(శ్రీ జయేంద్ర సరస్వతీ స్వాములవారి అనుగ్రహభాషణములనుండి)
సంతృప్తి పరచలేని విషయ వాంఛలను, తీర్చలేని కోర్కెలను దృష్టిలో ఉంచుకొని శంకరభగవత్పాదులు మనం భగవంతుని కోరదగిన కోర్కెను గురించి ఈ క్రింది విధంగా చమత్కారశైలిలో చెప్పారు :
శ్లో|| ”అశనం గరళం ఫణీ కలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః |
మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదాంబుజ భుక్తిమేవ దేహి ||”
“శంభో! నేను నిన్నేమి అడగను ? నాకు ఉపయోగపడేవీ, నీవు ఈయగల్గినవి నీదగ్గర ఏమి ఉన్నాయి ? నీవు భుజించేది విషాన్ని. కనుక నాకు ఆహారంగా నీవు ఇచ్చేది ఏమీ లేదు. నీవు నాగాభరుణుడవు. కనుక నాకీయగల ఆభరణములేవీ నీవద్ద లేవు. పోనీ ధరించడానికి దుస్తులనిస్తావా అంటే నీవు ఏనుగుతోలు ధరించేవాడవు. ఏదైనా వాహనాన్ని సమకూర్చగలవేమో అనుకుంటే వృషభవాహనుడవి నాకేమి ఈయగలవు ? కనుక నాకి ఇవేమీ వద్దు. నీ పాదపద్మాలపై భక్తి ప్రసాదించు చాలు. ”
ఈ ఆధునిక నాగరిక ప్రపంచంలో ప్రజలు వినూత్నమైన ఆభరణాల్ని, వింతవింత దుస్తుల్ని ధరిస్తున్నారు. అతివేగంగా ప్రయాణించే విమానాల్లాంటి సాధనాలు లభ్యమౌతున్నాయి. కనుక మనం ఈశ్వరుని ఆధీనంలో ఉన్నవాటిని మనం అర్థించే అవసరంలేదు. కనుక మనం ఈశ్వరుణ్ణి అర్థించగల్గిందిగాని, ఆయన సునాయాసంగా మనకీయగల్గింది ఏమీలేదు.
ఆదిశంకరులిలా అన్నారు :
”తవ పాదాంబుజభక్తిమేవ దేహి”
”నేను మిగతా విషయాలన్నీ సమకూర్చు కుంటాను. నీ పాదాంబుజములపై భక్తిని మాత్రం నాకు ప్రసాదించు. దానిని మాత్రం నేను ఉత్పత్తిచేయలేను. బజారులో కొనలేను. అంతేగాదు నాకు స్థిరమైన ప్రయోజనాన్ని ఇచ్చేది భక్తి మాత్రమే.” వస్తు సంపద విషయంలో మనుజుని కోరికకు పరిమితిలేదు. ఎన్నివున్నా ఇంకా కావాల్సినవి చాలా మిగుల్తాయి. కనుక మనకు వాంఛనీయమైంది భక్తి మాత్రమే. అలాంటి భక్తిని ఈశ్వరుడు ప్రసాదిస్తే మన జీవితంలో శాంతి సౌఖ్యాలకు కొరతవుండదు.
మరియొక సందర్భంలో ఈ క్రింది విషయం చెప్పబడింది.
శ్లో|| ”త్వత్సన్నిధానరహితో మమ మా೭స్తు దేశః |
త్వత్తత్వబోధరహితా మమ మా೭స్తు విద్యా ||
త్వత్పాదభక్తి రహితో మవ మా೭స్తు వంశః |
త్వత్చింతయా విరహితం మమ మా೭స్తు చాయుః ||”
“నా బ్రతుకుతెరువు కోసం నేను ఏ ప్రాంతంలోనైనా నివసించవచ్చు. కానీ దైవ సమక్షం లేని ప్రదేశమంటూ ఉండకూడదని నా కోరిక. ” ఏ పట్టణం కాని పల్లెకాని దేవాలయం లేకుండా ఉండకూడదని దీని భావం. దేవాలయం లేని ఊళ్ళో ప్రజలు నివసించరాదనే అంశానికి ఇక్కడ ప్రాధాన్యత ఈయబడింది. మనం ఎక్కడకు వెళ్ళినా దైవ సమక్షంలోనే నివసించాలి.
