శంకరచరితామృతము – 5: బాల్యం – 2

పరమాచార్యుల అమృతవాణి : శంకరచరితామృతము : 5
బాల్యం – 2

ఒకనాడు వారి తల్లికి దేహం అస్వస్థంగా ఉంది. ఆమె కుమారునితో – ‘నాయనా! నాకు నేడు నదికి వేళ్ళే ఓపిక లేదు- అన్నది. అపుడు వారు దూరంగా ఉన్న నది ఇంటికి చేరువగా రావాలని ప్రార్థించేరు. ఆయన ప్రార్థించినట్లు నది యింటికి దగ్గరగా వచ్చింది. దారిలో ఒక కృష్ణాలయం ఉంది. నదీవేగానికి ఆ ఆలయం కూలిపోయింది. కాలాంతరంలో ఆచార్యులవారు ఆజ్ఞాపించగా ఒక దేశపురాజు దానిని పునరుద్ధరించేడు.

ఆచార్యులవారు తమతల్లిని నదిలో స్నానం చేయించేరు. తరువాత తాము స్నానం చేయడానికై నదిలోకి దిగేరు. వారునీటిలో అడుగు పెట్టగానే ఒక మొసలి వారి పాదం పట్టుకొంది; అపుడు ఆయన తల్లితో – ‘ఇదుగో! మొసలి పట్టుకొన్నది, ఇప్పుడు నా ప్రాణాలు పోవడం నిశ్చయం మానసికంగా సంన్యాసం స్వీకరించానా నాకు వేరొక జన్మ వచ్చినట్లు అవుతుంది; నా ప్రారబ్ధము మారిపోతుంది, కాగా ప్రారబ్ధముచే వచ్చిన మరణంకూడా మారిపోవచ్చు; తల్లివి, నీవు ఆజ్ఞాపించకుండా నేను సంన్యాసం తీసికొనకూడదు, సంన్యాసం తీసికొంటే ఒకవేళ నేను బ్రతుకుతానేమో కాని, తీసికోకపోతే నాకు చావు తప్పదు; ఇది దుర్మరణం; నేను ఇలా మరణిస్తే నీకు పుత్రకార్యాలు ఉండవు; సంన్యాసము తీసికొంటే నాకు మోక్షము వస్తుంది; నీకు సద్గతి కలుగుతుంది; సంన్యసించినా నేను నీకు అంత్యక్రియలు చేస్తాను’ అన్నారు.

ఆచార్యులవారు జలంలో ఉండియే సంన్యాసం స్వీకరించాలనుకొన్నారు. ఆయన అలా అనుకొనుటతోడెనే మొసలి ఆయన కాలిని విడిచిపెట్టింది. ఆ క్షణంలోనే ఆకాశంలో రథంమీద ఒక గంధర్వుడు ప్రత్యక్షం ఆయ్యేడు. అతడు ఆచార్యుల పాదాలమీదపడి నమస్కరించేడు. ఆచార్యుల వారికి ఆశ్చర్యం కలిగింది. తానొక గంధర్వుడనని అతడు చెప్పుకోన్నాడు.

ఆ గంధర్వుడు ఆచార్యులవారితోఅయ్యా! నేను ఒకప్పుడు బాగా మద్యం సేవించి గానలోలుడనై కదలకుండా పడిఉన్నాను. ఆసమయంలో దూర్వాసమహర్షి అలా వచ్చేరు. ఆయనకు మద్యము, సంగీతము రెండును కిట్టవు. ఆయనను చూచి నేను లేవలేదు; నా గానాన్ని విరమించలేదు. దానికి ఆ మహరి కోపించినీవు త్రాగి మొసలివలె పడి ఉన్నావు. అందుచే నీవు మొసలివై పడిఉండు! అని శపించేరు. అప్పుడు నేను వారిని ప్రార్ధించేను. ‘ఈ శాపాన్ని అనుసరించి నీవు కొంతకాలం మొసలివై పడి ఉండక తప్పదు, ఈశ్వరుడు ఈ లోకంలో అవతరిస్తాడు, ఆయన కాలినిపట్టుకొన్నపుడు నీకు శాపవిమోచనం కలుగుతుంది. నీవు కాలడిలో నివసించు, ఈశ్వరుడు అచ్చటనే అవతరిస్తారు, నిన్ను అనుగ్రహిస్తాడు’ అని దుర్వాసమహర్షి నన్ను అనుగ్రహించారు అని తన విషయం తెలిపి ఆచార్యుల సెలవు పొంది ఆ గంధర్వుదు అంతర్హితుడయ్యేడు.

మొసలి నోటినుండి విడువడిన కుమారుని చూడగానే తల్లికి చాలా ఆనందం కలిగింది, ఆమెరా! నాయానా ! ఇక నీవు పెండ్లి చేసికొనవచ్చును, తగిన కన్యను చూస్తానుఅని ఆరంభించింది.

ఇది విని ఆచార్యులవారు- ‘తల్లీ! నేటినుండి నేనొక యింటిక సంబంధించిన బిడ్డను కాను. అన్ని యిళ్లు నాకు సొంతమే. సంన్యాసము తీసుకొనడానికి నీవు నాకు అనుమతి ఇచ్చేవు; ఆ విషయం మరచితివేమో! నేనింక ఇచ్చటనుండి వెళ్లిపోవాలి’ అని ఆమెకు నమస్కరించేరు.

‘సర్వవంద్యేన యతినా ప్రసూ ర్వంద్యా హి పాదరం’ అందరూ సంన్యాసికి నమస్కరిస్తే సంన్యాసి తల్లికి నమస్కరించాలి. పిమ్మట ఆచార్యులవారు ఇక తనకు తల్లి, తండ్రి, కుమారుడు ఎవరూ లేరని భావించేరు.

భిక్షప్రదా జనన్యః పితరొ గురవః కుమారకాః శిష్యాః|
ఏకాంతరమణ హేతుః శాంతి ర్దయితా విరక్తస్య||

– వైరాగ్య శతకము.

”సంన్యాసినైన నాకు భిక్షచేసేవారే తల్లులు. జ్ఞానోపదేష్టలైన గురువులే తండ్రులు; శిష్యులే కుమారులు. నేను ఈ విశ్వకుటుంబానికి చెందిన వాడను” అని ఆచార్యులవారు తల్లితో చెపుతూ ఏమైనా నీవు నన్ను తలచగానే నేను నీ దగ్గరకు వస్తాను’ అని ఆమెకు నచ్చజెప్పి సక్రమ సంన్యాసస్వీకారానికి యోగ్యగురువును అన్వేషిస్తూ బయలుదేరేరు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s