ఇన్ని దేవతామూర్తులు మీ కోసమే వున్నవి
(పరమాచార్యుల అమృత అనుగ్రహభాషణములనుండి)
మన చిత్తం ఒకరోజు వున్నట్లు మరొకరోజు వుండదు. ఈ చాంచల్యం సాధారణ జనం లోనేకాదు. ఒక్కొక్కపుడు మహాత్ములలోనూ చూస్తాం. ఒక విషయంపై మనకు నేడు అభిరుచి వుండే, మరొక్కరోజు దానిపై మనస్సే పోదు.
పాటకచ్చేరీకి వెళ్ళినపుడు గాయకుడు ఒకే రాగాన్ని తరచూ పాడితే మనకు విసుగువేస్తుంది. మార్పును కోరే గుణం మనస్సుకు స్వాభావికంగా వచ్చినది. ఈ రోజు దధ్యోదనం కోరిన మనస్సు మరుసటిరోజు పులిహోర కావలెనని మారాం చేస్తుంది. పుర్రెలో పుట్టెడు బుద్ధులు. ఒక్కొక్కరోజూ ఒక్కొక్క విషయంపై బుద్ధి స్వైరవిహారం చేస్తూవుంటుంది. అందుకూ మన మతంలో ఎన్నో సాధనా ప్రణాళికలు, ఆర్చామూర్తులు వున్నవి.
ఆలయమునకు వెళ్ళి గణేశుని ముందు నిలుచుంటాం. దేవతామూర్తిని ఎంతో సుందరంగా అలంకరించివుంటారు. ఆ లంబోదరం, ప్రసన్నవదనం, నాలుగు భుజాలూ, అన్నీ అందంగా వున్నవి. కానీ మనస్సు ఇంకో దేవతా సన్నిధికి-దుర్గ వద్దకు-వెళ్ళాలంటుంది. అందుకే మన పెద్దలు ఈ అస్థిరమైన మనస్సుకు ఎన్నో మార్గాలు చూపారు. వారు – ఎల్లిసెట్టి లెక్క ఏకలెక్క – అని కూర్చోలేదు. అమ్మవారు, దక్షిణామూర్తి, నటరాజు, లింగోద్భవ మూర్తి, అని ఎన్నో దేవతలను ఆలయాలలో స్థాపించారు. ఒక్కొక్క విగ్రహం ముందూ, రెండు నిముషాలు వున్నా, ఆలయం ప్రదక్షిణ చేసి వచ్చేసరికి, ఒక అరగంటసేపు మనస్సు భక్తి భావ భరిత మయ్యే విధంగా మన పెద్దలు సంవిధాన పరచినారు.
మన మతం జీవబ్రహ్మైక్యాన్ని బోధిస్తుంది. ఈ విషయాన్ని ప్రపంచంలోని తాత్వికులందరూ ప్రశంసిస్తున్నారు. అద్వైతమే ఐశ్వర్యం మనకున్నది. అద్వైతమనే మహూన్నత సిద్ధాంతమే వర్ణాశ్రమ విధానాన్నీ, ఆర్చామూర్తి బాహుళ్యాన్నీ, అంగీకరిస్తున్నది. అద్వైతం, పరమాత్మ అనేది మన అంతిమలక్ష్యం. అది పరమార్థం. కానీ వ్యావహారికంలో అద్వైతాన్ని అనుష్ఠించలేము. అట్లా అనుష్ఠించినా అది మిధ్యావర్తనకే దారితీస్తుంది. వ్యవహారంలో ద్వైతం వుండి తీరుతుంది. అందుకే ఆచార్యులవారు పంచాయతన పూజా విధానాన్ని బోధించారు. అంతేకాదు, కౌమారాన్నీ చేర్చి షణ్మతస్థాపన చేశారు. ఎన్నో ఆర్చామూర్తులు, రాముడు, కృష్ణుడు, నరసింహుడు, అంబ, భవాని, భ్రమరాంబ త్రిపుర సుందరి, శారదాంబ మొదలైన దేవతా మూర్తులను మనం ఆరాధిస్తున్నాం.
అనన్యభక్తి అనేది పరమార్ధ సత్యం. మనం ఒక్కదాటులో ఆ భూమికను అందుకోలేము. గురువుయందు ఈశ్వరభావన వుండవలెనని అన్నారు. మీరందరూ నన్నే ఈశ్వరుడని భావిస్తే, నేను పూజించే చంద్రమౌళీశ్వరుని గతి ఏమి? ఆయన లేకుంటే నా భిక్షగతి ఏమి? నన్ను నమస్కరించి చంద్రమౌళీశ్వరుణ్ణి మీరు తిరస్కరిస్తే ఆయన ఉంటేనే కదా ఈ మఠానికి అస్తిత్వం. భగవత్పాదాచార్యులు ఈ మఠాన్నే కాదు; ఇంకా ఎన్నో మఠాలను స్థాపించారు. ఆయన పేరుతో ఇతర ఆచార్యులూ వున్నారు. ఆ మఠాలలో, ఆయా మఠానుశాసనములను అనుసరించి పూజాక్రమాలున్నవి. కానీ ఇపుడు నేను మాట్లాడేది నా జీవనోపాధిని గూర్చి!
ఇన్ని దేవతామూర్తులు మీ కోసమే వున్నవి. ఏ దేవతామూర్తిపై అభిరుచివున్నదో, ఏ ఆరాధన రసవంతంగా వుటుందో ఆ ఆరాధనను మీరు గ్రహించవచ్చును. నేను అనన్యభక్తిని గూర్చి చెప్పానంటే అది ఒక ఉత్తమ లక్ష్యమని అనడానికే. దానిని వెంటనే మీరు ఆచరణలోకి తెస్తారని కాదు. శృతి, యుక్తి, అనుభవం అని వెనక చెప్పాను. అనన్యభక్తి, యుక్తీ అలవాటు అయినదంటే-అది అనుభవానికి క్రమంగా తీసుకొని వెడుతుంది.