మనం గ్రంథాల్ని ఎక్కువగా పఠిస్తాం. కాని భగవత్సంబంధిత పుస్తాకాల్నే చదవటం ఉచితం. నీవు బహుళ సంఖ్యలో పుస్తకాలు చదువు. కాని దైవాన్ని గురించిన గ్రంథాల్ని ఎక్కువగా చదువు. అలాగని ఇతర విషయాల్ని గురించిన పుస్తకాలను బహిష్కరించమనికాదు. విషయ గ్రహణం కొరకు అవీచదవాల్సిందే. కాని దైవ మహిమను ప్రకటించేవి. దైవస్తుతి కల్గిన గ్రంథాలపై ఎక్కువ దృష్టిని వుంచాలి.”
”నిన్ను గురించిన నీ లీలలను గురించిన విజ్ఞానాన్ని ఈయని గ్రంథపఠనంగాని, చదువుగాని నాకవసరంలేదు. నీ పదపంకజములపై భక్తిలేకుండా నా జాతి వుండకూడదు. నా సంతతివారు, నా జాతులు బహుళంగా వుండవచ్చు. కాని వారందరూ నీయందు భక్తిగలవారై వుండాలి. అంటే భక్తి నశించగానే జాతికూడ అంతం కావాలని కాదు. కాని భక్తి ఒక సంతతినుండి తరువాత వార్కి నిరంతరంగా స్రవించాలి.
”నా జీవిత కాలమంతా నిన్నే గురించి భావన చేయాలి. నిన్ను మరచి జీవించాలనే కోరిక నాకు లేదు.” ఎవరూ తొందరగా మరణించాలని అనుకోరు. నిజానికి నిండా నూరేళ్ళు జీవించాలనే ప్రతివాడు ఇష్టపడతాడు. కాని జీవిత కాలమంతా దైవధ్యానాన్ని విడువరాదు. దైవాన్ని మరచి దుష్కృత్యాలు సలిపి తర్వాత పరితపించి ప్రయోజనంలేదు.
మరొక శ్లోకంలో ఆదిశంకరులే ఇలా చెప్తారు :
”సాధ్వీ నిజవిభుం”
పతివ్రతాశిరోమణియైన స్త్రీ తానే పనిచేస్తున్నా తన పతిని గురించే ఎల్లవేళల ఆలోచిస్తున్నట్లుగనే మనం మన తలపులను భగవానునిపై నిలపవలెను. భర్త బయటకు వెళ్లినపుడు భార్య తనపిల్లల పాలనలోను, గృహకృత్యాల్లోను నిమగ్నురాలై కూడ ఆమె దృష్టి, ఆలోచనలు నిరంతరం భర్తపైనే నిలుపుతుంది. ”సాధ్వీ నిజవిభుం” అనే ప్రయోగంవల్ల స్త్రీధర్మమేగాక భక్తితత్వం కూడ విపులీకరించబడ్డాయి. పెనిమిటి బయటకు వెళ్లగానే భార్య తాను స్వేచ్ఛగా సంచరించ వచ్చునని తలంచరాదు. భర్త తన సమీపంలో లేకపోయినా, భార్య తన పతిని గురించిన తలంపును ఏసమయంలోను విడనాడరాదు. అదే విధంగా మనం ఏ పని నిర్వహిస్తున్నా భగవంతుని మరువరాదు. మనం చేసేపనే భగవంతుడని భావించగల్గితే పనిని సులభంగా సాధించవచ్చు; భగవధ్యానమందు తేలిగ్గా నిమగ్నం కావచ్చు.
కనుక ఆ కవి మాటల్లో ”పరమాత్ముని కొద్ది సమయంలో కూడ విస్మరించి జీవించటానికి ఇష్టపడను”.