించినవాడనూ అవుతానో‌ అపుడు నేను నిను పూజించుటకు, స్తుతించుటకు, ధ్యానించుటకు సమర్థుడనవుతాను.


నతిభిర్నుతిభిస్త్వమీశపూజా-
విధిభిర్ధ్యానసమాధిభిర్న తుష్టః ।
ధనుషా ముసలేన చాశ్మభిర్వా
వద తే ప్రీతికరం తథా కరోమి ॥ 89 ॥


శంకరులు శివుడు భోళాశంకరుడని, భక్తసులభుడని ఈ శ్లోకములో‌ చూపుతున్నారు.

ఈశ్వరా! నీవు నమస్కారములచేతనూ, స్తుతిచేతనూ, పూజావిధులచేతనూ, ధ్యాన సమాధులచేతనూ సంతోషించుటలేదు. నీకు (పూజ)‌ధనుస్సుతోనా , రోకలితోనా, రాళ్లతోనా ?‌ నీకు ఏది ప్రీతియో‌ చెప్పుము, అటులనే చేసెదను.

అర్జునుడు ధనుస్సుతోనూ, రాళ్లతోనూ‌ ఇతర రీతులనవలంబించి శివునితో‌ పోరాడెను. కానీ‌ శివుడు ప్రసన్నుడాయెను, పాశుపతము ఉపదేశించెను. శివభక్తులు (నాయనార్లు) శివుని రోకటితోనూ, రాళ్లతోనూ కొట్టితిరనీ, వారిని శివుడనుగ్రహించెననీ‌ గాధ.

సాధారణ (బాహ్య పటాటోపాల) సాత్వికపూజా విధానములు భక్తి పండనిచో శివుని మెప్పించలేవు. భక్తి పండిన చోట శివుడు సర్వదా ప్రసన్నుడనీ‌ శంకరుల ఉపదేశము.

వచసా చరితం వదామి శంభో-
రహముద్యోగవిధాసు తేఽప్రసక్తః ।
మనసా కృతిమీశ్వరస్య సేవే
శిరసా చైవ సదాశివం నమామి ॥ 90 ॥


శంభో! నేను శాస్త్రవిధిన నిన్ను పూజించుట తెలియనివాడను. నోటితో నీ చరిత్ర పలుకుతాను. మనస్సులో ఈశ్వరుని స్వరూపము ధ్యానించుతాను. సదాశివుని శిరస్సుతో‌ నమస్కరించుతాను.

త్రికరణశుద్ధిగా శివుని సేవించుట ముఖ్యమని శంకరుల ఉపదేశము.

Shivanandalahari 81- 90

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s