రామాయణ కథ : అంతరార్థము : 5
బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి గారి ఉపన్యాసముల నుండి
ఇక తప్పనిసరిగ రాముడు సీతాలక్ష్మణులతో అరణ్యమునకు పోవలసివచ్చినది. ఈ జంజాటకముతో వచ్చిన రామునకు విశ్వామిత్రుడిచ్చిన అస్త్రములను పురశ్చరణము చేయుటకు సమయము చిక్కుటలేదు. ఈ అస్త్రములు రావణునిపై పనిచేయుటకు తపస్సు చేయవలసియున్నది. కాని సంసార బంధమైన సీతతో కూడ వచ్చుటచే నది సాధ్యము కాదుగదా! కాబట్టి కఠోర బ్రహ్మచర్యము అవలంభించి యుండవలెను. అయినను నిత్యము సీతారాముల వనవిహారములు, జలక్రీడలు, విలాసాదు లెన్నియో జరుగుచునే యున్నవి. ఈ రీతిగా అరణ్యవాసము చేయుచున్న రాముని చూచిన దేవతలకు నిట్టి విలాసపురుషు డెట్లు రావణవధ చేయగలడను ననుమానము వచ్చినది. అపుడు దేవతలు రాముని పరీక్షించుటకు కాకాసురుని పంపిరి.
ఈ కాకి వచ్చి సీత ముఖముపై తిరుగుచుండగా, సీత విసిగిపోవుచుండగా రాముడు చూచి నవ్వెను. అది కొంతసేపటికి చెట్టుపై వ్రాలినది సీతారాముల జలక్రీడానంతరము, రాముడు నిద్ర నందెను. అపుడు కాకి సీత స్తనాంతరము గీరిపోవుచుండెను. రాముడు నిద్రమేల్కొని చూచి, జరిగినది విని కోపించెను. కాని సీత మాత్రము తనకు తాను రక్షించుకొనగలదు. కామశాస్త్ర ప్రకారము మొదట స్త్రీముఖము చూచి సంతసించువాడు తండ్రియని, వక్షస్థలముగని సంతసించువాడు బిడ్డయని, నాభిక్రింద చూచువాడు భర్తయని నిబంధింపబడినది. ఈ శాస్త్రానుసారము కాకి ముక్కుతో సీత స్తనాంతరము స్పృశించెను. గాన బిడ్డతో సమానమగుచున్నది. కాని రాముడు దానిపై బ్రహ్మాస్త్ర ప్రయోగము గావించెను.
ఈ కాకి దేవతలచే పంపబడి రాముని బ్రహ్మచర్యమును పరీక్షించుటకు వచ్చినది. అదియునుగాక రాముడు సైతము దానిని పరీక్షించుటకే బ్రహ్మాస్త్ర ప్రయోగము చేసెనుగాన నది కాకి వెన్నంటి ముల్లోకముల చుట్టినది. కాని దాని సంహరింపలేదు. దివ్యాస్త్రములు అప్పుడే నిద్ర లేచినవారికి, ఉపస్పర్శనాదులేకుండ నశుచులుగాన పలుకవు రాముడు నిద్రలేచిన వెంటనే బ్రహ్మాస్త్రము ప్రయోగించెనన నది నిద్రకాదని, ఆత డశుచికాడని తెలియుచున్నది. ఆ కాకి తన బాధ నందరకెఱింగించినది. కాని రామునిది నిజమైన నిద్రకాదు, అది సమాధిస్థితియని అందఱచే తెలిసికొనబడినది. ఇక దేవతాధిపతి యగు ఇంద్రుడు కాకిని రామునే శరణువేడుమనెను. ఇది యొక పరీక్ష.
ఇక కాకి రాముని శరణుజొచ్చినది. కాని రాముడు నా అస్త్రము ఊరకపోవునది కాదు కనుక కాకిని ఏదేని బలియివ్వవలయునని కోరెను. అపుడా కాకి ఒక కంటిని మాత్రము బలి యిచ్చెదనని యిచ్చినది. నిద్ర లేచినప్పుడు అస్త్ర ప్రయోగోప సంహారములు మామూలుగ నడచుచున్న ఈ విచిత్రమును చూచుచున్న దేవతలు రాముడు అసిధారావ్రతముగా బ్రహ్మచర్య మాచరించుచున్నాడని, ఆతని నిద్ర సమాధి యని సంతసించిరి. పదమూడు వత్సరము లట్లు అరణ్యవాసము సాగినది.
Ramayanam : 5