భగవంతుని కర్పించే వస్తువుల్లో శ్రేష్ఠమైంది

(శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాములవారి అనుగ్రహభాషణములనుండి)

భగవంతునకు మనం సమర్పించేవన్నీ అవసరమా అనే ప్రశ్న వస్తుంది. నిశ్చయంగా ఆయనకు వీటిలో ఏ ఒకదానితోనూ పనిలేదు. ఇది అంతా మన సంతృప్తి కొరకే మనం చేస్తాం. భగవంతుడు సృష్టికర్త. ప్రపంచాన్ని, మనకు అవసరమైన వస్తువుల్ని అన్నిటిని సృష్టిచేశాడు. మనకు కనీసం ఒక గడ్డిపరకను కూడ సృష్టి చేసేశక్తిలేదు. అంతేగాక ఆయన సంకల్పం లేకుండా మనం ఏ పనీ ఏ పరిస్థితిలోనూ చేయలేము. మీదుమిక్కిలి మనకు దేవుడిచ్చిన వాటిని అనుభవించటానికి మనలో మనం తగవులాడుకుంటాం. ఇంత చేసిన భగవంతునిపై కృతజ్ఞతాభావంతో మనం ఆయనకు అన్నిటిని నివేదన యొనరిస్తే ఆయన కృపకు పాత్రులమై అధికమైన వస్తుసంపదతో వర్థిల్లుతాం.

పిల్లలకెపుడైనా బహుమతిగా ఏదైన ఇస్తే, వారు దానిని తమ తల్లిదండ్రులకు చూపించిగాని దాన్ని వినియోగించుకోక పోవటాన్ని నిత్యం చూస్తుంటాం. అదే విధంగా మనకు దేవుడు బహుకరించిన వస్తువుల విషయంలో మనం ఆయన పట్ల కృతజ్ఞతను ప్రకటిస్తూ వాటిని ఆయనకు నివేదన చేసి మనం అనుభవించటం మన ధర్మం. అలా చేయటం వలన ఆ వస్తువులు మనల్ని వీడిపోవు.

మనం తీసుకునే ఆహారం కూడ దేవునికి ముందు నివేదించి భుజిస్తే మనకు క్షేమకరం గీతలో కృష్ణభగవానుడు ఇలా అంటాడు.

శ్లో|| యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషః | భుంజతే తేధ్వం పాపా యే పచంత్యాత్మకారణాత్‌ ||

భగవంతునికి నివేదించి తీసుకున్న ఆహారమే మనకు పూర్తి ఆరోగ్యన్నిస్తుంది. కనుక, అలాచేయకుండా ఆహారం భుజిస్తే రోగగ్రస్తులమవుతాము. రోగపీడితులమవుతున్న సమయంలో భగవంతుని గూర్చి దేవాలయాల్నిగూర్చి స్మరణకు తెచ్చుకోవడం ఉచితం కాదు.

దేవునికి ముందుగా ఆహారాన్ని సమర్పించే ఆచారాన్ని నివేదనం అంటాం కదా. నివేదన అంటే తెలుపుట అని అర్థం. మధుర, బృందావనం, గోకులం మొదలైన పుణ్యక్షేత్రాల్లో పూజార్లు పాలతో తయారుచేసిన ”పేడా”లను నివేదిస్తారు. ఆ సందర్భంలో వారు ప్రదర్శించే శ్రద్ధాభక్తులు అనిర్వచనీయం. ప్రతి”పేడా”ను రెండుముక్కలు చేసి ఒక ముక్కను విగ్రహం తినే పద్ధతిలో నోటివద్దకు తెచ్చి తిరిగి వెనక్కి తీసుకుంటారు. రెండవ ముక్కను ఉచ్ఛిష్టంగా భావించి నివేదనకు వినియోగించరు. అలా మిగతా ముక్కల్ని కూడ నివేదన చేసిగాని వాటిని ఉపయోగించరు.

ఈ సందర్భంలో తమిళనాడులో జరిగిన నివేదనకు సంబంధించిన ఇతివృత్తం ఒకటి వుంది. ఇది కలియుగంలోనే జరిగింది. చాల ఆసక్తికరమైంది కూడ. ఒక వినాయకుని ఆలయంలో తండ్రి పూజలు నిర్వహిస్తూ ఆరాధన చేసేవాడు. ఒకరోజు ఆయన గ్రామాంతరం వెళ్లవలసి వచ్చి తన పిల్లవాణ్ణి ఆలయ విధులకు వినియోగించాడు. బాలుడు పూజలుచేసి నివేదనం దేవునికి చేశాడు. కాని వినాయకుడు ఆ నివేదనాన్ని స్వీకరించలేదు. బాలుడు నిర్వేదన చెంది వినాయకుని అనేక విధాల ప్రార్థించాడు. గణేశుడు ప్రార్థనలనాలకించి నివేదన చేసిన ఆహారాన్ని స్వీకరించాడు. అలా పది దినాలు గడిచాయి. తండ్రి తిరిగివచ్చిన తర్వాత వినాయకుడు బాలుడిచ్చిన ఆహారాన్ని భుజించిన కథనాన్ని విన్నాడు. ఆయన ఆ విషయాన్ని విశ్వసించక తనకై తానే చూడాలని అనుకున్నాడు. మరునాడు తండ్రి దాగియుండి ఆలయంలో జరిగే విషయాల్ని పరిశీలించాడు. బాలుడు మామూలుగ వచ్చి ఆహారాన్ని వినాయకుని ముందుంచట ఆయన దాన్ని తినటం తండ్రి కనులారా జూచి పరవశుడైనాడు. ఆ పిల్లవాడే పిల్లైయార్‌గా ప్రసిద్ధి చెందిన కవి. తేవరం, తిరువాచకం మొదలైన తమిళ రచనలకు ఆయనే బాధ్యుడు. అందువలన భక్తితో భగవంతునికి ప్రతి వస్తువును నివేదన చేసినతర్వాత మనందాన్ని వినియోగించుకోవటం శ్రేయోదాయక మనేదే ఈ ఇతివృత్త సారాంశం.

కాని భగవంతునకు ప్రప్రథమంగా అర్పించవలసింది మన మనస్సు. ప్రధానమైన మనస్సును అర్పిస్తే మిగతా వాటన్నిటిని నివేదించుకున్నట్లే. మన మనస్సు తప్ప మిగతా విషయాలు ఆయనలో లేనివి లేవు.

‘శివానందలహరి’లో ఆదిశంకరులు ఇలా చెప్పారు :-

శ్లో|| ‘కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్థ ధనపతౌ | గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణి గణః |

శరస్థే శీతాంశౌ చరణయుగళస్థే೭ ఖిలశుభే | కమర్థం దాస్యే ೭హం భవతు భవదర్థ మమ మనః ||

“మేరు పర్వతం విల్లు రూపంలో నీ చేతియందు ఉన్నది. ధనాధీశుడైన కుబేరుడు నీ పార్శ్వమందే వసిస్తాడు. స్వర్గలోకమందలి కల్పతరువు, సకలాభీష్టములనొసగే కామధేనువు, అమూల్య రత్నమైన చింతామణి, ఇవన్నియు నీ గృహమందేవున్నవి. శీతలకిరణున్ని శశాంకుని నీ శిరస్సు పై ధరించావు. సర్వశ్రేయస్సుల నీయగల నీ పాదపద్మాలుండనే వున్నాయి. కనుక నీకు నేను ఏమి సమర్పింప గలను? నా మనస్సు మాత్రమే నీకర్పించ గలను “

ఈశ్వరునకు మనం బంగారాన్ని అర్పిద్దామని మధనపడనవసరంలేదు. మేరుపర్వతమే విల్లు రూపంలో ఆయన చెంతవుంది. మనం దేనిని సమర్పించాలని ఉద్దేశించినా అది మనకొరకేగాని ఆయన కొరకు గాదు. అలాగే మనం ఈశ్వరునకు ప్రార్థనలు చేయటం ఆయన కవి అవసరమని కాదు. నీలకంఠ దీక్షితులు ఇలా అన్నారు.

శ్లో|| ఆవేద్యతాం అవిదితం కిం అధాప్యుక్తం | వక్తవ్యమాంతర రుజోపశమాయ నాలం |

ఇత్యర్థసే కిమపి త్వచ్చువణే నిధాతుం | మాతః ప్రసీద మలయధ్వజపాండ్య కన్యే ||

మలయధ్వజ పాండ్య రాకుమారీ! నీకు తెలియని విషయమేమున్నది ? నీ వెరుగని విషయాన్ని నీకెలా చెప్పగలను ? అయినా అగత్యమైన ఆలోచనలు వెల్లువలా మనస్సును నింపివేస్తున్నాయి. వాటికి మనస్సునుండి బహిర్గతం చేసినకాని నాకు శాంతి లభించదు. కనుక ఓ దేవి, నా మనోగతాల్ని నీ ముందు వెలువరిస్తాను. దయచేసి విను.

ప్రార్థన చేయనిచో మామూలుగ మన మనస్సులు వ్యాకులత చెందుతాయి. ప్రార్థన మన విధులలో నొకటి. ప్రార్థనలవల్ల భగవంతుని కృపకు పాత్రులమౌటయేగాక, మానసిక శాంతిని, స్వచ్ఛతను, మనోదార్ధ్యతను కూడ పొందగల్గుతాం. త్యాగనిరతి, విశాల హృదయం మనలో పెంపొందటానికి కూడ మనం భగవంతున కర్పించే ప్రార్థనలు, ఇతర వస్తువులు కారణభూతమౌతాయి.

కాని ఆదిశంకరులు నుడివినట్లు మనం భగవంతుని కర్పించే వస్తువుల్లో శ్రేష్ఠమైంది మన మనస్సు. ధనకనక వస్తువాహనాది విషయములేవియు మనస్సుతో సరికావు. ఈశ్వరునకవియన్నియు ఉన్నవి. మనస్సు మాత్రం లేదు గనుక ఆయనకు చింతలు లేవు. ‘మనస్సే సకల దుఃఖాలకు, బాధలకు హేతుభూతమైనది. నేనా మనస్సును కలిగియున్నాను గనుక నాకు బాధలు తప్పుటలేదు. కనుక నీకా మనస్సును సమర్పిస్తాను’ అని ఆదిశంకరులు వెనుకటి శ్లోకంలో విశదీకరించారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s